సినిమా హాల్లో రన్నింగ్ కామెంటరీ గురించి విన్నారా?
x

సినిమా హాల్లో రన్నింగ్ కామెంటరీ గురించి విన్నారా?

ఎప్పుడైనా హిందీ, ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. ఆ సినిమాల సంభాషణలు అందరికీ అర్థం కావడంకోసం హాలు యజమానులు ఒక అనువాదకుడిని ఏర్పాటు చేసే వాళ్ళు.కవిటం కబుర్లు-7


పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలో వున్న మా ఊరు కవిటం పల్లెటూరే కానీ ఎంతో విలక్షణమైన ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న వూరు. దేశభక్తులకు, సంఘసేవకులకు , రాజకీయ నాయకులకు, మంత్రులకు , ఉన్నత నౌకా దళ అధికారులకు, ఉన్నత ప్రభుత్వ అధికారులకూ, పత్రికా రచయితలకు పుట్టినిల్లు. జాతిపిత మహాత్మా గాంధీజీ పాద స్పర్శ తో పునీతం అయిన వూరు మా కవిటం.

పచ్చని పంట పొలాలతో, కొబ్బరి తోటలతో, మామిడి ఇంకా రకరకాల పండ్ల తోటలతో కనువిందు చేసే మా కవిటం లో పుట్టి , పెరిగిన వాళ్ళు ఎంతో అదృష్ట వంతులని చెప్పాలి.

మా ఊరు కవిటంలో అక్షరాస్యత ఎక్కువ . బాగా పై చదువులు చదువుకుని, ఉన్నత పదవులు అలంకరించి మా వూరికి పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన ప్రముఖులు ఎంతోమంది ఇక్కడ పుట్టి పెరిగిన వారే. మా గ్రామంలో అంతా ఎంతో సౌమ్యులు. సహృదయతకూ, స్నేహశీలతకూ కాణాచి మా కవిటం.

ఎంతో ఒదుగుతూనే ఎదిగి , ఎదుగుతూనే ఒదిగే సౌజన్య మూర్తులకు నిలువెత్తు నిదర్శనం మా కవిటం.

ఉద్యోగాల నిమిత్తం , పిల్లల చదువుల నిమిత్తం విధి లేక వేరే వూళ్ళలో వుండవలసి వచ్చినా మా మూలాలు కవిటమే.

ఏదేశమేగినా, ఎందు కాలిడినా మేము పుట్టి పెరిగిన కవిటం గ్రామాన్ని తలుచుకోగానే మా ఒళ్ళు పులకరించి పోతుంది. ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు మా మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. మా కవిటం నేలలో, ఆ మట్టిలో ఏదో చెప్పలేని గొప్పతనం వుంది.తలుచుకుంటే తరగని తీయని జ్ఞాపకాల నిధి, పెన్నిధి మా వూరు కవిటం. వాటిని తలుచుకుంటూ శేషజీవితం గడిపేయవచ్చు. మా చిన్ననాటి జ్ఞాపకాలలో ఎంతో మనసుకి హత్తుకుపోయిన కొన్నింటిని మీతో పంచుకుంటాను.

మా చిన్నతనాల్లో వేసవి సెలవుల్లో తినడం, తిరగడం పిచ్చి అల్లరి చెయడం తప్పించి వేరే కాలక్షేపం ఏమీ వుండేది కాదు. వూళ్ళో ప్రతి సందు, ప్రతి డొంక, ప్రతి పొలంగట్టూ, ప్రతి పంట కాలువా మాకు కొట్టిన పిండే. ఎక్కడైనా ఈతచెట్టుకి, ఈత పళ్ళ గెల కనిపిస్తే చాలు మిడతల దండులా అక్కడ వాలి పోయేవాళ్ళం.ఒకవేళ గెలలో ఈతకాయలు పచ్చిగా వున్నా దాన్ని బతకనిచ్చేవాళ్ళం కాదు. ఆ గెలలు కోసుకువెళ్ళే వాళ్ళం.

అవి కూడా తాటి ముంజలు లాగే వేసవిలో వస్తాయి. వీటిని ముగ్గపెట్టడం ఓ గమ్మత్తు ప్రక్రియ. అవి పసుపు రంగు లోకి తిరగ్గానే కోసి చెరువు బురదలో కానీ కాలువ మట్టిలో గాని 3,4 రోజులపాటు కప్పెట్టాలి. ఆ తరువాత వాటిని బైటకి తీసి కడిగి చూస్తే అవి ముదురు, ఎరుపు రంగులో, ఖర్జూరం పండు రంగులో కి మారుతాయి. అవి కూడా ఖర్జూరం జాతే. భలే తీపి చిరుతిండి..

ఆ మూడు నాలుగు రోజులూ మేము వాటిని కప్పెట్టిన రహస్య ప్రదేశాన్ని ఒ కంట కనిపెడుతూనే వుండేవాళ్ళం. ప్రత్యర్థుల కంటపడకుండా అక్కడ ఎండిపోయిన పుల్లలు, కొమ్మలు పడేసేవాళ్ళం. అవి బాగా పండిన తరువాత శుభ్రంగా కడిగి సమానంగా పంచుకుని తినేవాళ్ళం. ఎవరికీ ఎక్కువ తక్కువలు వుండేవికాదు. మా గ్యాంగ్ లో అంతా సమానమే. ఇవేనా , కాదు మా తిండి రంధికి కాదేదీ అనర్హం.

స్ప్రింగులా చుట్టలు తిరిగి చెట్టుకు వేలాడుతూ నోరూరించేలా కనిపించే రంగు రంగుల సీమ చింత కాయలు మా మరో అభిమాన చిరుతిండి.

మా గ్యాంగ్ లో అవలీలగా చెట్లుఎక్కే చాకులాంటి కుర్రాళ్ళకి ఆ పని పురమాయించే వాళ్ళం. పాఠకుల్లో, ఈ కాలం కుర్రాళ్ళలో ఎంత మందికి ఈ సీమ చింతకాయలు తెలుసో నాకు తెలియదు. అసలు ఎంతమంది వీటిని చూసి , తిని వుంటారు? నాకు సందేహమే సుమండీ.అవి ఎంతో తియ్యగా, కాస్త ఒగరుగా వుండేవి.

ఇంక గుత్తులు గుత్తులుగా చెట్లకి వేలాడుతూ నోరూరిస్తూ అమాయకంగా కనిపించే చింత కాయలు మా కంట పడితే చాలు మా పంటి కింద నలిగిపోవల్సిందే. అది ఎవరి చెట్టు అన్నది మాకు ముఖ్యంకాదు. మా దృష్టిలో అంతా సమానులే.


నల్లని నేరేడు పళ్ళ పరిస్థితి కూడా అంతే. నేరేడు చెట్లు చాలా ఎత్తు గా వుండేవి. ముందుగానే జేబుల్లో పోసుకెళ్ళిన రాళ్ళను, అంబుల పొదిలో వుంచిన స్పెషలు బాణాల్లా బైటికి తీసి , ఎక్కు పెట్టి, గురి చూసి కొట్టేవాళ్ళం. సాధారణంగా మా గురి తప్పేదికాదు. నేరెడు పళ్ళు టపటపా రాలి పడేవి. పక్కనే వున్న పిల్లకాలువలో వాటిని శుభ్రంగా కడిగి వాటిని అక్కడే, ఆ చెట్టకిందే కూచుని లాగించేసే వాళ్ళం. తన చెట్టు పళ్ళని కుర్రాళ్ళు హాయిగా ఆరగిస్తున్నారని ఆ నేరేడు చెట్టు ఆనందించేదో లేక మా రాళ్ళ దెబ్బలకి తిట్టుకునేదో మాకు తెలియదు. " axe forgets, tree remembers" అన్న ఇంగ్లీషు సామెత నాకు గుర్తొచ్చింది. పాపం, మా చిన్నతనాల్లో అలా ఎన్ని అమాయక, అభాగ్య, నిస్సహాయ పండ్ల చెట్లు మా దౌష్ట్యానికి బలైపోయాయో లెక్కలేదు.

మా ఇంట్లోపండగలకి పది రోజులు ముందుగానే పిండివంటల తయారీ సన్నాహాలు మొదలయ్యేవి. అరిసెలు, మిఠాయిలు, జంతికలు వంటి పిండి వంటల్ని తయారుచేసి, పెద్ద పెద్ద డబ్బల్లో పెట్టి మూత గట్టిగా బిగించి మాకంట పడకుండా రాక్షసుడి ప్రాణాల్లా ఏడు ఇరుకుల్లో దాచేసేవాళ్ళు. అయినా మేము అవలీలగా ఆ వాసల్ని పసికట్టేవాళ్ళం. కానీ పెద్దవాళ్ళ కన్నుకప్పి వాటి సమీపానికి వెళ్ళలేక పోయేవాళ్ళం. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆ ప్రదేశంలోనే వుండేవాళ్ళు.

మధ్యాన్నాల టైములోకూడా వంటింటి గడపమీద తల పెట్టుకుని పడుకునే వాళ్ళు. చీమ చిటుక్కు మంటే కళ్ళు తెరిచి చూసేవాళ్ళు. ఇంక మా ఆటలు ఏమి సాగుతాయి చెప్పండి. మా కోతి మూకకి మా ఇంట్లోనే కాదు మా వూళ్ళో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు వుండేవి మరి.

మా చిన్నతనాల్లో చిరుతిండి యావ అలావుండేది. అలాంటి రోజులు మళ్ళీరావు.

కడుపు నిండిన తరువాత వేరే కాలక్షేపం ఏమిటా అని ఆలోచించే వాళ్ళం. మా బాబయ్యలు మా పోరు పడలేక మమ్మల్ని అప్పుడప్పుడు షికార్లకీ సినిమాలకీ తీసుకువెళ్ళే వాళ్ళు. అప్పుడు మా హుషారు అంతా ఇంతా కాదు. సైకిలు హాండిల్ బార్ రాడ్ మీద ఒకళ్ళని, వెనకాల కారియర్ మీద ఇంకొకళ్ళనీ కూచోపెట్టుకుని మా బాబయ్య మమ్మల్ని ఓ రౌండ్ తిప్పేవాడు. ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్ళేవాడు. అప్పుడు మా సంబరం అంతా ఇంతా కాదు. ఏడాదికో శివరాత్రి లా ఎప్పుడైనా ఇంటిల్లపాది సినిమాకి బయలుదేరితే ఆ ప్రయాణం ఏర్పాట్లు , ఆ సన్నాహాలు మీకు చెప్పి తీరవలసిందే.

మాకు దగ్గర్లో వున్న టౌన్ పాలకొల్లు. అక్కడ రెండు సినిమాహాళ్ళు ఉండేవి. మొత్తం కుటుంబ సమేతంగా సినిమా చూడటానికి అంతా రెండెడ్ల బండి మీద బయలు దేరేవాళ్ళం. ప్రత్యేకంగా బండికి గూడు కట్టి, క్రింద తొట్టి లో గడ్డి పరిచి పైన జంబుఖానా గాని బొంత గాని వేసి, మరచెంబు లో మంచినీళ్ళు పోసుకుని, అటుకులు, జంతికలు చిరుతిళ్ళు పెట్టుకుని బయలు దేరేవాళ్ళం.

ఎడ్లకి ప్రత్యేకమైన మువ్వల పట్టీలు కట్టి అవి నడుస్తోంటే ఘల్ ఘల్ మని మంటూంటే ఆ శబ్దం ఎంతో వినసొంపుగా వుండేది. బండికి ఒక లాంతరు కట్టి వెళ్ళే వాళ్ళం. ఆ రెండెడ్ల బండి మీద ప్రయాణం,అదో మధురమైన అనుభవం. మా పిల్లల సంబరం అంతా ఇంతా కాదు.

ఎడ్లు తినడానికి క్రింద తొట్టిలో గడ్డి, జనపకాడలు పెట్టేవారు. ఒక చేత్తో దుడ్డు కర్ర, మరో చేత్తో లాంతరు పట్టుకుని ఒక పాలేడు బండి ముందర నడిచేవాడు. సాధారణంగా రెండు బళ్ళలో సినిమా కి వెళ్ళేవాళ్ళం.

సినిమాకి ఓ రెండు గంటలు ముందుగానే బయలుదేరేవాళ్ళం. మరి రెండెడ్ల బండి మీద ప్రయాణంకదా!

సినిమా హాలుకు చేరుకోగానే పాలేడు బండిని కాస్త దూరంగా కట్టేసి ఎడ్లకి మేత పెట్టేవాడు. అవి నింపాదిగా నెమరు వేసుకుంటూ తినేవి. పాలేడు కూడా ఓ కునుకు తీసేవాడు. ఈ లోగా మా బాబయ్య సినిమా టిక్కెట్లు కొనుక్కొచ్చేవాడు.

ఆరోజుల్లో సినిమా హాల్లో నేల, బెంచి, కుర్చీ టిక్కెట్లు వుండేవి. పిల్లలకు బెంచీ, పెద్దలకు కుర్చీ టిక్కెట్లు కొనేవాడని బాగా జ్ఞాపకం.

ఆరోజుల్లో సాధారణంగా తెలుగు సినిమాలే ఆడేవి. ఎప్పుడైనా పౌరాణిక జానపద హిందీ, ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. ఆ సినిమాల సంభాషణలు అందరికీ అర్థం కావడంకోసం హాలు యజమానులు ఒక అనువాదకుడిని ఏర్పాటు చేసే వాళ్ళు.

ఆ వ్యక్తి హాలు లోపల మధ్యలో , గోడవారగా ఓ పెద్ద బల్లమీద నుంచుని ఆ డైలాగుల్ని తెలుగులో అనువాదం చేసేవాడు .

అందరికీ వినపడటం కోసం గొంతు చించుకుని అరిచేవాడు. చాలా నాటకీయంగా సందర్భానికి తగ్గట్టు అభినయిస్తూ అనువాదం చేసేవాడు.

సినిమాలో యుద్ధం సీన్లు వస్తే ఆయన కూడా వీరావేశంతో వూగి పోయేవాడు. సినిమా చూడాలో, ఆ వ్యక్తి నటనని చూడాలో తేల్చుకోలేక పోయేవాళ్ళం.

సినిమా అయిపోగానే ఇంటికి ఆ చీకట్లో బళ్ళ మీద బయలుదేరేవాళ్ళం. ఆ చిమ్మచీకటిలో రెండెడ్ల బండిలో ప్రయాణం ఎంతో వుత్కంఠ భరితంగా వుండేది. ఎడ్లు చాలా స్పీడ్ గా నడిచేవి. చుట్టూరా చీకటి, కీచురాళ్ళ రొద. కాలువ గట్టమ్మటే , మువ్వల శబ్దంతో బళ్ళు ముందుకు వెడుతోంటే తాటి, కొబ్బరి చెట్ల నీడలు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా తలలు ఆడిస్తోన్నట్టు కనిపించేవి. భయంతో బితుకు బితుకు మంటూ కూచునే వాళ్ళం. అలాగే నెమ్మదిగా నిద్ర లోకి జారుకునేవాళ్ళం.

ఎప్పుడు బళ్ళు ఇంటికి చేరేవో తెలిసేది కాదు. ఇంక లేవండి, ఇంటికి వచ్చేసాము అని పెద్దవాళ్ళు మమ్మల్ని లేపితే కళ్ళు నులుముకుంటూ లేచి పక్కల మీద వాలిపోయేవాళ్ళం. వెంటనే నిద్ర పట్టేసేది.

ఈ నాడు పల్లెటూళ్ళలో సైతం ఎవరూ రెండెడ్ల బళ్ళ మీద సినిమాలకు వెళ్ళరు. ఇప్పుడు పల్లెటూళ్ళలో అంతా బైకుల మీదా , కార్లలోనూ వెడతారు. కానీ మా చిన్నతనాల్లో మేము వెళ్ళాం. ఆ అనుభూతుల్ని తృప్తి తీరా ఆస్వాదించాం. మరి మీలో ఎంతమందికి అటువంటి అనుభవాలు వున్నాయో నాకు తెలియదు.

అందుకే అంటాను అటువంటి రోజులు మళ్ళీ రావని.

Read More
Next Story