దశరథుడి భార్య  కౌసల్య గురించిన ఓ నిజం మీకు తెలుసా?!
x

దశరథుడి భార్య కౌసల్య గురించిన ఓ నిజం మీకు తెలుసా?!

రామాయణంలో నిరుత్తరకాండ-19 : కోసల మేరకు దశరథుని ముగ్గురు భార్యలలో కౌసల్యకు మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో చెబుతున్నారు ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం


అయోధ్యకాండలో 31 వ సర్గలో, రామలక్ష్మణుల సంభాషణలో కౌసల్య గురించిన ఒక నిజం వెల్లడవుతుంది.

దాని పూర్వరంగం ఏమిటంటే, రాముడు అరణ్యవాసానికి బయలుదేరేముందు లక్ష్మణుడు కూడా అతనితో వస్తానంటాడు. రాముడు వద్దని వారిస్తూ, నాలుగు శ్లోకాలలో అందుకు కారణాలు వివరిస్తాడు. ఆ వివరణ రాముడి వ్యక్తిత్వపరంగా కూడా ఆసక్తి గొలిపేదే కానీ, ప్రస్తుతం అందులోకి వెళ్లకుండా కౌసల్య గురించిన నిజానికి పరిమితమవుదాం.

రాముడి మాటలు ఇలా ఉంటాయి:

“లక్ష్మణా! నువ్వు నాతో అరణ్యానికి వస్తే, కౌసల్యను, యశస్విని అయిన సుమిత్రను ఎవరు పోషిస్తారు?(మయా zద్య సహ సౌమిత్రే త్వయి గచ్ఛతి తద్వనం/ కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్-శ్లో.11);

మహాతేజశ్శాలి అయిన రాజు భూమిపై మేఘం వర్షించినట్లు కోరిన కోరికలన్నీ వర్షించేవాడు. కానీ ఇప్పుడు కామపాశంతో కట్టుబడి ఉన్నాడు (అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ/ స కామపాశపర్యస్తో మహాతేజా మహీపతిః –శ్లో.12);

ఈ రాజ్యం లభించిన తర్వాత ఆ అశ్వపతిమహారాజు కూతురు(కైక), (ఇప్పటికే)దుఃఖంలో ఉన్న తన సవతులకు మేలు చేయదు (సా హి రాజ్యమిదం ప్రాప్య నృపస్యాశ్వపతేః సుతా/ దుఃఖితానాం సపత్నీనాం న కరిష్యతి శోభనమ్- శ్లో.13);

రాజ్యాన్ని పొందిన భరతుడు కైక మాట విని దుఃఖంలో ఉన్న కౌసల్యను, సుమిత్రను పట్టించుకోడు (న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సుదుఃఖితామ్/ భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః- శ్లో.14)....”

కనుక, కౌసల్యా, సుమిత్రలను పోషిస్తూ లక్ష్మణుడు అయోధ్యలోనే ఉండాలని రాముని మాటల సారాంశం.

దానికి లక్ష్మణుని సమాధానం ఇలా ఉంటుంది:

“ఓ వీరుడా! నీ పరాక్రమానికి భరతుడు భయపడి కౌసల్యా, సుమిత్రలను వినయంతో పూజిస్తాడు; అందులో సందేహం లేదు (తవైవ తేజసా వీర, భరతః పూజయిష్యతి/ కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః- శ్లో.19);

పూజ్యురాలైన కౌసల్య తనను ఆధారం చేసుకుని జీవించే వెయ్యిగ్రామాలను పొందింది. నాలాంటి వేయిమందిని తనే భరించగలదు (కౌసల్యా బిభృయాదార్య సహస్రమపి మద్విధాన్/ యస్యాః సహస్రం గ్రామానాం సంప్రాప్తముపజీవినామ్- శ్లో.20);

ఆ యశస్విని (కౌసల్య) తనను తానూ, నా తల్లినీ, నా లాంటి అనేకమందినీ పోషించడానికి సమర్థురాలు (తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ/ పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశస్వినీ- శ్లో.21)...

***

అదీ కౌసల్య గురించిన నిజం! ఆమె వెయ్యి గ్రామాలకు యజమానురాలు! లక్ష్మణుడు చెప్పిన ప్రకారం, అతని తల్లి సుమిత్రకు గానీ, తనకు గానీ అంతటి ఐశ్వర్యం లేదు. అంటే, తల్లీ, తనూ కూడా ఇంకొకరిపై ఆధారపడి జీవించవలసినవారే. అంతేకాదు, కైక అధీనంలో గ్రామాలు ఉన్నట్టు రామాయణం ఎక్కడా చెప్పలేదు; ఒకవేళ ఉంటే ఆమె పుట్టింటి రాజ్యమైన కేకయరాజ్యంలో ఉండవచ్చు కానీ, కోసల సందర్భంలో ఆ వివరంతో పనిలేదు. కనుక కోసల మేరకు దశరథుని ముగ్గురు భార్యలలో కౌసల్యకు మాత్రమే ఉన్న ప్రత్యేకత అది.

కౌసల్య కోసలరాజ్యం ఆడబడుచు కనుక, ఆమె అధీనంలో ఉన్న ఆ వెయ్యి గ్రామాలూ కచ్చితంగా కోసలరాజ్యంలోనే ఉండి ఉంటాయి; అవి ఆమెకు నిస్సందేహంగా పుట్టింటినుంచే లభించి ఉంటాయి. మిగతా సవతులిద్దరికీ లేని ఈ ప్రత్యేకత కౌసల్యకు మాత్రమే ఉండడం ఏం చెబుతోంది? ఆమె కోసలరాజ్యాధికారానికి వారసురాలనీ, దశరథుని పెళ్లాడడానికి ముందే ఆమె కోసలరాణి అనీ సాధికారికంగా చెబుతోంది.

అయితే, కౌసల్య అధీనంలోని వేయి గ్రామాల ప్రస్తావనలో కొంత స్పష్టత లోపించిన మాట నిజమే. ఉదాహరణకు, ఆ వెయ్యి గ్రామాలూ కోసలరాజ్యంలో భాగంగా కోసలరాజు అధికారం కిందికి వస్తాయా, లేక కౌసల్య సొంత ఆస్తిగా ఉండిపోతాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ కోసలరాజు అధికారం కిందికే వస్తే, భరతుడు కోసలరాజైతే; అతను, అతని తల్లి కైక కౌసల్యా, సుమిత్రలను ఆదరించరన్న రాముడి అనుమానం అర్థవంతమే అవుతుంది. అలాకాక, ఆ వేయి గ్రామాలూ కౌసల్య సొంత ఆస్తి అయినప్పుడే లక్ష్మణుడి మాటల్లో అర్థముంటుంది. అలాగే, తల్లి అధీనంలో అన్ని గ్రామాలున్నట్టు రాముడికి తెలియదా, లక్ష్మణుడు చెప్పాలా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈ ప్రశ్నలనూ, అవి ఎత్తిచూపే అస్పష్టతను అలా ఉంచి- ‘కౌసల్య అధీనంలో వెయ్యి గ్రామాలున్నా’యన్న ఆ ఒక్క వివరమే ప్రస్తుత మన సందర్భానికి చాలు; ఈ పరిశీలనను ముందుకు నడిపించడానికి కావలసినంత ఇంధనాన్ని అదే అందిస్తుంది.

కోసలరాజ్యవివాదంతో నేరుగా ముడిపడిన ఈ అంశంలోకి మరింత వివరంగా, లోతుగా వెళ్ళే సందర్భం ముందు ముందు వస్తుంది కనుక ప్రస్తుతానికి వ్యవస్థాపరంగా కౌసల్య సహస్రగ్రామాధిపత్యాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే-

ఆ ప్రయత్నం మనల్ని మాతృస్వామ్యంవైపు నడిపిస్తుంది...

***

ఇంతకుముందు మనం ఉటంకించుకున్న లూయీ హెన్రీ మోర్గన్ తన ‘పురాతన సమాజం’ అనే గ్రంథంలో ‘స్త్రీ నుంచి పురుషునికి పారంపర్యం మార్పు’ అనే శీర్షికతో మాతృస్వామ్య, పితృస్వామ్యాల గురించి చర్చించాడు. కాకపోతే, వాటిని ‘స్త్రీ పారంపర్యం’, ‘పురుష పారంపర్యం’ గా పేర్కొన్నాడు. ఆయన వెలుగులోనే, ఆయన అభిప్రాయాలలో ఒకటిరెండింటిని సవరిస్తూ జార్జి థామ్సన్ అనే మరో పండితుడు తన ‘స్టడీస్ ఇన్ ఏన్షియెంట్ గ్రీక్ సొసైటీ- ది ప్రీహిస్టారిక్ ఎజియన్(Studies in Ancient Greek Society- The Prehistoric Aegean)’ అనే గ్రంథంలో మాతృస్వామ్య, పురుషస్వామ్యాల గురించి సోదాహరణంగానూ, విస్తృతంగానూ వివరించాడు. ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న హిట్టైట్ల అధికారవారసత్వంలో మాతృస్వామ్య, పితృస్వామ్య లక్షణాలు జమిలిగా ఎలా అల్లుకున్నాయో, ‘ది ఏన్షియెంట్ నియర్ ఈస్ట్’ పేరుతో మార్క్ డబ్ల్యు. చవాలస్(Mark W. Chavalas) సంపాదకత్వంలో సంకలితమైన పురాతన హిట్టైట్ చారిత్రక పత్రాలు చెబుతాయి...

మోర్గన్, జార్జి థామ్సన్ లకు గానీ; హిట్టైట్లకు గానీ మన రామాయణగాథతో పరిచయం ఉండి ఉంటుందని చెప్పలేం. ఒకవేళ మోర్గన్, థామ్సన్ లకు చూచాయగా పరిచయం ఉండచ్చనుకున్నా దానిని వారు తమ అధ్యయనంలో భాగం చేయలేదు. అయినాసరే, రామాయణ సందర్భాన్ని అర్థం చేసుకోడానికి వారి అధ్యయనాలు తోడ్పడే అవకాశం చాలా ఉంది. అదెలాగో చూద్దాం:

స్త్రీ పారంపర్యమే అతిప్రాచీనమనీ, ప్రాచీనకాలపు పరిస్థితులకు అదే అనుగుణంగా ఉంటుందనీ మోర్గన్ అంటాడు. పెంపుడు జంతువులను మందలు మందలుగా పెంచడం, ఆ తర్వాత వ్యవసాయమూ వచ్చాక; ఇళ్ళు, భూముల విభజన మొదలయ్యాక సొంత ఆస్తి అనేది వచ్చిందనీ; అది వారసత్వం ఎవరికి దక్కాలనే ప్రశ్నకు దారితీయడంతో స్త్రీ పారంపర్యం నుంచి పురుషపారంపర్యానికి మారవలసిన అవసరం తలెత్తిందనీ ఆయన అంటాడు. దాని అంచెలంచెల పరిణామాన్ని వివరిస్తాడు...

స్త్రీ పారంపర్యంలో గణానికి స్త్రీయే కేంద్రబిందువుగా ఉంటుంది. ఆమెకు కలిగే కూతుళ్ళు, మళ్ళీ వాళ్ళకు కలిగే కూతుళ్ళు...ఇలా స్త్రీలు మాత్రమే ఆ గణంలో సభ్యులుగా ఉంటారు. ఆమెకు కలిగే కొడుకులు, వారి కొడుకులు వేరే గణానికి చెందుతారు. పురుషపారంపర్యానికి వచ్చేసరికి అందులో పురుషుడే కేంద్రబిందువు అవుతాడు. స్త్రీ పారంపర్యాన్ని పురుషపారంపర్యానికి మార్చాలంటే చేయవలసింది ఒకటే; అది, స్త్రీపారంపర్యంలోని గణసభ్యత్వాన్ని తారుమారు చేయడం! ఎలాగంటే, స్త్రీపారంపర్యంలో గణం బయట ఉన్న పురుషులు, పురుషపారంపర్యంలో గణం లోపలికి వస్తారు; గణంలోపల ఉన్న స్త్రీలు గణం బయటకు వెడతారు. ఇప్పటికీ మన కుటుంబాల్లో జరుగుతున్నది ఇదే: పురుషుడు పుట్టినింటే ఉంటాడు; స్త్రీ మాత్రం అత్తింటికి వెడుతుంది. అంటే, గణం పేరు పెట్టుకునే హక్కు స్త్రీకి పోయి, పురుషుడికి వస్తుంది. మొదట స్త్రీ పురుషుని గణం బయటికి పంపిస్తే, ఆ తర్వాత పురుషుడు స్త్రీని గణం బయటికి పంపించాడన్నమాట...

మోర్గన్ చెప్పిన ప్రకారం, ఈ మార్పు పైకి కనిపించేటంత తేలికేమీ కాదు, కాకపోతే అది రావడానికి బలమైన కారణాలున్నాయి కనుక సులభమైపోయింది. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని తరాలు పట్టింది. మోర్గన్ నాటికి అమెరికా ఆదివాసుల్లోని ఒజిబ్వా తెగలవారిలో పురుషపారంపర్యం ప్రవేశించింది కానీ, వారి జ్ఞాతులైన దెలావరేలలో, మోహెగన్లలో స్త్రీపారంపర్యం కొనసాగుతూనే ఉంది...

స్త్రీ పారంపర్యంనుంచి పురుషపారంపర్యానికి మారడం చరిత్రకాలానికి కొంచెం పూర్వమే జరిగి ఉండాలని మోర్గన్ అంటాడు. పురుషపారంపర్యంలోకి మారాక మొదట్లో కొంతకాలంపాటు ఆస్తిని కొడుకులతోపాటు జ్ఞాతులు కూడా పంచుకునేవారు. గ్రీసుకు చెందిన రాజనీతిజ్ఞుడు, ధర్మశాస్త్రకారుడు అయిన సోలాన్(క్రీ.పూ.560)కాలంలోనో, కొంచెం తర్వాతో ఎథీనియా గణాలలో వచ్చిన వారసత్వనియమం ప్రకారం, ఆస్తి కొడుకులందరికీ సమానంగా చెందడం మొదలైంది. కూతుళ్లను పోషించడం, వారికి వివాహమైన తర్వాత ఎంతో కొంత ఆస్తిని ముట్టజెప్పడం తండ్రీ, అన్నదమ్ముల బాధ్యత అయింది. విశేషమేమిటంటే, సరిగ్గా ఇలాంటి వ్యవస్థే ఇప్పటికీ మన కుటుంబాలలో ఉంది. రాంభట్ల కృష్ణమూర్తి ప్రకారం చెప్పాలంటే, పెళ్లై అత్తింటికి వెళ్ళినా, అమ్మాయి పోషణ బాధ్యత నిన్నమొన్నటి వరకూ పుట్టింటిమీదే ఉండేది. ఇప్పటికీ చీరా, సారె వగైరాల రూపంలో అది కొనసాగుతూనే ఉంది...

మొదట్లో గణాలకు జంతువుల పేర్లు ఉండేవనీ, పురుష పారంపర్యం వచ్చాకో, దానికి ఒకింత ముందో గణాలకు జంతువుల పేర్లు తొలగించి, వ్యక్తుల పేర్లు పెట్టడం మొదలైందనీ మోర్గన్ అంటాడు. సమాజం అభివృద్ధి చెంది, ఆస్తి పెరిగి, అది వ్యక్తి యాజమాన్యంలోకి వచ్చి, వ్యక్తుల ప్రత్యేకత స్థిరపడుతున్న కొద్దీ, ఒక వ్యక్తిని పూర్వపురుషునిగా నిర్ణయించడం, అతని పేరుతో గణాన్ని పిలవడం మొదలై ఉంటుందంటాడు. విశేషమేమిటంటే, మోర్గన్ ప్రధానంగా గ్రీకు, లాటిన్ తెగలకే తన ఈ పరిశీలనను అన్వయించినప్పటికీ; మన ఇతిహాస, పురాణకథనాలలోనూ దాని ప్రతిబింబాలు స్పష్టంగా కనిపిస్తాయి. రామాయణంలోని దశరథ, జనకమహారాజుల వంశకర్తల గురించి వెనకటి వ్యాసభాగాలలో చెప్పుకున్నాం. అలాగే మహాభారతంలోనూ రాజులు, ఋషుల వంశపరంపరల వివరణ కనిపిస్తూ ఉంటుంది. గణవ్యవస్థ ప్రపంచవ్యాప్తం కనుక, మన దగ్గరే కాక, అనేక ప్రాంతాలలో వంశచరిత్రలను కూర్చి గానం చేయడం పరిపాటిగా కనిపిస్తుంది. వంశచరిత్రల కథనశైలి కూడా అన్నిచోట్లా దాదాపు ఒకేలా ఉండి ఆశ్చర్యం గొలుపుతుంది. మొదట్లో గణాలకు జంతువుల పేర్లే కాక, మొక్కల పేర్లు కూడా ఉండేవని జార్జి థామ్సన్ తన పుస్తకంలో, ‘టోటెమిజం’ అనే తొలి అధ్యాయంలో అంటాడు. ‘ఇక్షు’, అంటే చెరకుగడ కనుక ఆ పేరునుంచే ‘ఇక్ష్వాకు’ వంశం పుట్టిందని ఇంతకుముందు అనుకున్నాం. చెరకుగడను సూచించే ఆ పేరునే వ్యక్తి పేరుగా మార్చడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

పురుషపారంపర్యానికి మారే ఈ క్రమంలోనే గణమూ, వంశకర్తల స్థానంలో గోత్రం వచ్చింది. పశుపాలకార్యులు గణాల స్థానంలో గోత్రాలను, వ్రాతాల(కొన్ని గణాలు కలసి వ్రాతాలు అవుతాయి)స్థానంలో మండలాలను స్థాపించారనీ; ఇది పశుపాలకార్యులలో వ్యాపించడానికి చాలాకాలమే పట్టినట్టు కనిపిస్తుందనీ రాంభట్ల కృష్ణమూర్తి తన ‘జనకథ’లో అంటారు.

గణానికి అంతవరకూ ఉన్న పేరు తొలగించి ఓ ప్రసిద్ధుడైన పూర్వపురుషుని పేరు ఉంచడం గ్రీకుగణాల్లో ఎంతో సున్నితంగా జరిగిందని మోర్గన్ అంటాడు. ఆ పూర్వపురుషుని తల్లి పేరును అలాగే ఉంచి, అతడు ఒక దేవుడివల్ల ఆమెకు కలిగిన సంతానంగా చెప్పే ఆనవాయితీ గ్రీకుగణాల్లో ఉండడాన్ని ఆయన ఉదహరిస్తాడు. అంటే, స్త్రీ, పురుషపారంపర్యాల మధ్య ఘర్షణతోపాటు సయోధ్య, సర్దుబాటు కూడా ఉండేవన్నమాట. విచిత్రంగా ఇది మన పురాణ, ఇతిహాసాల్లో కూడా కనిపిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులను ఎవరికి వారినే సృష్టి, స్థితి, లయకర్తలుగా చూపుతూ స్త్రీదేవతలకంటె ఉన్నతస్థానంలో నిలుపుతూనే; మళ్ళీ వారిని జగన్మాత సంతానంగా చెప్పి వారిపైన స్త్రీదేవతను ప్రతిష్ఠించడం కనిపిస్తుంది.

ఈ వ్యాసకర్త రాసిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే గ్రంథంలో మాతృస్వామ్యంనుంచి పురుషస్వామ్యానికి జరిగిన పరివర్తనక్రమాన్ని, అందులో ఘర్షణా, సర్దుబాటూ రెండూ ఉన్న వైనాన్ని విస్తృతంగా చర్చించడం జరిగింది.

స్త్రీ, పురుష పారంపర్యాల సంధిదశలో ఆ రెండు పారంపర్యాల మిశ్రమం అధికారవారసత్వనియమాలలో ప్రతిఫలించిన వైనాన్ని హిట్టైట్లకు చెందిన చారిత్రకపత్రాలు లిఖితపూర్వకంగా ఎలా వెల్లడిస్తున్నాయో తర్వాత చెప్పుకుందాం...

దాంతోపాటే, కౌసల్య వెయ్యి గ్రామాలకు యజమానురాలు కావడంలో మాతృస్వామికమైన క్లూ ఏదైనా జార్జి థామ్సన్ అధ్యయనంలో లభిస్తుందేమో కూడా చూద్దాం...


Read More
Next Story