
ఎం.శివరామ్
విప్లవం నుంచి తాత్వికత వరకు – శివరాం గారి జీవన యానం
'బతికింది చాలు, ఇక జీవితాన్ని ముగించాలన్న' ఆయన కోరిక నెరవేరిందేమో గాని చిన్న పిల్లలు మాత్రం చాలా కోల్పోయారేమో అనిపించింది.
అందరూ బతకడానికి బోలెడన్ని కష్టనష్టాలు పడుతుంటే ఈయనేమో చనిపోవడానికి అష్టకష్టాలు పడ్డారు. తన శరీరాన్ని తానే పూర్తిగా హింసించుకుని, అన్నీ అందుబాటులో ఉన్నా దేన్నీ స్వీకరించకుండా నలిపి నారతీసుకున్నారు. 86 ఏళ్ల వయసులో చివరకు ఇవాళ అంటే ఆగస్టు 20 ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శుష్కించిన శరీరాన్ని వదిలి చివరి ఊపిరి తీసుకున్నారు. మరణం వెనుక ఇంత వేదన ఉంటుందని ఆయన్ను చూసిన తర్వాతే తెలిసింది.
అంపశయ్య మీదున్న శివరాం గారితో ఇంద్రాణి, టి.నరసింహారావు, శరచ్చంద్ర జ్యోతిశ్రీతో ఈ వ్యాస రచయిత
ఆయనే మంచిరెడ్డి శివరాం. శ్రమజీవన విద్యావేత్త, జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంత వేత్త, ఎందరెందరికో స్ఫూర్తి ప్రదాత. 'బతికింది చాలు, ఇక జీవితాన్ని ముగించాలన్న' ఆయన కోరిక నెరవేరిందేమో గాని చిన్న పిల్లలు మాత్రం చాలా కోల్పోయారేమో అనిపించింది. 'శివరాం గారు ఇక లేరు' అని విజయవాడ నుంచి మా మిత్రుడు కేవీ కృష్ణా మెసేజ్ పెట్టినపుడు నాకు తెలియకుండానే కళ్లంట నీళ్లు జలజలా రాలిపోయాయి. మనసు వికలమైంది.
2025 ఆగస్టు 19..సాయంత్రం 5 గంటల ప్రాంతం.. ఆయన చనిపోవడానికి సరిగ్గా 16,17 గంటల ముందు నేను, కొమ్మాలపాటి శరచ్చంద్ర జ్యోతిశ్రీ, టీవీ నరసింహారావు విజయవాడ సమీపంలోని అరవింద స్కూల్లో ఉన్న జేకే సెంటర్ కు వెళ్లాం. 'మహాభారతం'లో భీష్మడు అంపశయ్య మీద అలమటించినట్టు కథల్లో చదివామే గాని నిజంగా చూసినవాళ్లు లేరు. ఇప్పుడు శివరాం గారిని చూసిన తర్వాత ఆ సీన్ గుర్తుకువచ్చింది.
ఇనుప మంచం మీద సన్నటి పరుపు, తలకింద చిన్న దిండు, నిండాకప్పుకున్న దుప్పటితో ఎడమవైపు వత్తిగిలి పడుకుని ఉన్నారు. మాటా పలుకు లేదు. అప్పటికే ఆయన తిండి మానేసి ఉగ్గటించడం మొదలుపెట్టి వారం పదిరోజులు దాటిపోయింది. ఎడమ చేతి మీద కుడి చేయి వేసుకుని పడుకోవడం వల్లనేమో ముంజేతులకు నీరు వచ్చింది.
అటువంటి చేతిని మృదువుగా నిమురుతూ ఓ శిష్యురాలు (మాధవి అనుకుంటా) 'తాతగారూ, తాతగారు..' అని పిలుస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో మేము ఆ రూంలోకి ప్రవేశించాం. దాంతో ఆమె 'తాతగారు, మీ కోసం ఎవరో వచ్చారు.. కళ్లు తెరవండి' అంటోంది. నాలుగైదుసార్లు పిలిచిన తర్వాత కుడికంటి రెప్పని ఓ రెండు సెకన్ల పాటు తెరిచి మళ్లీ మూసుకున్నారు.
ఇంతలో నేనూ, శరత్ కూడా 'సార్, శివరాం గారు' అని పిలిచాం గాని కళ్లు తెరిపిడి పడడం లేదు. మూసిన కళ్లంట నీళ్లు వస్తున్నాయి. నోటి వెంట సన్నటి మూలుగు, ఆ తర్వాత కొంచెం సేపటికి కొంచెం రక్తం వచ్చింది.
ఇంతలో అరవింద స్కూల్స్ ప్రిన్సిపాల్ కమ్ యజమాని ఇంద్రాణి గారు వచ్చారు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు నియమించిన భాషను పిలిపించి ఆయన్ను 'మరోపక్కకు తిప్పడానికి వీలవుతుందేమో' చూడమన్నారు. ఆమెకు మేము ఎవరిమో గుర్తుకు వచ్చినట్టు లేదని గ్రహించి మా పరిచయం చేసుకున్న తర్వాత మాకు తెలియకుండానే శివరాం గారి జ్ఞాపకాల్లోకి వెళ్లాం..
2001 డిసెంబర్ (తేదీ గుర్తులేదు)..
విజయవాడలో మాకో గుంపు ఉండేది. దానికి మేము పెట్టుకున్న పేరు జర్నలిజం వృత్తిమిత్రులు. 12,13 మంది ఉండేవాళ్లం. ఓరోజు మా మిత్రుడు, అన్నింటికీ చలించే పంతంగి రాంబాబు ఓరోజు మధ్యాహ్నం మమ్మల్ని తీసుకుని భవానీపురం కేసీ పబ్లిక్ స్కూలుకు తీసుకుపోయాడు. ఎవరో శివరాం అని విద్యావేత్తట, చర్చా గోష్టి పెట్టారు వెళదామంటే వెళ్లాం. ఆయన్ని చూసిన ఈయనేంటీ మనకు చెప్పేదేంటీ అనుకుంటూ మెహమాటపడుతూనే కింద కూలబడ్డాం.
పరిచయాలయ్యాక ఆయన తొలి ఉపన్యాసం విన్నాక నాకు ఒళ్లు జలతరించింది. విద్య, వికాసం, ధ్యానం, జ్ఞానం, దాస్యం, జీకే తత్వం, కాస్తంత కమ్యూనిజం, మనుషుల్లో కపటత్వంపై - ఓ గంటసేపు సాగిన ముచ్చట అది. అప్పటి దాకా పిల్లల్ని చితక్కొట్టైనా సరే నాలుగు అక్షరం ముక్కలు నేర్పించాలన్న నా మంకు వదిలింది గాని ఆయన చెప్పిన వాటిపై ఆరోజంతా ఆలోచించినా కొన్నింటిపై ఆయనతో ఏకీభవించలేకపోయాను.
ఆ తర్వాత ఓరోజు విజయవాడ అశోక్ నగర్ లోని శాంతి విద్యావనంలో ఆయన మాట్లాడతారు రమ్మంటే వెళ్లా. ఆరోజు ఆయనతో చాలాసేపు ఘర్షణ పడ్డా.. 'కమ్యూనిస్టులు ఇంతే, మీరు మారరు, విప్లవంతోనే సర్వం మారతాయనుకుంటారు, మనసులు మారకుండా సమాజం మారుతుందా' వంటివనేకం నాపై సంధించారు.
నేను సమాధానపడలేదు. నేనేదో పెద్ద కమ్యూనిస్టుననుకుని- ఆయన కమ్యూనిస్టులపై కోపంతో మాట్లాడుతున్నారనుకుని చాలా రోజుల పాటు ఆయన దగ్గరకు పోలేదు గాని కలిసిన ప్రతిసారీ ఆయన స్పర్శ చాలా ఆత్మీయంగా ఉండేది. చాలా కాలం మాట్లాడుకోకపోయినా అదే ఆత్మీయత, అనుబంధం ఉండేది. ఆ క్షణంలో బతకాలన్నది ఆయన తత్వం. అదే మా ఇద్దరి మధ్య స్నేహానికి దారి తీసింది. మాది మితృత్వ శత్రుత్వం.. ఓసారి నేను ఆయన కోసం ఓ జత బట్టలు కొని తీసుకుపోయా.. 'నాకెందుకయ్యా, ఇప్పుడున్న జత ఇంకా చిరిగిపోలేదుగా' అన్నప్పుడు నేనే పెద్ద హిపోక్రాట్ అని అర్థమైంది. ఆ తర్వాత అరవింద స్కూలులో ఆయనకు ఓ రూం ఇచ్చి ఆయన్ను ఓ తండ్రిలాగా ఇంద్రాణి గారు కాపాడుతున్నారని, విద్యాగోష్టులు తెలిసి మిత్రులతో కలిసి నాలుగైదు సార్లు వెళ్లాం. ఎప్పుడెళ్లినా అదే ప్రేమ, ఆప్యాయత.
గత మే నెలలో అనుకుంటా.. పెదకూరపాడులో మా మిత్రుడు శరచ్చంద్ర జ్యోతిశ్రీ అమరవీరుల సంస్మరణ సభ పెడితే అక్కడకు వెళుతూ నేనూ, నరసింహారావు, జీపీ వెంకటేశ్వర్లు, రాంబాబు, అక్బర్ పాషా అరవింద స్కూలులో ఆయన్ను కలిశాం. ఆ సందర్భంలో 'అసలు మీరెవరండీ' అని అడిగా..
నాకు గుర్తున్న వరకు శివరాం గారు చెప్పిన వివరాలు..
మా పూర్వీకులది కర్నాటక. మేము లింగాయతులం. మా తండ్రి విరూపాక్ష రెడ్డి. (బాగా డబ్బున్న వాళ్లను రెడ్డి గారు అని సంబోధించడం వల్ల తండ్రికి రెడ్డి అని పేరువచ్చిందట). అప్పచెల్లెళ్లు ఉన్నారు. సంపన్న కుటుంబమే. మా పెదనాన్న గొంగడి రామప్ప. ఈయనకు అనంతపురం జిల్లా కొత్తూరులో ఆయిల్ మిల్లు ఉండేది. ఆ మిల్లులో లెక్కలు రాయడానికో (పని చేయడానికో) నేను అక్కడ చేరా. అప్పుడు మా పెదనాన్న పెద్ద శ్రమదోపిడీదారని తెలిసింది. నాకు అప్పటికే కొందరు కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సాహిత్య సంబంధాలు ఉండేవి. వాళ్లు మా పెదనాన్న మిల్లులో శ్రమదోపిడీని అరికట్టాలంటే సమ్మె చేయించాలని నిర్ణయించారు. పరోక్షంగా నా తోడ్పాటు కోరారు. పరోక్షంగా ఎందుకని ప్రత్యక్షంగానే కార్మికులతో సమ్మె చేయించి జీతాలు పెంచించాం. అయితే ఆ తర్వాత మా పెదనాన్న నన్ను అక్కడి నుంచి తీసేసి ఇంట్లోంచి తరిమేశారు. అప్పటి నుంచి సామాజిక పరివర్తనే ధ్యేయంగా భావించే కమ్యూనిస్టులతో కలిసి పని చేశా. ఆ క్రమంలోనే తరిమెల నాగిరెడ్డితో పరిచయమైంది. ముఖ్య అనుచరునిగా మారా. సాహిత్య, సాంస్కృతిక రంగంలో పని చేశా. తరిమెల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 1969లో అసెంబ్లీకి రాజీనామా చేసినపుడు పునరాలోచనలో పడ్డా. అసెంబ్లీలు బాతాకాని క్లబ్బులు అనే విషయాన్ని టీఎన్ ప్రకటించినప్పుడు 'నువ్వు చెప్పిన ప్రతి దాన్నీ మేము వినాలా, మీరు విభేదిస్తే విభేదించాలా.. మీరు అనుకూలిస్తే మేము అనుకూలించాలా.. అనే దాని మీద భిన్నాభిప్రాయాలు వచ్చి ఆ తర్వాత నా దారి నేను ఎంచుకున్నా. కొన్ని ఏళ్లతరబడి అనుసరించిన విధానాలను చారిత్రక తప్పిదాలంటూ నాయకులు చెప్పుకు పోవడం, వారిని నమ్మిన వారు తలలూపుతతూ అనసరించడం నాకు ఇష్టం లేకపోయింది. దాంతో సత్యాన్వేషణకు బయల్దేరా. 1971 ప్రాంతంలో రిషీవాలీకి వెళ్లి జిడ్డు కృష్ణమూర్తి అనుచరునిగా మారిపోయారు. విద్యతోనే వికాసం అనే దాన్ని వంటబట్టించుకున్నా. చాలాచాలా కష్టాలు పడ్డా. ఓ దశలో అయితే జోలెపట్టి అడుక్కున్నా కూడా. ఎన్ని విభేదాలు ఉన్నా తరిమెలనాగిరెడ్డి మరణానంతరం జరిగిన సంతాప సభలో కూడా యాక్టివ్ గా పాల్గొన్నా.. అంతటి అత్యవసర పరిస్థితి కాలంలోనూ ఈ సభను మా మిత్రుడు అచ్యుత పట్వర్థన్ నిర్వహించినట్టు గుర్తు. రిషీ వ్యాలీ స్కూలు సంపన్నుల బిడ్డలకే పరిమితం అవుతున్నప్పుడు దాంతో విభేదించినట్టు కూడా శివరాం గారు చెప్పారు.
రూరల్ శాటిలైట్ ప్రోగ్రామ్ ను అచ్యుత పట్వర్ధన్ ప్రారంభించినపుడు చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించారు. పట్వర్ధన్ తనకు మార్గదర్శి అని చెబుతారు ఆయన. చాలా ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యా వికాసంపై చర్చలు, ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఆయన విజయవాడ వచ్చారు. పిల్లల ఆలోచనలకు తగ్గట్టుగా స్కూళ్లు నడపడం ఆయన అభిమతం. స్వార్థపు గోడలను కూల్చాలన్నది ఆయన ఆశయం. బట్టీ చదువులను చెదరగొట్టాలన్నది ఆయన సంకల్పం. ఆ ఆశయ సాధనలో ఆయన తుదివరకు శ్రమించారు. ఆ ఒంటరి పోరాటంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యారో, ఎన్ని స్కూళ్లు ఆయన ప్రభావంతో పని చేస్తున్నాయో, చేస్తాయో కాలమే తేల్చాలి. ఎందరెందరో యువ రచయితలకు వెన్నుదన్నుగా నిలిచారు. నిరాడంబరుడు. అనేక తాత్విక గ్రంథాల రచయిత. ప్రత్యామ్నాయ విద్యను గురించి నిరంతరం ప్రసంగాలు చేశారు.
జీవితాంతం విద్య, ఆలోచన, నిరాడంబరతకే అంకితం అయిన శివరాం గారి ప్రయాణం మనకు చెప్పే పాఠమేమిటంటే – మనసు, మనిషి మారితేనే సమాజం మారుతుంది. ఆయనకు మా జర్నలిజం వృత్తిమిత్రుల తరఫున వినమ్రనివాళి.
Next Story