కూతురు పుడితే ఆ  ఊర్లో 111 మొక్కలు నాటుతారు, ఎందుకు?
x

కూతురు పుడితే ఆ ఊర్లో 111 మొక్కలు నాటుతారు, ఎందుకు?

పిప్లాంట్రి గ్రామం – రాజస్థాన్‌లో పచ్చదనం విప్లవానికి ఆదర్శం

ఎండలు, ఎడారులు, రాతి కొండలతో పేరుగాంచిన రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామం ఉంది. అది పచ్చని వృక్షాలతో కమ్ముకొని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామం పేరు పిప్లాంట్రి (జిల్లా రాజ్‌సమంద్). ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఒక విశిష్టమైన సంప్రదాయం – అమ్మాయి పుట్టిన ప్రతి సారి 111 మొక్కలు నాటడం.

విషాదాన్ని ఆశగా మార్చిన కథ
ఈ మార్పు వెనక నిలిచిన వ్యక్తి గ్రామానికి మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్.
2005లో పలివాల్ సర్పంచ్ అయినప్పుడు, ఆ గ్రామానికి చుట్టుపక్కల వున్నా కొండలను పాలరాయి తవ్వకాలు కోసం క్వారీలు నాశనం చేసేశాయి; చుట్టుపక్కల వున్నా భూమి ఎండిపోయి , పచ్చదనం పూర్తిగా క్షీణించిపోయివున్నాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, ఇక్కడ కుమార్తెలను ఆర్థిక భారంగా చూసేవారు. ఇక్కడి తల్లిదండ్రులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే కొడుకులతో పోలిస్తే కుమార్తెలకు విలువను అంతగా ఇచ్చేవారు కారు.
2007లో, పాలివాల్ 17 ఏళ్ల కుమార్తె కిరణ్ అనారోగ్య కారణంగా మరణించింది. ఆ దుఃఖం ఆయనను కుదిపేసింది. తన కూతురు పేరు ఎప్పటికీ నిలిచిపోవాలని, ఆమె జ్ఞాపకార్థం, అతని కుటుంబం ఆమె పేరు మీద గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ఒక చెట్టును నాటారు (కిందిఫోటో) .

పాలివాల్ సమాజంలో అమ్మాయి పుట్టినప్పుడు దాన్ని శాపంగా కాక, ఆశీర్వాదంగా భావించాలని ఆయన కోరుకున్నారు. ఆ చెట్టు ఎదుగుదలన చూస్తున్న పాలివాల్ ఈ కార్యక్రమాన్ని విస్తృత కార్యక్రమంగా ఎందుకు మార్చకూడదు ? అనే ఆలోచన అతని మస్తిష్కము లో తట్టింది. మిగిలిన గ్రామస్థులతో చర్చించిన పిదప వారు కూడా అతని మార్గాన్ని అనుసరించడం ప్రారంభించారు.
అతని కూతురు మరణం వలన సంభవించిన దుఃఖాన్ని ఆశగా మార్చేందుకు ఆయన ఓ మహోన్నత సంప్రదాయానికి పునాది వేశాడు గ్రామానికి మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్.
ఆ నిర్ణయం ప్రాకారం గ్రామస్థులు పాప పుట్టిన కుటుంబం ఒక అఫిడవిట్‌పై సంతకం చేస్తుంది. అందులో – పాప పుట్టినప్పుడు 111 మొక్కలు నాటాలి, పుట్టిన పాపను 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు, నాటిన మొక్కలను సంరక్షించాలి అని వ్రాసి ఉంటుంది. అంతేకాక, గ్రామస్థులు కలిసి పాప భవిష్యత్తు కోసం ₹31,000 రూపాయల (గ్రామస్థులు, తల్లిదండ్రులు, బంధువులు కలసి) స్థిర డిపాజిట్ కూడా చేస్తారు. ఈ విధానం వలన సమాజం లో స్త్రీల స్థానం పెరగడం, చిన్న వయసులో పెళ్లిళ్లు తగ్గడం, పర్యావరణ సంరక్షణ అన్నీ ఒకేసారి సాధ్యమయ్యాయి. ఇలా ప్రారంభమైన సంప్రదాయం పిప్లాంట్రి గ్రామాన్ని ప్రపంచానికి ఆదర్శంగా మార్చింది.

కుటుంబానికి మొక్కలు నాటేందుకు కేటాయించిన స్థలానికి పాపని ఇలా శిల్క్ వస్త్రం పరిచిన గంపలో ఇలా తీసుకెళ్తారు.

ముఖ్య గణాంకాలు
ఇప్పటి వరకు గ్రామంలో 4 లక్షలకుపైగా చెట్లు నాటబడ్డాయి.
సగటున గ్రామంలో 200–250 ఆడపిల్లలు పుట్టినప్పుడల్లా, సంవత్సరానికి సుమారు 25,000–30,000 మొక్కలు నాటబడుతున్నాయి.
పర్యావరణం – సమాజ న్యాయం కలయిక
గ్రామం చుట్టూ ఒకప్పుడు ఎడారిలా ఉన్న ప్రాంతం ఇప్పుడు పచ్చని బెల్టుగా మారింది. భూగర్భజల స్థాయి పెరిగి, నీటి లభ్యత మెరుగుపడింది.
ఎడారి మధ్యలో పచ్చని ఊయల
ఇప్పటివరకు పిప్లాంట్రి గ్రామంలో 4 లక్షలకుపైగా చెట్లు నాటబడ్డాయి. నిమ్మ, శీశం, మామిడి, ఉసిరి, అలోవెరా మొక్కలు ప్రధానంగా నాటుతున్నారు. పశువులు తినకుండా కాపాడేందుకు చెట్ల చుట్టూ అలోవెరా మొక్కలు నాటుతున్నారు. దీని వలన గ్రామంలో అలోవెరా ఉత్పత్తులు – జ్యూస్, జెల్, కాస్మొటిక్స్ వంటి వాటి తయారీకి అవకాశాలు కలిగాయి. గ్రామంలోఉపాధి కూడా పెరిగింది. కుటుంబాదాయాలు పెరిగాయి.
మహిళల శక్తివంతం – గ్రామ అభివృద్ధి
పిప్లాంట్రిలో మహిళలు స్వయంసహాయక సంఘాల ద్వారా అలోవెరా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. విత్తనాల నర్సరీలను కూడా వారు చూసుకుంటున్నారు. దీని వలన వారికి ఆర్థిక స్వావలంబన లభించింది. పచ్చదనం మాత్రమే కాదు, మహిళా సాధికారత కూడా ఈ గ్రామ ప్రత్యేకత.


గ్రామస్తుల అనుభవాలు
గ్రామంలోని సావిత్రీ దేవి చెబుతున్నారు – “ముందు అమ్మాయి పుట్టింది అంటే భారంగా అనుకునేవాళ్లం. ఇప్పుడు అమ్మాయి పుట్టిందంటే ఊరంతా పండుగలా చెట్లు నాటుకుంటాం. మా పాపతో పాటు మా పచ్చదనం కూడా పెరుగుతుంటే గర్వంగా ఉంటుంది.”
ఒక స్వయంసహాయక సంఘానికి చెందిన గీతా బెన్ చెబుతున్నారు – “మేము అలోవెరా జ్యూస్, జెల్ తయారు చేసి అమ్ముతున్నాం. దాంతో ఇంట్లోనే డబ్బు సంపాదిస్తున్నాం. మొక్కలే ఇప్పుడు మాకు ఆదాయ వనరుగా మారాయి.”
జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
పిప్లాంట్రి గ్రామం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి (UN), పర్యావరణ సంస్థలు, NGOs లు ఈ గ్రామాన్ని స్థిరమైన అభివృద్ధి మోడల్గా పరిగణిస్తున్నాయి.
పిప్లాంట్రి గ్రామం ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలుస్తోంది. చాలా గ్రామాలు ఈ మోడల్‌ చూసి అనుసరిస్తున్నాయి. పర్యావరణం, సమాజం, ఆర్థికం – ఈ మూడు రంగాల్లోనూ గ్రామం ఒక జీవించి ఉన్న పాఠశాలగా మారింది.
పచ్చదనమే జీవన మంత్రం
ఇప్పుడు పిప్లాంట్రి గ్రామం పచ్చని చెట్లతో, వెలుగొందుతున్న మహిళా సంఘాలతో, అమ్మాయి పుట్టిన ఆనందోత్సవాలతో ఒక ఆశ యొక్క చిహ్నంగా నిలిచింది.


Read More
Next Story