జాగ్రత్త, తమ్ముడా జాగ్రత్త!
x
Source: changingthepresent.org

జాగ్రత్త, తమ్ముడా జాగ్రత్త!

నేటి మేటి కవిత: కృపాకర్ మాదిగ


అంటరానితనం అగడ్తలు దాటి

సాంఘిక బహిష్కరణల
పరమపద సోపానాల పడగలు దాటి
సవర్ణ సరిహద్దు రేఖ వద్దకు చేరుకున్న తమ్ముడా జాగ్రత్త!
మునుపు ఈ దారిలోనే
మన తాతలు ముత్తాతలు అవ్వలు పోయారు
వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

డిగ్రీలు డాక్టరేట్లు పట్టుకొని
చూపుడు వేలంత స్వయం గౌరవాన్ని మదిలో నిలుపుకొని
ప్రశ్నల పాయింట్లు కొన్ని గుండెల్లో పెట్టుకుని
సంక్షేమం మొదటి మెట్టుకాడ నిలబడ్డ తమ్ముడా జాగ్రత్త!

మీ తాత ఎట్టోడు
మీ అయ్య చర్మకారి
నువ్వేమో చదువరి
చర్మాల చెప్పులు కుట్టడం చిన్నప్పుడే మానేశావు
అక్షరాల రక్షలు కుట్టడం నేర్చేసావు
శ్రమలోంచి పుట్టిన శక్తి నీది
మట్టిని తొలుచుకుని మొగ్గ తొడిగిన విద్వత్తు నీది
నీ ప్రతిభా సంపత్తులను సవర్ణం మెచ్చదు జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణులుంటారు
అడ్డుగా నిలబడే సాలభంజికలూ
వారి పరిచారికలూ నీ భవిష్య సింహాసనం
మెట్టు మెట్టుకీ ఉంటారు
నిన్నూ నీ డిగ్రీలనూ చిత్తు కాగితాలుగా
తీసేస్తారు
చెల్లని రూపాయిగా మార్చేస్తారు
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

నువ్వు లొంగిపోయావనుకో
నీ బుర్రలో గుజ్జు తీసేస్తారు
నిన్ను రోబోదాస్ గా మార్చేస్తారు
నువ్వు ఎదురు తిరిగావనుకో
మసి లేకుండానే మంటేస్తారు
మారేడు కాయని చేసేస్తారు
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

ముక్కూ చెవులూ కోయడం
బొటన వేళ్ల బహుమానాలు దోయడం
శిరో ముండనాలూ శిరస్సుల ఖండనాలూ
ఇక పాత ముచ్చటే తమ్ముడూ
అసలే బహిష్కృతుడవు
గ్లాడియేటర్ బరిలోకీ తోసేస్తారు
మహిళా ట్రాఫికర్ గా ముద్రేస్తారు
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

సవర్ణ పితృస్వామ్యం
అవర్ణం రొమ్ములపై పన్నులు విధించింది
మట్టి మహిళల రైకల్ని నిషేధించింది
నాంగేళి అమ్మ విషాద ప్రతిఘటన చూపింది
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

సవర్ణ పితృస్వామ్యం
సత్యభామ వేషం గడుతున్నది
మోహినీ ఆట్టం ఆడుతున్నది
సైరంధ్రీ బట్టలూ తొడుక్కొంది
అర్థనారీశ్వరిగా మారింది

https://changingthepresent.org/

కులం కచ్చడాలనూ తొడుక్కుంది
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

అందుకే తమ్ముడా!
నీ తల జాగ్రత్త!
నీ మొల జాగ్రత్త!
ప్రశ్నలూ జాగ్రత్త!
బొటన వేళ్ళూ
చూపుడు వేళ్ళూ
ఇంకా జాగ్రత్త!
జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త!

- కృపాకర్ మాదిగ


Read More
Next Story