
రోశయ్య ప్రకృతి సేద్యం అన్నదాతలకు ఆదర్శం
80 ఏళ్ల రైతు రోశయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
భూమిని తల్లిగా భావించి ప్రకృతి సేద్యం ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్న రైతు నామని రోశయ్య (80) విజయగాథ రాష్ట్రవ్యాప్తంగా పలువురు అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఈ వృద్ధ రైతు కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రోశయ్యను అభినందించడం విశేషం.
‘భూమిని తల్లిలా భావించి... ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ... నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకం.’ అంటూ సీఎం తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రైతు కథ కాదు, ప్రకృతి వ్యవసాయం ద్వారా సుస్థిరత, లాభదాయకత సాధ్యమని నిరూపించే జీవన మార్గం.
సెర్ప్ ప్రతినిధుల అధ్యయనం
రోశయ్య 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యల నుంచి ప్రేరణ పొందారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎమ్‌ఎన్‌ఎఫ్) కార్యక్రమంలో భాగంగా ఆయన తన పొలంలో '5-లేయర్ మోడల్'ను అమలు చేశారు. ఈ మోడల్‌లో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఔషధ మొక్కలు వంటి విభిన్న పంటలను బహుళ స్థాయిలలో సాగు చేస్తారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా బీజామృతం, నీమాస్త్రం వంటి సహజ పద్ధతులతో పంటలు పండిస్తున్నారు. ఇటీవల సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) బృందం ఆయన పొలాన్ని సందర్శించి, అరటి పంటలో బ్రిక్స్ విలువలను పరీక్షించి, ప్రకృతి సేద్యం ప్రభావాన్ని అధ్యయనం చేసింది.
ఎనభై ఏళ్ల వయసులోనూ చెట్టు ఎక్కుతున్న రోశయ్య
సారవంతమైన మట్టిలో పంట రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
‘మా పొలంలో రసాయనాలు వాడము. సహజ పద్ధతులతో మట్టి ఆరోగ్యాన్ని కాపాడుతూ, బహుళ పంటలు సాగు చేస్తున్నాం. ఇది మా ఆదాయాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణాన్ని కాపాడుతుంది’ అని రోశయ్య తన అనుభవాలను పంచుకున్నారు. ఆయనతో పాటు ఇతర రైతులు వై. బాపయ్య, వై. సత్యనారాయణ కూడా తమ ప్రకృతి సేద్య అనుభవాలను వివరించారు. ఈ మోడల్ ద్వారా పంటల ఉత్పాదకత పెరగడమే కాకుండా మట్టి సారవంతం కావడం, రోగాలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
రోశయ్య విజయం రాష్ట్రంలోని 16 లక్షల మంది రైతులకు స్ఫూర్తినిస్తోంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు పెంచుకోవడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయవచ్చని ఇది నిరూపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం 10 లక్షల మంది రైతులను పూర్తి ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోశయ్యలాంటి రైతులు ఈ లక్ష్య సాధనకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
రోశయ్య మాటల్లో ప్రకృతి వ్యవసాయం
మా పంటలపై ఎలాంటి పురుగు మందులు స్ప్రే చేయము. అవసరమైతే మాత్రమే అస్త్రం (నీమాస్త్రం) ఎక్స్‌ట్రాక్ట్ మాత్రమే స్ప్రే చేస్తాం అని రోశయ్య చెప్పారు. ‘ఐదు లేయర్ ప్రకృతి సేద్య మోడల్ మట్టి ఆరోగ్యానికి అవసరమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తుంది.’ మట్టి కలుషితం కాకుండా జీవవైవిధ్యం కాపాడుకోవడం, భూగర్భ జలాలు సరిగా ఉపయోగించడం వంటివి సాధ్యమవుతాయి. అని చెప్పారు. పంటల డైవర్సిటీ క్రిటికల్ పాయింట్‌కు చేరుకున్నప్పుడు వ్యవస్థ రోగ నిరోధకత, కార్బన్ సేకరణ వంటి ప్రయోజనాలు ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఆదాయం క్రమంగా పెరుగుతోంది అని రోశయ్య చెప్పటం విశేషం.
రోశయ్య సాహస కథ పలువురు యువ రైతులకు, సాంప్రదాయ వ్యవసాయం నుంచి మార్పు కోరేవారికి ప్రేరణ. వయసు ఎంతైనా, సంకల్పం ఉంటే అసాధ్యమేమీ లేదని రోశయ్య నిరూపిస్తున్నారు.

