
హెల్మెట్‌పై బైకర్లకు అవగాహన కల్పిస్తున్న విశాఖ పోలీసులు
బైక్ ఒకటి.. హెల్మెట్లు రెండు..!
విశాఖ నగరంలో బైక్ నడిపే వారే కాదు.. వెనక కూర్చున్న వారికీ హెల్మెట్ ధారణను తప్పనిసరి చేశారు.
మీ ఇంట్లో బైక్ ఉందా? అయితే హెల్మెట్లు ఎన్ని ఉన్నాయి? అదేం ప్రశ్న అనుకుంటున్నారా? అనుకుంటే అనుకోండి. కానీ హెల్మెట్లు మాత్రం తప్పనిసరిగా రెండు ఉండాల్సిందే? ఎందుకో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి!
ఇకపై ఒకటి కాదు.. రెండు..
ఇన్నాళ్లూ విశాఖపట్నంలో బైక్ ఉన్న వారికి ఒక హెల్మెట్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కుదరదు. కచ్చితంగా రెండు హెల్మెట్లు ఉండాల్సిందే. ఎందుకంటే? బైక్ నడిపే వ్యక్తే కాదు.. వెనక కూర్చున్న (పిలియన్ రైడర్) వారికి కూడా శిరస్త్రాణం తప్పనిసరి. అది భార్యాభర్తలైనా, పిల్లలైనా, స్నేహితులైనా.. ఇంకెవరైనా! అలా కాకుండా బైక్‌ను నడిపే వారే హెల్మెట్ పెట్టుకుని, వెనక కూర్చున్న వారికి లేకపోతే రూ.1,035 జరిమానా చెల్లించాల్సిందే. ట్రాఫిక్ పోలీసుల కళ్లలో పడ్డాక ఇంటికెళ్లే సరికే మొబైల్ ఫోన్‌లో ఈ–చలానా ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారి ఈ–చలానా జారీ అయితే ఇక చెల్లించి తీరాల్సిందే తప్ప తప్పించుకునే వీలుండదు.
పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని ఏర్పాటు చేసిన పోస్టరు
ఇతర రాష్ట్రాల్లోనూ అమలులో ఉన్నా..
బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న (పిలియన్ రైడర్) వారికీ హెల్మెట్ తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. దీంతో.. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 129 (ఎ) 1988 ప్రకారం మోటార్ సైకిల్ వెనక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఈ తీర్పు దృష్ట్యా ఈ సెక్షన్‌ను దేశంలోని కొన్ని రాష్ట్ర్రాలు అమలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు చూసీ చూడనట్టు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఈ విధానాన్ని కొన్నాళ్లుగా అమలు చేస్తున్నారు. అక్కడ హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినా, వెనక కూర్చున్నా రూ.500 జరిమానా విధిస్తున్నారు. 2020 ఫిబ్రవరి నుంచి హైదరాబాద్‌లోనూ, 2024 నుంచి మహారాష్ట్రలోనూ పాక్షికంగా అమలు చేస్తున్నారు.
ఏపీలో మూడేళ్ల క్రితమే అమలులోకి వచ్చినా..
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2022 అక్టోబర్ 20 నుంచి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ విధిగా ధరించాలన్న నిబంధన తెచ్చింది. అయితే ఇన్నాళ్లూ అది అంతగా అమలు కాలేదు. కానీ ఇప్పుడు బైక్‌పై వెళ్లే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్‌లు ధరించాలని నిబంధన పెట్టారు. ప్రయోగాత్మకంగా ఏపీలో విశాఖ నగరంలో జనవరి 1 నుంచి దానిని అమలు చేస్తున్నారు. హైవే మీదే కాదు.. నగరంలో ఇతర రోడ్లపై వెళ్లే వాహనాలను దారి కాచి మరీ పోలీసులు కేసులు రాస్తూ ఫైన్ వేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి, ఈ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడటానికే ఇది అని పోలీసు అ«ధికారులు చెబుతున్నారు.
వైజాగ్‌లో ఇకపై ఇలా వెళ్లాల్సిందే..
ఎవరికీ మినహాయింపు లేదు..
గతంలో మాదిరిగా కాదిప్పుడు. ఇంట్లోంచి కాలు బయట పెడితే బైక్‌పైనే వెళ్తున్నారు. దగ్గర్లో ఉన్న మార్కెట్‌కో, కిరాణా సరకులకో, రైతు బజారుకో, పిల్లలను స్కూల్లో దించడానికో, స్నేహితులు/సన్నిహితులు/కుటుంబ సభ్యులను బస్టాపుల్లో డ్రాప్ చేయడానికో బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లడం అందరికీ అలవాటు. ఇప్పుడు అలా వెళ్తే కాచుకు కూర్చున్న పోలీసులు వారికి జరిమానాతో ఝలక్ ఇస్తున్నారు. ‘మా పిల్లల్ని రోజూ నేనే స్కూలులో దించుతాను. నేను హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. తొమ్మిదో తరగతి చదువుతున్న మా అమ్మాయికి హెల్మెట్ ఉండాలంటే ఎలా?’ అని గురుద్వారా ప్రాంతానికి చెందిన తులసి ప్రశ్నించారు. ‘నేను మా ఇంటికి దగ్గరల్లో ఉన్న రైతు బజార్‌కు బైక్‌పై వెళ్తే హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు చలానా పంపారు’ అని అక్కయ్యపాలెంలో ఉంటున్న సుధారాణి అనే మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వీరే కాదు.. పలువురు విశాఖ వాసులు వ్యధ చెందుతున్నారు. నగరంలో కొన్నిచోట్ల సందుల్లోనూ పోలీసులు కాపు కాసి హెల్మెట్ ధరించలేదంటూ కేసులు రాసి ఫైన్లు వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
డీటీసీ ఆర్. శ్రీనివాసరావు
వైజాగ్‌లో 85 శాతం మందికి హెల్మెట్లు..
వైజాగ్‌లో సుమారు ఏడు లక్షల బైక్‌లున్నట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వీరిలో 85 శాతం మంది బైకర్లు హెల్మెట్లను కలిగి ఉన్నట్టు అంచనా. ఇకపై మోటార్ సైకిలున్న ప్రతి వాహనదారుడికి విధిగా రెండు హెల్మెట్లుండాల్సిందే. ఒంటరిగా వెళ్తే ఒక హెల్మెట్ సరిపోయినా వెనక మరొకరిని ఎక్కించుకుని వెళ్తే మాత్రం రెండోది తప్పనిసరి అయింది. ఇది పేద, మధ్య తరగతి వారికి భారమైనా ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదని పోలీసులు హితవు పలుకుతున్నారు.
2025లో 333 మంది మృత్యువాత..
ఇటీవల నగర పోలీస్ కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025లో విశాఖ నగర పరిధిలో 1,086 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 333 మంది చనిపోయారు. 1038 మంది గాయపడ్డారు. ఒక్క జాతీయ రహదారి–16పై జరిగిన ప్రమాదాల్లోనే 149 మంది మరణించారు. 388 మందికి గాయాలయ్యాయి.
వైజాగ్‌లో నో హెల్మెట్.. నో పెట్రోల్..
ఈనెల ఒకటి నుంచి పిలియన్ రైడర్‌కు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో సెల్‌ఫోన్‌లో ఆ బైక్ ఫోటో తీసి ఈ–చలాన్లు పంపిస్తున్నారు. మరోవైపు హెల్మెట్ లేని వారికి పెట్రోల్ వేయరాదంటూ పోలీసులు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు పిలియన్ రైడర్లకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసిన విషయంపై అవగాహన కల్పించామని, జనవరి 1 నుంచి ఈ–చలాన్ల జారీ ప్రక్రియ మొదలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఐఎస్‌ఐ హెల్మెట్లనే ధరించాలి మరి!
పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారని ఏదో ఒక హెల్మెట్ కొనేసి పెట్టుకుంటే సరిపోదు.. ఐఎస్‌ఐ మార్కు/బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్గదర్శకాలు కలిగిన హెల్మెట్ అయి ఉండాలి. అంటే అది అత్యంత నాణ్యత కలిగినదై ఉండాలన్న మాట. అంతేకాదు.. హెల్మెట్ మొక్కుబడిగా తలకు తగిలించుకుని వెళ్తే కుదరదు. అది తలకు సరిగ్గా అమర్చుకుని వాటికున్న పట్టీలను పెట్టుకుని వెళ్లాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఊడిపోయి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని పోలీసులు అంటున్నారు.
పోలీసులతో అవగాహన కల్పిస్తున్నాం.. డీటీసీ
‘ద్విచక్ర వాహనదారులతో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన గురించి పోలీసులతో కలిసి అవగాహన కల్పిస్తున్నాం. కొన్నాళ్ల క్రితం నుంచే ప్రధాన జంక్షన్లలో ఈ పని మొదలు పెట్టాం. ఏప్రిల్ నుంచి షోరూంలో కొత్త బైక్ కొనుగోలు చేసేటప్పుడే హెల్మెట్ తప్పనిసరి చేసే నిబంధన అమలులోకి వస్తుంది.’ అని విశాఖ రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్.శ్రీనివాసరావు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
ఏడీసీపీ కె. ప్రవీణ్‌కుమార్
ప్రజల ప్రాణాల రక్షణకే: ఏడీసీపీ
‘ప్రజల ప్రాణాల రక్షణ కోసమే బైక్ డ్రైవర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధారణను తప్పనిసరి చేశాం. హెల్మెట్లు లేకుండా బైక్‌పై వెళ్తూ ప్రమాదాల పాలై ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి మరణాలను నిలువరించడానికే హెల్మెట్ ధారణ నిబంధన. గత సెప్టెంబర్ నుంచి బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తున్నాం. ఈనెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నాం. త్వరలో దీనిని మరింత కఠినతరం చేస్తాం. హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించే వారికి రూ.1,035 జరిమానా విధిస్తున్నాం. మరోసారి అతిక్రమిస్తే వారి బైక్‌ను సీజ్ చేస్తున్నాం. ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ నిబంధన తెచ్చాం. హెల్మెట్ ధారణలో ఎవరికీ మినహాయింపు లేదు’ అని విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
Next Story

