తిరుపతికి కూత వేటంత దూరంలో ప్రకృతి పారవశ్యం
x

తిరుపతికి కూత వేటంత దూరంలో ప్రకృతి పారవశ్యం

తిరుపతి వేద విశ్వవిద్యాలయానికి ఎదురుగా, చెర్లోపల్లి రోడ్డు పక్కన అద్భుతమైన చిట్టడవి ఉంది. ఒక్క వాన చినుకుకి అడవంతా పచ్చబారింది. ఎంతటి ఆహ్లాదకరమైందో ప్రకృతి.


తిరుపతి వేద విశ్వవిద్యాలయానికి సరిగ్గా ఎదురుగా, చెర్లోపల్లి రోడ్డు పక్కన అద్భుతమైన చిట్టడవి ఉంది. అరవింద ఆసుపత్రి ఎదురుగా సైన్స్ సిటీ బోర్డు కింద (Science City) కింద మా స్కూటర్లు పార్క్ చేసి లోపలికి పొద్దున్నే ఆరుగంటలకంతా బయలుదేరినాము. ఈ దఫా మా శ్వేత సిబ్బంది, నా సహచరుడు శీనుతో కలిసి సూర్యోదయ ట్రెక్ చేసినాము. పొద్దు పొద్దునే అట్లా బయలుదేరటమే ఒక ఘనకార్యం.


ఇరవై సంవత్సరాలుగా నేనయితే ఈ ప్రదేశానికి తరచూ పోయి వస్తున్నాను. నాకు ఎంతో ప్రియమయిన ప్రకృతిశాల ఇది. ఒంటరిగానూ, పదిమందితోనూ పోయి వస్తుంట. ఎన్నడూ ఈ దారుల్లో నాకు మరొక్క మనిషి ఇంత వరకు కనిపించలేదు. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్ల అందమే అందము. వీటితో పాటు చింతచెట్లు, వేపచెట్లు, నీలగిరి చెట్లతో రకరకాల తాటిచెట్లు, కలబంద నన్నెప్పుడూ కనువిందు చేస్తూంటాయి. ఒక్క వాన చినుకుకి అడవంతా పచ్చబారింది. చింత చిగురు భలే చిగురించింది. తాటిచెట్లల్లో కాయలు మగ్గిపోతున్నాయి.


కొంచెం దూరం పోగానే నాలుగైదు జింకలు చెంగు చెంగున దూకుతున్నాయి. నెమళ్ళు, అడవి కోళ్ళ అరుపులు, కేకలు భలే పసందుగా ఉన్నాయి. మిత్రుడు కుమార్ ఫోటోలు తీయటానికి ఉబలాటపడుతుంటే, మా శీను వీడియోలకు వీడియోలు తీస్తున్నాడు. గీతాంజలి కూతురు హాసిత ఇట్లా ఓపెన్‌గా వీటిని చూడటంలో బాగా హుషారెత్తింది. లక్ష్మి నారాయణ, ఈశ్వర రెడ్డి, రెడ్డెమ్మ మౌనంగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలాజీ నిశబ్దంగా నడక.


ఇంకొంచెం దూరం పోగానే మందలు మందలుగా జింకలగుంపు ఎదురైంది. అందులో చాలా పిల్లలున్నాయి. ఈ జింకలు ఎప్పుడు, ఎక్కడ కంటాయో వాటిని ఎట్లా పెంచుతాయో కదా సార్ అని అంటున్నాడు శీను. అస్సలు ఈ జింక పిల్లలు పుట్టగానే నడుస్తాయా ఏమి అని మరొక మిత్రుని ప్రశ్న. నేను ఇంతకు మునుపు అనేక మార్లు వచ్చినా ఇట్లా మందలు మందలుగా చూడటం ఇదే తొలిసారి. ఇంతకు మునుపు పందుల మందను చూసి ఉన్నాను.


మధ్య దారిలోకి వస్తే చాలా విశాలమయిన ప్రాంతం కనువిందు చేస్తున్నది. వెదురు సంగీతం వీనుల విందుగా ఉంది. ఎంతటి ఆహ్లాదకరమయిందో ప్రకృతి. మరెంతటి మనోజ్ఞమయిన పచ్చటి తెరచాప. ఆ ప్రాంతమంతా రాళ్ల దారిలో ఉంది. ప్రాచీనకాలంలో కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా వచ్చి అలిపిరి మీదుగా తిరుమల కొండెక్కేవారని తెలిసింది. మధ్యలో మంచి కోనేరు ఉంది. అడుగంటిన నీరు పచ్చగా పాచిపట్టి ఉంది. కోనేరు నిండార ఉన్నప్పుడు, ఎండినప్పుడు చూసిన నాకు రుతువు రుతువుకు జరుగుతున్న మార్పు ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. ఈ కొనేరును చూసినప్పుడల్లా దీనికి దగ్గర్లో ఏదైనా గుడి ఉండేదని అనిపిస్తున్నది. ఐతే ఆ ఆనవాలు ఏమీ లేదు. గతకాలపు వైభవం మట్టి కొట్టుకు పోయినట్టు ఎన్ని పురాతన రహస్యాలు మరుగున పడిపోయినాయో కదా!


ఇదే దారిలో అప్పుడప్పుడు చిరుతపులి తిరిగేదని విన్నాను. అది ప్రస్తుతం ఈ దరిదాపుల్లో ఉన్నట్టుగా లేదు. ఆ పులి మాటంటే అందరూ ఉలిక్కి పడటం గమనించినాను. ఆ భయమేమిలేదని భరోసా చెప్పి ముందుకు కదలి ఆళ్వారు తీర్థపు పాయను చూపించినాను. చుక్క నీరు లేక విలవిలలాడుతున్నది. వానాకాలం ఇదే కాల్వ గొప్ప సౌందర్యంతో కళ కళ లాడుతుంటుంది. అలిపిరి 999 మెట్టుకు ఎడమ వైపున ఆళ్వారు తీర్థం వుంది. అక్కడ రామానుజాచార్యులు ధ్యానం చేసినట్టుగా కథనం. ఈ తీర్థం నుండే నీరు ఇక్కడికి జాలు వారుతూంటుంది.

అరుదుగా పెరిగే ఊడా చెట్టు కాయ (ఊడా కాయ)

అక్కడ నుండి కుడి పక్కకు దారి తీస్తూ ఆ ఏపు ఎర్రచందనపు చెట్ల మధ్య నడకే ఒక వరంగా ఫీల్ అవుతున్నారు మా వాళ్లు, చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందా తీరు. అక్కడనుండి శుద్దగుంట దాకా పోయినాము. పూర్వము తిరుపతిలో ఇళ్లు కట్టుకోవడానికి ఈ శుద్ధనే వాడేవారు. ఇక్కడ నుండి చూస్తే నాకెంతో అపురూపమైన గంటామంటపు కోస, గాలిగోపురం పసందుగా కనువిందు చేస్తున్నాయి.


శుద్దగుంట నుంచి తిరిగి వచ్చేటప్పుడు వెల్వెట్ పురుగులను ఎప్పుడో చిన్నతనంలో చూశాము మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు చూసి చాలా అబ్బురపడ్డాము. దాదాపు రానుపోను రెండు గంటల సేపు అంతా కలియతిరిగి వెనుతిరిగినాము. కొత్తగా వచ్చిన వారు మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనుకున్నారు. పరవళ్లు తొక్కే ప్రకృతి చమత్కృతికి అబ్బుర పడని వారెవరుంటారు? ఈ పొద్దు ఇట్టాంటి అద్భుతమైన ప్రకృతి విహారం చేసి అందరం తృప్తిగా ఇంటిదారి పట్టినాము.

Read More
Next Story