చైనా పర్యటనలో ‘ఓ కొత్త బంగారులోకం’
అధిక జనాభాతో పక్కపక్కనే ఉన్నభారత్–చైనా దేశాల మధ్య సఖ్యత లేకపోతే ఆసియా ఖండంలో శాంతి ఉండదు.
‘సరిగ్గా పదేళ్ల కిందట 2015 భారత్ చైనా మిత్రమండలి తరపున డాక్టర్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 12 మంది సభ్యుల బృందం బీజింగ్, షియాంగ్, షాంఘై నగరాలతో పాటు జుజియా జియానో గ్రామ పర్యటనలలో చూసిన అంశాలను రాఘవ శర్మగారు "ఓ కొత్త బంగారు లోకం" గా మన ముందుంచారు.
ఈ మిత్రమండలి ఎందుకు? భారత్ చైనా ప్రజల మధ్య స్నేహ సంబంధాలు, పరస్పర అవగాహన పెంపొందించడం కోసం1950 దశకంలో పండిట్ సుందర్ లాల్, ప్రముఖ చరిత్రకారుడు తారచంద్ అధ్యక్ష కార్యదర్శులుగా భారత్ చైనా మిత్రబండలి ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఉభయ దేశాల మధ్య అపోహలు తొలగించి మైత్రికి కృషి చేస్తుంది.
భారత్ చైనా మధ్య స్నేహ సంబంధాలు ఎందుకు? ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గలదేశాలు. ఆసియా ఖండంలో పక్కపక్కనే ఉన్న దేశాలు అవ్వటంతో వేల సంవత్సరాలుగా సాంస్కృతిక సంబంధాలున్నాయి. రెండు దేశాలు వలస పాలనకు,ఆర్థిక దోపిడికి గురై వలసపాలన కు వ్యతిరేకంగా పోరాడినవి. భారత్ 1947లో, చైనా 1949లో విముక్తిని సాధించి సామ్యవాదం వైపు నడిచింది. భారత్ సామ్రాజ్యవాద, పెత్తందారి దేశాల పద్ధతులను అవలంబిస్తూ పేదరికం ఉన్న సంపన్న దేశంగా మారింది. అధిక జనాభాతో పక్కపక్కనే ఉన్న ఈ రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోతే ఆసియా ఖండంలోనే శాంతి ఉండదు. సామ్రాజ్యవాద యుద్ధకాముకులు భారత్ చైనాల మధ్య అలజడులు ఆపోహలు సృష్టిస్తున్నారు.
వీటిని తొలగించి రెండు దేశాల మధ్య చారిత్రికంగా ఉన్న స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు మిత్రమండలి ఏర్పడింది. భారత్ చైనాల మధ్య అపోహలు అలజడులు లేని స్నేహ సంబంధాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ స్నేహ సంబంధాల నేపథ్యంలోనే భారత్ చైనాలు పంచశీల సూత్రాల పై సంతకాలు పెట్టినవి. ఆచరించినవి.
బ్రిటిష్ ఇండియాలో పండించిన నల్ల మందులో చైనా ప్రజలు వలస పాలనలో ఓలలాడారు(నల్ల మందు సంబంధం కూడా). ఈ విషయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ "చీని మర్నాదే బేబస్" (అంటే బ్రిటిష్ ఇండియాలో పండించిన నల్లమందును చైనా లో ప్రజలను చంపే వ్యాపారం) అన్న హెడ్డింగ్ తో 1881 లోనే వ్యాసం రాశారు. ఠాగూర్ కూడా రెండు దేశాల మధ్య సంబంధాల కోసం కృషి చేశారు.
ఇప్పటిచైనా ఎలా ఉంది? చైనా వారి సిగ్నల్స్ అవసరంలేని రవాణా వ్యవస్థ అత్యంత అద్భుతమైనది. పెద్ద నగరాలైన బీజింగ్ షియాంగ్ షాంఘైలలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేదట. నాలుగు దిక్కులకు వెళ్లేలా ఒకదానిపై ఒకటి నాలుగు ఫ్లై ఓవర్లు ఉండటం అద్భుతం అనుకోవాలి. హంగ్సు నది కింద 1.2 కిలోమీటర్ల దూరం ఉన్న భూగర్భ రహదారి మన ఊహలకి అందటం లేదు.
మురికివాడలు లేకపోవడం, శుభ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం. వారి మరుగుదొడ్లు స్టార్ హోటల్స్ ను మరిపిస్తూ ఆధునిక నాగరికతకు అద్దం పడుతున్నాయంట. ఉచిత నిర్బంధ విద్య వైద్యం అంతా ప్రభుత్వ ఆధీనములోనే. అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు మన కార్పొరేట్ పాఠశాలలు ఏమాత్రం సాటి రావంటారు రాఘవ శర్మ గారు. వైద్యులకు ఉపాధ్యాయులకు అత్యంత గౌరవమని ఏ ఉద్యోగమైనా సంపాదించవచ్చు కానీ ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించడం అత్యంత కష్టమంటారు. విద్య మొత్తం చైనా భాషలోనే సాగుతుంది. మాతృభాషలో ప్రాథమిక విద్యను కూడా వదిలి ఇంగ్లీషు ఇంగ్లీషు అని మనం అంటుంటే ఇంగ్లీషులేని ఆదేశం ఎలా అభివృద్ధి సాధిస్తుంది!?
చైనా నిర్మాణాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా అనగానే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, థియనాన్ మేన్ స్క్వేర్,ఫర్బిడన్ సిటి, టెర్రకోట మ్యూజియం, అందులోని సైనికుల బొమ్మలు, సాంగ్సి చరిత్ర మ్యూజియం, ఓరియంటల్ టవరు, యు గార్డెన్, విద్యుత్ దీపాలతో ఎలిగిపోతున్న ఆకాశ హార్మ్యాలు, రైల్వే స్టేషన్లు, ప్రాథమిక పాఠశాలలు, ఫ్లై ఓవర్లు, రహదారులు, కాలవలు, పడవలు, ఆర్ట్ మ్యూజియం, ఏడంతస్తుల్లో ఉన్న బుక్ సిటి, షియాన్ మసీదు ఒక్కొక్కటి ఒక్కోక్క వింత.
ఇంతేనా? కాదు. ఎక్రోబేటిక్ ప్రదర్శనలో అద్భుత విన్యాసాలు, నాట్య భంగిమలు ఫియాంగ్ నగర వీధులలో సీనియర్ సిటిజన్ల బృందనాట్యాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.
అన్నింటికన్నా అతి ముఖ్యమైనది అర్ధరాత్రి ఒంటి గంటకైనా, తెల్లవార్లు, ఎక్కడికైనా ఒంటరిగా వెళుతున్న మహిళలకు ఎలాంటి భయము, అబద్రత, ఇబ్బందులు లేవని, ఇక్కడి ప్రజలు చాలా మర్యాదస్తులని తూర్పుగోదావరి తునికి చెందిన కుర్రోడు చెప్పాడు. నేరాలు చాలా తక్కువ అని నేరం జరిగితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని గైడ్ యాంగ్ చెప్పారట. మహిళలకే కాదు బాల్యానికి భద్రత ఉంది. వార్ధక్యానికి ఆధరణ ఉంది. వృద్ధాప్యం వారికి శాపం కాదు. బాల్యంవారికి బరువు కాదు. రెండు ఆనందదాయకమే. బృందం చూసినంతమేరా అడుక్కునేవాళ్లు ఒకే ఒక్కడు కనిపించాడట. అతనికి ఇతర దేశాల వాళ్ళు తప్ప చైనావాళ్లు ఎవరు డబ్బులు వేయటం లేదట.
ఇది కదా మనం కోరుకోవాల్సింది. అనుసరించాల్సింది.
ఈ మహత్తర "కొత్త బంగారు లోకం"లో ఎదుగుతున్న పెట్టుబడి పారిశ్రామిక దేశంగా ఆ వ్యవస్థ అవలక్షణాలు కూడా అంటుకుంటున్నాయి. అవినీతి, అక్రమ సంపాదనలు, జైలు శిక్షలున్నాయి. మారుమూల నివసించే మరో ఏడు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయాల్సి ఉంది. మహిళలకు 55 పురుషులకు 60 రిటైర్మెంట్ వయస్సుగా ఉంది. దీనిలో సమానత్వం లేకపోవడం నచ్చలేదు. యువత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుంటే క్రమశిక్షణగా ఉండాలంటు, తీసుకోవడం లేదoటున్నారు. ప్రాచ్యాత దేశాల విష సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. ప్రధాన ఆకర్షణలైన సొంత ప్లాటు, కారు, సొంత ఆస్తులు కావాలని రైతులు ఉద్యోగులు కోరుకుంటున్నారు.
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ చైనా, సామ్రాజ్యవాద అమెరికాకు పోటీనిస్తూ ఓ గొప్ప సోషలిస్ట్ దేశంగా, ఆధునిక దేశంగా ఎదిగింది. నల్లమందు మత్తులో జోగాడిన జాతిని చైతన్య వంతంచేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చుట్టూ తిప్పుకునే స్థాయికి చేర్చింది జనసేన విప్లవం, మావో ఆలోచన విధానమేనని వెలుగెత్తి చాటవచ్చు.వేసిన సోషలిస్ట్ భావజాల పునాదులు ఇంకా బలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. నూతన ప్రైవేట్ ఆర్థిక విధానాలు కన్నా సోషలిస్ట్ విప్లవ భావజాలంలో ఉంటే ఇంకా ప్రజల పక్షాన ఉండేదేమో!? చిన్న ఆశ.
వీసా పాస్పోర్ట్ గోల లేకపోతే మహిళలకు, వృద్ధులకు పిల్లలకు భద్రత ఉన్న చైనా ను వెంటనే చూడాలనoతా గొప్పగా రాఘవ శర్మ గారు ఈ "ఓ కొత్త బంగారు లోకం" పుస్తకంలో రాశారు. చూడలేకపోయినా కనీసం చదువుదాం.
నేనైతే భారత చైనా మిత్రమండలి తరఫున చైనా వెళ్లే అవకాశం వస్తే ఎంత బాగుంటుందోనని కలలు కంటున్నాను. అబ్బా! ఎంత ఆశ అనుకోవద్దు. ఈ పుస్తకం చదివితే మీరు అంతే ఆశపడతారు. ప్రయత్నిస్తారు కూడా. ఇది నేనిస్తున్న హామీ.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముఖచిత్రంతో, లోపల పేజీల్లో స్కానింగ్ చేసిన ఫోటోలుతో, చిత్రాలతో 60 పేజీల చిన్న,అందమైన పుస్తకం ఇది. అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2015 డిసెంబర్ 19 నుంచి 28వ తేదీ వరకు ఆ పర్యటన సాగింది.