
చంద్రగ్రహ శోధనకు బయలుదేరిన వ్యోమగాములు
ARTIMIS 2 : చందమామపై ఈ నలుగురు ఏం చేస్తారు, ఏమి తెస్తారు!
50 ఏళ్ల నిరీక్షణకు తెర.. చందమామ ఒడిలోకి నలుగురు వీరులు!
50 ఏళ్ల నిరీక్షణ.. ఎక్కడ నేల.. ఎక్కడ నింగి.. 10,500 కిలోమీటర్ల ఎత్తు.. అదిగదిగో చందమామ అనడమే తప్ప అక్కడేముందో తెలియదు. ఇప్పుడు అటో ఇటో తేలనుంది. మనిషి ఉండవచ్చో లేదో తేలనుంది. అనంత విశ్వంలో మానవుడు మరో ముందడుగు వేశాడు.
2026, ఏప్రిల్-1, బుధవారం మునిమాపు వేళ.. 5 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 'ఆర్టెమిస్-2' ఉపగ్రహం ఫ్లోరిడాలోని నాసా అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అందులో నలుగురు మనుషులు, 10 రోజులు క్షణం తీరికలేకుండా చంద్రగ్రహాన్ని పరిశీలించబోతున్నారు.
అప్పుడెప్పుడో అపోలో...
మానవ చరిత్రలో కొన్ని క్షణాలు కాలాతీతంగా నిలిచిపోతాయి. 1972లో 'అపోలో' మిషన్ ద్వారా చందమామపై ఓ మూలన తొలిసారి మనిషి అడుగుపెట్టినప్పుడు ప్రపంచం ఓ అద్భుతాన్ని చూసింది. ఒళ్లు పులకించింది. మళ్ళీ 5 దశాబ్దాల తర్వాత, అంతకంటే గొప్ప లక్ష్యంతో, అంతకంటే శక్తివంతమైన సాంకేతికతతో మానవాళి అంతరిక్ష గూడు దాటి బయటకు వచ్చింది. నాసా కేంద్రం నుంచి ఆర్టెమిస్-2 నౌక నింగిలోకి దూసుకెళ్లినపుడు ప్రపంచం కేరింతలు కొట్టింది. జయహో మానవుడా అని జేజేలు పలికింది. శాస్త్రవేత్తలు భావోద్వేగంతో కంటతడిపెట్టారు. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం కాదు.. అది రాబోయే తరాల ఉనికికి వేసిన పునాది.
18 వేల మందిలో నలుగురు..
ఈ మిషన్ కోసం వ్యోమగాముల ఎంపిక అగ్నిపరీక్షను తలపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన సుమారు 18,000 మంది పోటీపడ్డారు. వీరిలో కేవలం ఈ నలుగురిని ఏరికోరి ఎంపిక చేశారు. దీని వెనుక నాసా దశాబ్ద కాలపు కఠిన ప్రణాళిక ఉంది. ఈ బృందంలో ముగ్గురు అమెరికా (NASA) కు చెందిన వారు, ఒకరు కెనడా (CSA) దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేవలం శారీరక దృఢత్వం, పైలటింగ్ నైపుణ్యాలే కాకుండా.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని మానసిక స్థైర్యం, సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకునే చాకచక్యం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వీరిని ఎంపిక చేశారు. వేల సంఖ్యలో ఉన్న మేధావుల నుంచి ఈ నలుగురిని ఎంపిక చేయడం అంటే సముద్రంలో ఆణిముత్యాలను వెతికి తీయడమే. వీరు ఎంపికైన నాటి నుంచి రెండేళ్ల పాటు కఠోర శిక్షణ పొందారు. నిరంతరం 'సిమ్యులేటర్ల'లో గడిపారు. శూన్య గురుత్వాకర్షణ స్థితిలో ఉన్నారు. అంతరిక్షంలో ఏదైనా ముప్పు వాటిల్లితే ఎలా బతికి బయటపడాలో నేర్చుకున్నారు. అత్యవసర ల్యాండింగ్ మొదలు ప్రతి చిన్న అంశాన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశారు. అందుకే, వీరు కేవలం వ్యోమగాములు మాత్రమే కాదు.. అంతర్జాతీయ సహకారానికి చిహ్నాలు. మానవాళి ప్రతినిధులు. అనంత విశ్వంలోకి వెళ్తున్న ధీశాలురు.
ఈ యాత్రా బృందానికి సారథి రీడ్ వైజ్‌మాన్ (కమాండర్).
విక్టర్ గ్లోవర్ పైలట్. చంద్రుడి చెంతకు చేరుకోబోతున్న తొలి నల్లజాతీయుడు.
క్రిస్టినా కోచ్ మిషన్ స్పెషలిస్ట్. అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్న తొలి మహిళా చంద్రగ్రహ యాత్రికురాలు.
జెరెమీ హాన్సెన్ కెనడా వాసి. అంతర్జాతీయ సహకారానికి గుర్తు. ఈ బృందంలో చేరిన తొలి అమెరికాయేతర వ్యక్తి.
పది రోజుల ప్రయాణం.. పది తరాల భవిష్యత్తు..
ఈ 10 రోజుల ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత కీలకం. వీరు చంద్రుడిపై దిగకపోయినా, చంద్రుడి వెనుక భాగం (Far Side) నుండి సుమారు 10,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తారు. అత్యంత ప్రమాదకరమైన అంతరిక్ష రేడియేషన్‌ను మానవ శరీరం ఎలా తట్టుకుంటుందో ఈ మిషన్ నుంచి పరిశీలిస్తారు. ఓరియన్ నౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎంతవరకు పని చేస్తున్నాయో పరీక్షించడమే వీరి ప్రధాన విధి.
ఈ పది రోజుల్లో వీరు సేకరించే సమాచారం ఆధారంగానే వచ్చే ఏడాది లేదా ఆ పై ఏడాది 'ఆర్టెమిస్-3' ద్వారా మనుషులు చంద్రుడి మీద అడుగు పెడతారు.
చంద్రుడు కేవలం గమ్యం కాదు..
నాసా ఈ మిషన్‌ను "మేము వెళ్తున్నాం.. అక్కడే ఉండటానికి" అనే నినాదంతో చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు రూపంలోని నీటిని వాడుకుని, అక్కడ 'ఆర్టెమిస్ బేస్ క్యాంప్' నిర్మించాలన్నది అసలు ప్రణాళిక. చంద్రుడిపై జనావాసాలు సాధ్యమైతే, అది మానవాళిని మంగళ గ్రహం (Mars) వైపు తీసుకెళ్లే తొలి మెట్టు అవుతుంది. శాస్త్రవేత్తల ఉద్దేశ్యం ప్రకారం, భూమిపై వనరులు తరిగిపోయినా లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినా, మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే 'మల్టీ-ప్లానెటరీ స్పీషీస్' (బహుళ గ్రహాలపై నివసించే జాతి)గా మారడం ఒక్కటే మార్గం. ఆ సుదీర్ఘ ప్రయాణానికి ఆర్టెమిస్ అనేది ఒక ప్రయోగశాల వంటిది.
అసలేమిటీ ఆర్టెమిస్ ప్రయోగం..
ఇది మొత్తం మూడు దశలు.
1. ఆర్టెమిస్-1 - ఇది 2022లో జరిగింది. ఇందులో మనుషులు ఎవరూ వెళ్ళలేదు. కేవలం ఖాళీ రాకెట్ (SLS), ఓరియన్ నౌకను చంద్రుడి చుట్టూ పంపి, అది సురక్షితంగా తిరిగి వస్తుందో లేదో పరీక్షించారు. అది విజయవంతమైంది.
2. ఆర్టెమిస్-2 - ఇప్పుడు జరుగుతున్నది. మనుషులతో చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి మిషన్. ఇందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు.
వీరు చంద్రుడి మీద దిగరు. చంద్రుడిని చుట్టి, అంతరిక్షంలో మానవ మనుగడకు వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అని పరీక్షించి 10 రోజుల్లో తిరిగి వస్తారు. ఇది ఒక రకంగా "టెస్ట్ డ్రైవ్" లాంటిది.
3. ఆర్టెమిస్-3 - అసలైన ఘట్టం ఇది. 2027 లేదా 2028లో జరగబోయే మిషన్. ఆర్టెమిస్-2 విజయవంతంగా తిరిగి వచ్చాక, ఈ మిషన్ ద్వారానే మనుషులు చంద్రుడి మీద అడుగు పెడతారు. ఇందులో వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి అక్కడ పరిశోధనలు చేస్తారు.
నిజంగానే ఇదో గంభీరమైన ఘట్టం. ఈ నలుగురు తిరిగి వచ్చిన తర్వాత వారు చెప్పే అనుభవాలు, సేకరించిన డేటా రాబోయే వంద ఏళ్ల అంతరిక్ష పరిశోధనల దిశను మారుస్తాయి. ఇది ఒక దేశానికో, ఒక సంస్థకో సంబంధించిన విజయం కాదు. ఇది యావత్ మానవజాతి మేధస్సుకు, అన్వేషణా కాంక్షకు దక్కిన గౌరవం. ఈ ప్రయోగం విజయవంతంతో చందమామ మళ్ళీ మనకు చేరువయ్యింది. అనంత విశ్వంలో మనిషి తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతున్న వేళ.. చందమామా, నీ బిడ్డలను సాదరంగా ఆహ్వానించు! నీ గుట్టు ఏమిటో విప్పు అంటోంది విశ్వమానవాళి.
Next Story

