రామాయణ, భారతాల్లో స్త్రీ, పురుషుల పేర్లు ఏం చెబుతున్నాయి?
రామాయణంలో నిరుత్తరకాండ-22: కోసలకు చెందిన’దని చెప్పే కౌసల్య అనే పేరు, ఆమె వేయి గ్రామాల సమాచారం ఆమె మాతృస్వామిక నేపథ్యాన్ని సూచిస్తే; దశరథుడు ఎవరై ఉండాలి?!
ఇంతకుముందు ఖాసీల గురించి చెప్పుకున్న వివరాల వెలుగులో చూస్తే, దశరథుడు కౌసల్యతో వివాహానికి వరసైన వేరొక తెగకు చెందినవాడు అయుండాలి. అలా అయినప్పుడే ఒక కోసలరాజు, పెళ్ళికి ముందే కోసలరాణిగా ఉన్న కన్యను పెళ్ళాడడంలోని అసంబద్ధతకు అర్థవంతమైన పరిష్కారం లభిస్తుంది...
సరే, లభిస్తుందనే అనుకుందాం. కానీ, ఇంతకుముందే ఒకసారి అనుకున్నట్టు, అదింకో పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. దశరథుడు ఇక్ష్వాకు వంశీకుడనీ; అవ్యక్తంనుంచి పుట్టిన బ్రహ్మతో మొదలై సూర్యునితోనూ, అతని కొడుకైన వైవస్వతమనువుతోనూ, ఇక్ష్వాకువు వంటి ఎందరో ప్రసిద్ధులైన రాజులతోనూ విస్తరించిన ఆ వంశపరంపరలో దశరథుడు అరవై ఆరవ వాడనీ(ఒక లెక్కప్రకారం ముప్పై ఒకటవవాడు); అయోధ్యానగరాన్ని నిర్మించి, కోసలరాజ్యాన్ని స్థాపించి ఏలిన తొలి రాజు వైవస్వతమనువే నని కదా రామాయణం చెబుతున్నది...?!
అందుకు భిన్నంగా కోసలరాజ్యానికి నిక్కమైన వారసురాలు కౌసల్య అనీ, దశరథుడు ఆ రాజ్యానికి అల్లుడు మాత్రమే కాగల అవకాశముందనీ అనుకున్నప్పుడు బ్రహ్మ దగ్గరనుంచీ నిర్మించుకుంటూ వచ్చిన ఆ ఇక్ష్వాకువంశం ఏమవుతుంది...?!
ఇక్ష్వాకువంశమనే వివరం కేవలం దశరథుడి, లేదా రాముడి వంశాన్ని సూచించడంతో ఆగడం లేదు; అది రామాయణమంతా మరింత ప్రముఖంగా పరచుకుని కనిపిస్తుంది; ఆ విధంగా రామాయణకథకు అదొక వంశపరమైన పునాదిని కల్పిస్తోంది. ఇది కూడా ఇంతకుముందు అనుకున్నదే; ‘ఈ భూమండలమంతా ఇక్ష్వాకువుల’దని రాముడు వివిధసందర్భాలలో నొక్కిచెప్పిన సంగతిని ఉదహరించుకున్నాం. దశరథుడు కోసలరాజ్యానికి అల్లుడని తేలినప్పుడు ఈ పునాది ఏమవుతుందనేది మరింత కీలకమైన ప్రశ్న!
అదలా ఉంచితే; పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ, పురుషుల పేర్ల విషయంలో పరిశోధించాల్సింది ఎంతో ఉంది. కౌసల్య, కైక అనే పేర్లు రాజ్యంతో, లేదా ఒక ప్రాంతంతో ముడిపడి ఉండడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య గాంధారదేశపు రాచకన్యగా గాంధారి; పాండురాజు రెండవ భార్య మద్రదేశపు రాచకన్యగా మాద్రి; కృష్ణ అనే పేరుగల ద్రౌపది పాంచాలరాజ్యానికి చెందిన ఆడబడుచుగా ‘పాంచాలి’ అయిన సంగతి తెలిసినదే. రామాయణంలో విదేహరాజకన్యగా సీతకు ‘వైదేహి’ అనే పేరు కూడా ప్రసిద్ధమే...
రాజ్యం పేరుతోనే కాకుండా తండ్రి పేరుతో వ్యవహారంలోకి వచ్చిన స్త్రీల పేర్లు రామాయణ, మహాభారతాలలో కనిపిస్తాయి. కుంతికి ‘పృథ’ అనే పేరు ఉన్నా, దత్తత తండ్రి కుంతిభోజుని పేరిట కుంతిగానే ఎక్కువ ఆమె ప్రసిద్ధికెక్కింది. అలాగే, తండ్రి ద్రుపదుని పేరిట ద్రౌపది కూడా. సీత విషయానికే వస్తే, జనకుని కూతురుగా ఆమెకు ‘జానకి’అనే పేరు, సీత అనే పేరుతో సమానంగా వ్యవహారంలోకి వచ్చింది; దశరథుడి కొడుకు దాశరథి అయినట్టన్నమాట! ఇలా తండ్రి పేరిట వ్యవహారంలోకి వచ్చిన స్త్రీనామాలు ఏం సూచిస్తున్నాయన్నది కూడా పెద్ద ప్రశ్నే. సీతకు అన్నదమ్ములున్నట్టు రామాయణం చెప్పడం లేదు కనుక ఆమెకు గల ‘జానకి’, ‘వైదేహి’ అనే పేర్లు ఆమెను విదేహసింహాసనానికి వారసురాలిగా సూచిస్తున్నాయా!? అయితే, ద్రౌపది విషయంలో ఆ సామ్యం కుదరడంలేదు; ఆమెకు ధృష్టద్యుమ్నుడనే సోదరుడున్నాడు...
స్థూలంగా చూసినప్పుడు స్త్రీల పేర్లు రాజ్యం, లేదా ప్రాంతంతో ముడిపడి కనిపిస్తే; పురుషుల పేర్లు వాటికి భిన్నంగా శౌర్యాన్ని; లేదా సైనిక, రథ, ఆశ్వసంపదను; లేదా ఏదైనా వ్యక్తిగత విశేషాన్ని సూచించేవిగా కనిపిస్తాయి. ఉదాహరణకు, దశరథుడనే పేరు పది రథాలు ఉన్నవాడని చెబుతుంది; అలాంటిదే బృహద్రథుడు అనే మరో పేరు. పేరులో రథం ఉన్న రాజులు హిట్టైట్లలో కూడా కనిపిస్తారు. ‘త్వెషరత’ అనే పేరు ఒక ఉదాహరణ. కైక తండ్రి పేరు అశ్వపతి. అలా గుర్రంతో కలిపి పెట్టుకున్న పేర్లైతే అసంఖ్యాకంగా కనిపిస్తాయి- అశ్వసేనుడు, కువలయాశ్వుడు, యువనాశ్వుడు వగైరాల రూపంలో. అశ్వసేనుడనే పేరు సైనికసంపదను కూడా సూచిస్తుంది. చక్రమూ, రథసాంకేతికతా కాస్పియన్ సముద్రానికి, నల్లసముద్రానికి మధ్యలో ఉన్న కాకసస్ నుంచి రష్యన్ గడ్డిభూములకు వ్యాపించి; గుర్రాన్ని కూడా కలుపుకుని, రథాశ్వాలతో కూడిన యుద్ధాలకు విస్తరించి అక్కడినుంచి మధ్య, పశ్చిమ, తూర్పు, దక్షిణాసియాలకు వ్యాపించిన సంగతిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ పేర్ల వెనుక ఉన్న కథ అర్థమవుతుంది. ఈ వ్యాసకర్త రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే గ్రంథంలో దీని గురించిన సమాచారం విస్తారంగా కనిపిస్తుంది...
రాముడు, లక్ష్మణుడు, భరతుడు వంటి రామాయణ సంబంధమైన పేర్లు; ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మొదలైన మహాభారత సంబంధమైన పేర్లు భిన్న వర్గీకరణ కిందికి వస్తాయి. మళ్ళీ శత్రుఘ్నుడు, పరశురాముడు మొదలైన పేర్లు శౌర్యాన్ని సూచిస్తాయి. ఇంకోపక్క కొడుకులను తల్లి వైపునుంచి, తండ్రి వైపునుంచీ కూడా చెప్పడం కనిపిస్తుంది కానీ అందులో మళ్ళీ ప్రాచుర్యంలో ఎక్కువ తక్కువ తేడాలున్నాయి. రాముణ్ణి దాశరథి అనడంలో ఉన్నంత ప్రాచుర్యం కౌసల్యానందనుడనడంలో లేదు. దాశరథిగా తండ్రి నామాన్ని పెద్ద కొడుకైన రాముడు ధరించగా, సుమిత్ర కొడుకుగా లక్ష్మణుడు సౌమిత్రి పేరును తెచ్చుకున్నాడు. భరత, శత్రుఘ్నులకు తల్లి, దండ్రులలో ఏ వైపునుంచీ అలాంటి అదనపు నామం ప్రాచుర్యంలోకి వచ్చినట్టు కనిపించదు. ధర్మరాజూ; మాద్రి కొడుకులైన నకుల, సహదేవులతో సహా అతని నలుగురు సోదరులకూ పాండరాజు కొడుకులుగా పాండవులనే పేరే కాక; దానితో సమానంగా, కుంతి కొడుకులుగా కౌంతేయులనే పేరు కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే కౌరవుల విషయానికి వస్తే, తండ్రిపేరుతో ధార్తరాష్ట్రులుగానూ, కురువంశం పేరుతో కౌరవులుగానూ వారు అనిపించుకున్నంతగా తల్లి పేరుతో గాంధారేయులు అనిపించుకోవడం తక్కువ...
ముందే చెప్పినట్టు, పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ, పురుష నామాల గురించి ఇదంతా స్థూలపరిశీలనే తప్ప సాధికారికంగా చెబుతున్నది కాదు; పరిశోధించాల్సింది చాలా ఉంది. కాకపోతే, పేర్లకు సంబంధించిన పై తేడాలు, పోలికలు అంతే స్థూలంగా మాతృస్వామ్య, పితృస్వామ్యాల గురించి; వాటి మిశ్రస్థితి గురించి, మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరుగుతున్న పరివర్తన గురించి చెబుతున్నాయనుకోవచ్చు ...
మొదట్లో గణాలకు జంతువుల పేర్లో, వస్తువుల పేర్లో, మొక్కల పేర్లో, పక్షుల పేర్లో పెట్టేవారనీ; తర్వాత ప్రసిద్ధులైన వ్యక్తుల పేర్లు పెట్టడం వచ్చిందనీ ఇంతకుముందు అనుకున్నాం. ‘ఇక్షు’ అంటే చెరకు కనుక ఆ పేరుతో వ్యవహారంలోకి వచ్చిన మాతృస్వామికగణం పితృస్వామ్యానికి మారగానే ఇక్ష్వాకువనే వ్యక్తి పేరుతో ఇక్ష్వాకువంశంగా మారిన సంగతిని జైన తీర్థంకరుడైన ఋషభుని ఉదంతం ద్వారా గతంలో చెప్పుకున్నాం. ఈ సామ్యంతో చూసినప్పుడు, కౌసల్య నామానికి మూలమైన ‘కోసల’ అనే మాటకు- ఆంధ్రభారతి అనే ఆన్ లైన్ నిఘంటువు ఉటంకించిన పరవస్తు శ్రీనివాసాచార్య గారి ‘సర్వశబ్దసంబోధిని’ అనే సంస్కృత నిఘంటువు ‘అగ్ని’ అనే అర్థం చెబుతుండడం గమనార్హం. అంటే సంబంధిత గణం ‘అగ్ని’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చు...
అసలు గణమంటేనే మాతృస్వామికమనీ, పితృస్వామికమైన గణాలు ఉండవనీ, మాతృస్వామ్యనుంచి పితృస్వామ్యంలోకి మారాక గణం స్థానంలో వంశాన్ని, లేదా గోత్రాన్ని ప్రతిష్ఠించుకున్నారనీ రాంభట్ల కృష్ణమూర్తి తన ‘జనకథ’లో ఇచ్చిన వివరణను ఈ సందర్భంలో దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా చూసినప్పుడు కౌసల్యది కోసలగణానికి చెందిన మాతృస్వామిక నేపథ్యమనే కాక; కోసలగణం ఉనికి వల్లనే ఆ ప్రాంతానికి కోసల అనే స్థలనామం వచ్చినట్టు, క్రమంగా ఆ పేరుతోనే అక్కడ రాజ్యం అవతరించినట్టు కూడా అర్థమవుతుంది…
పైన పేర్కొన్న ‘సర్వశబ్దసంబోధిని’ కైక పుట్టింటి రాజ్యమైన ‘కేకయ’శబ్దానికి ఒక దేశవిశేషమనే కాక, ‘నూపుర’మనే అర్థం కూడా చెప్పింది. అంటే, సంబంధితగణం నూపురం పేరిట, అనగా కాలికి ధరించే అందె పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిందనుకోవాలి. అలాగే, ద్రౌపది పుట్టింటి రాజ్యమైన ‘పాంచాల’ అనే మాటకు “మంచికులమున పుట్టినవాడు, పాంచాలదేశము, ద్రుపదుడనే రాజు” అనే సామాన్యార్థాలతోపాటు; “వడ్లవాడు, సాలెవాడు, చాకలివాడు, మంగలివాడు, మాదిగవాడు, వీరల గుంపు” అనే ప్రత్యేకార్థాలు కూడా ఇచ్చింది. బహుశా ఈ ప్రత్యేకార్థాలలో ఒక దానినుంచి పాంచాలగణం ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చు. కురువంశంలోని ‘కురు’ శబ్దానికి కూడా చిన్న లేదా కురచ అనే అర్థాలున్నాయి. ఆ అర్థంలో ప్రాచుర్యానికి వచ్చిన కురుగణంలోని ‘కురు’ను వ్యక్తినామంగా మార్చి దానినుంచి కురువంశాన్ని సృష్టించి పితృస్వామికం చేసినట్టు కనిపిస్తుంది. దీనికి ఇక్ష్వాకువంశంతో పోలిక స్పష్టంగా కనిపిస్తోంది కూడా!
ఈరోజున మనం పేర్లను చాలా తేలిగ్గా తీసుకుంటాం; పేరులో ఏముందని అనుకుంటాం; ఎవరికి వాళ్ళం పిల్లలకు తోచిన పేర్లను పెట్టుకుంటాం. కాకపోతే కొంతమందిలో నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం, తల్లిదండ్రుల పేర్లు పెట్టు కోవడం ఉండవచ్చు. పేరు ఎంపికలో ఎలాంటి నిర్బంధాలూ, నిషేధాలు మాత్రం లేవు. కానీ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణదశలో అలాంటి పూర్తి స్వాతంత్ర్యం లేదు. ఆనాడు పేరుపెట్టడం అనేది గణం అస్తిత్వంతో, గుర్తింపుతో నేరుగా ముడిపడి ఉండేది. లూయీ హెన్రీ మోర్గన్ తన ‘పురాతన సమాజం’లో అమెరికన్ ఆదివాసులవైపు నుంచి నామకరణం హక్కు గురించి వివరిస్తాడు:
దాని ప్రకారం, ఆటవికులలోనూ, అనాగరికులలోనూ కుటుంబాలకు పేర్లు లేవు; వ్యక్తుల పేర్లను బట్టి కుటుంబాన్ని గుర్తించడం సాధ్యం కాదు; కుటుంబనామాలు నాగరికతతో వచ్చాయి. అమెరికన్ ఇండియన్ తెగలలో అతను లేదా ఆమె ఏ గణంవారో తెగలోని ఇతరులకు తెలియాలంటే పేరే ఆధారం; పేరే పూర్తి చిరునామా అన్నమాట. అందువల్ల ప్రతి గణానికీ తన సభ్యులకు పెట్టే పేర్లమీద హక్కు ఉంటుంది. ఆ పేర్లను తెగలోని మరే గణమూ వాడకూడదు. ప్రతి గణమూ తన పేర్లపై హక్కును ప్రకటించుకుంటుంది...
తల్లి తన సంతానానికి గణంలో వాడుకలో లేని పేరు పెట్టుకోవచ్చు కానీ, దానికి దగ్గరి బంధువులు ఆమోదించాలి; ఆపైన తెగకు చెందిన సమితి సమావేశంలో బిడ్డ పుట్టినట్టు వెల్లడించి, ఆ బిడ్డకు పెట్టిన పేరును, తల్లి పేరును, ఆమె గణం పేరును, తండ్రి పేరును ప్రకటించాలి. అప్పుడు మాత్రమే నామకరణం తంతు పూర్తిగా జరిగినట్టు! ఇప్పుడు కూడా బంధువులను పిలిచి బారసాల జరపడంలో ఈ గణసమాజపు ఆనవాయితీని మనకు తెలియకుండానే పాటిస్తున్నాం. కాకపోతే, గణసమాజంలో పేర్లకు సంబంధించి పట్టింపులు, విధినిషేధాలు ఎంత ఎక్కువగా ఉండేవంటే; ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని పేరుపై అతని సంతానానికి మాత్రమే హక్కు ఉంటుంది; ఆ పేరును ఇంకొకరు వాడుకోవాలంటే మరణించిన వ్యక్తి పెద్దకొడుకు ఆమోదించాలి. ఆ పేరును మరో గణంలోని మిత్రునికి అతను ఎరువు ఇవ్వవచ్చు; ఆ ఎరువు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ పేరు మళ్ళీ సొంత గణానికి వస్తుంది...
మళ్ళీ పేరు పెట్టడం కూడా రెండు దశల్లో జరుగుతుంది- చిన్నప్పుడు ఉపయోగించేది, పెద్దయ్యాక ఉపయోగించేది. ఈ పేరు మార్పునకు కూడా పెద్ద తతంగం ఉంటుంది. రెండో పేరు పెట్టాక మొదటి పేరు రద్దవుతుంది. పదహారునుంచి పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చాక పేరు మార్పు జరుగుతుంది. సాధారణంగా గణం నాయకుడే ఈ రెండో పేరు పెడతాడు. ఆ తర్వాత జరిగే తెగ సమితి సమావేశంలో ఆ పేరు మార్పును ప్రకటిస్తారు. ఈ రెండో పేరు పెట్టడం అనేది పెద్దవాళ్ళు మోయవలసిన బరువు బాధ్యతల స్వీకారానికి గుర్తు. విశేషమేమిటంటే, మన దగ్గర కొన్ని కులాల్లో జరిగే ఉపనయనం తంతు ఈ గణసమాజపు ఆనవాయితీకి కొనసాగింపే. ఇందులో కూడా పేరు మార్పు ఉంటుంది. అందుకు తగినట్టే ఉపనయనాన్ని మన దగ్గర రెండో జన్మగా పరిగణించడం ఉంది. ద్విజులు, ద్విజన్ములు అనే మాటలు దానినే సూచిస్తాయి. కాకపోతే, ప్రపంచవ్యాప్తంగా గణదశలో ఇది ప్రతిచోటా ఉండేదన్న సంగతి మనకు తెలియక మన దగ్గర, అది కూడా కొన్ని అగ్రకులాలకే ఇది పరిమితమనుకుంటాం; ద్విజుడంటే “రెండుసార్లు పుట్టువాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులు” అని ముదిగంటి గోపాలరెడ్డి గారు కూర్చిన సంస్కృతాంధ్ర నిఘంటువు అర్థం చెబుతోంది...
మళ్ళీ అమెరికన్ ఇండియన్ల విషయానికి వస్తే, వాళ్ళ తెగలలో వయసు వచ్చిన యువకుడు ఎవరైనా యుద్ధోత్సాహం చూపించినా, ఏమైనా వీరకృత్యాలు చేసినా పేరు మార్చడం జరుగుతుంది. ఏదైనా జబ్బు చేసినప్పుడు నయమవుతుందనే నమ్మకంతో పేరు మార్చుకోవడం; అలాగే, ఏదైనా పదవికి ఎన్నికైనప్పుడు కొత్తపేరు పెట్టుకోవడం ఉన్నాయి. ఇలాంటి గణసమాజపు ఆనవాయితీలు ఇప్పుడూ మన దగ్గర అనేకం కనిపిస్తాయి. మోర్గన్ చెప్పకపోయినా, ఎవరి చేతిలోనైనా ఓడిపోయినప్పుడు కూడా పేరు మార్చుకునే ఆనవాయితీ ఉండి ఉండాలి. మహాభారతంలో అర్జునుని చేతిలో ఓడిపోయిన అంగారపర్ణుడనే గంధర్వుడు తన పాత పేరును వదిలేసి చిత్రరథుడనే కొత్త పేరు పెట్టుకుంటానంటాడు...
పేరు పెట్టడంలో మన ధర్మశాస్త్రాలు నిర్దేశించిన విధినిషేధాలు కూడా తక్కువవి కావు. అవి మాతృస్వామ్యంపై పితృస్వామ్యాన్ని స్థాపించిన వైనాన్ని కూడా చెబుతాయి. కౌసల్య గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత సందర్భంలో వాటి గురించి కూడా తెలుసుకోవడం అవసరం…