రాగిరొట్టె.. జొన్న రొట్టె.. బరువు తగ్గడానికి ఏది మేలు
x

రాగిరొట్టె.. జొన్న రొట్టె.. బరువు తగ్గడానికి ఏది మేలు

ఒకప్పుడు పేదల ఆహారంగా భావించే చాలా ఐటమ్స్ ఈవేళ అందరి మెనూగా మారాయి.


హైదరాబాద్ గోకుల్ నగర్ మూల మలుపు మీద ఓ చిన్న బండి వద్ద నిలబడిన జనంలో ఒకరు... “అక్కా, మూడు రొట్టెలు, పచ్చడి కొంచెం ఎక్కువగా వేయి”..

కృష్ణనగర్ గ్రీన్ బావార్చీ పక్కనున్న ఓ సెంటర్లో.. ఓ పెద్దాయనా.. రెండు నార్మల్, ఇంకో రెండు కొంచెం మెత్తగా కాల్చినవి ప్యాక్ చేయ్..

ఇందిరా నగర్ రోడ్ నెంబర్ 5లో ఓ ఇద్దరమ్మాయిలు.. సాయంత్రం వేళ జొన్న రొట్టెలు మాత్రమే అమ్ముతుంటారు..

విజయవాడ ఆటోనగర్ వంద అడుగుల రోడ్డులో కొంచెం లోపలికి వెళ్లిన తర్వాత మంజుల పుల్క కమ్ రోటీ సెంటర్ ఉంటుంది. అక్కడ నిలబడిన జనాలు.. ఏమండీ, 2 రెండు జొన్న రొట్టెలు, రెండు రాగి రొట్టెలు ప్యాక్ చేయండని ఒకరు, రాగి రొట్టెలు మాత్రమే రెండు అనే వాళ్లు మరి కొందరు..

తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న టీడీడీ సత్రాల మూలమలుపుల్లో ఓ టిఫిన్ సెంటర్ ఉంది.. దానికి పేరేమీ ఉండదు, అచ్చంగా జొన్న రొట్టెలు మాత్రమే తయారు చేస్తుంటారు. దానిలోకి రాయలసీమ తరహాలో చేసే ఉల్లి కారం ఫేమస్...

ఇలా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జొన్న రొట్టెలు (జొన్న చపాతీ), రాగి రొట్టెలు, రాగి సంగటి బడ్డీలు కనిపిస్తున్నాయి. వీధి మూలల్లోనో, పెద్ద సెంటర్లలోనో ఇలాంటి బండ్లు లేదా బండ్లు చాలా కామన్ అయ్యాయి. ఒక్కసారిగా వీటికింత గిరాకీ ఎందుకు పెరిగిందో చూద్దాం.

జీవన శైలిలో మార్పులు...

ప్రత్యేకించి కోవిడ్-19 అనంతరం నగర మధ్య తరగతి, సంపన్న వర్గాల జీవిన శైలి మారింది. బీపీ, షుగర్, గుండెపోటు, డయాబెటీస్, ఒబేసిటీ వంటి వాటి భయం పెరిగింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ప్రత్యామ్నాయ ఆహారంపై వెతుకులాట మొదలైంది. ఇందులో భాగంగా చిరు ధాన్యాలు, తక్కువ కార్బొహైడ్రేట్ డైట్ ( Low carbo diet), కషాయాలు, రొట్టెల సంస్కృతి పెరిగింది.

ఒకప్పుడు పేదల ఆహారంగా భావించే చాలా ఐటమ్స్ ఈవేళ అందరి మెనూగా మారాయి. దీనిలో భాగంగానే జొన్న, సజ్జ, రాగి రొట్టెలకు డిమాండ్ పెరిగింది. చిన్న చిన్న పుష్ కార్ట్స్ మొదలు కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ రొట్టెల్ని తయారు చేసి రెడీమేడ్ ఫుడ్స్ గా కూడా విక్రయిస్తున్నాయి.

పదీపదిహేను ఏళ్ల కిందట ప్రముఖ పారిశ్రామిక సంస్థ- నందీ పైప్స్ వారు- కేవలం 2 రూపాయలకే జొన్నరొట్టెల విక్రయాన్ని చేపట్టి ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా మానేశారు. రాయలసీమకు చెందిన ఆ సంస్థ తన సీఆర్ఎస్ లో భాగంగా పెద్ద వ్యాన్లలోనూ ఈ రొట్టెల్ని అమ్మింది.

ఇప్పుడా పనిని- గ్రామాల నుంచి వలసవచ్చిన- చాలా మంది స్వయం ఉపాధి కింద రొట్టెలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో రొట్టె ధర పది నుంచి 20 రూపాయల మధ్య ఉంది. గుంటూరులో 10 రూపాయలుగా ఉన్న జొన్న, రాగి రొట్టెలు విజయవాడ, హైదరాబాద్ లో రూ.15 నుంచి రూ.20 మధ్య ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రాలో అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే బంజారాలు పట్టణాలకు వలస వెళ్లి రొట్టె సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో బంజారాలు, రైతు కూలీలు జొన్న రొట్టెలను గుండ్రంగా, ఆకర్షణీయంగా చేసే వారిగా పేరు పొందారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన జొన్న రొట్టె, ఇప్పుడు సంపన్నుల ప్లేట్లలోనూ విందులు, వినోదాల్లోనూ ఓ ఫుడ్ ఐటమ్ గా చేరిపోయింది.

అభిప్రాయలు ఇలా...

“గ్రామాల్లో పేదవాడి ఆహారం, పట్టణాలలో ధనికుల ఫ్యాషన్” అంటోంది నర్సాపురంలోని బంజారా మహిళ లచ్ఛమి. “మేము మా ఊర్లో జొన్న రొట్టె తినేవాళ్లం. కానీ పట్టణానికి రాగానే, ఇదే రొట్టె డాక్టర్లు సూచించే ఫుడ్ అయింది. ఇప్పుడు ఒక రొట్టెకు పది రూపాయలు వస్తున్నాయి. రోజుకి 150 నుంచి 200 రొట్టెల వరకు వేస్తాను. మా ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ దీని వలన నెరవేరుతున్నాయి” అని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కోయిల్ నుంచి కేపీహెచ్బీ 9th ఫేజీలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా ఉంటూ సాయంత్రం వేళ రొట్టెలు అమ్ముతున్న తిరుపతమ్మ చెబుతోంది.

నగరవాసుల కొత్త అలవాటు..

హైదరాబాద్‌ లో ఉంటున్న ఓ ఐటీ ఉద్యోగి శ్రీనివాస్.. “ఆఫీసు నైట్ టైంలో ఇంతకుముందు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినేవాళ్లం. ఇప్పుడు మేమందరం ఈ రొట్టె బాక్సులు ఆర్డర్‌ చేస్తాం. తిన్నాక లైట్‌గా ఉంటుంది, నిద్ర రాదు. బరువు కూడా తగ్గింది” అంటారు.

విజయవాడలో డయాబెటిస్‌తో బాధపడుతున్న పద్మావతి ఏమంటున్నారంటే.. “డాక్టర్ రైస్ తగ్గించమన్నాడు. ఇప్పుడు రాత్రి భోజనం రాగి రొట్టెతోనే. ఆకలి ఎక్కువగా రాదు, బరువు కూడా నియంత్రణలో ఉంది... ” అన్నారు.

పెళ్లిళ్లలోనూ రొట్టెలు...

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇటీవల పెళ్లిళ్లు కూడా ఆర్గానిక్ పద్ధతిలో జరుగుతున్నాయి. చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి పెద్ద నగరాలలో ప్రస్తుతం ఇతర మెనూతో పాటు రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి సంగటి వంటి వాటి కోసం వెతుక్కుంటున్నారు. “మా కొడుకు పెళ్లిలో ప్రత్యేకంగా రొట్టె మాస్టర్లను పల్లె నుంచి పిలిపించాం. రోటి పచ్చడి, జొన్నరొట్టె పెట్టాం. అందరూ రొట్టె తిన్నాకే వెళ్లిపోయారు” అని గుంటూరు రైతు పి.రాంబాబు గర్వంగా చెబుతున్నారు.

రొట్టెను ఎలా తయారు చేస్తారంటే..

జొన్నలు కూడా రెండు రకాలుండేవి. తెల్లజొన్నలు, పచ్చజొన్నలు. తినడానికి ఇప్పుడు ఎక్కువ భాగం పచ్చజొన్నలే. ఎండలో రెండు రోజులు బాగా ఎండనిచ్చిన తర్వాత పిండి మర కి తీసుకెళ్లి పిండి చేయించేవాళ్లు కొందరుంటే కొందరేమో నేరుగా షాపుల నుంచే పిండి కొనుగోలు చేస్తున్నారు. ఆర్గానిక్ షాపులు కూడా బాగానే వెలిశాయి. కేజీ పిండి రూ.40 నుంచి రూ.60 వరకు ఉంది. 1 కేజీ పిండితో సుమారు 30 రొట్టెలు వస్తాయి.

హైదరాబాద్ కృష్ణనగర్ లో అచ్చంగా జొన్న రొట్టెలు మాత్రమే తయారు చేసి విక్రయించే కిష్టమ్మకి రొట్టెల తయారీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. ముందుగా ఓ కేజీ జొన్న పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో వేడినీళ్లను పోసి కలుపుతుంది. ఆ తర్వాత ఓ గంటకి పైగా నానబెడుతుంది. ఈమె కట్టెల పొయ్యి మీదనే తయారు చేస్తారు. మంట బాగా పైకి వచ్చే వరకు ఆగి అప్పుడు పేనం పొయ్యి మీద పెట్టి 30,35 గ్రాముల పిండిని తీసుకుని గుండ్రంగా ఉండలు తయారు చేస్తారు. చేత్తోనే పీట మీద పిండిని ఒత్తి గుండ్రంగా రొట్టెను తయారు చేసి ఇస్తారు. ఈమె కూర అమ్మదు. రొట్టెలు మాత్రమే అమ్ముతారు. ఒక్కో రొట్టె రూ.20.

ఇక విజయవాడలో ఆంధ్రా గో పుష్టి నిర్వాహకురాలు విజయలక్ష్మీ చెప్పే కథనం వేరుగా ఉంది. ఇది ఆర్గానిక్ ఫుడ్ స్టాల్. సొంతంగా వాళ్ల పొలంలోనే ఆమె జొన్నలు, రాగులు పండించి వాటితోనే రొట్టెలు తయారు చేస్తారు. వీటి ఖరీదు ఎక్కువ. రెండు జొన్న రొట్టెలు (పెద్దవి) ప్లస్ కర్రీ కలిపి రూ.80. రాగి రొట్టెలు లేదా సంగటి అయితే రూ.100. సహజ ఉత్పత్తులు కనుక రేటు ఎక్కువ. తయారీ కూడా ట్రెడిషినల్ గానే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా ఇక్కడ బాగానే కొంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే తీరు ఎక్కువగా ఉంది.

ఇదే గుంటూరులో ఓ సాదాసీదా రొట్టెలమ్మే చాయమ్మ రూ.10 లకే రొట్టెలు అమ్ముతారు. ఇవి కొంచెం గట్టిగా ఉంటుంటాయి. కాల్చడంలో తేడా వల్ల అలా ఉంటుందని ఆమె చెప్పారు. అయితే వీటికి కూడా గిరాకీ బాగానే ఉంది. రూ.10 రొట్టె రూ.10 కూర.. కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు.

పోషక విలువలు ఎలా ఉంటాయంటే...

హైదరాబాద్ లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (National Institute of Nutrition – NIN) శాస్త్రవేత్త దినేష్ జీ (రిటైర్ట్డ్) చెప్పిన దాని ప్రకారం ఈ రెండు రొట్టెల్లో పోషకాలు ఇలా..

జొన్న రొట్టె: ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. మజిల్స్ బలం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఆకలిలో హెచ్చుతగ్గులు (పీక్స్) రాకుండా కాపాడుతుంది.

రాగి రొట్టె పోషక విలువలు

కాల్షియం అత్యధికంగా ఉంటుంది – ఎముకల బలానికి అద్భుతంగా పనికి వస్తుంది. ముఖ్యమైన అమినో ఆమ్లాలు, అధిక ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరగడం వల్ల చిన్నచిన్న స్నాక్స్ పదే పదే తినాల్సిన అవసరం ఉండదు. తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండటంతో రక్త చక్కెర నియంత్రణకు ఉత్తమం.

బరువు తగ్గడంలో...

జొన్న: ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల lean muscle కాపాడటానికి అనువైనది. త్వరిత బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రాగి: పొట్ట నిండుగా ఉంచుతుంది, ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఒక రోజు జొన్న, మరో రోజు రాగి తింటే సమతుల్య పోషకాలు లభిస్తాయి, బరువు తగ్గడంలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ సులభతరం అవుతుంది.

జొన్న, రాగి రొట్టెల పునరాగమనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే అవగాహనను గుర్తు చేసింది. ఒకప్పుడు పల్లెల గుడిసెలో పొయ్యి మీద దొరికే ఈ రొట్టె, ఇప్పుడు పెళ్లిళ్ల పీటలపైనే కాదు—మధ్యతరగతి డైనింగ్ టేబుల్ మీద కూడా దర్శనం ఇస్తున్నాయి.

Read More
Next Story