పాపాయి మనస్సు...
వనజ తాతినేని 'ఆదివారం కవిత'
పాపలేం చేయగలరు ?
పాపం!! మనం తిడితే తిట్టలేరు
కొడితే కొట్టలేరు.
అంతర్లీనంగా ఓ ధిక్కార స్వరాన్ని బలోపేతం చేసుకోవడం మినహా!
వాళ్ళేం... మన పెంపుడు జంతువులు కాదు
పంజరంలో బంధించిన పెంపుడు చిలుకలు కాదు.
మనకు ఇష్టమైనప్పుడు
ఆడమన్నట్టు ఆడటానికి
పలకమన్నప్పుడు పలకడానికి
వారేం గాడిదలు కారు
మన కోపతాపాలు మన అసహనాలు
మన తాపత్రయాలు మన లక్ష్యాలు
మన బరువులు మోయడానికి.
మన మానసిక కల్లోలాన్ని తట్టుకునే సముద్రం కాదు వాళ్ళు
కనీసం ఆహ్లాదానికి మనం పెంచుకున్న పూల మొక్కలు కాదూ
అమర్చుకున్న ఆక్వేరియంలో చిరు చేపలైనా కాదు.
వారు మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు
వారికి మన భాష అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు
మన కరుకైన వ్యవహారశైలి
వారి మెదడులో గుప్తనిధిలా దాక్కునే వుండవచ్చు
తెలివిడి పెరిగిన కొద్దీ మనస్సు కూడా గాయపడుతుండవచ్చు
వారి నిర్మల హృదయం బండబారటానికి
బీజం వేసిన పాపం మాత్రం మనదే! మనదే కావచ్చు!!
పుట్టుకతోనే కర్ణుడికి కవచకుండలాలులభించినట్లు
మన అహంకారమూ…
తుస్కారం తుత్తర స్వభావం
నోటి వాచాలత వారసత్వ ఆస్తులుగా నిలుపుకున్నట్లు
మన ఆయుధాలను ఝళిపించడానికి
సర్వదా సన్నద్ధంగా వుంటాము
కార్యాకారణాలను కూడా
సైన్యం లా సమకూర్చుకునే వుంటాము.
అయిననూ.. ఓ బాధాతప్త హృదయంతో వేడుకొన్నాను
సుందరేశ్వరా! మనిషికి సుందరమైన ఆకాంక్షలే కానీ
సున్నితమైన మనసు ఎందుకిప్వలేదు తండ్రీ !! .
పోనీ పసిపిల్లల మనసు గాయపడకుండా
లోహకవచాన్ని తొడుగుగా అయినా ఇవ్వకపోతివి కదా అని.
ఇంతకీ పిల్లలేం చేస్తారు?
చిన్నబుచ్చుకున్న మనస్సును చిచ్చు కొట్టి
కాసేపటికి ఎప్పటిలానే
వారి పెద్ద మనసుతో పెద్దల్ని క్షమించేస్తారు.
వారు క్షమించిన ప్రతిసారీ
అదఃపాతాళానికి కృంగిపోవడానికి బదులు
అహంకారంతో మరోసారి పెట్రేగిపోవడానికి
బలం చేకూర్చుకుంటారు అని
మళ్ళీ తిట్టినప్పుడు కానీ అర్థమవదు.
పసిపిల్లల స్వచ్ఛత ప్రేమ మనల్ని పునీతులును చేస్తుందని
మనసుండీ గ్రహించలేని ఆల్చిప్పలు నిలువెత్తు సంతకమై
ఇంట్లో తిరుగాడుతూనే వుంటారు.
పాపలు ఇల్లాళ్ళుగా మారుతుంటారు.
మరో పురుషుడి దాష్టీకాన్ని తట్టుకోవడానికి సమాయత్తమై.
ఈ దేశంలో ఎన్నటికీ చావు లేనివి రెండే రెండు..
మగవాడి అహంకారం స్త్రీ క్షమాగుణం