అమ్మ ఒక ఖాళీ కంచం !
x

అమ్మ ఒక ఖాళీ కంచం !

ఇల్లు సీక్వెల్ కవిత - 15:



కొంతమంది గాభరాగా తినే స్త్రీలు

మెల్లిగా తిను వైశాలీ

కాస్త మెల్లిగా తిను !

మనువు పాలిస్తున్న ఏడు మన్వంతరాల కాలం నుంచీ..

రెండు వందల పదిహేను కోట్ల..

తొంబై ఒక్క వేల ముప్ఫయ్ ఆరు సంవత్సరాల నుంచీ

రోజూ ప్రతీ పూటా ఆదరా బాదరా ఎవరో తరుముతున్నట్లే.....

త్వరగా తినకపోతే ఎవరో కొట్టబోతున్నట్లే...

దేన్నో తప్పించుకుంటున్నట్లే

ఎక్కిళ్ళు పడుతూ ముద్ద ముద్దకీ నీళ్లు తాగుతూ

పొలమారి ఊపిరాడక వచ్చే కన్నీళ్లు మింగుతూ..

మందులు మింగినట్లే ముద్దలు గుటుక్కున మింగుతూ...

ఎమిటి వైశాలీ, నువ్వు నెమ్మదిగా తింటే నిన్ను చంపేసేదీ?

వాళ్లంతా తీరిగ్గా తిని టిఫిన్ బాక్స్ లు పట్టుకెళ్లిపోయారుగా..

ఇక నువ్వు నిదానంగా కూర్చో అక్కడ.. అన్నీ వడ్డీంచుకో వాళ్లకు

నీ భర్తా, పిల్లలూ, అత్తమామలకు వచ్చిపోయే అతిథులకు వడ్డించినట్లు.

కంచం నిండుగా.. వేడిగా ..వేడిగా

Complete plate meal !

రుచి చూస్తూ..పూర్తిగా నమిలి మింగుతూ ఆస్వాదిస్తూ...

జీర్ణం కావాలిగా..పోషకాలు కావాలిగా..ఇంటి పని గొడ్డులా చేయడానికి..

శక్తి కావాలిగా..

ప్రాణాలకు తెగించి పిల్లల్ని కనడానికి రక్తం కావాలిగా..

ఒంటి మీద ఆపేరేషన్ కుట్లు ఆరకముందే..

వచ్చిన జ్వరం తగ్గక ముందే ఇంటి వంట పనిలోకి చేరాలిగా..

అచ్ఛం అంట్లు తోమడానికి వచ్చే సారమ్మ లా !

అందుకే..వైశాలీ మెల్లిగా తిను..అన్నీ వడ్డించుకొని తిను !

వాళ్ళ కంటే నువ్వే ముందు తిను !

లేకపోతే..అనీమియాలు,అసిడిటీలు, ఒళ్ళు నొప్పులు..

ఒత్తిడి తల నొప్పులు

అబార్షన్లు,పురిట్లో మరణాలు..

ఎముకలు బోలు పోవడాలు...ఫ్రాక్చర్లు..

ఐదో కాలనే వాకర్ తో నడవడాలు !

గర్భసంచీ లో గడ్డలు

బిడ్డ అడ్డం పడితే సిసేరియన్లు, కోతలు, కుట్లు !

అందుకే తినాలి..వాళ్ళకంటే ఎక్కువగా నువ్వే తినాలి !

****

కొంతమంది ఆకలితో ఉండే స్రీలు

ఆకలి వాళ్ళకి వంట చేస్తున్నప్పుడు..

వాళ్ళకి వడ్డిస్తున్నప్పుడు..వాళ్ళు తింటూ ఉన్నప్పుడు...

వాళ్ళు తినేసి న కంచం ఎత్తేస్తున్నప్పుడు..

ఆకలాకలి అవుతుంది.

వాళ్ళ ఎంగిలి కంచం కూడా ఆమ్మ లో ఆకలి పెంచేస్తుంది.

అమ్మకి షుగర్ ఆకలి ఎంత క్రూరంగా ఉంటుందో కూడా తెలుసు...

ఒంట్లోని పెరిగిన షుగర్ 'ఆకలి.. అన్నం పెట్టు' అని అరుస్తూనే ఉంటుంది.

ఆకలి భగ భగ మండే ఆకలి...షుగరు ఆకలి..

తినకపోతే చచ్చే -చంపేసే ఆకలి !

కానీ..ఇల్లంతా..మాకు ముందు పెట్టు అంటూ కంచం చాపుతుంది..

లేదా అమ్మే అలా అనుకుంటుంది..

ముందు పురుషులు- తరువాతే స్రీలు అని ఆమెకు మనువు చెప్పాడు !

ఇక ఆఖరికి...అమ్మ ఆకలిని గుక్కిళ్ళుగా మింగుతూ..

నీళ్లతో కడుపులోని అసిడిటీ ని చల్లార్చుకుంటుంది అమ్మ...

చెమటలు కక్కుకుంటూ ఆకలి చంపుకుంటూ వండే భోజనం ..

అమ్మ కంచం దాకా ఎందుకు రాదు ?

ఒక సుదీర్ఘ కాలం తరువాత...

వేళకి అన్నం అందని అమ్మ పేగులలో అసిడిటీ పుండై రక్తం కారుస్తుంది !

మొగుడుకి కడుపునిండా తిన బెట్టి...

అతని దీర్ఘాయువు కోసం చేసే నోములూ, వ్రతాలూ, ఉపవాసాలు...

ఎలానూ అమ్మ కడుపుని మరింత ఎండగొట్టేవే !

***

భోజనానికి పిలుపు అందని స్రీలు

అమ్మా అన్నం తిను. !

ఏవోయ్.. తిను ..

కోడలా మాతో కూర్చుని తిందువు రా..అని ఎవరూ ఆమెని పిలవరు.

వంటకీ..వడ్డనకే పిలుస్తారు అమ్మనే పాపం

అందరినీ తినడానికి రమ్మని ఢంకా మోగిస్తూ పిలుచుకుంటుంది.

ఇక అమ్మ వడ్డన చేసే చెయ్యి

మెల్లిగా స్టీలు గరిటగా మారి పోతుంది !

పేదవాడి ఆకలి విప్లవం సృష్టిస్తుంది !

కానీ అమ్మ ఆకలి కనీసం తిరుగుబాటు కూడా చేయదు !

మాతృత్వం.. ఆదర్శ గృహిణి నమూనాల్లో అమాయకంగా దేహాన్నీ..

మనసుని జీవితాన్ని ఇరికించేసు కుంటుంది పాపం పిచ్చితల్లి !

***

రక్తం లేక పాలి పోయే స్రీలు ఆమె పాలి పోతుంది..

ఆమె కింది కనురెప్పలో తెలుపు..చేతి గోళ్ళల్లో విరుపు చూసి చెప్తాడు డాక్టర్...

ఇది అనీమియా రక్తమే లేదు ఎక్కడ పోయింది..

ఎవరికి ధారపోశావు..తినవెందుకు అంటూ..

ఆమె ఖంగారు పడుతూ ..అయ్యో..అయ్యో..

నా చేతివేళ్లు నిత్యం కురగాయలు తరుగుతూనే ఉంటాయి...

చేతులు వడ్డిస్తూనే ఉంటాయి..

భోజనం ఎప్పుడూ నా చేతుల్లోనే...

వాటికి రక్తమే లేకుండా ఎలా.. ఎటుపోయింది.

అయినా నేను తినడం ఏమిటీ..

వాళ్ళు తింటే నేను తిన్నట్లేగా...

మరి నా ఒంట్లో రక్తం ఎటు పోయిందీ అంటుంది ఒట్టి అమాయకంగా !

****

కొన్ని కంచాలు ఉంటాయి

అవును..ఆడ కంచం...మగ కంచం !

మగ కంచంలో నిండు భోజనం !

ఆడ కంచంలో సగం భోజనం.. అన్నీ తక్కువే !

పురుషుల రక్తంలో అన్ని విటమిన్లు పుష్కలం...రోగాలు తక్కువ.

అదే ఆడవాళ్ళ రక్తంలో అన్నీ విటమిన్లు తక్కువే....ఎప్పుడూ నీరసమే...చిరాకు బాధ..ఖంగారు ..ఆందోళన.

పురుషులు మాత్రం గంభీరంగా...నిమ్మళంగా ..స్థిరంగా ఉంటారు.

అనాదిగా ఇదే మనుశాస్రం చెప్తున్నది

ఇప్పుడు శాశ్రాన్ని తలకిందులు చేయాలి.

కంచాలని మార్చి పడేయాలి.

***

ఎక్కడున్నా..పిల్లల ఆకలి తీర్చే స్త్రీలు

"అమ్మా ..అన్నం పెట్టు" అని తప్ప..

."అమ్మా..అన్నం తిన్నావా" అని అడగని పిల్లలు...

Swiggy నే నయం..

"హై..వైశాలీ లంచ్ అవైట్స్ ఫర్ యూ..వాంట్ టు ఈట్ "? అంటూ

మెస్సేజీలు మూడు పూటలూ పంపుతూనే ఉంటుంది ...

మొగుడే అడగంది !

అమ్మని తిన్నావా అని అడగని దయలేని పిల్లలు ఎలా ఉన్నా..

ఎక్కడ ఉన్నా..తనని అడవిలో వదిలేసినా..

ఆమె హృదయం పగిలినా.. ఆమెలో మాత్రం ప్రేమ తగ్గదు

యుగాల తరువాత నువ్వు చూడ్డానికి వెళ్ళినప్పుడు

"తిన్నావా నాయనా" అనే అడుగుతుంది !

నీకెలా కావాలో..నీకేది ఇష్టమో తెలుసుకుని మరీ వంట చేసి పెడుతుంది ..

తన కడుపులో బాధ చెప్పదు..

నీ కడుపు నింపాలనే చూస్తుంది !

నువ్వు చిన్నప్పుడు నీ బొజ్జ తడిమి నీ ఆకలి తెలుసుకునే అమ్మ ..

నువ్వామెను హృదయమే లేని జనారణ్యం లో

ప్రేమ దాహమెప్పటికీ తీరని ఎడారుల్లో వదిలేసినా...

నువ్వు నీ మెట్టింటి నుంచి వచ్చినా...

కొడుకువో.. కూతురివో...నువ్వు తిన్నావో.. లేదో అనే ఆలోచిస్తుంది .

***

అమ్మ-ఆకలి-ఖాళీ ఇల్లు


ఊరి నుంచి వచ్చే అమ్మ కోసం..

ఇల్లూ..వాకిలీ,పిల్లలూ, భర్త..నానమ్మ-తాతయ్యా ఎదురు చూస్తూ ఉంటారు..

అమ్మ రాగానే వాకిలి పులకించి పోతుంది.

మూసుకున్న వంటగది తెరుచుకుంటుంది.

అమ్మ ..డ్యూటీ ఎక్కుతుంది !

Dining table ని తప్ప cooking range ని స్వంతం చేసుకోని

నాన్న ..తాతయ్య తో పాటు ఇల్లు కడుపునిండా తిని ప్రశాంతంగా నిద్ర పోతుంది.

అమ్మ-రాత్రి మిగిలిన భోజనం

దసరాకు దేవీ నవరాత్రుళ్లప్పుడు....

ఇంటి ఇల్లాలు తాజా భోజనం చేయాలి..

దేవికి పెట్టే ప్రసాద భోజనమే ఇల్లాలు చేస్తుంది.

ఇక మిగతా 356 రోజులూ

అమ్మ రాత్రి మిగిలిన కూరలు అన్నం తింటుంది.

ఇంట్లో పెద్దవాళ్ళు.. భర్తా..పిల్లలకి తాజా వేడి భోజనం పెడుతుంది..

వాళ్ళకి రాత్రి మిగిలిన వంట పెట్టటం ఆమెకే ఇష్టం ఉండదు !

ఆమెకెప్పుడూ...ఎవరూ ప్రేమగా వడ్డించని ఒంటరి భోజనమే...

ఆమెదెప్పుడూ చివరి భోజనమే.

తినని దేవుళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..

తినే నోరు.. చేతులూ ఉన్న అమ్మకి..రాత్రి మిగిలిన భోజనం.

అమ్మ ముత్థవ్వ...మొగుడి ఎంగిలి కంచంలో

తినలేక పెరట్లో నూతి గట్టు మీద వాంతి చేసుకుంటే....

ఇప్పటి అమ్మ మాత్రం రాత్రి కూటితో....పేగులని కలవర పరుస్తుంది !

అమ్మా..నువ్వు రాత్రి మిగిలిన పాచి కూడుని

కడుపులో వేసే డస్ట్ బిన్ వి కాదు అని ఎవరు ఆమెకి చెప్పాలి చెప్పండి ?

అన్నం పరబ్రహ్మ స్వరూపం పడెయ్య కూడదు..మరిక తినేది అమ్మే కదా..

తాజా భోజనం అయినా అమ్మకెక్కడ దొరుకుతుందని...

అందరూ తిన్నాక మిగిలిన అడుగు బొడుగే.. ఆమె కడపటి భోజనం...

ఇంత భోజన హీనత..ప్రేమ హీనత ఉన్నాక

ఇక అమ్మకి రక్త హీనత కాక ...ఇంకేం వస్తుందని ?

ఆమెని అతడు సరస్వతీ దేవి నుంచి అన్న పూర్ణా దేవిగా మార్చేసినా.. అది వాళ్లకోసమే !

ఆమె మాత్రం చిట్ట చివరి భోజన కర్త... అమ్మ ఏమీ మిగలని ఖాళీ కంచం !

వాళ్లకు వడ్డిస్తున్నప్పుడు భోజనం ఆమె తో మాట్లాడుతుంది...

ఆకు కూర..వైశాలీ నీకు నేను ముఖ్యం నన్ను తిను అని ప్రేమగా పిలుస్తుంది....

నువ్వు కూడా వడ్డించుకో అని డైనింగ్ టేబుల్ ఎక్కని

ఆమె ఖాళీకంచం ఆగ్రహంగా కసురుతుంది.

ఆకలికి నీళ్లు తాగే అమ్మని "కొంచెం తినరాదామ్మ" అంటూ

ఊడుస్తున్న సారమ్మ పనాపి జాలిగా చూస్తుంది..

ఆమెకి ఆకలి ఎలా ఉంటుందో బాగా తెలుసు !

****

అమృతం కాదు...అన్యాయం

అమ్మ చేతి వంట అమృతం అనడంలో ఎంత విషం..

ఎంత శ్రమ దోపిడీ ఎన్ని యుగాలుగా వుందో ఎవరు లెక్క తేల్చాలి ఇప్పుడు..?

అమ్మ చేతి వంటలో ప్రేమ తో పాటు ఇంకేం ఉంటాయో అడిగావా ఎప్పుడైనా...అడుగు !

"నొప్పిరా కన్నా...వంట చేయలేకున్నా"..అంటుంది.

అరేయ్..వంటలో మోకాళ్ళ నొప్పులతో..

.షుగరు,బీపీ లతో చేయలేక చేస్తున్న

అమ్మ కన్నీళ్ళున్నాయిరా...అందుకే అది నీకు అమృతమైంది...

అమ్మని ఆరామ్ కుర్చీలో కూర్చో బెట్టి నువ్వు వంటింట్లోకొచ్చి

నీ చేతి వంట అమృతంలా తినిపించవచ్చు !

కొడుకుల..నాన్నల భర్తల చేతి వంట కూడా అమ్మ కోసం అమృతంగా చేయచ్చుఁ...

వంటిల్లు నీకు నిషేధ స్థలం కాదు !

భోజనం ఫార్ములాని ..

అమ్మ+మసాలా+రుచికరమైన వంట గా మార్చిన మనువెక్కడ దాక్కున్నాడు ..

నీలో ...నాన్నలో...చంపేయ్ వాడిని.

నాన్న దొంగపాట

అమ్మతో నాన్న అంటాడు.."నా హృదయం దాకా...నువ్వెలా రావాలో చెబుతాను విను !

నాకు రోజూ మంచి భోజనం చేసి వడ్డించు !

అసలు..నువ్వే నా భోజన కంచంగా.. మారిపో !

అప్పుడే నా మనసుని గెలుచుకుంటావు" !

అంటూ నిత్యం అమ్మకి వంటింటి సైగలు చేస్తుంటాడు.

నీ చేతి వంటకి నాకూ మధ్య

ఎంత గొప్ప భోజన రాగం ఉందో విను అంటూ పాడతూ ఉంటాడు !

పొధ్ధున్న మధ్యాహ్నం రాత్రి ..అన్ని రుతువులలో ఒక తిరగలి లా డైనింగ్ టేబుల్ కి ..

వంటింటికీ మధ్య తిరుగుతూ ఆమె కాళ్ళు అదృశ్యమై చక్రాలు మొలిచేసాయి ...

ఇలా కాదని ఆమె ఇంకా చురుకుగా తిరగాలని స్కేటింగ్ చక్రాలు వేస్తాడు.!

రెండు చేతులు సరిపోవని ఇంకో ఆరు చేతులు తెచ్చి కుడతాడు !

వేసవిలో చెమట కి పంకా, చలికాలం కుంపటి

వంటింట్లో ఎంత ప్రేమో తనకి భార్య అంటే అని మురిసి పోతాడు.

ఇక నొప్పులు తగ్గించే మాత్రలైతే ..

వేరు శెనక్కాయల్లా మింగించి మరీ వంట చేయిస్తాడు.

ఆమె నొప్పి తగ్గక మూల్గుతుంటే మాత్రం చూడలేక

వంటింటి తలుపేసేసి..తాను లివింగ్ రూమ్ లో ..

టీవీల్లో మంచి భర్తల పాత్రల్లో తనను చూసుకుంటూ స్వయంతృప్తి పొందుతుంటాడు !

***

కొంతమంది మనువుని తప్పించు కున్న పురుషులు

వీళ్ళు ..ఈ పురుషులు ఆమెలతో పాటు వంటిళ్ల లోకి వస్తారు...

ఆమెకి పది చేతులు మొలవకుండా..తమ చేతులని ఇస్తారు.

ఆమె ఖాళీ కంచాన్ని మొదటగా నింపుతారు.

ఆమె నోటికి తొలి ముద్దగా మారి పోతారు.

భార్యలకు అమ్మలైపోయి అన్నం తినిపిస్తారు.

భార్యలు రక్త హీనత బారిన పడకుండా...తమ రక్తాన్ని ఇస్తారు

ఆమె షుగర్,బీపీ లని తగ్గించే దివ్యౌషదాలు అవుతారు..

ఆమెల కు ప్రాణం పోస్తారు..

ఆమెలను తమతో పాటు కూర్చో పెట్టుకుని

భోజనం చేయడమే అందమంటారు.

అలాంటి పురుషులు వంట చేసే వాళ్ళ చేతులని

కళ్లకద్దు కోవాలనిపించే నాన్నలూ ఉన్నారు..

Mother/wife ఇద్దరూ

మగాడికి జీవితకాలం కోసం appoint అయిన

వంట మనుషులు ఏమాత్రమూ కాదని..

వాళ్లందుకు మాత్రమే పుట్టలేదని కొడుకులను..

హెచ్చరించే మగవాళ్ళున్నారు !

అమ్మ ఎప్పుడూ ఖాళీ కంచం కాకూడదని...

దేవతకు పెట్టే నిండు ప్రసాదం లా

ముందు అమ్మ కంచం నింపే నాన్నలు ఉన్నారు !

మనువుని తప్పించుకుని మనుషులుగా మిగిలిన నాన్నలున్నారు !

కాకపోతే ఇక్కడ సరిపోనిది equation !

వందలో 30% మాత్రమే ఉన్న

అలాంటి నూతన మానవులు..వంద శాతం ఎప్పుడు కావాలి ?

మనువు ఊర్కోడు...ఇంకో..ఏడు మన్వంతరాలు..

ఇంకో రెండు వందల కోట్ల చిల్లర సంవత్స రాల..

పాపి చిరాయువుగా ఉంటూనే ఉంటాడు మనువు !

ఈ దేశంలో మనువుకి ఫర్టిలిటీ సమస్య లేనే లేదు... రాదు !

తనని తాను కోట్ల లో కంటూ నే ఉంటాడు !

భారత దేశంలో మనువు స్వయంభువు!

అందుకే...అమ్మా.. నువ్వే మారాలి.

వంటింట్లోంచి బయటకు నువ్వే రావాలి.

వాళ్ళ వంట వాళ్లే చేసుకోవాలి.

ఇంటి డైనింగ్ టేబుల్ ని నీ స్వంతం చేసుకోవాలి .

నువ్వు ఖాళీ కంచం కాకూడదు !

ఇంట్లో కొత్త మనువుల్ని తయారు చేయకూడదు !

మనువుల్ని కనడాన్ని తిరస్కరించు.

మానవిగా...మానవుడ్ని మాత్రమే కను !

కన్నాక వాడిని మనవుని కానీయకు !

**

స్త్రీకి భర్తపై ప్రేమ అంటే కమ్మని భోజనం చేసి పెట్టడం ..

అమ్మ చేతి వంట అమృతం అనే మనువు దొంగ మాటల కుట్రలు...

స్రీలని వంటింటికి ఆహుతి చేసేవే !

నీపై ప్రేమ ఉంటే.... అతను ముందుగా వంట గదిని ప్రేమించాలి...

రోగాలతో బాధ పడే అమ్మతో/భార్యతో

వంట చేయించుకుని తింటున్నందుకు సిగ్గుపడాలి !

ఆ పురుషులు వంట గదిని అలవాటు చేసుకోవాలి .

అతను వంటింట్లోకి వెళ్లాలంటే ..దాని కంటే ముందు నువ్వే బయటకు రావాలి.

నీ కంచం నువ్వే నింపుకోవాలి !

నువ్వొక ఖాళీ కంచం కాకూడదు !

Read More
Next Story