
సంక్రాంతి
నేటి మేటి కవిత: మధు గోలి
మసకబారుతున్న
మానవ సంబంధాలకు
కొత్త చిగురులు తొడుగుతూ
ఊళ్లన్నీ కళకళ లాడుతున్నాయి
ఇంటికొచ్చిన పంటతో
నేల తల్లి పొడిబారినా
మట్టి మనిషి కళ్ళు
నీళ్ళు నిండిన వరి చేళ్ళయ్యాయి
కడుపు తీపి కన్న ఊరు
గత స్మృతుల అలలపై
బంధాల నావలో
అనుబంధాల తీరం చేరాయి
మట్టి పరిమళం నీడన దాగిన
మమతల పంజరం చేరిన
పంచవన్నెల రామచిలుకల సవ్వడికి
గడప గడపా సంగీత కచేరీ అయింది
సాంకేతిక విప్లవాల బాటలో
విదేశీ విహంగ యానంలో
పెరిగిన దూరాల్ని
అనుబంధాల స్మరణ తగ్గించేసి
ఆత్మీయత గూటికి చేర్చింది
భేషజాలు సమసి
స్నేహాలు ఎగసి
బాల్యపు మాధుర్యాల నీడన
పల్లెలన్నీ పులకిస్తున్నాయి
అపార్ట్మెంట్ వాకిట
ముగ్గులు మరచిన మగువలు
గొబ్బెమ్మల పనిలో పడితే
నెరిసిన తలలు తెగమురిసిపోతున్నాయి
ఆన్ లైన్ వంటకాలు
జోమాటో టమాటో
పిజ్జా బర్గర్లు మరచి
అరిసెల పాకంలో
అనుగాగం మునిగి
ఆనందాల హరివిల్లే
పల్లె పల్లె అంతా
పతంగుల గిరికీలు
గంగిరెద్దుల సవ్వళ్లూ
కోడిపందేల జాతరలూ
పండుగ తెచ్చిన బహుమానాలు
సంక్రాంతి సందడి అయ్యాక
పొట్ట తిప్పల వేటలో
ప్రాణాలన్నీ తిరుగుముఖం పడుతుంటే
నెరిసిన తలల కళ్ళు
కట్టతెగిన చెరువులయ్యాయి
తెగిన కట్టకు ఆనకట్టగా...
చూపుడు వేలు కదిలి
నుదుటిని చుంబిస్తూ చెప్పింది
సంక్రాంతికి మళ్లీ కలుస్తామంటూ !
గోలి మధు,
Next Story

