సఖినేటిపల్లి సూరిబాబు పెసరట్టు హోటల్
x

సఖినేటిపల్లి సూరిబాబు పెసరట్టు హోటల్

ఆ హోటలు బోర్డులోని తెలుగు అక్షరాల సొగసు చూడగానే సగం కడుపు నిండిపోయింది. తర్వాతేమయిందంటే...


సూర్యకుమార్


సఖినేటిపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన నరసాపురం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి, సఖినేటిపల్లికి మధ్య గోదావరి మాత్రమే అడ్డు. బల్లకట్టు ద్వారా నరసాపురానికి రాకపోకలు, సరుకుల రవాణా జరిగేవి. ఇప్పుడో వంతెన వచ్చినా, ఉత్పత్తులు పెరిగినా, వ్యాపారం సులువై విస్తరించినా బల్లకట్టు పూర్తిగా పోలేదు. దాని చుట్టూ అల్లుకున్న ఆనాటి జీవితం లోని మెరుపులు, మరకలు, మమకారాలు, రుచులు, అభిరుచులు, పలకరింపులు, అరమరికలు లేని అప్యాయతలు, వెటకారాలు అన్ని కొనసాగుతూనే వున్నాయి.


జీవితాన్ని పరిమళింప జేస్తూనే వున్నాయి. స్థానిక సంస్కృతిని జీవన సొబగుల్ని వాళ్ళు కాపాడుకుంటూనే వున్నారు. దర్శకుడు వంశీ అక్కడి జ్ఞాపకాల్ని, వశిష్ట గోదారి జ్ఞాపకాల్ని అక్కడి మాటల జ్ఞాపకాల్ని, పోట్లాడుకున్న జ్ఞాపకల్ని, రంగుల జ్ఞాపకల్ని, పొలమారిన జ్ఞాపకాల్ని పొగుచేసి ఒక గౌతమి గంగా ప్రవాహపు తీపి నీటి ఊటలా ప్రతి గురువారం ఒక వీడియోగా విడుదల చేస్తున్నారుఈ మధ్య. తాను పుట్టి పెరిగిన వూళ్ళు, ప్రాంతాలు, ఈదులాడిన ఏర్లు, వాగులు,నదులు, కాలువలు వాటిని దాటించే పడవలూ పంటులూ, చదువులు సాములు, ఆహారపు అలవాట్లు, ఆచారపు వ్యవహారాలు అన్నిటినీ కొద్ది కొద్దిగా ఆత్మీయంగా మనకు చూపిస్తున్నాడు. వేద గౌతమిగా తీర్చి దిద్దుతున్నాడు. ఒక స్థానిక సంస్కృతికి , తెలుగు జీవితాల్లోని ఒక అందమైన భాగానికి పట్టం కడుతున్నాడు.




అలాటి వీడియోల్లో వైరల్ గా మారిందో వీడియో. అదే” సఖినేటిపల్లి సూరిబాబు హోటల్-ఇక్కడ పెసరట్టు ప్రత్యేకం.” ఎప్పుడో ఒక షూటింగ్ కోసం అక్కడికి వెళ్లీన వంశీ, ఒకచోట టిఫిన్ తిని అది నచ్చి, ఆ పెసరట్టు- కొంచెం ఘాటైన టమాటా చట్నీ, బంగారు రంగులో వేగిన పెసర పునుగులు, పల్లి చట్నీ, ఇట్టే కరిగిపోయే దూది పింజల్లాంటి మెత్తని ఇడ్లీలు- కారంపొడి రుచులను నోరూరించేలా అక్షరబద్ధం చేశారు. ఆ టిఫిన్ సెంటరును, దాని సృష్టికర్త సూరిబాబు ను, అతని స్వభావాన్ని, వంటకాలు వడ్డిస్తూ ఆయన చూపే ఆదరణని, గోదారి మర్యాదని, ఆ ప్రాంతీయత ని, తన దైన స్వంత దనాన్ని వంశీ ఆప్యాయంగా చిత్రించి వాటికి సాహిత్య గౌరవం కల్పించాడు. సొట్టలు తీసిన సత్తు పళ్ళెం ధ్వనిలా ఆయన పేరును మోగించేశాడు. వాటిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. తన యు- ట్యూబ్ చానెల్ ద్వారా విశేష ప్రచారం కల్పించాడు

రోడ్డు పక్కన వున్న ఫలహార శాలలు, పాక హోటళ్లలో కబుర్లు చెప్పుకుంటూ తినే రుచే వేరు కదండీ ఆయ్ .. అదీ వంశీ పోకడ. కోనసీమ కొబ్బరి చెట్ల నీడల్లో, కలలో కనిపించే అందాల మధ్య ఆరగించే తిండి రుచే వేరు అనుకుంటూ, చేతులు కాలే వేడి వేడి అట్టును తుంచుకుంటూ, ఉఫ్ ఉఫ్ న ఊదుకుంటూ తినడంలోనే గొప్ప రుచిని అనుభవిస్తాడాయన.


రేవులో చాకళ్ళు బట్టలుతుకుతున్న చప్పుళ్ళు, దుమ్ము రేపుకుంటూ మోర లెత్తుకుపోతూ పశువులు చేసే అంబారావాలు, కాడికింద క్రమశిక్షణగా నడుస్తూ పోయే ఎద్దుల మెడల్లో మోగే గంటల శబ్దాలు, పక్కనే పాఠ శాలలో చదువుకుంటున్న పిల్లలు చేసే వేదఘోషలు, మరొ పక్క రాములోరీ గుడినుంచి వుండీ వుండీ వినిపించే కంచు గంట మోతలు వింటూ, కంటూ తినే తిండి రుచి, ఫైవ్ స్టార్ హోటళ్లలో రమ్మంటే ఎలా వస్తుంది అని ఆయన ఆంతర్యం. ఈ వాతావరణం నుంచి విడదీసి చూస్తే ఒక పదార్ధంలో ఆ రుచి వుంటుందా అని మనకు అనిపిస్తుంది. మోతుబరులు, డబ్బున్నవాళ్లు పరువు తక్కువ అని భావించి రాని , రాలేని చిన్న హోటళ్లలో ఈ మొత్తం ప్రకృతిలో భాగమవుతూ తింటూ, ఆ రుచికి లొట్టలు వేయటమీ ఆయనకో సరదా. అదో తృప్తి !



ఈ సూరిబాబు హోటల్ మాత్రం మోతుబరులను సైతం తన దగ్గరకు లైను కట్టించిందండోయ్ సఖినేటిపల్లి వెళ్లీ ఆ పెసరట్టు ను ఒక పట్టు పట్టాలిసిందే అనే విధంగా ప్రాణం పోశారు. అదీ ఆ పసలపూడి కథల బ్రహ్మ రచనా కౌశల్యం. ఆకర్షణ. తన ప్రాంతపు జీవన విశేషాలను, ప్రత్యేకతలను చూసి దృశ్యమానం , శ్రవ్యమానం చేసిన కళా ప్రతిభ ఆ కంటి చూపు. చివరకి ఆ సూరిబాబు ఇప్పుడు ఇక్కడే మన హైదరాబాదులోనే మియాపూర్ దగ్గరలో నిజాంపేట దగ్గర బాలాజీ కాలనీ లో ఆ పెసరట్లు తినిపించటానికి రడీగా అందుబాటు లో వున్నాడని ఓ కొసమెరుపు విసిరాడు.

మరేం! సఖినేటిపల్లి మన ముంగిట్లోకె వచ్చింది, ఒకసారి వెళ్లీ ఆ సూరిబాబును చూసొద్దాము అనుకుని ఈ ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా పదిమందిమి ---వంశీ వర్ణించిన రూటులో .. పిల్లర్ నంబర్లు, యు టర్నులు ఫాలో అవుతూ సఖినేటిపల్లి సూరిబాబు హోటల్ కు చేరుకున్నాము. గూగులమ్మ రూటు చెప్పదా అంటే మహా బాగా చెబుతుంది. కానీ వంశీ ఆడియో వింటూ అవుననుకుంటూ , కాదనుకుంటూ కాస్త గందర గోళంగా అక్కడకు వెళ్ళటం కూడా ఒక సరదానే. ఆ హోటలు బోర్డులోని తెలుగు అక్షరాల సొగసు చూడగానే సగం కడుపు నిండిపోయింది.


కోనసీమంత కాకపోయినా ఇక్కడా పెద్ద చెట్లతో కాస్త విశాలంగానే వున్న రోడ్లతో, పరిసరాలు ఆహ్లాదకరంగానే వున్నాయి. పరిశుభ్రం గానే వున్నాయి. నగరం ఇంకా నిద్ర దుప్పటి తీసి మడిచి పెట్టలేదు కనుక పక్షుల కూతలు వినిపిస్తూనూ వున్నాయి. శీతాకాలపు ఉదయం. చలి తెరలు పూర్తిగా తొలిగి పోలేదు. అప్పుడప్పుడే ఇడ్లీల వాయి దించుతున్నారు. పెసరట్టుకోసం పెనం వేడెక్కుతోంది. పక్కనే అట్టు లోకి ఉప్మా పొగలు కక్కుతూ వుంది.


పుణుగులు, వడలు ఒక గాజు పెట్టెలో కంటికి ఇంపుగా వున్నాయి. చట్నీలు చిన్న గిన్నెల్లో సిద్ధంగా వున్నాయి. అందరం ఎవరికి కావలసింది వాళ్ళు తిని పక్కనే వున్న కాలనీ పార్కులో కాసేపు క్రికెట్ కాసేపు వ్యాయామ క్రీడలు ఆడి ఆదివారం ఉదయాన్ని సార్ధకం చేసుకున్నాము. పిల్లల కేరింతలతో ఆనందపు హుషారు నింపుకుని వచ్చాము.

ఇంతకీ టిఫెన్ల రుచి సంగతి ఏమిటి అంటున్నారా?


“ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి పొద్దున్నే లేచి పడీ పడీ రావాలా ?” అన్న వారొకరు, ఆ పెసరట్టు టమాటా చట్నీ అదిరింది అన్నవారొకరు, ఈ ఉదయం అంతా ఒక అందమైన అనుభవం కాదూ? అని అడ్డు తగిలిన వారొకరు . ఏమైనా మీ రచయితలు వాస్తవాలను ఉత్ప్రే క్షించి ఊహా లోకాల లో తేలించి వేస్తారులే అన్నవారొకరు, ఉన్నదాన్ని ఆత్మీయంగా స్వీకరించటమే కదూ జీవించటం అంటే , మన చుట్టూ వున్న వాటితోనె మమేకం చెందుతూ, వాటినె ఇష్టంగా మలుచు కుంటూ ప్రతిక్షణం ఆనందం పిండుకోవటమే కదా జీవితాన్ని రసభరితం చేసుకోవటం అంటే. రచయిత అదే చేస్తాడు. “లేని” కాదు “లోని” అందాన్ని వెలికి తీస్తాదు అని సర్ది చెప్పిన వారొకరు.


అసలైన రుచి వడ్డించేవాడి ప్రేమ పలకరింపులో కదా వుంటుంది అని వంశీ ఈ వీడియో లో కూడా అంటారు. ఏమైనా వంశీ గారి వాక్చిత్రాన్ని మనం వాస్తవం చేసుకున్నాం అది చాలదూ--- అని ప్రశ్నించిన వారొకరు. అసలు రుచి ఆకలిలో వుంటుంది. తినే నాలుకలో వుంటుంది. అందం చూసే కన్నుల్లో వున్నట్టే రుచి ఆస్వాదించే మనసులో కదా వుంటుంది. అందుకే పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు. ఏమంటారు?



Read More
Next Story