తల్లీ మమ్మల్ని మన్నించు!
పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఆ పాశవిక ఉదంతంపై డాక్టర్ గోపికృష్ణ రాసిన కవిత హృదయాలను కదిలిస్తోంది.
-డాక్టర్ గోపికృష్ణ (అమృత హాస్పిటల్, మదనపల్లె)
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిస్సహాయతకు క్షమించు!
నలుగురినీ కాపాడేందుకు
నిద్రాహారాలు మరిచి
సేవలందిస్తున్న నిన్ను.
అదే నలుగురూ కలిసి
క్రూరంగా చెరిచి చంపేస్తూంటే
చూస్తూ ఊరికే ఉన్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా చేతకానితనాన్ని క్షమించు!
ముప్పైఆరుగంటలు
ఇంటి మొహం చూడకుండా
పేషంట్లను కాపాడుతున్న నిన్ను..
అర్దరాత్రి దాటాక అసురులు
చిత్రహింసలు పెడుతూంటే
ఆర్తనాదాలు వినక నిద్రపోయాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా మొద్దునిద్రను నువ్వేవదిలించు!
పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని
నీకళ్ళలోంచి కారిన రక్తం
వైతరిణిలా భయపెడుతోంది..
పటపటమని విరిగిన
నీ ఎముకల శబ్దం మాకు
గుండె పగిలేలా చేస్తోంది..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా పిరికితనాన్ని గమనించు!
గజానికొక్క గాంధారీపుత్రుడు
వలపన్ని చెరపడుతోంటే
కాపాడేందుకు రాడే అర్జునుడు..
ద్రౌపతి మాన సంరక్షణకు
చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు
ఎందుకనో తనని వదిలేశాడు..
తల్లీ మమల్ని మన్నించు!
నీ రక్షణకు నువ్వే నడుంకట్టు!
భగతసింగ్ పక్కింట్లో మాత్రమే
పుట్టాలని కోరుకొనే
కరుడుకట్టిన స్వార్థపరులం..
నువ్వు మాఇంట్లో పుట్టిన
ఆడబిడ్డ కానందుకు
సిగ్గులేకుండా సంతోషిస్తున్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా స్వార్థాన్ని దయతో క్షమించు!
సరిహద్దులో సైనికుడు
ఆదమరిచి నిద్రిస్తే
దేశరక్షణకే అది పెనుప్రమాదం..
విరక్తిచెందిన వైద్యుడు
తెల్లకోటు స్టెతస్కోపు విసిరేస్తే
లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిరాసక్తతను నువ్వే వదిలించు!
పూల పరిమళాలను
ప్రపంచానికి అందివ్వాలని
ప్రయత్నిస్తుంటే నువ్వు..
వేర్లతోసహా నరికేసి
చెట్టును కూల్చే రాక్షసులను
జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం..
తల్లీ మమ్మల్ని మన్నించు!
మా నిర్లిప్తతకు మొహంపై ఉంచు!
...కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో
...కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళితో