హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొండపల్లి విశ్వరూప ప్రదర్శన
x

హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొండపల్లి విశ్వరూప ప్రదర్శన

శతజయంతి సందర్భంగా రివైవింగ్ ది రూట్స్ పేరుతో కొండపల్లి శేషగిరి రావు పెయింగ్ ప్రదర్శన. గిరిజ పైడిమర్రి రివ్యూ

జీవితంలోని యాంత్రికత నుంచి బయట పడడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవడం అత్యవసరం. దానికి ప్రధానంగా లలిత కళలు దోహదం చేస్తాయి. సంగీతాన్ని వినడమో, మంచి పుస్తకాన్ని చదువుకోవడమో, నృత్య ప్రదర్శనను కానీ చిత్ర ప్రదర్శనను గాని చూడడం లాంటివి ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు చేస్తుంటారు. లలిత కళలలో అన్నింటిలో కాక పోయినా కొన్నింటిలో అయినా, ప్రావీణ్యం లేదా ప్రవేశమైనా ఉంటే మంచిది. అందరూ గాయకులో, చిత్రకారులో, నృత్యకారులో, రచయితలో కావడం అసాధ్యం. కానీ లలిత కళలను ఆస్వాదించే సున్నిత హృదయం ఉన్నా మన జీవితం యాంత్రికం కాకుండా జాగ్రత పడొచ్చు. అందులో భాగంగా స్టేట్ ఆర్ట్ గాలరీ (State Art Gallery,Hyderabad) లో ఏర్పాటు చేసిన ప్రసిద్ధ చిత్రకారులు కొండపల్లి శేషగిరి రావు (Kondapalli Seshagiri Rao) గారి చిత్రకళా ప్రదర్శన (Reviving the Roots) కు నేను, మిత్రురాలు జ్యోతి వెళ్ళాము. ఆ ఆనందాన్ని పాఠకులతో పెంచుకోవాలనే ఈ వ్యాసం.

ఈ నెల జనవరి 27న డా.కొండపల్లిశేషగిరి రావు గారి జయంతి ((January 27, 1924). నిజానికి జయంతి మాత్రమే కాదు, గత ఏడాది పుట్టినరోజు నుంచి వారి 'శత జయంతి' సందర్భం మొదలైంది.


తార్నాకలో మెట్రో రైలెక్కి మాదాపూర్ లో దిగాము. అక్కడ నుంచి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కి ఐదు నిమిషాలు నడక. ఉదయం పదకొండు గంటలకు అక్కడికి చేరుకున్నాము. గ్యాలరీ ప్రాంగణం కూడా కళాత్మకంగా ఉంది. రాతి శిల్పాలు, గ్లాస్ చిత్రాలు, వివిధ కళాఖండాలతో తీర్చి దిద్దారు. వాటిని చూస్తూ ఫోటోలు తీసుకుంటూ లోపలికి వెళ్ళాము.

కొండపల్లి శేషగిరి రావు గారు జాతీయ స్థాయి చిత్ర కళాకారుడు. నాలుగు గ్యాలరీలో సుమారు 200 పెయింటింగ్స్ వరకు ప్రదర్శనలో ఉన్నాయి. మొదటి రెండు గదులలో పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. మరో రెండు గదులలో ఇతర పెయింటింగ్స్ ఉన్నాయి. వారి రెండో కుమారుడు సంపత్ గారు మాతో ఉండి చాలా విషయాలు వివరించారు.


ఇంతకు మునుపు కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. కానీ 200 చిత్రాలతో 12 రోజుల పాటు ప్రదర్శన ఏర్పాటు చేయడం ఈ సారి ప్రత్యేకత. ఇది జనవరి 25 న మొదలైంది. ఫిబ్రవరి ఐదో తేదీ వరకు ఉంటుంది.

మొదటి రెండు గ్యాలరీలలో పౌరాణిక చిత్రాలను ఏర్పాటు చేశారు. శకుంతల వృత్తాంతం, పాండవ వనవాసం,అహల్య శాపవిమోచనం, శ్రీరాముడిని గంగానదికి దాటించిన గుహుడు,మాయలేడి వృత్తాంతం, అశోక వనంలో సీత ఇలా పురాణ కథలకు సంబంధించిన వరుస చిత్రాలు అక్కడ ఉన్నాయి. ప్రతి చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు పోయాము. చిన్నవి వాటర్ కలర్స్ తో వేసారు. ఇవి పెన్సిల్ స్కెచ్ వేయకుండా వేసారని తెలిసి ఆశ్చర్య పోయాము. అంతేకాదు, అందులో వారు చూపిన నైపుణ్యానికి (Aqua Texture ) అబ్బుర పడ్డాము.దీనినే ' Wesh & Gouche' పద్ధతి అంటారట. పెద్ద పెయింటింగ్స్ ఆయిల్ కలర్స్ తో వేసినవి. వీటిలో రెండు చిత్రాలు ముందుకు వెళ్లనివ్వకుండా కట్టి పడేశాయి. నేనైతే మంత్ర ముగ్ధనయ్యాను. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే నాకు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న ముసుగు లోపలి నుంచి ముఖం కనిపంచే యూరోపియన్ శిల్పం గుర్తుకు వచ్చింది. అందమైన స్త్రీ కటి భాగాన్ని వస్త్రం లోపలి నుంచి కనిపించేటట్లుగా చిత్రించారు. ఇలా పారదర్శకంగా చిత్రించడం శేషగిరి రావు అసమానమైన కళా నైపుణ్యానికి తార్కాణం. నీటిలో తడిసిన తరుణి చిత్రం మరొకటి. తడిసిన శిరోజాల వంపులు, తడి ఒంటికి అతుక్కుని పోయి లోపలి నుంచి స్పష్టంగా కనిపిస్తున్న ఒంటి సొంపులు ... అంత జీవం ఉట్టిపడేటట్లు చిత్రించడం రవివర్మ పెయింటింగ్స్ లో చూసాను. మళ్ళీ ఇప్పుడే చూసాను.


మరో రెండు రూములలో ప్రకృతి, జంతువులు, పక్షులు, శిలలు, ఆదివాసీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ప్రముఖుల చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఆదివాసి మగువ లచ్చి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణా రాష్ట్రం, అందులోను హైదరాబాదు నగరం శిలాసంపదకు కాణాచి. ఆ శిలా సంపదను శేషగిరి రావు తమ చిత్రాలలో పదిల పరిచారు. సాధారణంగా చిత్రం అంటే స్థిరమైనదనే భావం కలుగుతుంది. కానీ శేషగిరి రావుగారు చిత్రించిన జంతుచిత్రాలన్నీ కదలికను సూచిచేవే... అదే ఆయన జంతు చిత్రాలలోని ప్రత్యేకత.

కొండపల్లి శేషగిరి రావులో సహజంగా ఉన్న చిత్రకళాసక్తిని గురువులు దీన్ దయాల్ నాయుడు, జలాలుద్దీన్ సాహెబ్ లు ప్రోత్సహించారు.నిజానికి ఆయన వారాలు అబ్బాయి. తరువాత నవాబ్ మెహిదీ నవాజ్ జంగ్ చొరవతో రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతన్ లో ప్రవేశం పొందాడు. అక్కడ నందలాల్ బోస్ శిష్యరికంలో చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించాడు. యురోపియన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. తర్వాత చిత్రకళా ఉపాధ్యాయులు. జెఎన్‌టియూ చిత్రకళా విభాగంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. పూర్తికాలం చిత్రకారుడిగా జీవితకాలం కృషి చేశారు. JNTU లో Fine Arts శాఖలో ఆచార్యుడిగా పని చేసారు. నేటి పేరు పొందిన చిత్ర కళాకారులందరూ దాదాపు ఆయన శిష్యులే...

(ఒక పెయింటింగ్ దగ్గిర రచయిత్రి గిరిజ (ఎడమ)

శేషగిరి రావు పొందిన సన్మానాలు, పురస్కారాలు, అవార్డులు ఎన్నో ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో ఆయనను సత్కరించింది. ఆయన చిత్రకళాకారుడే కాదు, రచయిత కూడా ... చిత్రకళకు సంబంధించి బేసిక్ అంశాల గురించి రాసిన పుస్తకం చిత్రకళా విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా ఉన్నదట. ఆదిమ చిత్రకళ, భిత్తి చిత్రకళ, అలంకరణ చిత్రకళ, పరిశ్రమలలో చిత్రకళ, ఆంధ్రప్రదేశ్ లోని జానపద చిత్రకళ... ఇలా చిత్రకళకు సంబంధించి పలు వ్యాసాలు రాసారు. ఆయన రాసిన ' రూప రుచి ' అనే పుస్తకం త్వరలోనే తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురణ కాబోతోందని తెలిసింది.

ఆయన పోతనామాత్యుడిని, రాణీ రుద్రమదేవిని,లచ్చిని, శకుంతలను చిత్రించారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ దేవీదేవతలకు రూపం ఇచ్చినట్లే కొండపల్లి మన పురాణేతిహాసాలకు చిత్రరూపం ఇచ్చారు. కావ్య నాయకులకు జీవం పోశారు. దక్కనీ శిలలను చిత్రించారు.


నేటి సాంకేతిక యుగంలో ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితులలో... కుటుంబ సభ్యులు ఆయన చిత్రాలను భద్రపరిచి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందించ తగినది. అన్ని గ్యాలరీలు చూసి బయటకు వచ్చే ద్వారం దగ్గరున్న ఫోటో ఫ్రేం నన్ను ఆకర్షించింది. శేషగిరి రావుగారు ద్వారం నుంచి బయటకు వెళుతున్న ఫోటో ... దాని పక్కనే ఆయన చిత్రించిన చిత్రాన్ని ఉంచి ప్రత్యేకంగా ఫ్రేం కట్టించినది. దానిని ఆయన వేసిన చిత్రంతోపాటు ప్రేం కట్టించడం నాకు భలే నచ్చింది.

జీవితమంతా చిత్రకళకు అర్పించిన ఆయన ఆ రంగం నుంచి, జీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించడాన్ని ఆ ఫోటో ఫ్రేం ప్రతీకాత్మకంగా సూచిస్తుందని అనిపించింది. చిత్రకళలో ప్రత్యేకమైన అభిరుచి ఉన్న జ్యోతి తో కలిసి ఈ ప్రదర్శన చూడడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.

రివైవింగ్ రూట్స్ (Reviving the Roots) పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 5 దాకా ఉంటుంది.

Read More
Next Story