మేడ్చల్ జిల్లాలో ఇంకా బతికున్న పురాతన సమాధులు
x

ఈ రాతి వలయం పురాతన సమాధి స్థలం

మేడ్చల్ జిల్లాలో ఇంకా బతికున్న పురాతన సమాధులు

మేడ్చల్ జిల్లాలో ఇంకా బతికున్న సమాధులు. పదుల కొద్దీ సమాధులు ఇంకా ఇక్కడ వున్నాయి. ఈ సమాధులు మన పుర మానవుల చరిత్ర పేటికలు


మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని అద్రస్ పల్లెలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు పెద్దరాతియుగం (మెగాలిథిక్) సమాధులను గుర్తించారు. అదే విధంగా బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్ ఆ పరిసరాల్లో మెన్హర్లను కూడా పరిశీలించారు. ఈ సమాధులను 17.625524 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.686504 డిగ్రీల తూర్పు రేఖాంశంపై గుర్తించారు. సభ్యులు గుర్తించిన ఒక మెగాలిథిక్ సమాధికి 18 బండరాళ్ళు గుండ్రంగా పాతివున్నాయి. మధ్యలో సమాధికి సంబంధించిన పలకరాళ్ళు (ఆర్ధోస్టాట్స్) పైకి కనిపిస్తున్నాయని, ఇది సిస్ట్ బరియల్(పెట్టె సమాధి) అని, పరిసరాల్లో ఉన్న మెన్హర్లు 12 నుంచి 14 అడుగుల ఎత్తు కలిగివున్నాయని, ఇక్కడ పెద్దఎత్తున సమాధులున్నాయని ఈ మెన్హర్లు సూచిస్తున్నాయని చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.


తెలంగాణలో కనీసం పది లక్షల బృహత్ శిలాయుగపు సమాధులు ఉండి ఉంటాయని అప్పటి హైదరాబాద్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యులు ఈహెచ్ హంట్ అనే యూరోపియన్ పరిశోధకుడు తను 1925లో రాసిన గ్రంథంలో పేర్కొన్నారు. గడిచిన వందేండ్లలో నగర విస్తీర్ణం, వ్యవసాయానికి భూముల సాగు, అడవుల నరికివేత, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలవల్ల లక్షల్లో ఈ సమాధులు అదృశ్య సమాధుల జాబితాలో చేరిపోయాయి. ఎక్కడైనా కనపడుతున్నాయంటే ఇంకా మెగాలిథిక్ సమాధులు బతికున్నాయని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. తరాలుగా అలలు, అలలుగా తెలంగాణకు వచ్చిన వేర్వేరు సంస్కృతుల పురామానవులు నిర్మించిన ఈ సమాధుల్లో వైవిధ్యం, చారిత్రక గమనం అగుపిస్తాయి. వీటిని ఇంకా పూర్తిగా తవ్వకాలు జరిపి పరిశోధనలు చేయలేదు. మచ్చు తవ్వకాలు వేళ్ళ మీద లెక్కపెట్టేటన్నే వున్నాయి.


‘‘ఇటీవలి కాలంలో మేడ్చల్ జిల్లాలో మా బృందం చేసిన అన్వేషణల్లో పదుల సంఖ్యలో రాతిచిత్రాలు, పెట్రోగ్లైప్స్, పెదరాతియుగం సమాధులు, రాతిపనిముట్లు గుర్తించడం జరిగింది. మన పూర్వీకుల జీవనం తెలిస్తేనే మన చరిత్ర సంపూర్ణం అవుతుంది. మన చరిత్ర, సంస్కృతి మూలాలు ఇక్కడ భద్రపరచి ఉన్నాయి. వాటిని పరిశీలించి, పరిశోధించడానికి సమాధులను రక్షించాలని తెలంగాణ వారసత్వ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం నివేదిస్తున్నది’’ అని చరిత్ర బృందం తెలిపింది.

పరిశీలన, పరిశోధన: అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్, 9398654646, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు

చారిత్రక కథనం: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Read More
Next Story