విస్తరిస్తున్న రామేశ్వరం కేఫ్: హోసూర్ రోడ్‌లో మొదటి హైవే బ్రాంచ్‌
x

ఇటీవల ప్రారంభించిన బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ ఇందిరానగర్ బ్రాంచ్

విస్తరిస్తున్న రామేశ్వరం కేఫ్: హోసూర్ రోడ్‌లో మొదటి హైవే బ్రాంచ్‌

QSR (క్విక్ సర్వీసింగ్ రెస్టారెంట్)లో భాగంగా మొదటిసారిగా బెంగళూరు హోసూర్ హైవేలో రామేశ్వరం కేఫ్ బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నారు.


ప్యూరిస్టులు రామేశ్వరం కేఫ్‌ను "అతిగా ప్రచారం చేశారు" అని అంటుంటారు. కొంతమంది ఆహార ప్రియులు ఈ కేఫ్‌లో "అధిక నెయ్యి వాడకం" గురించి మాట్లాడుకుంటారు. తక్కువ సమయంలో అంటే కేవలం నాలుగేళ్లలోనే ఐదు అవుట్‌లెట్‌లను ప్రారంభించారు. అవి కూడా ఇప్పటికే పేరున్న CTR, 100 ఏళ్లుగా ఉంటున్న MTR లకు సమీపంలో ఏర్పాటుచేయడం విశేషం. QSR (క్విక్ సర్వీసింగ్ రెస్టారెంట్)లో భాగంగా మొట్టమొదటి బెంగళూరు హోసూర్ రోడ్‌లో హైవే బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నారు.

పేలుడు ఘటనలో జాతీయ వార్తల్లోకి ..

భార్యభర్తలు రాఘవేంద్రరావు (మెకానికల్ ఇంజనీర్), దివ్య రాఘవేంద్రరావు (IIM-అహ్మదాబాద్) దంపతులు శాఖాహార రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరుకు సమీపంలోని వైట్‌ఫీల్డ్ బ్రాంచ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలుడు ఘటనతో ఈ కేఫ్ జాతీయ వార్తల్లోకెక్కింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

ఆ ఘటన నుంచి తేరుకోడానికి కొంత సమయం పట్టింది.

"పేలుడు ఘటన నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ ఘటన తర్వాత భద్రతను పెంచాం. మా కేఫ్‌లో ఆహారం, వంటకాలు, ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెడతాం. దక్షిణాదికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఎక్కువ మంది భారతీయులు, విదేశీయులకు మా వంటకాలు రుచి చూపాలన్నదే మా ఆలోచన” అని బెంగళూరు ఇందిరానగర్‌ బ్రాంచ్ బయట కాఫీ తాగుతూ చెప్పారు రాఘవేంద్రరావు.

ప్రశ్న: మీ కేఫ్‌లో నెయ్యి ఎక్కువగా వాడతారని ప్రచారం?

జవాబు: మా కస్టమర్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. నెయ్యి బాగా వాడతామనేది కొంతవరకు నిజం. అలా వాడటానికి కారణం ఉంది. మన పూర్వీకులు కూడా వంటలో నెయ్యి, నువ్వులు లేదా కొబ్బరి నూనె వంటి సంప్రదాయ నూనెలను ఎక్కువగా వాడారు. మన ఇంట్లో కూడా నెయ్యి వాడకుండా ఉండరు.

‘‘రీఫైన్డ్ ఆయిల్స్‌తో పోలిస్తే నా దృష్టిలో నెయ్యి ఆరోగ్యకరం. మేం మా వంటకాల్లో దేశంలోనే అత్యుత్తమమైన నందిని నెయ్యిని వాడతాం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తర్వాత నందిని బ్రాండ్ నెయ్యిని ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్ల జాబితాలో మొదట మేమే ఉంటాం. అలాగే కేరళ నుంచి తెప్పించిన కొబ్బరి నూనెను వంటకాల్లో వాడతాం. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌ల విషయంలో నేను బసవన్న సలహా అనుసరిస్తాను ‘‘నిన్ను దూషించే వారు మిమ్మల్ని ఎదగడానికి సహాయం చేస్తారు. మిమ్మల్ని పొగిడే వారు కాదు.’’ దీన్ని నేను ఫాలో అవుతా.


ప్రశ్న : మీరు రోజూ ఎంత నెయ్యి వాడతారు?

జవాబు: వాస్తవానికి ఆవాల నుంచి పిండి వరకు నూనె నుంచి మసాలా వరకు కొలత విధానాన్ని అనుసరిస్తాం. దాదాపు 35-40 దోసెలకు మేము 1 లీటర్ నెయ్యిని ఉపయోగిస్తాం. అయితే కొంత నెయ్యి మంటకు ఆవిరైపోతుంది.

ప్రశ్న : ఔట్‌లెట్ల నిర్వహణ ఎలా చేస్తారు.?

జవాబు: నిరంతర కృషి, తాజా ఆహారాన్ని వడ్డించడం, హోటల్‌కు వచ్చే కస్టమర్ల పట్ల మర్యాదగా నడుచుకోవడం మాకు ముఖ్యం. ప్రతిరోజూ దాదాపు 17-18 గంటల సమయాన్ని వెచ్చిస్తాం. నేను హోటల్ మెయింటెనెన్స్ చూసుకుంటా. ఇక నా భార్య ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. వంటగది పూర్తిగా నా భూభాగం. ఇక్కడ నా భార్యకు అనుమతి లేదు (నవ్వుతూ). అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను చూసుకుంటాను. ఫైనాన్స్ విషయాలు ఆమె బాధ్యత. మా వద్ద 24/7 పని చేసే సిబ్బంది ఉన్నారు. అయితే మా సిబ్బందిలో ఎవరూ పని ఒత్తిడికి గురికాకుండా చూసుకుంటాం. అందుకే ఫంక్షన్ల కోసం సపరేటుగా కొంతమందిని నియమించుకున్నాం. ఉదాహరణకు 'డీప్ క్లీనింగ్' కోసం రెస్టారెంట్‌ను గంట పాటు మూసేస్తాం. ఈ పని చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారు. గంటల పాటు తవాస్ ముందు నిలుచుని, వేడిని భరిస్తూ దోసెలు వేసే అబ్బాయిలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మా కార్యనిర్వాహక బృందం వారిపై ఎక్కువ భారం పడకుండా చూసుకుంటారు. రోజు చివరిలో వారికి మంచి, తాజా ఆహారాన్ని అందిస్తాం.

ప్రశ్న : కర్ణాటక ప్రభుత్వం రెస్టారెంట్లను 24/7 నడపడానికి అనుమతించింది. మీరు సిద్ధంగా ఉన్నారా?

జవాబు: సిద్ధంగా ఉన్నాం. మేము 24/7 అందుబాటులో ఉండాలనుకుంటున్నాం. అయితే పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అందుకు మా అసోసియేషన్ కూడా పోలీసులతో చర్చలు జరుపుతోంది. వారి నుంచి అనుమతి రాగానే అన్ని అవుట్‌లెట్‌లను 24/7, 365 రోజులు తెరచి ఉంచేందుకు ప్రయత్నిస్తాం. మీరు మా అవుట్‌లెట్‌లను చూసి ఉంటారు. వాటికి షట్టర్లు లేదా తలుపులు ఉండవు. మీరు ఎప్పుడైనా వెళ్లి భోంచేయొచ్చు.


ప్రశ్న : తెల్లవారుజామున వచ్చే కస్టమర్ల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది?

జవాబు: మేం ఉదయం 5 గంటలకు కేఫ్ తెరిచినప్పుడు నైట్ షిఫ్టు ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వెళుతున్న వారు వస్తుంటారు. 12 తర్వాత దోసె, పొంగల్‌ - సాంబారు తినేందుకు ఎక్కువ మంది యువకులు వస్తుంటారు.

ప్రశ్న : మీ హాటల్‌కు వచ్చే వాళ్లలో కొత్తవాళ్ల ఎక్కువగా వస్తుంటారా? లేక పాతవాళ్ల?

జవాబు: మా హాటల్‌కు వచ్చేవాళ్లలో ఎక్కువ మంది అంతకుముందు విజిట్ చేసినవాళ్లే. ఒకసారి విజిట్ చేసిన కస్టమర్‌ను తిరిగి రాబట్టుకోవడమే హోటల్ నిర్వహణ విజయ రహస్యం. వైట్‌ఫీల్డ్ బ్రాంచ్‌లో యువ జంటలు ఎక్కువగా కనిపిస్తారు. రాజాజీనగర్ బ్రాంచ్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటారు. ఇక ఇందిరానగర్, జేపీ నగర్ బ్రాంచీల్లో అయితే మిక్స్‌డ్.

ప్రశ్న : మీరు సెంట్రలైజ్డ్ కిచెన్ కాన్సెప్ట్‌కు వ్యతిరేకం కదా.. మరి ఎలా చేస్తారు?

జవాబు: మొదట్నుంచి ప్రతి రెస్టారెంట్‌లో ఒక వంటగది ఉండాలని, అక్కడ ఆహారాన్ని తాజాగా తయారు చేసి వడ్డించాలని మేము అనుకున్నాం. ప్రతి 30 నిమిషాలకు ఓసారి తాజాగా చట్నీలను తయారుచేస్తాం. పగలు, రాత్రి ఇలాగే చేస్తాం. మాలాంటి QSR అవుట్‌లెట్లలో ఎంత కొత్త సాంకేతికతను జోడించినా..మనుషులు మాత్రం తప్పనిసరి. మేము భోజనాన్ని తయారుచేసి 5 గంటల తర్వాత వడ్డించం. అలాగే మిగిలిన ఆహారాన్ని తర్వాతి రోజు వడ్డించడానికి మేం విరుద్ధం. ఒకవేళ ఆహారం మిగిలిపోతే పందులకు పెట్టేస్తాం.


ప్రశ్న : ఒక్కో కేఫ్ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది?

జవాబు: మా ఈ తరహా కేఫ్ నడపడం అంత సులభం కాదు. ఒక్కో అవుట్‌లెట్‌‌కు మా పెట్టుబడి దాదాపు రూ. 15 కోట్లు. మా మొత్తం స్థలంలో కేవలం 30 శాతం మాత్రమే డైనింగ్ కోసం వినియోగిస్తాం. మిగతాదంతా లాజిస్టిక్స్, వంటకు, నిల్వకు వాడతాం.

ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా రాజాజీనగర్‌ బ్రాంచ్‌లో కస్టమర్లు నేలపై లేదా మెట్లపై కూర్చుని భోజనం చేయడం సరదాగా ఉంటుంది. యాదృచ్చికంగా బెంగళూరు దర్శిని రెస్టారెంట్లు ప్రజలు నిలబడి తినడానికి ప్రసిద్ధి. కస్టమర్లు సాంప్రదాయ పద్ధతిలో (కూర్చోవడం, మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం) భోజనం చేయాలని మేం కోరుకుంటాం. ఈ పద్ధతి కస్టమర్లను ఆకర్షించినందుకు మేం సంతోషిస్తున్నాం.

ప్రశ్న : ఇతర రాష్ట్రాల వంటకాలు కూడా తయారుచేస్తున్నట్లు తెలిసింది?

జవాబు: ఇటీవలె మేం తాలిని మెనులో యాడ్ చేశాం. ఈ వంటకం సౌత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. దోసెను తమిళనాడు సాంబార్, కర్ణాటక చట్నీతో వడ్డిస్తారు. కేరళ కడల కూర (నల్ల చిక్‌పీ)ని కొత్తగా తయారుచేస్తున్నాం. ఇది ఖాళీ దోసతో కలిపి తింటే బాగుంటుంది. ఇక ఆంధ్రా నుంచి పూతరేకులు, మల్నాడు తాంబూలి, ఇంకా కొన్ని రకాలు వంటకాలను మెనూలో యాడ్ చేశాం.

మా వంటకాల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 20కి పైగా ఉంటాయి. ఉప్మా/ఖారా బాత్ కోసం కర్ణాటకలో ఫేమస్. అలాగే తమిళనాడులో పొంగల్. కర్నాటక తరహాలో చాలా మంది కస్టమర్లు ఉదయం పూట తారీ ఇడ్లీ (రవ్వతో) ఇష్టపడతారు. రాత్రికి సాధారణ ఇడ్లీల(తట్టే) కోసం వస్తుంటారు. ఒక వంటకాన్ని పరిచయం చేయడానికి ముందు మా 500 మంది సభ్యుల బృందం ఓపీనియన్ తీసుకుంటాం. మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకే దాన్ని మెనూలో చేరుస్తాం. నా సూచనలను కూడా లెక్కచేయని సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రశ్న: మేము చివరిసారి మాట్లాడినప్పుడు.. మీరు హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?

జవాబు: అవును. మేము కొత్త ప్రాంతాలకు విస్తరించాలనుకున్నాం. ప్రతి రాష్ట్రాన్ని కలుపుకుని పెద్ద సౌత్ ప్లాటర్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది.అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో మా ఆహారానికి అనూహ్య స్పందన లభించింది. నేను ఎంతో సంతోషించా. ప్రపంచవ్యాప్తంగా కూడా దక్షిణాది వంటకాలను ఆసక్తి పెరుగుతోంది. దుబాయ్‌‌లో బ్రాంచ్ ప్రారంభించాలనుంది. అలాగే ముంబై, పుణెలపై కూడా. మా ఆలోచనలో ఉన్న మరో రాష్ట్రం గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్). బెంగళూరులో మరో రెండు హోటళ్లు వస్తాయి. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఒకటి హెన్నూర్ రోడ్‌లో మరొకటి. హోసూరు రోడ్డులో కూడా ఒకటి ప్రారంభించే ఆలోచన ఉంది.


ప్రశ్న: హోసూరు హైవే అవుట్‌లెట్ గురించి చెప్పండి?

జవాబు: హోసూరు రోడ్డులో ఔట్ లెట్ భారీ ప్రాజెక్ట్. ఎకరం విస్తీర్ణంలో ఉంది. పగటిపూట 10,000 మందికి పైగా ఒకే సారి సర్వ్ చేసేలా తయారుచేస్తున్నాం. పాత రోజుల్లోలాగా.. ప్రజలు నేలపై కూర్చోవడానికి, అరటి ఆకులో భోజనం వడ్డించడానికి ఒక భారీ హాల్ ఏర్పాటు చేస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలకు స్థలం ఉంది. ఇది ఎవరూ చేయని ప్రయోగం.

ప్రశ్న: హైదరాబాద్‌లో ఎలా ఉంది? కర్ణాటక తర్వాత పెట్టిన బ్రాంచ్ కదా?

జవాబు: అది ఓ ఛాలెంజ్. మేము మెనులో కొన్ని మార్పులు చేశాం. అక్కడి వాళ్లను దృష్టిలో ఉంచుకుని మసాలా స్థాయిని పెంచవలసి వచ్చింది. ఇక్కడ బెంగుళూరులో ఒక కూర కోసం 100 గ్రా.. కారం వేస్తే అక్కడ 400 గ్రా. వేయాలి. మనం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆహారపు అలవాట్లు ఎలా మారతాయో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా మెయింటెన్ చేయడం అతిపెద్ద సవాలు.

Read More
Next Story