ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, వర్ధిల్లాలి, ఎందుకంటే....
x

ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, వర్ధిల్లాలి, ఎందుకంటే....

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు: 9. ప్రభుత్వ పాఠశాలలులేకపోతే నయీమ్, మోక్షిత, నితన్ లాంటి పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రైవేట్ పాఠశాలలు చేర్చుకుంటాయా? శ్రద్ధ వహిస్తాయా?

పిల్లలను గురించి బాగా తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబాలని ఎరిగి ఉండాలి. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు,తాతలు అవ్వలు అందరిని.

నా భవిష్యత్తు విద్యార్థుల గురించి నేను బాగా తెలుసుకునే కొద్ది వాళ్లు ఇళ్ల దగ్గర కోల్పోయిన బాల్యాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వడమే నా ప్రధాన కర్తవ్యాల్లో ఒకటిని నాకు నమ్మకం ఏర్పడింది. .......వి. సుహోమ్లీన్ స్కీ.

(మకారెంకో, సుహోమ్లీన్ స్కీ,యానుష్ కోర్ చక్,క్రూపస్కయ, స్టనిస్లావ్ స్కీ..... వీరందరు రష్యన్ విద్యావేత్తలు, రచయితలు. మొదటి ప్రపంచ యుద్ధము, రష్యన్ విప్లవము, రెండవ ప్రపంచ యుద్ధము, నాజీలతో సోవిట్ ప్రజల యుద్ధాలతో, తల్లిని, తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు, వారి బాల్యం,పేదరికం,అనారోగ్యాలు. ఆ యుద్ధాల మాయని మచ్చలు, మానని గాయాలతో రష్యన్ సమాజం ఉంది. ఈ విద్యావేత్తలందరూ విద్యకు గల మహత్తర శక్తిని దృఢంగా విశ్వసించారు. పాఠశాల పూర్వపు, ప్రాథమిక విద్యా సంవత్సరాలు ఒక వ్యక్తి భవిష్యత్తుని అధిక భాగం నిర్ణయిస్తానే దృఢమైన విశ్వాసంతో పనిచేశారు. సోవియట్ కమ్యూనిస్టు ప్రభుత్వము కూడా డే కేర్, సమిష్టి, ఆనంద, దేశభక్తియుత విద్యా విధానానికి ప్రాధాన్యతనిచ్చింది. మకరెంకో విద్యార్థులే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, దేశభక్తితో సాహాస పూరిత మహత్తర విజయాలను సాధించారు) ఇప్పటికీ రష్యా , జర్మనీ, సౌదీ, అమెరికా లాంటి దేశాల విద్యా విధానం ప్రభుత్వంలో ఉండగా మన విద్యా విధానం కార్పొరేట్ కు పరుగులెత్తుతుంది. అంతేకాదు దేశ, రాష్ట్రాల విద్యా విధానం బూజు పట్టి కునారీలుతున్నది. ఎందుకు? సాధ్యమైనంతవరకు అక్షరాలు, విషయాలు విద్యార్థుల బుర్రల్లోకి చెప్పించాలని చూస్తున్నారేందుకు? మార్కులు, గ్రేడ్లు, ఇంగ్లీషు కొలమానంగా స్కేల్ బద్దతో కొలుస్తూ, సమిష్టి ఆలోచనగా కాకుండా వ్యక్తి ప్రధానoగా విద్యా విధానం రూపొందుతుంది. అమెరికా కలలతో కొనసాగుతుంది.

అసలు ప్రభుత్వ పాఠశాలలకు ఏ కుటుంబాల నుండి ఎలాంటి పిల్లలు వస్తున్నారు? వాళ్ల పరిస్థితి ఏంటి? చదువులో ఏ తరం వారు ఉన్నారు? అన్న అవగాహన ఉపాధ్యాయలకు? అధికార గణానికి ఉందా? ఐఏఎస్ నాగార్జున గారు (మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ పెట్టి ఇప్పటికీ పాఠశాలలకు రాకుండా గొర్రెల మేకల కాస్తున్న పిల్లలను ఓ ఉద్యమంలా పాఠశాలలో చేర్చి విద్యను అందిస్తున్న) నీ పిల్లలకు, నా పిల్లలకు ( చదువులో మూడోతరం) చదువు చెప్పడం గొప్ప కాదు. పాఠశాలకు వస్తున్న మొదటితరం పిల్లలకు చదువు చెప్పటమే నీ టాలెంట్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్న ఇంకా మొదటితరం ఉందంటే మనoదరం సిగ్గుపడాల్సిందే.

బ్రతుకుతెరువు కోసం వృత్తిలో చేరిన ఉపాధ్యాయ, అధికారులే ఎక్కువ శాతం. వీరికి మించి అధికార దాహంతో సింహాసనాలెక్కిన రాజకీయ నాయకులు. కనుకనే మన విద్యా విధానం సృజనాత్మకంగాలేదు. చదువుతోపాటు వ్యక్తిత్వ పెంపకం కూడా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలోనే కొనప్రాణంతో సాగుతున్న విద్యా విధానంలో, ఉసుళ్ళ పుట్టల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్య ఉంటుందా!

నయీమ్, మోక్షిత, నితన్ లాంటి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు చేర్చుకుంటాయా? శ్రద్ధ వహిస్తాయా? అయ్యో! నయీమ్, మోక్షిత, నితిన్ ల గురించి చెప్పలేదు కదూ!

నయీం మెంటల్లీ రిగార్డ్, హైపర్ యాక్టివ్. తిన్నగా ఓ చోట కూర్చోడు. చెప్పినది అర్థం చేసుకోలేడు. తిరిగి చెప్పలేడు. ఎవర్నో ఒకర్ని పీకుతాడు.లాగుతాడు.అయినా నయీమ్ లో స్పెషల్ టాలెంట్ మ్యూజిక్ను బాగా ఆస్వాదిస్తాడు. డప్పు, డోలు ఎక్కడ మోగుతుంటే అక్కడకు పరుగులు తీస్తాడు. డప్పు, డోలు అద్భుతంగా వాయిస్తాడు. దీనిలో రాణిస్తాడు డప్పు కొనిపెట్టండని నయీమ్ అమ్మ నాన్నలతో, అన్నతో పదే పదే చెప్పాను. నేను కొని పెడదామని ఎంక్వైరీ చేయగా విజయవాడలో దొరుకుతాయి అన్నారు. సంవత్సరం పాటు డప్పు తెప్పించడానికి నాకు వీలు కాలేదు. నయీమ్ నాన్న తేవడం, పగలగొట్టడం కూడా అయిపోయింది. నయీమ్ నాకు బాగా అలవాటయ్యాడు. రూమ్ లో ఉన్నంతసేపు కూర్చునేవాడు. గోడల మీద ఉన్న చార్టులు పీకేవాడు. రెండో టీచరు అసలు రానిచ్చేది కాదు లోపలకు. వరండాలో తిరిగి నా దగ్గరకు వచ్చేవాడు. కొద్దిసేపు మాట్లాడి ఓ చాక్లెట్ ఇస్తే ఆడుకునేవాడు. బయటికి పోకుండా వరండా అనే జైలు ఉండేది.

జైలు అంటే? మా పాఠశాలలో రెండు పెద్ద పెద్ద గదులు ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాతనే ఆ రెండు గదుల ఎదురుగా ఉన్న పెద్ద వరండాకి కోళ్ళు, కుక్కలు దూరకుండా, గేదెలు కట్టేయకుండా గ్రిల్స్ పెట్టించాను పాఠశాల అకౌంట్ బ్యాంకులో మురుగుతున్న డబ్బులతో. భోజనం అప్పుడు పడమటి గాలికి దుమ్ము వచ్చి పళ్లేల నిండా పడేది.పడకుండా ప్లేట్స్ ఒళ్ళో పెట్టుకొని వాలమనేదాన్ని. దుమ్ముదూళి రాకుండా రెండు అడుగుల ఎత్తున గోడ పెట్టి గ్రిల్స్ పెట్టాం. నయీమ్ పోకుండా గ్రిల్స్ కు రెండు వైపులా గడులు వేయటం విద్యార్థులందరూ అలవాటు చేసుకున్నారు. పొరపాటున నయీమ్ బయటకు పరిగెత్తితే విద్యార్థులు పట్టుకొచ్చేవాళ్లు. మా గ్రిల్స్ నయీమ్ కు బాగా ఉపయోగపడ్డాయి.

నయీమ్ వాళ్ళ అమ్మ, నయీమ్ తో, మంచం లో ఉన్న వాళ్ళ తాత తో ఇంటి పనితో సతమవుతమవుతుంది టీచరుగారు బాగా చూస్తారని మా పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే ఉమామహేశ్వరి నయీo వాళ్ళ అమ్మకి చెప్పింది. నయీమ్ గురించి నాకు చెప్పింది.(నాకు కొంత తెలుసుకాని, ఇంత మైల్డ్ అని తెలియదు.జనాభా లెక్కలు రాసుకుంటూ 5 సంవత్సరాలు నిండలేదు కాబట్టి అంగన్వాడీలో చేర్చమని చెప్పాను) నయీమ్ వాళ్ళ అమ్మ చేర్పించుకుంటారా అని దిగులుగా అడిగింది. చేర్పించుకుంటాను. పాఠశాలకు నీటుగా పంపించు అన్నాను. నీకు కొంత వెసులుబాటు ఉంటుంది. అన్నం తిన్న తర్వాత తీసుకెళ్ళు. రోజంతా స్కూల్లో ఉండడం అంటే ఇబ్బంది పడతాడు. మా స్కూల్ పిల్లల చదువుకు కూడా ఇబ్బంది అన్నాను. సంతోషంగా ఒప్పుకుంది. నయీమ్ కు అంగన్వాడీ కూడా అలవాటు కాలేదు. నయీమ్ వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం.. నయీమ్ ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండడు.

నయీమ్ పరుగులతో ఉంటే మోక్షిత కుర్చీలో నుంచి కదలలేని, చూపు వినికిడి తక్కువగా, అంటే 80% డిజేబుల్ చైల్డ్. ఫైవ్ ప్లస్ పిల్లల్ని అంగన్వాడీలో ఉంచుకోకూడదు టీచర్ గారి దగ్గర చేర్చమన్నారు. ఈ అంగన్వాడి నా రూమ్ (మా పాఠశాలదే) వెనకే నాలుగు మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అంగన్వాడిలో ముగ్గురు టీచర్లు, ఇద్దరు ఆయాలు ఉంటారు. పేరు రాసుకుంటాను. నా వెనకే కాబట్టి మీ దగ్గరే ఉండనివ్వండి అన్నాను. సరే అన్నారు. కాని మోక్షిత అమ్మని ప్రెజర్ పెట్టారు టీచర్ గారి దగ్గర వదిలిపెట్టు అని. దానితో నా దగ్గరే కూర్చోపెట్టుకుంటున్నాను. బండిమీదనో, ఎత్తుకొనో వచ్చి కుర్చీలో కూర్చో పెట్టేవాళ్ళు. నీళ్ళు తాగడం కోసం ఓ పాలడబ్బా, తినడానికి చిన్న గిన్నె తెచ్చేవాళ్ళు. మోక్షిత కు అప్పుడప్పుడు మోషన్స్ అయ్యేవి. రూమ్ లో ఉండలేక పోయేవాళ్ళం. అందుకే అంగన్వాడి వాళ్లు ప్రెజర్ పెట్టారు. మాకు ఆయాలు లేరు కనుక ఫోన్ చేస్తాము. పిల్లలను పంపిస్తే ఊరికే ఊరిలో తిరుగుతున్నట్టుగా ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేస్తారని,మీరు ఎక్కడ ఉంటారో వెతకడం ఇబ్బంది అని కూడా వెంటనే ఫోన్ కొనుక్కోండి అని చెప్పాను. అప్పటివరకు మోక్షిత నాన్నకే ఫోన్ ఉంది. మోక్షిత అమ్మ కొంటానని ఒప్పుకుంది. పెద్దగా ఫోన్ చేయాల్సిన అవసరం రాలేదు. డైపర్స్ వేసి పంపించేది .

మరుసటి సంవత్సరo లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా ఈమెనే (ఒప్పించాను) ఉంది. మోక్షితని మోయలేక మోయలేక తీసుకొచ్చేది వాళ్ళ అమ్మ శ్రావణి. పాఠశాలకు ఇల్లు కొంచెం దూరం. పెద్దైనా,లావు అయినా మోయటం ఇబ్బంది అని ట్రై సైకిల్ కొనమన్నాం. ట్రై సైకిల్ అయితే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే విద్యార్థులైన నేట్టుకుంటూ వస్తారని కూడా చెప్పాం. మోక్షిత లేచిన దగ్గరనుంచి బడికి పోతా, బడికి పోతా అని గోలపెట్టేదట. 9 కి ముందే తీసుకొచ్చేవాళ్ళు. ఈ ట్రై సైకిల్ కొనలేకపోయారు.వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబమే. మోక్షిత నాన్న బేల్దారి పని చేసేవాడు. ఫ్రీగా ఇచ్చే ట్రై సైకిల్ కోసం నేను, అలాంటి పిల్లలకు చదువు చెప్పే టీచరు (మండలానికి ఒక్కళ్ళు ఉంటారు) చాలా ప్రయత్నించాం. అప్పుడంతా కాలేదు. నేను వచ్చిన తర్వాత ట్రై సైకిల్ ఇచ్చామని ఆమాస్టార్ గారు ఫోన్ చేసి చెప్పారు. మోక్షిత కి పెన్షన్ కూడా లేదు. సర్టిఫికేటు తీసుకోవడం సరిగ్గా రాక. డిజేబుల్ అని చెప్పడం ఇష్టం లేక సర్టిఫికేట్ (అప్పుడు పెన్షన్ 200 లే) అలా తీసుకున్నారని అంగన్వాడి వాళ్ళు అంటారు. 2019 నాటికి పెన్షన్ 3000. పిల్లలను చూసుకుంటూ ఇద్దరు (నయీమ్, మోక్షత వాళ్ళ అమ్మలు) ఇంటి దగ్గరే ఉంటారు. మీకు కాకపోయినా పిల్లల ఖర్చులకు ఉంటాయి సర్టిఫికెట్లు సరిగ్గా రాయించుకొని తీచుకోండి అని చెప్పాను. ఇపడైతే 6000.

ఇద్దరమ్మలు, వీళ్ళ పరిస్థితి ఏమిటా అని దిగులుగానే ఉండేవాళ్ళు. మోక్షితయితే ఒక్కతే. మరొకరి కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండేవాళ్లు. చాలా డబ్బు పెట్టారు కూడా. 20 తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. చాలా హ్యాపీగా ఉన్నారు.. మోక్షతని మాత్రం అశ్రద్ధ చేయొద్దని చెప్పాను.

మోక్షిత నా టేబుల్ పక్కనే కుర్చీలో కూర్చునేది. సంతోషం ఆనందం వస్తే చేతులు పైకి ఎత్తి ఊగేది. కుర్చీ పడిపోకుండా టేబుల్ కానిచ్చి ఉండేది. టీచరు టీచరు, అన్న, అక్క అంటూ కబుర్లు చెప్పేది. కొంతమంది పేర్లు కూడా గుర్తు ఉండేవి. ఎక్కువగా ఓరల్ గా అక్షరాలు, నంబర్స్, పాటలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా చెప్పేవాళ్లు. నచ్చిన పాటలు, తప్పులుతడకలతో 100 వరకు ఒంట్లు, ఏ బి సి డి లు, తెలుగు అక్షరాలు చెప్పేది. పలక మీద రాయమంటే మాత్రం మహా బద్ధకం. చదువుతో మోక్షిత ఆనందాన్ని ఎందుకు పాడు చేయాలి శ్రావణి, ఇంటి దగ్గరన్న కొద్దిగా చదువు చెప్పమ్మా అనేదాన్ని. నయీమ్ కి చెప్పడం పిల్లలకు వచ్చేది కాదు. నయీం రెండు చేతులు పట్టుకుని(అలా పట్టుకోవడం నయీమ్ కు ఇష్టం) పలికించినా తల ఊపేవాడు. అన్నం తిన్నావా? ప్యాకెట్ తిన్నావా? లాంటి మాటలు అడిగితే తల ఊపుతూ ఓ ఐదు నిమిషాలు నా దగ్గర ఉండేవాడు. చేతులు లాక్కొని వెళ్లి మళ్ళీ వస్తుండేవాడు. నేను సెలవు పెట్టిన రోజు నయీమ్ కు కూడా సెలవే. అవతల టీచర్ లోపలికి కూడా రానిచ్చేది కాదు. మోక్షిత మా టీచర్ గారికి ఏమైంది? ఎందుకు రాలేదు? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశ్నలతో బుర్ర తింటుందండి అనేది వాళ్ళ అమ్మ. అందుకని శేలవని అనుకుంటే ముందుగానే చెప్పేదాన్ని.

నేను కుర్చీలో కూర్చున్న శబ్దం అయితే టీచరు ఏం తింటున్నావు అని అడిగేది మోక్షిత. ఉదయం 7: 45 కి బయలుదేరేదాన్ని. పిల్లలకు వర్కులు ఇచ్చి ఎప్పుడు వీలైతే, ఆకలి వేస్తే అప్పుడు తినేదాన్ని, పిల్లలందరికీ డయాబెటిక్ అని అర్థం చేయిOచి. మోక్షిత కి చిన్న చిన్న ముక్కలు గిన్నెలో పెడితే చిన్న చిన్నగా తినేది. బాగుంది లేనిది కూడా చెప్పేది. నయీమ్ పెద్దగా తినడు. నేల మీద వేసి పాడు చేస్తాడు. ఇష్టం లేకపోతే తీసుకోను కూడా తీసుకోడు. షుగరు డౌన్ అయ్యి పడిపోతే ఏడవకండి, నోటిలో పంచధార (బీరువాలో ఉండేది) వేయండని కూడా పిల్లలందరికీ అర్థం చేయించేదాన్ని. ఓ సందర్భంలో ఏదో చర్చ వచ్చి అరేయ్ మీరు దొంగ ప్రేమ నటిస్తున్నారురా! నేను చచ్చిపోతే ఎలా ఏడుస్తారు చెప్పండి అన్నాను. పిల్లలందరూ అద్భుతమైన రాగాలాపన చేశారు. నాకైతే నవ్వు ఆగలేదు. ఇప్పటికీ నవ్వుకుంటాను. ఇలా బ్రతికి ఉండగానే "చావుల" రాగాలాపన వినే అదృష్టం, సంతాపం సభ చూసే అదృష్టం ఎవరికి ఉంటుంది? చెప్పండి. ఒక్క ఉపాధ్యాయులకు తప్ప. ఇంతకన్నా ఇంకేం కావాలి? జీతం వచ్చిన రోజు కన్నా ఎక్కువ ఆనందం పొందాను. ఇద్దరూ మధ్యాహ్న భోజనం లోని ఎగ్స్ వరకు తినేవాళ్లు. ఇళ్లకు తీసుకెళ్లేవాళ్ళు.

వీరిద్దరే కాదు. మా పాఠశాలలోనే లోకేష్ వైష్ణవి(అన్నా చెల్లెళ్ళు) (వీరి బాబాయి కొడుకు) నితిన్, యశ్వంత్ ,జ్వాలా చైతన్య (అన్నదమ్ములు) కుమారి, సాయి కల్పనా. ఆ ఊరిలో ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. వీరే కాదు. తల్లి లేని (రూప, రాము అన్నా చెల్లెళ్ళు) తండ్రి లేని నందిని వెంకటేష్ (అక్కాతమ్ముడు), తాగుబోతు తండ్రులున్న అన్నమయ్య చిరంజీవి(అన్నదమ్ములు) శివ పార్వతి, వాళ్ళ చెల్లెలు. బడి అంటే ఇష్టం లేని శ్రావణి

వీరందరి చదువు పట్ల శ్రద్ధ తీసుకొని సమిష్టి విద్యా విధానం, వ్యక్తిత్వ ప్రధాన విద్యా విధానం వైపు గా అభివృద్ధి చెందాలంటే సోషలిస్ట్ రష్యాలో లాగా మన విద్య వ్యవస్థలోనూ మకారెంకో, సుహోమ్లిన్ స్కీ,యానుష్ కోర్, క్రూపస్కయ, స్టానిస్లావ్ స్కీ లాంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు చాలా అవసరం.

ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారగణం, బెల్లు, బిల్లు, వారి పిల్లల శ్రేయస్సు, చదువు మాత్రమే చూసుకునే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గముతో మన విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. ఈ దేశ భవిష్యత్తు సంపద పిల్లలు అని మరిచి, పిల్లల కన్నా ఓటర్లను, ఓట్లను చూసుకునే ప్రభుత్వాలు. భూములు, ఇళ్ళు, లారీలు, ప్లాట్లు ఉన్నవాళ్లు. ఇక్కడ, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలున్న తల్లిదండ్రులు కూడా తెల్ల కార్డులకు, పెన్షన్లకు ఉచితాలకు ఎగబడే జనాభా ఉన్నంతకాలం మన విద్యా వ్యవస్థ బూజు పట్టిన భావాలతో, కుంటినడక నడుస్తూ తిరోగమనములోనే ఉంటుంది.

30 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో ఇలాంటి పిల్లలు. గ్రేడ్లు ర్యాంకులు వస్తాయా? వీరే కాదు. వీరికి ముందు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు ఆ ఊర్లో. ఇక్కడ ఎందుకు ఇలాంటి పిల్లలు ఉన్నారు? మేనరికాలా? అనే ఎంక్వయిరీ మొదలుపెడితే ఎవరిది మేనరికం కాదు. దగ్గర బంధువులు కూడా కాదు. డబ్బుల కోసం పై పిల్లలను చేర్చుకున్నా మోక్షిత, నయీములను కార్పొరేట్ పాఠశాలలు చేర్చుకుంటాయా? మా టీచర్లు కూడా కొంత మంది పేర్లు చేర్చుకుంటారు కాని బడికి రానివ్వరు.

ఈ పిల్లలే కాదు అద్భుతమైన తెలివి ఉన్న పిల్లలు, పనిచేసే పిల్లలు, అబద్ధం ఆడని పిల్లలు, ఓ చిన్న బూతు మాట్లాడని పిల్లలు అధికారుల ముందు మన పరువు నిలబెట్టే పిల్లలు ఉన్నారు. వీరి గురించి చెప్పుకోవాలి.

ఈ పిల్లల కబుర్లతో యదానికా 10 లో కలుద్దాం.

Read More
Next Story