దడిచిన నైరుతి
x

దడిచిన నైరుతి

కాసిన్ని చినుకుల్ని చిలకరించకుండా ఎటు పోతావు? విత్తనం పొర పగలడానికి పనికిరాని నీ నీటి ధారలు ఎక్కడో సముద్రం మీద కురిపించి ఏం బావుకుందామని?


-కాంతి నల్లూరి

నైరుతి : రానా ? అంది.

నేలతల్లి : గర్వంగా తలెత్తి రా..రా..
చూసుకుందామంది.
నైరుతి : నిజంగానా ? అంది.
నేలతల్లి : పాత మిత్రుడివని ప్రేమగా పిలుస్తున్నాను.
నైరుతి : ఇప్పుడు కాదులే మరెప్పుడైనా చూద్దామంది
నేలతల్లి : నా ఆహ్వానాన్ని అందుకోకపోతే
ఈశాన్యాన్ని పిలుస్తాను, తనూ నా పాత
మిత్రుడేనంది.
నైరుతి : పో , పో..ఈశాన్యాన్నే పిలుచుకో.నాదిక్కుల్ని
నేను మార్చుకుంటాను.
నేలతల్లి : రావడం రాకపోవడం అంతా నీఇష్టా"రాజ్య"
మైపోయింది. ఆలస్యం చేస్తే వాయువ్యం
నిన్ను ఆనవాలు లేకుండా ఎగరగొట్టేస్తోంది
రాకుండా ఏం చేస్తావ్? ఎంతకాలమని
ఆ మబ్బుల్లో దాక్కుంటావు?ఇప్పటికే
దిగాలుపడ్డ రైతు పగుళ్లు బారిన నేలని
చూసి గుండెలు బాదుకుంటున్నాడు.
కాసిన్ని చినుకుల్ని చిలకరించకుండా ఎటు
పోతావు? గుండెల్లో గడ్డకట్టిన భారాన్ని
ఎక్కడ దించుకుంటావు? విత్తనం పొర
పగలడానికి పనికిరాని నీ నీటి ధారలు
ఎక్కడో సముద్రం మీద కురిపించి ఏం
బావుకుందామని? ఎండిన బీళ్ళల్లో
అడ్డంగా తెగబడి కూలిపోయిన లక్షల
కళ్ళు నీకు కనబడటం లేదా? వట్టి కాళ్లతో
ఎండిన గొంతులతో,ఖాళీ కడుపులతో,
బద్దలైపోయిన బతుకులతో ఆ రైతులు
అగ్నిగుండాలకు ఆడ్డంపడి మైళ్ళకు మైళ్ళు
నెత్తుటి తర్పణ తో నడవడం నీకు కన
పడలేదా ? నీకు సిగ్గనిపించలేదా ?
నీకన్నా ఆ బస్తీ జనం నయం.పగిలి,
నెత్తుర్లు కారిన పాదాలకు జోళ్లిచ్చారు.
ఎండిన గొంతులకు ఇన్ని నీళ్లిచ్చారు.
అంటుకుపోయిన డొక్కలకు ఇంత అన్నం
పెట్టి అక్కున చేర్చుకున్నారు.
అదంతా చూసినా నీ గుండె కరగలేదా?
అంతగా గడ్డకట్టుకుపోయావా? సరిగ్గా
చెప్పు రావాల్సిన సమయానికి నీవొచ్చి
ఎన్నాళ్ళయింది? ఎన్నేళ్ళయింది?
నీ రాకకోసం ఎదురుచూసి చూసి నా కళ్ళు
పల్లెర్లయి కాచాయి,జిల్లేళ్లయి మొలిచాయి.
గబ్బు తుమ్మలు తనువంతా నిండాయి.
పచ్చని మాగాణి కలల మీద ఎడారులు
పర్చుకున్నాయి. బళ్లు ఓడలయ్యాయో
లేదో తెలియదు కానీ, ఓడలు మాత్రం
ఇసుక మేటల్లో కూరుకుపోయి శిథిలమై
బిక్క చచ్చిపోతున్నాయి.
రానని మొఖం తిప్పేసుకుంటే ఆనవాలు
లేకుండా ఆవిరయిపోయేది నీవే. నాకేంటి?
పిలిస్తే ఈశాన్యం పలుకుతుంది, దిక్కులు
ఓయంటే ఓయంటాయి. గుండెల్లో శతా
బ్దాల కన్నీళ్లని వేల తుఫానులుగా
మోస్తున్న దాన్ని, గుంభనంగా దాచుకున్న
దాన్ని .సాగరంలో ఒక్క అల్పపీడనాన్ని
సృష్టించలేనా? నా బిడ్డల దాహాన్ని తీర్చు
కోలేనా? నన్ను నేను నిలువెల్లా తడుపు
కోలేనా? తిరిగి మరోసారి ఆకుపచ్చ పైరు
చీర కట్టుకోలేనా? నా రైతు బిడ్డల కాళ్ళని
నా గుండెల చెమ్మతో కడుక్కోలేనా?
నీవొచ్చావా... సరేసరి లేదా, నీవు రానన్నా
ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసు.
నా చుట్టూ వున్న నా బిడ్డలైన "అరణ్యాలు"
నిన్ను జుట్టు పట్టి రప్పించగలవు,జాగ్రత్త.

దెబ్బకు దడిచిన నైరుతి బిరబిర జరజర వచ్చి నేలతల్లి గుండెల్లో తలదాచుకుంది.తన కళ్లు ప్రేమతో ఆకుపచ్చగా మెరిశాయి. పగుళ్లిచ్చిన నేలతల్లి నీటి ధారల్ని తాగి బురద పండుగ చేసుకుంది. ఇంకెక్కడికి పోతావే పిచ్చిదానా అంటూ నైరుతిని గుండెల్లో పొదువుకొని ముద్దాడి " పద నల్లమలకు పొయొద్దాం, అక్కడ మళ్లీ బతుకు పంటని పండించాలి" అంది.


Read More
Next Story