
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన పల్లకీ ఎందుకు మోశారు?
శ్రీకృష్ణదేవరాయలంతటి మహారాజు ఓ సాదాసీదా కవి, పండితుడు అల్లసాని పెద్దన పల్లకీ మోయడం ఏమిటీ.. అందేంటో ఎందుకో చదవండి
(గొర్రెపాటి రమేష్ చంద్ర బాబు)
శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దనకు గండపెండేరం బహూకరించి, పల్లకిమోసి సన్మానించిన నేపథ్యం చాలమందికి తెలిసి ఉండకపోవచ్చు. కొత్త తరానికి తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. అందులో భాగమే ఇది...
పెద్దన ఇంట్లో ఊయల బల్లపై ఎడమకాలు పైనుంచి గండపెండేరం కనపడేట్లుగా కాలుమీద కాలు వేసుకుని కులాసాగా ఊగుతూ, ఏమీ నా భాగ్యము అని అనుకుంటూ ఈ పద్యం అందుకున్నాట్ట ;
వదలక మ్రోయు నాంధ్రకవి వామ పాదంబున హేమ నూపురంబు
ఉదిత మారాళ కంఠ నినదోక్తుల ఏమని పల్కు పల్కురా!
ఈ రెండుపాదాలు ఆరోహణ అవరోహణ చేస్తుండగా, తెనాలి రామలింగడు తాత గారిని గండపెండేర సన్మానమందుకున్న సందర్భంగా అభినందిద్దామని వచ్చాడు- వస్తూ వస్తూనే ఆ పద్యం విని .,
తాతా మిగిలిన రెండు పాదాలు నాకు వదులు, నేను పూర్తి చేస్తాననగా, సరేరా మనవడా కానీ! మస్నాడట పెద్దన;
గుదియల సాని నెన్నుదుట గూఢముగాగల భాగ్యరేఖ నీ
నుదుటను లేదు లేదనుచు నురువిధంబుల నొక్కి పల్కెరా!
పెద్దనగారు హాయిగా ఊయల ఊగుతూ వామపాదమునలంకరించిన గండపెండేరముకు అతికించిన మువ్వల రవళి ని - సరోవరంలో విహరిస్తూ గలగల లాడుతున్న హంసల గుసాగుసలుగా పెద్దన వైభోగాన్ని ఏమని చెప్పుకుంటున్నాయో । అని ఊహించగా -
ఆగుసగుసలు ఏమిటో రామలింగడు మిగిలిన రెండుపాదాలలో వివరించాడు;
ఓ తాతా నీకు పది తులాల గండపెండేరానికే ఇంత మురిసిపోతున్నావు, చచ్చి చెడి మనుచరిత్ర అనే మహాకావ్యం రాసి.
గుదియలసాని అనే రాయల వారి ఉంపుడుకత్తేకు వందతులాల వడ్డాణం చేయించాడయ్యా, ఆమె నుదుటను గల కనిపించనటువంటి భాగ్యరేఖ నీ నుదుటను లేదు లేదనుచు పరిపరి విధాల నొక్కి చెప్పుకుంటున్నాయి ఆ హంసలు -
అది నువ్వు గమనించినట్లు లేవు! అంటూ
కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లయిన పెద్దనగారి వదనానికి నమస్కరించి చక్కా వచ్చిన దోవనే పోయాడట.
Next Story