
చెట్టు కన్నీళ్లు కార్చిందా?
… లేక ప్రకృతి మాట్లాడిందా?
నీటి వాగు పక్కన నిలిచిన అంజిరా చెట్టు…
దాని చిన్న కొమ్మ సాయంత్రం అనుకోకుండా విరిగింది.
రాత్రంతా ఆ గాయమైన చోటు నుండి
స్ఫటికంలా స్వచ్ఛమైన నీరు
నెమ్మదిగా కారుతూ కనిపించింది.
ఉదయం సూర్యుడు ఉదయించగానే
ఆ ప్రవాహం మౌనంగా ఆగిపోయింది.
చూసిన ప్రతి ఒక్కరికీ అది —
చెట్టు కన్నీళ్లు కార్చినట్టే అనిపించింది.
తెల్లవారుజామున ఆ దృశ్యం చూసిన క్షణంలోనే
ప్రకృతిని ప్రేమించే మాలో చాలా మంది హృదయాలు
అనూహ్యమైన కరుణతో నిండిపోయాయి.
నా వరకైతే…
దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం తెలిసినా కూడా,
మన చేతులతోనే ఆ చిన్న కొమ్మను విరిచి
చెట్టుకు గాయం చేశామనే భావన
మనసును భారంగా మార్చింది.
నేను ఆ చెట్టును దగ్గరకు వెళ్లి
నిశ్శబ్దంగా కౌగిలించుకున్నాను…
మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకున్నాను.
ఆ క్షణంలో —
ఏదో తెలియని విద్యుత్ తరంగం
ఆ చెట్టు నుండి నాలోకి ప్రసరిస్తున్నట్లొక అనుభూతి...
మా బృందంలోని ప్రతి ఒక్కరూ
ఆ చెట్టును హత్తుకుని,
తమ వల్ల జరిగిన గాయానికి
మాటలకందని మౌన క్షమాపణలు కోరారు.
ప్రకృతిలో జరిగే ప్రతి సహజ సంఘటనకు
మనిషి తన హృదయాన్ని జోడిస్తాడు.
అప్పుడు సాధారణ జీవశాస్త్రం కూడా
అద్భుతంగా… భావోద్వేగంగా మారిపోతుంది.
నిజానికి రాత్రి సమయంలో
ఆకులపై ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయి.
వేర్లు మాత్రం నేల నుండి నీటిని పైకి పంపుతూనే ఉంటాయి.
దీంతో చెట్టు లోపల ఒత్తిడి పెరిగి
గాయమైన భాగం ద్వారా నీరు బయటకు కారుతుంది.
పగటి సమయంలో సూర్యకాంతి ప్రభావంతో
ఆకుల ద్వారా ట్రాన్స్‌పిరేషన్, ఆవిరీభవనం జరుగుతాయి.
అప్పుడు నీటి ప్రవాహం ఆకుల వైపు మళ్లిపోవడంతో
ఆ కారడం సహజంగానే ఆగిపోతుంది.
ఇది అడవిలో జరిగింది కనుక సరిపోయింది…
అదే జనారణ్యంలో జరిగి ఉంటే,
“బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది” అని
భక్తితో నమ్మేసి,
పూజలు — పురస్కారాలు కూడా నిర్వహించే వాళ్లమేమో!
దైవం విశ్వమంతా వ్యాపించి ఉందని నమ్మి,
ప్రకృతిలో కూడా దైవత్వాన్ని చూసే
మనలోని భారతీయతకు వందనాలు…
చెట్టు ఏడవలేదు —
ప్రకృతి తన పని చేసుకుంది అంతే.
అర్థం తెలియనప్పుడు అది అద్భుతం,
తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం.
Next Story

