గాజా ఊచకోతకి సరిగ్గా తొమ్మిది నెలలు
x

గాజా ఊచకోతకి సరిగ్గా తొమ్మిది నెలలు

గాజాను ఓ స్మశానంగా మార్చాకా కూడా అక్కడే ఉండాల్సిన అవసరం ఇజ్రేల్ కు ఏమొచ్చింది? అంటే ఏదో రహస్యం ఉంది. ఆ 'స్మశానం' కూడా ఇజ్రాయిల్ పై గెరిల్లా యుద్ధం చేస్తోంది


-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


ప్రతిరోజూ మరణ వేదన అనుభవిస్తున్న బాధిత ప్రజల బాధలు వినే మానవీయుల మెదళ్లు కూడా క్రమక్రమంగా సున్నితత్వాన్ని కోల్పోతాయి. గాజా అందుకొక నిదర్శనం. గాజా కోసం కన్నీళ్లు కార్చడం, ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడం వంటి సంఘీభావ విధుల్ని నిర్వర్తించడంలో ఒకవేళ మన మెదళ్ళు మిద్దుబారినా, గాజా ప్రజలు అలసిపోకుండా, మన సంఘీభావం కోసం ఎదురు చూడకుండా తమ వీరోచిత ప్రతిఘటనా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పైగా అది కొత్త పుంతలు తొక్కుతోంది. గాజా జినోసైడ్ కి నేటికి సరిగ్గా తొమ్మిది నెలలు నిండిన ప్రత్యేక సందర్భంగానైనా ఒకసారి దృష్టిని సారిద్దాం.

7-10-2023న ఉదయం ఇజ్రాయెల్ పై హమాస్ గెరిల్లా మెరుపు దాడి చేసింది. అదే సాయంత్రం గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార యుద్దానికి దిగింది. క్యాలెండర్ ప్రకారం ఈనెల 7కి తొమ్మిది నెలలు నిండుతుంది. రోజుల లెక్కలో నేటికి 270 రోజులు. అంటే సరిగ్గా నేటికి తొమ్మిది నెలలు నిండింది.

ఇజ్రాయెల్ ది ఆత్మరక్షణ చర్యగా సామ్రాజ్యవాద మీడియా ప్రచారం చేసింది. ఇజ్రాయెల్ ది ప్రతీకార దాడిగా మరోరకం ప్రచారం కూడా సాగింది. అది ఆత్మరక్షణ చర్య గానీ, ప్రతీకార దాడి గానీ కాదనీ, ఏకపక్ష యుద్దామనీ ప్రత్యామ్నాయ ప్రచారం సాగింది. అది కూడా సమగ్ర నిర్వచనం కాదనీ, నిజానికి అది యుద్ధం కాదనీ, అది ముమ్మాటికీ జినోసైడ్ అనీ మరోరకం ప్రచారం క్రమంగా ప్రాబల్యంలోకి వచ్చింది. ఇవి ఏవైనా, వారం రోజుల్లో లేదా కనీసం నెల రోజుల్లో ఈ క్రింది రెండు లక్ష్యాల్ని నెరవేర్చుకొని విజయవంతంగా గాజా నుండి వెనక్కి వస్తామని ఇజ్రాయెల్ ఆశించి అక్కడకు మూడున్నర లక్షల ఆధునిక సైన్యాలను తరలించింది. మొదటి లక్ష్యం, బందీలను విడుదల చేయడం. రెండవ లక్ష్యం, హమాస్ కి చెందిన 25 నుండి 30 వేల మంది సాయుధ గెరిల్లాల్ని నిర్మూలించడం! తొమ్మిది నెలలు ముగిసింది. రెండు లక్ష్యాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు. ఒప్పందంలో భాగంగా 2023 నవంబర్ చివర విడుదలైన బందీలతో పాటు అనుకోకుండా దొరికిన ఏడుగురిని తప్ప మరెవ్వరినీ విడుదల చేయించుకోలేక పోయింది. నేటికీ సుమారు 120 మంది బందీలు హమాస్ వద్ద ఉండడం గమనార్హం! పైగా గత ఒప్పందం ప్రకారం విడుదలైన పౌర సమాజపు ప్రతినిధుల కంటే, హమాస్ చేతుల్లో బందీలుగా మిగిలిన సైనిక, రాజ్య ప్రతినిధులు రాజకీయంగా నేతన్యాహు సర్కారు కి మరింత ఎక్కువ ప్రతిష్టాత్మకమైనది. ఇకపోతే రెండవ లక్ష్యమైన హమాస్ నిర్మూలన కేవలం పగటికలగా మారింది. తానే ప్రకటించిన 25 నుండి 30 వేల మందిలో ఒక్క శాతం మందిని కూడా నిర్మూలించలేక పోయింది. ఒక "మహత్తర బృహత్తర" గెలుపు మాత్రం సాధించింది. అదే 38 వేలమంది పౌరుల్ని చంపి, ఇంచుమించు లక్షమందిని గాయపరిచడం. ఇది గొప్ప విజయమే కాబోలు! నిజానికి పౌర మరణాలకు అవకాశం లేకుండా, సాయుధ హమాస్ శక్తుల్ని మాత్రమే మట్టుబెట్టే లక్ష్యాన్ని ప్రకటించి గాజాకు సైన్యాన్ని పంపింది. కానీ అది ఆచరణలో హమాస్ జోలికి వెళ్లకుండా పౌర మారణకాండ వరకే పరిమితమైనది. ఇదీ తొమ్మిది నెలల్లో ఇజ్రాయెల్ సాధించిన గొప్ప విజయం!

తొమ్మిది నెలల తర్వాత కూడా తన సైన్యాన్ని గాజా నుండి ఇజ్రాయెల్ ఎందుకు ఉపసంహరించలేదు? ఇంకా అక్కడ ఎందుకు ఉండాల్సి వస్తోంది? గాజాను ఓ స్మశాన స్థలంగా మార్చిన తర్వాత కూడా అక్కడే ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బయటకు తెలియని ఏదో ఒక రహస్యం ఉంది. అదేమిటంటే ఆ 'శ్మశానం' కూడా ఇజ్రాయిల్ పై గెరిల్లా యుద్ధం చేస్తోంది? ఈ రహస్య కోణాన్ని తొమ్మిది నెలలు నిండిన సందర్భంగా ఆవిష్కరించే ప్రయత్నమిది.

గాజాలోకి తన సైన్యాల్ని తేలిగ్గా ముందుకు నడిపించే మొదటి దశ ఒకటుంది. అది 2023 సైనిక ఆపరేషన్ తొలి కాలంలో సాగించింది.

పురోగమించడం కష్టంగా, క్లిష్టంగా మారిన రెండవ దశ మరొకటి ఉండేది. అది 2023 చివర రోజుల్లో సాగింది.

పురోగమించలేక పోయినా, ఉన్న చోట నిలబడగలిగిన లేదా వెనక్కి తేలిగ్గా రాగలిగిన ఇంకో దశ ఒకటుంది. అది గత కొన్ని నెలలుగా సాగుతోంది.

అడుగు ముందుకు వేయలేక పోవడమే కాకుండా, ఉన్న చోట నుండి భూమార్గంలో నిర్భయంగా వెనకడుగు కూడా వేయలేని మరో దశకి చేరింది. అది ప్రస్తుత దశ!

తన సరిహద్దు ప్రాంతమైన ఉత్తర గాజా కల్లోల రహిత ప్రాంతంగా మారిందని 2023 నవంబర్ లోనే ఇజ్రాయిల్ బహిరంగంగా ప్రకటించింది. మరికొన్ని నెలల తర్వాత సెంట్రల్ గాజా కూడా శాంతి మండలంగా మారిందని విజయ గర్వంతో ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. రఫా ఒక్కటే మిగిలిందని ఏప్రిల్ నెలలో ప్రకటించి స్వాతిశయంతో, ఉన్మాద ఉత్తేజంతో సైన్యాల్ని నేతన్యాహూ ప్రభుత్వం రఫా పైకి నడిపించింది. నాటి నుండే ఇజ్రాయెల్ కి అసలు సమస్య ఎదురైనది. రఫా వైపు వెళ్లిన తర్వాత ఉత్తర, సెంట్రల్ గాజా ప్రాంతాలు సైతం అనూహ్య రీతిలో తిరగబడుతున్నాయి. రఫా కూడా గెరిల్లా జోన్ గా మారింది. నాటి వియత్నాం నుండి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల వరకూ సామ్రాజ్యవాద, దురాక్రమణదారీ రాజ్యాలు ఎలా చావు దెబ్బ తిన్నాయో, 365 చ.కి.మీ. వైశాల్యం గల గాజా కూడా ఇజ్రాయిల్ కి సమాధిస్థలిగా మారుతోంది.

నేడు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట శక్తులు, ఆధిపత్య రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులు, సామ్యవాద రాజకీయ శక్తులు పాలస్తీనా విమోచనా పోరాట అనుకూల శక్తులు నిబద్ధతతో జినోసైడ్ ని దృఢంగా వ్యతిరేకిస్తున్నాయి. గాజా ప్రజల్ని బలపరుస్తూనే, వారు విజయం సాధించాలని కోరుకుంటూ వారు గెలుస్తారో ఓడి శాశ్వత నష్టపోతారో అని సందేహిస్తున్నారు. కానీ ఎనిమిదిన్నర నెలలకు పైగా జినోసైడ్ కి స్వయంగా ప్రత్యక్ష నేతృత్వం వహించిన తర్వాత జూన్ మూడవ వారంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి ఒక నిప్పులాంటి చేదు నిజాన్ని ఇలా బహిర్గతపరిచాడు.

హమాస్ ని ఎప్పటికీ మన సైన్యం ఓడించలేదు.

హమాస్ కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు, అదో భావజాలం కూడా!

గాజాలో చివరి మనిషి జీవించి ఉన్నంత కాలం హమాస్ కూడా జీవించే ఉంటుంది.

చారిత్రక పురోగమన నియమాల్ని కొన్నిసార్లు చారిత్రక పురోగమన రాజకీయ శక్తుల కంటే, చరిత్ర విధ్వంసక శక్తులే తొలుత గ్రహిస్తాయి. గాజా బోధిస్తున్న వర్తమాన చారిత్రక సత్యమిది.

38 వేల మంది మృత్యువాత పడ్డ తర్వాత, ఇంచుమించు లక్షమంది గాయపడ్డ తర్వాత, తమ మాతృభూమి ఓ స్మశాన స్థలిగా మారిన తర్వాత, గాజా ప్రజలు మరుభూమి నుండే రణభేరిని మోగిస్తున్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు మరణశాసనాన్ని రాయడానికి అంతిమ పోరాటానికి నడుం బిగించారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా గాజా ప్రజలకు అనుకూలంగానే మారుతున్నాయి.

యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలో, లేబనాన్ హిజ్బుల్లా సంస్థ మధ్యధరా సముద్ర తీరంలో సంఘీభావ ప్రతిఘటనకి దిగుతున్నారు. మండే అరబ్ నగరాలలో, వెల్లువెత్తే యూరోప్ దేశాల వీధుల్లో, తుదకు అమెరికా విశ్వవిద్యాలయాల విద్యార్థి లోకంలో గాజా ప్రజల విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా జూన్ మూడవ, నాలుగవ వారాల్లో వెస్ట్ బాంక్ ప్రజల ప్రతిఘటనలో మౌలిక మలుపు కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వెస్ట్ బాంక్ కి చెందిన జెనిన్ నగరంలో కూంబింగ్ ఆపరేషన్ పేరిట ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టించే సమయంలో వారికి ఎదురైన నూతన తరహా సాయుధ ప్రతిఘటన అదో కొత్త పుంత తొక్కుతుందని అర్ధమౌతుంది.

హౌతీ గెరిల్లా సంస్థ నాలుగు రోజుల క్రితం స్వంతంగా ఉత్పత్తి చేసుకున్న సూపర్ సోనిక్ క్షిపణులతో హైఫా పోర్టు వద్ద గల నావల్ స్థావరం మీద దాడి చేసింది. అది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఎర్ర సముద్రం నుండి తన సైనిక చర్యల్ని హైఫా పోర్టు వరకు విస్తరించడం ప్రాముఖ్యత గల ఓ కొత్త ప్రతిఘటనా రూపం.

ఇదిలావుండగా, ఇజ్రాయెల్ అంతర్గత సంక్షోభంలో నేడు కొట్టుమిట్టాడుతోంది. అది యుద్ధ భారాల్ని మోయలేక తమ దేశ ప్రజల మీద ఆర్ధిక భారాల్ని మోపుతున్నది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంగా ప్రారంభమై, క్రమంగా సాంఘిక అస్థిరతకు దారితీస్తోంది. ఆ సాంఘిక సంక్షోభం ముదిరి రాజకీయ అస్థిరతకు క్రమంగా దారి తీస్తున్నది. ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభం వైపు ప్రయాణం చేస్తోంది. మొత్తం ఆరుగురితో ఉన్న యుద్ధ మంత్రివర్గం నుండి ఇద్దరు జూన్ మూడవ వారంలో యుద్ధం పట్ల అసమ్మతిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేశారు. జూన్ 22న మాజీ రాజధాని టెల్ అవేవీ లో లక్షన్నర మందితో ప్రదర్శన నిర్వహించి వెంటనే యుద్ధాన్ని ఆపాలని, ప్రధాని నేతన్యాహు రాజీనామా చేయాలని, పార్లమెంటు రద్దుచేసి తాజాగా ఎన్నికల్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూడో రోజే జూన్ 24 తేదీన ఇదే డిమాండ్లతో ప్రస్తుత రాజధాని జెరూసలేం లో ప్రదర్శకులు పోలీసుతో ఘర్షణకు కూడా దిగారు.

ఇదంతా ఒక ఎత్తు! జూన్ నెలలో గాజాలో ఇజ్రాయెల్ అనేక వరస ఎదురు దెబ్బలు తింటోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) పేరిట గల ఇజ్రాయెల్ సైన్యం నుండి నేతన్యాహు ప్రభుత్వం మీద యుద్ధ విరమణ కోసం తీవ్ర వత్తిడి వస్తోంది. మేం యుద్ధం చేయలేమని నిస్సహాయతని వ్యక్తం చేస్తున్నది. ఇటు పౌర ప్రభుత్వానికీ అటు సైన్యానికీ మధ్య వైరుధ్యం ఏర్పడి క్రమంగా పెరుగుతోంది. అది సైనిక తిరుగుబాటుకు దారి తీసే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

శ్మశానంలో సుప్తకంకాళాలు మేల్కొని నినదిస్తున్న స్థితిని ఒక సందర్భంగా ఒక విప్లవ కవి అంటాడు. ఇజ్రాయెల్ చే స్మశానంగా మార్చబడ్డ గాజా కూడా అదే ప్రతిఘటనా స్థితికి అద్దం పడుతోంది. సమాధుల్లో 38 వేల పాలస్తీనా అమరుల అమరత్వం ప్రతిఘటనకు సానారాయిగా మారుతోంది. విముక్తిపథంలో నేడు గాజా ప్రజలూ, యావత్తు పాలస్తీనా ప్రజలూ అడుగులు వేస్తుంటే, ఇజ్రాయెల్ రాజకీయంగా మరణోణ్ముఖ దారిలో నేడు అడుగులు వేస్తోంది. చరిత్రలో స్టాలిన్ గ్రాడ్, లెనిన్ గ్రాడ్, సైగాన్, బాగ్దాద్, ఫలూజా, రమాబి, బాకుబా, తిక్రీత్ తదితర నగరాల ప్రజలు సృష్టించిన ప్రతిఘటనా పోరాటాలు కొత్త చరిత్రను సృష్టించాయి. దురాక్రమణ దార్లకు, ఫాసిస్టు నాజీలకు రాజకీయ సమాధి కట్టాయి. ఆ చరిత్రను గాజా పునరావృతం చేస్తుందని ఆశిద్దాం. గాజా అజేయం. వీరోచిత పాలస్తీనా విమోచనా పోరాటం వర్ధిల్లాలి.



Read More
Next Story