రాజ్యసభలో అంబేడ్కర్, పుచ్చలపల్లి సుందరయ్య వాగ్వాదం
x

రాజ్యసభలో అంబేడ్కర్, పుచ్చలపల్లి సుందరయ్య వాగ్వాదం

ఆంధ్ర ప్రాంతాన్ని రెడ్ల భూస్వామ్య రాజ్యమన్న అంబేడ్కర్. రెడ్లంతా భూసాములు కాదన్న సుందరయ్య. ఆంధ్రరాష్ట్ర బిల్లు చర్చలో ‘రెడ్ల’ మీద ఉపచర్చ


‘కమ్యూనిజం ఒక కులాన్ని మరొక కులంపై రెచ్చగొట్టదు’

అంబేద్కర్ రెడ్ల భూస్వామ్య వాదనపై పుచ్చలపల్లి సుందరయ్య

ఆంధ్ర రాష్ట్ర అవతరణ బిల్లుపై పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్ కు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యకు మధ్య 1953 సెప్టెంబర్ రెండు తేదీన వాడి వేడిగా వాదనలు జరిగాయి.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో జరిగిన చర్చలో అంబేడ్కర్ కు, పుచ్చలపల్లి సుందరయ్యకు మధ్య భిన్నాభిప్రాయాలు నాటి పార్లమెంటును వేడెక్కించాయి . వారిరువురి వాదనల్లో కులం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘కమ్యూనిజం ఒక కులాన్ని మరొక కులంపై రెచ్చగొట్టదు.’’ అని సుందరయ్య స్పష్టం చేశారు.

‘‘ఒక కులంపై మరొక కులాన్ని రెచ్చగొట్టే అంబేడ్కర్ లాంటి వారు ఐక్య భారతదేశం కోసం మాట్లాడుతున్నట్లు నటించడం ఆశ్చర్యంగా ఉంది. నిమ్న జాతి ప్రజలు ఒక్క ఆంధ్రలోనే కాక దేశమంతటా అనేక కష్టాలకు గురి అవుతూ బాధపడుతున్న మాట నిజమే. అయితే వారి కష్టాలను పోగొట్టాలంటే ఒక కులాన్ని మరొక కులంపై రెచ్చగొట్టడం మార్గం కాదు.’’ అంటూ సుందరయ్య అంబేడ్కర్ పై విరుచుకుపడ్డారు. ఈ చర్చ లో కులంతో పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వంటి నాటి అనేక విషయాలు, వాటి పై భిన్న వాదనలు చర్చకు వచ్చాయి. ఆ నాటి పరిస్థితులు, వాదనల ను, ఆనాటి పత్రి కా భాషా శైలిని తెలుసు కోవడం కోసం ఈ ప్రయత్నం.

‘కుల విభేదాలు రెచ్చగొట్టే అంబేడ్కర్ విచిత్ర వాదనల ఖండన: పార్లమెంటులో సుందరయ్య ప్రసంగం’ అన్న శీర్షికన 1953 అక్టోబర్ 4వ తేదీ నాటి విశాలాంధ్రలో వచ్చిన వార్త పూర్తి పాఠం ఉన్నదున్నట్లు : మధ్యలో వచ్చిన ఇంగ్లీష్ రెఫెరెన్స్ లను ‘ఫెడరల్ తెలంగాణ’జోడించింది.

రాజ్యసభలో అంబేడ్కర్ ప్రసంగం (ఒరిజినల్)

Source: Rajya Sabha Archives (https://rsdebate.nic.in/handle/123456789/588187)

‘కుల విభేదాలు రెచ్చగొట్టే అంబేడ్కర్ విచిత్ర వాదనల ఖండన:

పార్లమెంటులో సుందరయ్య ప్రసంగం’

“రాష్ట్రాలను ఏవిధంగా పునర్నిర్మించాలో పరిశీలించేందుకు మరో కమిషన్ను నియమించవలసిన అవసరం ఏ మాత్రం లేదు. 1954 అక్టోబర్ ఒకటవ తేదీకి మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, పంజాబీ రాష్ట్రాలను ఏర్పరచగలమని ప్రకటించిన ప్రభుత్వం హద్దులను సరిదిద్దడానికి ఒక సరిహద్దు కమిషన్ ను నియమించాలి." అని ఈ వేళ ఆంధ్ర బిల్లుపై స్టేట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ సుందరయ్య గారు డిమాండ్ చేశారు.

ఈ వేళ ఆంధ్ర బిల్లుపై జరిగిన చర్చ సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ భాషా రాష్ట్రాల సమస్యతో కులతత్వాలను ముడిపెట్టడం, కమ్యూనిస్టు నాయకుడు శ్రీ సుందరయ్య ఈ విచిత్ర సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.

దేశ వ్యవహారాల మంత్రి డాక్టర్ కట్జూ ప్రసంగం పూర్తి కాగానే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (నిమ్న జాతుల ఫెడరేషన్ బొంబాయి) బిల్లుపై ప్రసంగిస్తూ ఇలా అన్నారు. “కాంగ్రెస్ తన నియమావళిలో భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని 1921లోనే పొందుపరిచింది. అప్పటి నుండి 1949 వరకూ ఈ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ వదులుకున్నట్టు లేదు. 1949లో భారత రాజ్యాంగాన్ని తయారుచేసేటప్పుడు భాషా రాష్ట్రాలపై ఒక తీర్మానం ప్రస్తావనకొచ్చింది. ఆ తరువాత తీర్మానం ప్రతిపాదకునికి, కాంగ్రెస్ హై కమాండుకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కాంగ్రెస్ నాయకత్వం తీర్మాన పూర్తి స్వభావాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేమంటూ ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యను మాత్రం పరిశీలించగలమని మాట యిచ్చింది. అయితే రాజ్యాంగ చట్టం తయారుచేసేటప్పుడు షెడ్యూల్డులో ఆంధ్రరాష్ట్రం పేరుచేర్చాలా లేదా అన్న నా ప్రశ్నకు కాంగ్రెస్ నాయకత్వం నుండి జవాబే రాలేదు.

ప్రభుత్వ ఊగిసలాట

20 సంవత్సరాలుగా భాషారాష్ట్రాల సూత్రానికి కట్టుబడిన కాంగ్రెస్ సరిగా సమయమొచ్చేటప్పటికి ఎందుకు వెనకాడిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక సిద్ధాంతం మంచిదా చెడ్డదా అన్న విషయంపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడానికి 20 సంవత్సరాలు చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. అది ఒప్పో తప్పో తేల్చివేసి తదనుగుణ్యంగా ముందుకు సాగిపోవచ్చు. కాని 1949 నుండి ప్రభుత్వం ఈ సమస్యపై అటుయిటూ ఊగిసలాటను ప్రారంభించింది.

ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం ఒక ఆంధ్ర పెద్దమనిషి తన ప్రాణాన్ని బలి పెట్టేవరకూ ప్రభుత్వం ఈ విషయమై మరల ఆలోచించడానికి సిద్ధం కానేలేదు. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అయితే అంతకు ముందే అంగీకరించబడిన ఒక సిద్ధాంతాన్ని అమలు జరిపించేందుకు మరొక దేశంలో ఇలా ఒక వ్యక్తి చనిపోవలసి వచ్చి ఉంటే ఆ దేశంలో ప్రభుత్వానికి ఏమి జరిగేదో నాకు స్పష్టంగా తెలుసు. ఆ ప్రభుత్వ ప్రాణం తీసి ఉండేవారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.

రక్షణలు కావాలట

భాషా రాష్ట్రాలు దేశ ఐక్యతకు భంగకరమని వాదించబడుతోంది. ఇప్పుడున్న 27 రాష్ట్రాల్లో 23 భాషా రాష్ట్రాలే. నాలుగు మాత్రం బహుభాషా రాష్ట్రాలు. ఈ 23 రాష్ట్రాలు దేశ ఐక్యతను విచ్ఛిన్న పరిచాయని దేశ వ్యవహారాల శాఖా మంత్రి భావిస్తున్నారా? దేశ ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవలసిన మాట నిజమే కానీ భాషా రాష్ట్రాలే దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తాయనడంలో ఏ మాత్రం సత్యం లేదు.

ఆంధ్రలో కొన్ని పెద్ద కులాలు కొన్ని చిన్న కులాలు ఉన్నాయి. పెద్ద కులాల వారిలో రెడ్డి, కమ్మ, కాపు కులాలున్నాయి. చిన్న కులాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్న దురదృష్టవంతులైన నిమ్న జాతులవారున్నారు. దాదాపు భూమి అంతా రెడ్ల చేతుల్లోనే ఉంది. పై కులాల వారి నియంతృత్వాన్నుండి, దౌర్జన్యాల నుండి నిమ్న జాతుల వారిని కాపాడేందుకు దేశ వ్యవహారాల మంత్రి బిల్లులో ఎలాంటి రక్షణ పొందుపరిచారు? బహుబాషా రాష్ట్రాల్లో మైనారిటీలకు రక్షణ ఇవ్వడానికి గవర్నర్లకు ప్రత్యేక అధికారాలనివ్వాలని నా సూచన.”

సుందరయ్య గారి ప్రసంగం

డాక్టర్ అంబేద్కర్ ప్రసంగం పూర్తికాగానే కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ సుందరయ్య గారు లేచి అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండిచుతూ యిలా మాట్లాడారు. ‘‘డాక్టర్ అంబేద్కర్ ప్రసంగిస్తూ ఆంధ్రలోని సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని వివరించారు. రెడ్డి, కమ్మ కాపు కులాల వారు భూస్వాములని, నిమ్న జాతుల వారు అణచివేయబడే వారనీ ఆయన తెలియజేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన నాకు ఆంధ్ర సాంఘిక స్వరూపాన్ని గురించి అంబేద్కర్ కంటే ఎక్కువగా తెలుసు. ఆంధ్రలో పీడించబడే వారిలోనూ, అణచిపెట్టబడేవారిలోనూ కాపు, కమ్మ, రెడ్డి కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. పీడించేవారు, పీడించబడే వారు అన్ని కులాల వారిలోనూ ఉన్నారు. ఒక్క నిమ్న జాతుల వారిలో మాత్రమే అణచబడ్డ వారున్నారన్న విషయాన్ని మా పార్టీ ఎప్పుడూ ఆమోదించలేదు. అన్ని కులాల్లో ఉన్న పీడకులకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాం. కమ్యూనిజం ఒక కులాన్ని మరొక కులంపై రెచ్చగొట్టదు. పీడకులపై పీడితులు పోరాడాలనే సిద్ధాంతం పైనే మేము పనిచేశాం. అలా పోరాడాం కాబట్టి ఇక్కడకు వచ్చి మీలాంటి కులతత్వవాదులను ఖండించగలుగుతున్నాం.

అంబేద్కర్ దొంగ నటన

డాక్టర్ అంబేద్కర్ నిమ్న జాతుల వారి రక్షకుడుగా ఇక్కడ మాట్లాడుతున్నట్లు నటించడానికి ప్రయత్నించుతున్నాడు. ఒక కులంపై మరొక కులాన్ని రెచ్చగొట్టే అంబేద్కర్ లాంటి వారు ఐక్య భారతదేశం కోసం మాట్లాడుతున్నట్లు నటించడం ఆశ్చర్యంగా ఉంది. నిమ్న జాతి ప్రజలు ఒక్క ఆంధ్రలోనే కాక దేశమంతటా అనేక కష్టాలకు గురి అవుతూ బాధపడుతున్న మాట నిజమే. అయితే వారి కష్టాలను పోగొట్టాలంటే ఒక కులాన్ని మరొక కులంపై రెచ్చగొట్టడం మార్గం కాదు.

1947 నుంచి 1951 వరకు గల కేంద్రమంత్రి వర్గంలో డాక్టర్ అంబేద్కర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గమే భూమి కోసం పోరాడిన ప్రజలను తెలంగాణాలోనూ, ఆంధ్రలోనూ కాల్చి చంపింది. అక్కడే కాదు, దేశమంతటా కాల్పులు జరిపించింది. ఈ కాల్పుల్లో అనేక మంది నిమ్న జాతుల వారుకూడా మరణించారు.

కిరాయి మనిషిగా వ్యవహరించిన వ్యక్తి

అంబేద్కర్ ఆంధ్రలో ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని ఉదహరించారు. అక్కడ ఒక రెడ్డికి 1400 యకరాలున్నాయనీ, తతిమ్మా వారందరికి కలిపి 14 యకరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా నిమ్న జాతుల ప్రజలు భూమిలేక అవస్థలు పడుతున్నారని తన “బాధ”ను వెలిబుచ్చారు. సరే ఆయన తన అనుచరులతో ఆ భూస్వామి భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేని కూలీలకు పంచిపెడతానికి మాతో పాటు రాగలరా? అని ప్రశ్నించుతున్నా. కానీ ఇప్పుడేమో అంబేద్కర్ ఆనాడు తాను కిరాయిగా పనిచేశానంటాడు. అలాంటి వ్యక్తి మాటలకు ఎంత విలువ నివ్వాలో సభ వారు పరిశీలించాలని కోరుతున్నా. దీనర్థమేమిటి? నాలుగు డబ్బులు చేతికిస్తే ప్రజలను, తన కులానికి చెందిన ప్రజలనే కాల్ని చంపడానికి ఈ పెద్దమనిషి సిద్ధపడతాడన్నమాట. ఇలాంటి మనిషే నేడు బాషావాదులు కలుతత్వానికి మారు పేరని చెప్పడానికి సిద్ధపడ్డాడు.

భాషా రాష్ట్రాలు ఏర్పడక తప్పదు. ఇప్పటికైనా డాక్టర్ అంబేద్కర్ తన మనస్సును మార్చుకోవడానికి యింకా సమయం మించలేదని చెప్పకోరతా.”

అంబేడ్కర్ కి పి సుందరయ్య సమాధానం (ఒరిజినల్ ప్రసంగం)

Source: Rajya Sabha Archives (https://rsdebate.nic.in/handle/123456789/588187)

ఆంధ్రుల పోరాటం ఫలించింది

డాక్టర్ కట్జూ ప్రసంగాన్ని గురించి శ్రీ సుందరయ్య గారు ప్రస్తావించి ఇలా అన్నారు. "డాక్టర్ కట్జూ తన ప్రసంగంలో “భాషా రాష్ట్రం” అన్న పదాన్ని ఉపయోగించకుండా మాని వేయవచ్చు. అయినా ఆంధ్రులను గత పరిపాలన, తమ విద్య, తమ భాషలో జరగాలన్న కోర్కెకోసం సాగించిన పోరాటం ఫలించి రాష్ట్రం సిద్ధించింది.

గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ భాషా రాష్ట్రాలను కోరుతూ తీర్మానం చేసింది. కొంత మంది చరిత్ర కాల చక్రాన్ని తిప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే అది వారి ఊహగానే ఉండిపోగలదు.”

రాష్ట్రాల పునర్విభజన సమస్య పరిశీలనకు ఉన్నతాధికారులు గల ఒక కమిషన్ నియమించబడుతుందన్న డాక్టర్ కట్జూ వాగ్దానాన్ని గురించి సుందరయ్య గారు ప్రస్తావించి యిలా అన్నారు.

“30సంవత్సరాలపాటు భాషా రాష్ట్రాలు కావాలని వాదించిన తరువాత, పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన తరువాత, ఇంత పెద్ద ఎత్తున ప్రజాందోళన జరిగిన తరువాత-భాషల ప్రాతిపదికపై భారత దేశంలోని రాష్ట్రాలను పునర్విభజించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఉంటే, ఎంతో బాగుండేది. కాని ఇప్పుడు రాష్ట్రాల పునర్విభజన ఎలా జరగాలన్న విషయాన్ని పరిశీలించడానికి ఉన్నతాధికారులు గల కమిషన్ నియమించుతానని ప్రభుత్వం అంటోంది.

కమిషన్ ల తంతుకు స్వస్తి చెప్పాలి

ఈ కమిషన్లతో అందరమూ విసుగెత్తిపోయాం. కమిషన్ తరువాత కమిషన్, కమిటీ అనంతరం కమిటీ నియమించబడింది. మోతీలాల్ కమిటీ రిపోర్టు, ధార్ కమిటీ రిపోర్టు, జెవిపి రిపోర్టు ఇలా అనేక కమిటీలు ఇది వరకు ఈ సమస్యను పరిశీలించడం జరిగింది.

భారతదేశంలో రాష్ట్రాలు ఏ పద్ధతిలో నిర్మించబడాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోడానికి కాంగ్రెసు పార్టీకి 30 సంవత్సరాల కాలం చాలదా? మళ్ళీ ఇంకో కమిషన్ వేయవలసిన అవసరం ఏమి ఉంది? ఈ కమిటీల నియామకానికి యింక స్వస్తి చెప్పి, 1954 అక్టోబర్ ఒకటికి ఇతర భాషారాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, మహరాష్ట్ర, పంజాబీ రాష్ట్రాలను ఏర్పరచడం తమ ఉద్దేశ్యమని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఆ తేదీలోపున ఆ రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికి ఒక సరిహద్దు కమిషన్ ను నియమించాలి.

భాషా రాష్ట్రాల నిర్మాణానికి సులభ మార్గం

భాషా రాష్ట్రాలు ఏర్పడటం అంత కష్టమైన పని కానే కాదు. ఇప్పుడున్న తిరువానుకూర్-కొచ్చిన్ కు, మలబార్ తదితర మలయాళీ ప్రాంతాలను కలిపితే ఐక్య కేరళ ఏర్పడుతుంది. అలాగే బొంబాయి, హైద్రాబాద్, మధ్యప్రదేశ్ లలో మరాఠీ ప్రాంతాలను కలిపితే సంయుక్త మహారాష్ట్రం కాగలదు. భాషా రాష్ట్రాలు దేశ ఐక్యతకు భంగకరమనే వాదనతో ఈ సమస్యను వెనక్కు నెట్టడం ఎంత మాత్రం పనికిరాదు.”

హైద్రాబాద్ సంస్థాన విభజనావశ్యకత

హైదరాబాదు సంస్థానాన్ని వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య గారు యిలా అన్నారు.

‘‘భారత దేశ రక్షణకే ప్రభుత్వం నిజంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే, హైదరాబాద్ ను విభజించడం దాని మొట్టమొదటి కర్తవ్యం. రెండు వందల సంవత్సరాలుగా తెలుగు, మహరాష్ట్ర, కన్నడ ప్రజలకు నైజాం సంస్థానం బందిఖానాగా ఉంది. అంతే కాదు, ఇండియాలో ప్రత్యేక హైద్రాబాద్ డొమినియన్ స్థాపనకు బ్రిటిష్ సామ్రాజ్య వాదులతో ఈ నైజామ్ రాయబారాలు సాగించాడు. ఈ నైజామే పాకిస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు సాగించాడు. కాబట్టి భారతదేశ ఐక్యత, భారతదేశ రక్షణ అని మాటిమాటికీ మాట్లాడే వారంతా హైదరాబాదు సంస్థాన తక్షణ విభజనను డిమాండ్ చేయాలని కోరుతున్నా. అప్పుడే విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రలు ఏర్పడే అవకాశం కలుగుతుంది.” ఆ తరువాత సుందరయ్య గారు ఆంధ్ర బిల్లులోని వివరాలను గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. భాషా రాష్ట్రాలను గురించి డాక్టర్ కట్జూ తేలిగ్గా మాట్లాడినందుకు తన ఆక్షేపణ తెలిపారు. అలాగే ఆంధ్ర-తమిళుల మధ్యగల అభిప్రాయభేదాలను, కోస్తా రాయలసీమ ప్రజల మధ్య గల అభిప్రాయభేదాలను తన వాదనలకు డాక్టర్ కట్జూ వినియోగించు కోవడం బాధ్యతగల మంత్రికి తగినపని కాదన్నారు.

రాజధాని రభసకు కారణం కాంగ్రెసే

ఆంధ్ర రాజధాని సమస్యను గురించి ప్రస్తావించి సుందరయ్య గారు ఇలా అన్నారు.

“ఎవరికీ సమ్మతం కాని కర్నూలు నిర్ణయం అడగడానికి బాధ్యతంతా కాంగ్రెస్ దే. రాజధాని రభస కంతటికి కాంగ్రెస్ కారణం. హైద్రాబాద్ సంస్థానాలను విభజించి వుంటే ఏ పేరు లేకుండా హైద్రాబాద్ సహజంగా ఆంధ్ర రాజధానిగా ఏర్పడి ఉండేది. అసలు "తాత్కాలిక” “శాశ్వత” రాజధాని అని సూచించడంలోనే ప్రభుత్వ అపరాధమంతా ఉంది. అసలు “తాత్కాలిక” రాజధాని అంటే అర్థమేమిటి? ఒక ఏడాదిలో హైద్రాబాద్ ను విభజించుతామని మీరు వాగ్దానం చేసి వుంటే అందులో అర్థం ఉండేది. అలాంటిది ఏమీ లేనప్పుడు కేవలం ఆంధ్రులలో చీలికలు తీసుకొని రావడానికి ఈ "తాత్కాలిక” అన్న పదం ఉపయయోగించబడిందని చెప్పవలసి వస్తుంది.”

రాజధాని సమస్యపై రెండు సార్లు ఓటింగ్ జరిగిన విషయాన్ని సుందరయ్యగారు తెలుపుతూ మొత్తం 138 మంది సభ్యులలో 72 మంది గుంటూరు - విజయవాడకు అనుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. వీరిలో కమ్యూనిస్టులే కాక కాంగ్రెస్ వాదులు, తదితర పార్టీలవారు కూడా వున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితులలో ఇంకా కర్నూలుకే కట్టుబడి వుండటానికి కారణమేమిటని ప్రశ్నించారు.

ఆయనింకా ఇలా అన్నారు :

గుంటూరు-విజయవాడ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదించాలి. లేదా వెంటనే మరల రాజధాని నిర్ణయానికి ఆంధ్ర శాసనసభ్యుల సమావేశాన్ని జరపాలి.

బళ్ళారి ప్లెబిసైట్

బళ్ళారి సమస్యను గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.

"బళ్ళారి తాలూకాలోని మూడు ఫిర్కాల్లో ఆంధ్ర, కన్నడిగులు దాదాపు సరిసమాన సంఖ్యలో వున్నారు. వీరు గాక 40 వేల మంది ముస్లింలున్నారు. వారి పై అంతా ఆధారపడి వున్నది. అందువల్లనే ఈ పరిస్థితుల్లో ప్లెబిసైట్ ద్వారా ఆ ప్రాంత ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించాలని మేము కోరుతున్నాం. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు అంతకంటే వేరే మార్గం లేదు.

హైకోర్టు లాయరైన కట్జూ సామాన్య ప్రజలకు రాజధాని కంటే హైకోర్టే ఎక్కువ అవసరమని చెప్పారు. అంతకంటే తెలివితక్కువ వాదన మరొకటి లేదు. ప్రజల భాషలోనే న్యాయస్థానాలు తమ వ్యవహారాలను జరిపేందుకు మేము ప్రత్యేక కోర్టును కోరాం. ఆంధ్ర ప్రత్యేక హైకోర్టు 1954 జూన్కు ఏర్పడాలని మద్రాసు శాసనసభ ఏకగ్రీవంగా కోరింది. కేంద్రప్రభుత్వం ఈ సమస్యమ 56 జనవరి వరకు ఎందుకు పొడిగించవలసి వచ్చిందో తెలయడం లేదు. హైకోర్టు స్థల నిర్ణయంపై ఆంధ్ర శాసన సభ్యుల అభిప్రాయాన్ని రాష్ట్రపతి మన్నించవచ్చునని సందేహాస్పదంగా బిల్లులో పొందుపరచారు.

ఆస్తి అప్పుల విభజన సమస్య

ఆస్తి అప్పుల విభజన సమస్యపై సుందరయ్యగారు మాట్లాడుతూ, అది జనాభా నిష్పత్తిననుసరించి చేయాలని కోరారు. అది ఎలాంటి సందేహాలకు తావు కల్పించని పరిష్కారమార్గమని స్పష్టం చేశారు. ఆ తరువాత ప్రభుత్వం అనుసరించుతున్న పక్షపాత వైఖరిని సుందరయ్యగారు విమర్శించుతూ త్రివేది సలహా సంఘంలోకి కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీని అర్థం పరిపాలిస్తే కాంగ్రెసు పరిపాలించాలి లేదా, రాష్ట్రపతి పారిపాలన ఉండాలని వారి ఉద్దేశ్యమైనట్లు కనపడడం లేదా? అలా కాని పక్షంలో అసెంబ్లీలోకల్లా పెద్ద పార్టీగా ఎన్నుకోబడిన కమ్యూనిస్టుపార్టీని ఖాతరుచేయకపోవడంలో భావమేమిటి? 140 స్థానాల్లో 50 స్థానాలు గల కాంగ్రెస్ ను ఏదోవిధంగా అధికారం సంపాదించి పార్టీని బలపరచుకోవాలని చూస్తున్నది. ఇలాంటి పద్ధతులతో కాంగ్రెసు తన పరిపాలనను ఎంతో కాలం సాగించలేదని హెచ్చరించుతున్నా.”

శ్రీ కోటంరాజు రామారావు (కాంగ్రెస్-ఆంధ్ర) గారు మాట్లాడుతూ "భారతదేశంలోని రాష్ట్రాల పునర్విభజనకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ఎట్టకేలకు నెరవేర్చబడుతున్నాయన్నారు. ఈ బిల్లు తనకు పూర్తిగా సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ, విశాలాంధ్ర కోసం కన్న కలలు, ఆశించిన ఆశయాలు ఫలించడానికి ఇది మార్గం ఏర్పరచుతుంది. కాబట్టి బిల్లును బలపరుస్తున్నా”మన్నారు. “మన గమ్యస్థానం హైదరాబాదు, వ్యవధి రెండు సంవత్సరాలు, మార్గం కర్నూలు మీదుగా" అని రామారావుగారన్నారు. డాక్టర్ అంబేద్కర్ ప్రసంగం విని తాను ఆశ్చర్యపడ్డానంటూ యిలా అన్నారు.

“ఇటీవలనే ఆయన విదర్భ, మహారాష్ట్రలు నిర్మించాలన్న డిమాండ్ ను బలపరుచుతూ మాట్లాడినట్లు పత్రికల్లో చూశాను. ఈ వేళ కూడా భాషా రాష్ట్రాలను బలపరుచుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించుతూ చివరకు ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించుతూ తన ప్రసంగాన్ని ముగించారు. డాక్టర్ అంబేద్కర్ రాజకీయంగా గందరగోళం మనిషి.”

పాశ్యాత్య రాజ్యాంగ వ్యవస్థల అనుకరణ కూడదు

అంబేద్కర్ స్విడ్జర్లాండ్, కెనడా రాజ్యాంగ చట్టాలననుసరించి మైనారిటీలకు రక్షణలను పొందుపరచాలని కోరారు. పాశ్చాత్య దేశాల రాజ్యాంగ వ్యవహారాలను నేను తెలియనివాడిని కాను. ఒక్క విషయాన్ని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. పశ్చిమ రాజ్యాలను అనుకరించిన కొద్దీ మనం కష్టాలలో పడతాం. ఆంధ్రలో నిమ్న జాతుల వారు కష్టాలను అనుభవిస్తారని కూడా అంబేద్కర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉంటే వారికి కష్టాలు ఉండవని చెప్పగలరా? ఆంధ్రలోని నిమ్నజాతుల వారు అంబేద్కర్ చేతుల్లోనే ఉంటారని నమ్మశక్యంగా ఎలా చెప్పగలము. నిజానికి ఆంధ్రలోని నిమ్నజాతుల వారు సుందరయ్యగారి చేతుల్లోకి క్రమేణా పోతున్నారు. ఇది దురదృష్టకరమైన విషయమైనా జరుగుతున్నదిదే. భూసమస్యకు, ఆంధ్ర రాష్ట్రానికి పొత్తు కలిపినందుకు కూడా అంబేద్కర్ ను రామారావు గారు విమర్శించారు. నూతన రాష్ట్రంలో భూసమస్య పరిష్కారం కాగలదనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

కొంత మంది ఆంధ్ర మిత్రులు గోదావరి వరదల దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ ఒకటిన ప్రారంభం కాగలదా అనే సంశయం వెలిబుచ్చుతున్నారంటూ ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే తన వ్యహారం తాను చూసుకోగలదని ఆయన అన్నారు.

రాజధాని విషయంలో ఆంధ్రులకు అన్యాయం

రాజధాని సమస్యను రామారావు ప్రస్తావించి ఒక ప్రక్కన మద్రాసు నుండి పంపివేసి మరొక ప్రక్క హైద్రాబాద్ అందకుండా ప్రభుత్వం ఆంధ్రులకు అన్యాయం చేసిందన్నారు. కర్నూలు అభివృద్ధికి 10కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వచ్చినా అది కేంద్రమే భరించవలసి వస్తుంది.

రెండు రాష్ట్రాలకు అభిప్రాయభేదం వచ్చినప్పుడు దాని పరిష్కారాన్ని రాష్ట్రపతి నిర్ణయానికి కాక ఒక న్యాయస్థాన నిర్ణయానికి వదలడం మంచిదని ఆయన అన్నారు. భాషా రాష్ట్రాల సమస్య ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర సమస్యపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వలన ఆంధ్రతమిళ ప్రజల మధ్య అనవసరం అపోహలకు దారి తీసిందన్నారు.

రాష్ట్రాల పునర్నిర్మాణానికి నియమించబడనున్న కమిషన్ దేశమంతా గాలిగా తిరగడం కంటే కొన్ని ప్రత్యేక సూత్రాలను అమలుజరపడానికి అదేశించబడటం సరియైన మార్గమన్నారు.

శ్రీ సురేంద్ర దినే(పి.యస్.పి-ఒరిస్సా) ఈ బిల్లును భాషా రాష్ట్రాల నిర్మాణానికి నాందిగా పేర్కొని వుంటే బాగుండేదన్నారు. ఆలస్యం అయిన కొద్దీ వివిధ ప్రజల మధ్య తగాదాలు రాగలవని హెచ్చరించారు.

శ్రీయస్. మహింతీ (నేషనల్ డెమొక్రటిక్-ఒరిస్సా) మాట్లాడుతూ ఉండగా సభ వాయిదా వేయబడింది.

(4-9-53వ తేదీ 'విశాలాంధ్ర' సంచిక నుండి)

Read More
Next Story