మరో మహా నిష్క్రమణం
x

మరో మహా నిష్క్రమణం

ఈ రోజు, 02.07.2025, అనంతపురం జిల్లా ఉరవకొండలో మరో భూమిపుత్రుని అసహన మరణ వార్త విని కన్నీటి పర్యంతమై...


-సడ్లపల్లె చిదంబరరెడ్డి



లేగ దూడల లేత బతుకుల్ని ప్రేమగా పెంచాలని
అడవిదారి పట్టిన అమాయకం గోవు
అమాంతంగా అన్యాయాల పులుల పాలయినట్లు

అందరి ఆకల్నీ బాపే బాధ్యతల భుజాల్తో
పచ్చని కలల పొలాలకెళ్లిన భూమిపుత్రుని ఉనికి
అర్ధాంతంగా అదృశ్యమైతే....

అతడు కార్చిన ప్రతి కన్నీటి బొట్టూ
మట్టిని కఠిన శిలగా మారుస్తూనే ఉంటుంది.
అతని దేహమ్నుండి రాలిన ప్రతి రక్తం చుక్కా
అన్నంతినే జాతి బతుకును ఎర్రని కరువు కొరివితో కాలుస్తూనే ఉంటుంది.
అతడు వదిలిన ప్రతి నిరాశా నిట్టూర్పూ
మాగాణిహృదయాన్ని పగుళ్లబీళ్లను చేస్తూనే ఉంటుంది.

అయినా ...ఇక్కడ అన్నీ సశేషాలే...!!

అతని శవయాత్రని అపార వ్యాపార కేంద్రాలు
పూలదండల హంగుల్తో రేటింగులు పెంచుకొంటూనే ఉంటాయి.
పన్నాగాల పదవీ వ్యూహాల్లో బలిపశువై
అతడు వదిలేసిన కాడీమేడీ పలుగూ నొగా పనిముట్లు
అతని ఆత్మశాంతికి జరిపే అఖండ యజ్ఞంలో
కాల్చి బూడిదచేసి ప్రసాదంగా పంచబడ్తూనే ఉంటాయి.

అతడాశతో ఎక్కిన అప్పుల శిరిమాన్నుండి దిగలేక
హఠాత్తుగా జారి ఉరికొయ్యకు వేలాడ్తే
సజీవ చావు దృశ్యాల్ని కెమెరా కళ్లు
నిస్సిగ్గుగా బ్రేకింగు వార్తగా వల్లెవేస్తూనే ఉంటాయి.

పైనుండీ రాల్చే హామీల నాణ్యాలు
ఏ అవసరాల బొచ్చె లోనూ పడవు
వారు కురిపించే మేఘసందేశాల చినుకులు
ఏ దాహార్థిగొంతునూ తడపవు.
చివరికి విషం ద్రావకాలే వారి
నమ్మకాల్ని వొమ్ముచేయని విముక్తిద్వారాలవుతాయి.

నీచత్వాల్ని నిరసిస్తూ రైతుబిడ్డలు తనువులు చాలిస్తే
దాచుకోలేక వల్లకాడు తల్లి
పుత్రశోకంతో కుంచించుకు పోతుంటుంది.

అమ్మా నాన్నల్ని కోల్పోయిన అనాద బిడ్డల్లా
పల్లెలన్నీ భయంపడి కొల్లబోయి
బతుకుతెరువు అడ్డాల నగరాలకు వలసపక్షులై
దినకూలీల పాట్ల పాఠాల్ని గత్యంతరంలేక నేరుస్తారు.

సబ్సీడీల విత్తనకాయలు దుక్కిగర్భం చేరకుండానే
చీకటి బజారుల్లో చేరి
నల్లమొక్కల్ని మొలిచి నోట్లకాతలు కాస్తాయి.

న్యాయస్తానాల అడ్డాల్లోని గుడ్డి జడ్జీలు
బధిరుల వాగ్ఞ్మూలాన్నే ప్రామాణికంగా నమ్మి
లాఠీల నోళ్లతో తీర్మానాలిస్తూంటారు.

ఇక ప్రతిదినం సూర్యుడు
పచ్చని పైరగాలుల పొలాల్నుండీకాక
ఎడారిదిబ్బల వల్లకాడునుండి
ఎర్రెర్రగా నడిచివస్తూంటాడు!!


Read More
Next Story