దామోదరం సంజీవయ్య రాజకీయాలకు దారేది
x

దామోదరం సంజీవయ్య రాజకీయాలకు దారేది

ఫిబ్రవరి 14 దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి


(మలసాని శ్రీనివాస్)

కోట్లకు పడగలెత్తే అవినీతి, అక్రమాలు అనైతికత, ఆశ్రిత పక్షపాతం, అడుగడుగున అధికార దర్పం, ఆధిపత్య ప్రదర్శన, అహంకారం, ఆడంబరం, అసూయ, అసభ్య పదప్రయోగం, అసహనం, పగ, ప్రతీకారం ఇవన్నీ కలిపితే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవుతాయి. ఏ ఆధిపత్య నేపధ్యం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 నెలలపాటు ధీరోధత్తంగా ఓ నాయకుడు పరిపాలించడంటే నమ్మగలమా? కానీ, నమ్మాలి. ఎందుకంటే అది నిప్పులాంటి నిజం.
అలా పరిపాలించిన ఆ మహా మనిషి అన్నీ వడ్డించిన విస్తరి లాంటి ఆధిపత్య కులాల నుండి కాకుండా ఒక దళిత కులంలో అదీ భూమిలేని నిరుపేద కుటుంబంలో పుట్టి అత్యంత ప్రజ్ఞ పాటవాలతో ఉన్నత విద్యావంతుడిగా, సాహితీ పండితునిగా ఎదిగి 38 ఏళ్లకే ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆరున్నర దశాబ్దాల క్రితమే ముఖ్యమంత్రి పదవి అధిరోహించినవాడు దామోదరం సంజీవయ్య. అనేక రికార్డులు నెలకొల్పడంలో ఆయన పేరు మోసారు.
గత 76 ఏళ్ల తెలుగునేల రాజకీయ చరిత్రలో 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న ఒకే ఒక్కడు దామోదరం సంజీవయ్య. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించిన మంచి తెలివైన విద్యార్థి ఆయన. ఆనాటి వటవృక్షమైన భారత జాతీయ కాంగ్రెస్ కి 42 ఏళ్ల చిన్న వయసులోనే జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి షెడ్యూల్డ్ కులాల నాయకుడు సంజీవయ్య.
కూలి కుటుంబం నుంచి రాక
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య కర్నూలు నగరంలో నేడు అంతర్భాగంగా ఉన్న కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో ఓ అతి సాధారణ నిరుపేద దళిత కుటుంబంలో 1921 ఫిబ్రవరి 14న సంజీవ జన్మించారు. మున్నయ్య సుంకలమ్మ దంపతులకు ఆయన ఐదో సంతానం. కూలికి వెళితే తప్ప పూట గడవని కుటుంబం వారిది. ఆయన పుట్టిన మూడు రోజులకే తండ్రి మున్నయ్య చనిపోయాడు. జీవనాధారం కోసం సంజీవయ్య పశువులను మేపాడు.ఇదీ ఆయన నేపధ్యం.
పదవుల కోసం జీవితంలో ఆయన ఎప్పుడూ వెంపర్లాడకపోవడం విశేషం. ఆయననే పదవులు ఎదుక్కుంటూ వచ్చాయి. ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రులు దాకా ఆయనను ఏరి కోరి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రారంభికుడిగా కీర్తిని అర్జించినా, ఆర్థికంగా ఆర్థించాలన్న ఆలోచన చేయని ఆయన విధానమే ఆయనను తెలుగు నేలపై కీర్తి శిఖరాలపై అధిష్టింపజేసి నేటికీ చరిత్రలో నిలిచిపోయేటట్టు చేసింది.
ఆయన జన్మించే నాటికి ఇంట్లో అందరూ నిరక్షరాస్యులు. సంజీవయ్యకు చదువు పట్ల అమిత ఆసక్తి. అది గుర్తించిన అన్న చిన్నయ్య మేనమామ ప్రోత్సాహంతో చదువులలో ఒక్కోమెట్టూ ఎక్కారు సంజీవయ్య.


పెదపాడులో నాలుగో తరగతి వరకు చదివి తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ చర్చి మిషన్ పాఠశాలలో చేరారు. 1935 లో మున్సిపల్ పాఠశాలలో చేరి 1938లో ఎస్.ఎస్.ఎల్.సి లో (ఇప్పటి పదవ తరగతి) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత అనంతపురం సీడెడ్ కాలేజీలో గణితం, ఖగోళ శాస్త్రములు అధ్యయనం చేశాడు. 1942లో బిఎ పూర్తి చేసిన తర్వాత అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశారు. 1944లో మద్రాస్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ ఆఫీసులో అసిస్టెంట్ గా, 1945లో కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గా బళ్లారిలో నిమతులయ్యారు. ఆ తర్వాత మద్రాస్ పరిచయప్ప పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1946లో బళ్లారి జడ్జి కృష్ణయ్య ప్రోత్సాహంతో న్యాయవిద్య అభ్యసించడానికి మద్రాస్ కాలేజీలో చేరారు. అప్పట్లో స్కాలర్షిప్ ఇచ్చే పద్ధతి లేక స్థానికంగా ఒక పాఠశాలలో పార్ట్ టైమ్ మ్యాథ్స్ టీచరుగా పనిచేస్తూ వారిచ్చే 90 రూపాయలు జీతంతో హాస్టల్, ట్యూషన్ ఫీజులు చెల్లించేవాడు.
కళాకారుడిగా సంజీవయ్య
ప్రఖ్యాత రచయిత రావిశాస్త్రి సంజీవయ్యకు సహధ్యాయి. ఇద్దరూ సాహిత్య చర్చలు తరచు చేసేవారు. లా చదివే రోజుల్లోనే నాటకాలు వేయడం, నాటకాలు రాయడం చేసేవాడు సంజీవయ్య.
1950 అక్టోబర్లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదయ్యారు సంజీవయ్య విద్యార్థి దశలో స్వతంత్ర ఉద్యమ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపని ఆయన రాజకీయ నాయకుల పరిచయం వలన రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆసక్తి పెంచుకున్నారు సంజీవయ్య. ఆయన మంచి వక్త. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ధారాళంగా మనోరంజకంగా మాట్లాడేవాడు.
మద్రాసు అసెంబ్లీలో...
అప్పటి ప్రొవిజినల్ పార్లమెంట్లోనూ, మద్రాస్ అసెంబ్లీ రెంటిలోనూ సభ్యుడిగా ఉన్న దళిత నాయకుడు ఎస్.నాగప్ప ఎమ్మెల్యే పదవి ఉంచుకుని పార్లమెంటుకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన పదవికి రాజగోపాల చారి సూచన మేరకు ఎన్జీరంగా అన్వేషణలో సంజీవయ్య రంగంలోకి వచ్చి ఎంపీగా అయ్యారు.
1952 జనరల్ ఎలక్షన్స్ జరిగి మే 13 న ప్రొవిజనల్ పార్లమెంట్ రద్దయింది.
దీంతో 1952లో సంజీవయ్య అసెంబ్లీకి ఎన్నికై రాజగోపాలా చారి ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలోనూ, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ మంత్రి మండలిలోనూ ఆరోగ్యశాఖ మంత్రిగా సంజీవయ్య నియమితులయ్యారు. మంత్రిగా ఉండగానే సికింద్రాబాద్ లో ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కృష్ణవేణిని 1954 మే 7న వివాహం చేసుకున్నారు సంజీవయ్య. వీరికి సంతానం లేదు. సుజాత అనే ఒక బాలికను దత్తత తీసుకున్నారు.
1955 జులైలో బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన కేబినెట్లో రవాణా మంత్రిగా, 1956 నవంబర్ 1న కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన క్యాబినెట్లో సాంఘిక సంక్షేమ మంత్రిగా 1960 జనవరి 10 వరకు సంజీవయ్య కొనసాగారు.
ముఖ్యమంత్రిగా...
ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రాజీనామాతో... అప్పటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గ రాజకీయాల్లో నీలం వర్గానికి వ్యతిరేకంగా అల్లూరి సత్యనారాయణ రాజు వర్గం సీఎం పదవి కోసం పోరాటం నడిపింది.
రెండు వర్గాల మధ్య రాజీ అభ్యర్థిగా విద్యావేత్త, సాహితీవేత్త, నిరాడంబరుడు, నిజాయితీలు అర్హతలుగా సంజీవయ్య 1960 జనవరి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 38 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. పిన్న వయసులో ముఖ్యమంత్రి కావటం ఇప్పటికీ సంజీవయ్యేదే రికార్డు.
గ్రామీణ, భూస్వామ్య, ఆధిపత్య కులవాదులు దళితుడైన సంజీవయ్య ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేకపోయారు. ఆయన కొనసాగకుండా అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. బహిరంగంగానే కులం పేరుతో అవమానించారు. వీటిని ధైర్యంగా ఎదుర్కొంటూనే రెండు సంవత్సరాల రెండు నెలలపాటు సంజీవయ్య ముఖ్యమంత్రిగా కొనసాగి చివరికి 1962 మార్చి 11న తన పదవికి రాజీనామా చేశారు.
ఆనాటి కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యం సంజీవయ్యను అనేక అగచాటులకు గురి చేసిన విషయం బహిరంగ రహస్యం.1962 ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టిన సంజీవయ్యను ముఖ్యమంత్రి కాకుండా ఢిల్లీలో ఆంధ్ర ఆధిపత్య కులవాదులు నెహ్రూ వద్ద పెద్ద గొడవ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సంజీవయ్య ముఖ్యమంత్రిగా రెండోదఫా ఎన్నిక కావడానికి వీలులేదన్నారు. తమ మాట కాదనుకుంటే తమను వదులుకోమని నెహ్రూని హెచ్చరించే స్థాయికి కూడా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక 62లో సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ముఖ్యమంత్రిని చేసింది. అన్యాయానికి గురైన సంజీవయ్య సేవలను ఉపయోగించుకోవాలన్నా అప్పటి ప్రధాని నెహ్రు ఆయనను ఢిల్లీకి రప్పించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టవలసిందిగా కోరారు. నెహ్రూ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలి దళిత అధ్యక్షుడిగా 1962 నుండి 64 వరకు సంజీవయ్య పనిచేశారు.
అవినీతి నిర్మూలనకు కృషి
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని నిరోధించడానికి సంజీవయ్య ఏసీబీ ని ఏర్పాటు చేశారు. అలాగే రవీంద్రభారతి నిర్మాణం, లలిత కళలకు పలు అకాడమీలు ఏర్పాటు చేశారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా టీచర్లకు అప్పట్లో పెన్షన్ సౌకర్యం లేదు. సంజీవయ్య టీచర్లకు కూడా పెన్షన్ సౌకర్యం వర్తింపజేశారు. ముఖ్యంగా సీఎంగా తన పదవీకాలంలో రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయడం ఇప్పటికి ఇది రికార్డు. అలాగే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కల్పించడానికి ఆయన క్రియాశీలకమైన కృషి ప్రారంభించారు. తరువాత దశలో ఆ కృషి రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల ఏర్పాటుకు దోహదపడింది. 1964లో నెహ్రూ మరణానంతరం ఏర్పడిన కేంద్ర మంత్రివర్గాలు లాల్ బహుదూర్ శాస్త్రి, గుల్జారి లాల్ నందా, ఇందిరా గాంధీ ప్రధాన మంత్రులుగా ఉన్న క్యాబినెట్లలో 1964 జూన్ నుండి 1971 మార్చి వరకు కేంద్రంలో సంజీవయ్య వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ రెండో దఫా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 1972 మే 7న గుండెపోటుతో చనిపోయే వరకు సంజీవయ్య కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగారు. సంజీవయ్య అంతట మంచి మనిషి 51 ఏళ్ల వయసులో మరణించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటే అని చెప్పాలి.
పాలనా దక్షుడు- ప్రజాపక్షపాతి
ఏడేళ్ల పాటు కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పదవులు నిర్వహించి అనేక ప్రజాపోయోగ కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో 2000 ఎకరాల భూమిని సేకరించి అనేక పరిశ్రమలను స్థాపించారు. కార్మిక శాఖ మంత్రిగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు బోనస్ ఏర్పాటు చేసి బోనస్ సంజీవయ్యగా బోనస్ పేరు పొందారు.
తన హయాంలోనే ఒప్పంద కార్మికుల చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, కార్మిక సంఘాల చట్టం, కనీస వేతనాలు చట్టం అమల్లోకి తెచ్చారు. పరిశ్రమల మంత్రిగా హైదరాబాద్ సికింద్రాబాద్లో అద్భుతంగా వర్ధిల్లిన బిహెచ్ఇఎల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను సంజీవయ్య తన వ్యక్తిగత కృషి, పట్టుదలతో ఇక్కడ స్థాపించారు.
కోసమేరుపు: ఆయన చనిపోయే సమయానికి ఆయన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేదు. కనీసం సొంతిల్లు లేదు. ఎకరం సొంత పొలం లేదు. సొంత కారు లేదు. ఆస్తులు ఉన్నవాళ్లు, వేలకోట్లకు పడగలెత్తిన వాళ్ళు పదవులు చేస్తూ ఆస్తులు ఆర్థిస్తుంటే...
జీవితం పేదరికంతో మొదలుపెట్టి నీతి నిజాయితీగా జీవించి సంజీవయ్య చివరికి పేదగానే చనిపోవడం మన అసమాన కులసమాజంలో ఆశ్చర్యం లేదు.76 ఏళ్ల ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 19 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. వీరిలో ఐదారుగురు ఆర్థిక నిజాయితీతో పని చేసిన వారు ఉంటారని అంచనా. కానీ సంజీవయ్య ఆర్థిక నిజాయితీతో మాత్రమే కాకుండా సామాజిక నిజాయితీ, సాంస్కృతిక నిజాయితీ, రాజకీయ నిజాయితీతో పాలన సాగించిన ధన్యజీవి. సంజీవయ్య రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంతటి వ్యత్యాసము! సంజీవయ్య రాజకీయాలు తిరిగి రాష్ట్రంలో నెలకొనడానికి ఈ తరం వారు దారి వెతకాలి...


Read More
Next Story