
గిరిజన సంస్కృతిని ఆర్పేస్తున్నారు, అడ్డుకోవాలి...
ప్రత్యామ్నాయ సృజన శీలుర సాహిత్య సభ పిలుపు
- సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్ రావు సారథ్యంలో పల్లె పదాల సంరక్షణకు నాంది ప్రస్తావన
- తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి పలువురు హాజరు
- దేవదాసి, ఆదివాసి, రాయలసీమ యాస, జానపదాలు కరువుతున్నాయని కవుల ఆందోళన
-నరసన్న గౌడ్
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మాండలికాలు పల్లె పదాలు యాసలు క్రమంగా కనుమరుగవుతున్నాయని పలువురు రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. వాడిని కాపాడుకోకపోతే వివిధ ప్రాంతాల మాతృభాష కోల్పోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు సారధ్యంలో ప్రత్యామ్నాయ సృజన శీలుర సాహిత్య సదస్సును నిర్వహించారు. ఈమధ్య ఇలాంటి సాహితీ సభలు నిర్వహించడం లేదు. రొటీన్ కి భిన్నంగా సభ నిర్వహించడం సాహిత్య ప్రియులకు విమర్శకులకు సాహితీ సంబంధికులకు ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.
సదస్సు ప్రారంభంలో అరుణోదయ విమలక్క గిరిజన స్థితిగతులపై గీతాన్ని పాడి ప్రసంగించారు. నాగరికత పేరుతో గిరిజన సంస్కృతిని నాశనం చేస్తున్నారని వారి మూలాలను వారి కాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం అక్కడి సంపదల కోసం కార్పోరేట్ శక్తులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ గిరిజనులను మట్టు పెడుతున్నాయి అన్నారు. ఆ రకంగా వారి జీవితాలను బుగ్గి చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆమె ఆరోపించారు. నాగరిక సమాజం గిరిజనుల జీవన విధానాన్ని వారి సంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు పూను కోవాలన్నారు.
దేవదాశినులపై ప్రత్యేక పరిశోధన చేసిన ఉమామహేశ్వరరావు చేసిన ఉపన్యాసం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ, కర్ణాటక సంగీత కళాకారిణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాల సరస్వతి లాంటివారు వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించారు.
కానీ ఆయా రంగాల్లో వారు సాధించిన నైపుణ్యాల ద్వారా కాకుండా వారి కులాల ఆధారంగా వారికి గుర్తింపు దక్కడం చాలా బాధాకరమని ఆయన వాపోయారు. నిజానికి వీరందరి సామాజిక నేపథ్యం దేవదాసి వృత్తే. వీరిలో ఆద్యులు బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మను ఆయన చెప్పుకొచ్చారు.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతంలో ప్రవీణులుగా గణుతి కెక్కగా బార సరస్వతి సైతం నృత్యంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించినప్పటికీ ఆమెకు ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి వచ్చినంత పేరు రాలేదనేది ఇక్కడ ఆయన చెబుతున్నారు. ఇరువురు జాతీయస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడించినప్పటికీ బాల సరస్వతికి సుబ్బలక్ష్మి స్థాయికి చేరుకోలేకపోయింది. కళాకారులను కళలలో వారి నైపుణ్యాన్ని బట్టి కాకుండా వారి కులాల ఆధారంగా వారికి గౌరవం దక్కినట్టు ఉమామహేశ్వరరావు పేర్కొనడం ముదావహం.
దేవదాసీలు అనగానే వారి వృత్తి పడుపు వృత్తిగా వేశ్యలుగా పేర్కొనడం పూర్తిగా అభ్యంతరకరమన్నారు. కొందరు ప్రముఖ కవులు దేవదాసిలను వేశ్యలని కాకుండా మరి ఏమని పిలుస్తామని అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు సామాజిక స్పృహ ఉన్న రచయితలు సైతం ఆ రకమైన వ్యాఖ్యానాలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. దేవదాసిల పట్ల సమాజంలో కొనసాగుతున్న అవమానకరమైన నేటి దృక్పథం మారాల్సి ఉందని వారిని మనుషులుగా గుర్తించి వారికి ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని స్థానిక భాష ఆ ప్రాంత ప్రజల మాతృభాష అయిన కోయ ఇతర స్థానిక భాషలు క్రమంగా మాయమైపోతున్నాయని
గిరిజన ఉపాధ్యాయురాలు పద్దేం అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష ఆ ప్రాంత భాషలపై ఆధిపత్యం చెలాయిస్తోందని తత్ఫలితంగా స్థానిక భాషలు తెర మరగవుతున్నాయన్నారు. గర్భసంచిని గిరిజన ప్రాంతాల్లో 'పిల్లమడి'గా పేర్కొంటారని పరభాష వ్యామోహం లో ఇలాంటి పదాలు తెలియకుండా పోతుందన్నారు. వాడుకలో సైతం లేదన్న విషయాన్ని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. స్థానిక భాషల మూలాల్ని కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వాలు సైతం నడుము బిగించాలని కోరారు.
పాట మాల మాదిగ వాడల్లోనే పుట్టిందని ఆ పాటను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తోట ఆపర్ణ పేర్కొన్నారు. తాను చదువుకొని ఆధునిక మహిళగా రూపొందినప్పటికీ దాసరి కులంలో పుట్టడం వల్ల పాటలు కీర్తనలు పల్లె పదాలు లాంటివి పుట్టుకతో అబ్బినట్టు ఆమె చెప్పుకొచ్చారు. స్థానిక భాషను మరువకుండా వాటిని ఆచరణలో ఉంచడం ద్వారానే ఆ భాషలకు వెలుగు ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్ని టూరిస్టు స్థలాలుగా ప్రభుత్వం పరిగణిస్తూ ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. వివిధ ఎగ్జిబిషన్స్లో కొండపల్లి బొమ్మలు బుట్టలు ప్రదర్శనకు ఉంచి వాటిని అమ్మడంపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ వారి జీవితాలను సమగ్రంగా మార్పు చేసే అంశంపై దృష్టి సారించడం లేదు. వారి జీవన స్థితిగతులు వారి సాంప్రదాయాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు లేవు స్థానిక భాషల్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందని అపర్ణ పేర్కొన్నారు. మాల దాసర్లు మంచి కళాకారులని గ్రామాల్లో తొలుత వీరే వివిధ కీర్తనలు పాటలు లాంటివి పాడి గ్రామీణ ప్రజల కు ఆనందం చేకూర్చే వారన్నారు.
రాయలసీమ యాసపై ఆ ప్రాంత స్థానిక భాష గురించి చెలికంపల్లి కొండారెడ్డి ఆ ప్రాంత యాసలోనే సంభాషించడం ఆకట్టుకుంది. ఈ నేలపైనే నెత్తురులు పారినాయి బాంబులు పేలినాయి జనం బతుకులు నలిగినాశినమైనాయి. మరోవైపు నిరక్షరాస్యతతో ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ యాసలోనే కథలు రచనలు రావాల్సిన అవసరం ఉందని ఆ ప్రాంత యాసను కాపాడుకోవాలన్నారు.
రానున్న తరాలకు రాయలసీమ యాస గురించి అవగాహన ఉండేవిధంగా సాహిత్య సారస్వతం ఉండాలన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత ఉపాధ్యాయుడు పల్లి పట్టి నాగరాజు చిత్తూరు యాసను యాసగా పేర్కొనరాదని అది ఆ ప్రాంత భాషగా గుర్తించాలని గట్టిగా కోరారు. 'నడువంగ నడువంగ దావ మజాకా' 'పాడంగపాడంగా పాట మజాకా' అంటూ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మకుటాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఈ సాహిత్య సభకు చాయా పబ్లికేషన్స్ అరుణాంక్ అధ్యక్షత వహించారు. పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకురాలు మనోజ ఈ సదస్సు నిర్వహణలో పాల్పంచుకున్నారు. ఈ సదస్సులో శోభనం విజయకుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
Next Story