తట్టి లేపే మట్టిమనిషి నాటకం
x

తట్టి లేపే మట్టిమనిషి నాటకం

మనుషులు. ఈ మనుషులు మట్టి మనుషులు. వట్టి మట్టి మనుషులు. మాడే కడుపులకు ఎండే డొక్కలకు పట్టెడు అన్నం పెట్టే మనుషులు. ఆ మట్టి మనుషుల జీవితం ఒక కథగా నవలీకరణ జరిగింది.


మనుషులు. ఈ మనుషులు మట్టి మనుషులు. వట్టి మట్టి మనుషులు. రేయింబవళ్ళు కష్టంతో 'బలం ధరిత్రికి బలిగావించే' సంపద సృష్టించే మనుషులు. మాడే కడుపులకు ఎండే డొక్కలకు పట్టెడు అన్నం పెట్టే మనుషులు. ఆ మట్టి మనుషుల జీవితం ఒక కథగా నవలీకరణ జరిగింది. గత శతాబ్ది 70వ దశకం - తెలుగు నాట రైతు జీవితాల్లో ఓ మలుపు ప్రారంభమైన కాలం. నాడు ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రవహించిన మహత్తర కథ మట్టిమనిషి. ఒక చరిత్రను సంతరించుకున్న కథ.

తెలుగువారి ఆది కావ్యం అనుకునే శ్రీ మదాంధ్ర మహాభారతం నుండి ఆధునిక సాహిత్యం వరకూ వెయ్యేళ్ళ కాలంలో వచ్చిన మహోన్నత కావ్యాల సరసన 13వ గొప్ప రచనగా నిలచిన వచన కావ్యం మట్టిమనిషి నవల. 14 భారతీయ భాషల్లోకి అనువాదం పొందింది. తిరిగి తిరిగి ముద్రణలు పొందింది. ఇప్పటికీ పుస్తక దుకాణాల్లో అందుబాటులో ఉంది. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రైతు కుటుంబపు ఆడబిడ్డ డా. వాసిరెడ్డి సీతాదేవి రాసిన మహానవల మట్టిమనిషి.

పల్లెటూరును కళ్లకు కట్టిన నాటకం...

'మట్టిమనిషి' నాటకం ఓనాటి పల్లెటూరును కళ్లకు కట్టింది. సంక్రాంతికి స్వాగతం పలికే అలికిన గోడలు, తీర్చిదిద్దిన ముగ్గులతో ఇళ్లే కాదు... వరికంకులు, ధాన్యం బస్తాలు, పోలాల్లో కల్లాలు తూరుపాల... వంటి దృశ్యాలు ప్రేక్షకుల్ని కథా కాలానికి తీసుకువెళ్తాయి. ఆ నేపధ్యం లోంచే మట్టి మనిషి రంగస్థలంపై నిలిచాడు. 'సిరులు పండే భూమిని నమ్ముకున్నోడు ఎన్నడూ చెడిపోడు' అనే సందేశాన్ని చాటాడు. మ్ముకున్న నేలను అమ్ముకుంటే... సాధికారంగా హెచ్చరించింది ఈ నాటకం. అదే సమయంలో మోసం, దగా, దళారీ తనం, అన్యాయం మీద తిరుగుబాటును ప్రకటించింది.

ఇతివృత్తానికొస్తే...

మట్టికి, రైతుకూ ఉండే అనుబంధాన్ని దాని దృఢత్వాన్ని నాటకం కళ్ళకుకట్టింది. వ్యవసాయమే నేపథ్యమైన పల్లెటూళ్ళో మూడు తరాల రైతు జీవితమిది. జీతగాడి పనిలో ఇమడలేని యువకుడు కౌలురైతుగా మేడిపడతాడు. చెమటోడ్చి సేద్యం చేస్తాడు. సొంత భూమిని సమకూర్చుకొంటాడు. ఆయన బాటలోనే కొడుకూ ఎదుగుతాడు. 80 ఎకరాల ఆసామి అవుతాడు. సంపన్నుల బిడ్డ వరూధిని ఇంటి కోడలవుతుంది. నగర జీవితంపై వ్యామోహంతో కాపురాన్ని పట్టణానికి మార్పిస్తుంది. ఓ వ్యాపారిని నమ్మి స్నేహం చేసింది. వ్యాపారంచేసి ఎదగాలనుకొంటుంది. భర్తను ఒప్పించి పొలం అమ్మించి సినిమా హాలు కట్టి మోసపోతుంది. ఆస్తి హరించుకు పోతుంది. కోర్టులు ఉన్న వాళ్లకే చుట్టాలవుతాయి. చివరకు ఆ రైతు కుటుంబం సర్వస్వం పొగొట్టుకొటుంది. వరూధిని కొడుకు మట్టిమనిషి సాంబయ్య మనుమడు రవి తిరిగి నేలతల్లినే ఆశ్రయిస్తాడు. తాత తర్ఫీదు ఇస్తాడు. నిలబడే వాడిని పడదోయటమే ఈ వ్యవస్థ స్వభావం. దాన్నే సవాలు చేశాడు రవి.

మట్టి మనుషులు అమ్మ ఒడికి దూరమై పోతున్న కాలం ఇది. వారి సహజ ఆహార్య, వ్యవహారాలు మసక బారుతున్న కాలం. అటు మానవతను కోల్పోతున్న ఆధునిక సమాజం, ఇటు కల్లబొల్లి హామీలిచ్చే ప్రభు త్వాలు - ఆ మట్టిమనుషుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా, క్షమించరాని నిరాదరణతో ప్రవర్తిస్తున్న కాలం ఇది.ఈతరుణంలో మట్టిమనిషి నవలను నాటకీకరించారు సుప్రసిద్ధ అభ్యుదయ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్. దృశ్య రూపాన్నిచ్చి తొలిగా రంగస్థలం మీదకు తీసుకొచ్చారు గత ఏడాది బహుభాషా నాటక దర్శకురాలు నస్రీన్ ఇషాక్. దానికి మరింత మెరుగులుదిద్ది మనముందుకు తెచ్చారు ప్రసిద్ధ దర్శకులు ఎస్.ఎం. బాషా ఈనాడు.

అయితే విమర్శకుల మదిలోంచి ఒక ప్రశ్న అంకురిస్తుంది. అది గతించిన కాలపు గడిచిపోయిన కథ. వర్తమానంలో నాటకరూపాన్ని సంతరించుకున్న ఈ మట్టిమనిషికి ఉన్న ప్రాసంగీకత ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ఇది అవసరమైన ప్రశ్న. ఆలోచించాల్సింది, సమాధానం సాధించాల్సిందీనూ. ప్రజాస్వామిక యుగంలో ఏ కళకయినా ప్రధానంగా ఉండాల్సింది సామాజిక ప్రయోజనం. ఆ కళకు మూలమైన కథా వస్తువు సామాజికమైనదిగా ఉండాలి. ప్రజా జీవనాన్ని ప్రతిబింబించాలి. సఘర్షణ ఉండాలి. లీలా మాత్రంగా అయినా ఒక పరిష్కారాన్ని సూచించేదిగా ఉండాలి. కళాత్మకంగానూ ఉండాలి. దానినే ప్రజా కళ అంటాం. ప్రజా కళలకు కాల పరిమితులు వర్తించవు. అందుకు గొప్ప ఉదాహరణ కన్యాశుల్కం నాటకం.

ఈ దృష్టితో చూచినప్పుడు మట్టిమనిషి నాటక కథ చిరంజీవి. ఎందుకంటే మనిషి మట్టితో మమేకమైతేనే మానవజాతికి తిండి లభిస్తుంది. వ్యవసాయంలో ఎంత సాంకేతికత చోటు చేసుకున్నప్పటికీ రైతు బతుకు మట్టితోనే మమేకం అవుతుంది. దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం రైతు జీవితాలు కష్టాల కడగండ్లపాలే. అలాగే పట్టణీకరణ చెందుతున్న సమాజంలో పల్లెటూరి మనుషుల అమాయకత్వం, బోళాతనం నగర వ్యాపారికి అందివచ్చే గొప్ప పెట్టుబడి. ఈ దశలో చేజారిన జీవితాల్లో పతనం ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో మట్టిమనిషి నాటకం ప్రేక్షకుల కళ్ళకు కడుతుంది. అదే మట్టిమనిషి నాటకానికి నేడున్న ప్రాసంగికత.గ్

హైదరాబాద్‌కు చెందిన మిత్ర క్రియేషన్స్కు చెందిన 48మంది నటీనటులు, 12మంది సాంకేతిక నిపుణులు ఈ నాటకాన్ని గొప్పగా ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన నటుడు, దర్శకుడు, ప్రయోక్త ఎస్. ఎం. బాష, తన అనుభవాన్నంతా రంగరించి నాటకానికి వన్నెలద్దారు. సాంబయ్యగా భుజంగరావు, కనకయ్యగా డి. మహేంద్ర, వెంకటపతిగా కె. గోవర్థన్ రెడ్డి, వరూధినిగా అనూష నూతుల, రామనాథ బాబుగా మంజునాథ, రవిగా బాలనటుడు వి. దేవేష్ సూత్రధారిగా పోలుదాసు శ్రీనివాసరావు తదితర నటీనటులు అవధుల మేర నటించారు. అనవసరపు హంగులూ ఆర్భాటాలకు తావివ్వకుండా అవసరమైన మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొన్నారు దర్శకులు.

శ్రావ్యమైన జానపద గీత సంగీతాలతో అలరిస్తోంది మట్టిమనిషి నాటకం. ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, చింతలపల్లి అనంత్ పాటలకు సాహిత్యాన్ని సమకూర్చారు. ఇండ్ల ఏసుపాదం, వై. గంగాధర్, ఎం. అనిల్ కుమార్, కె. వేణు వినసొంపైన సంగీతాన్ని సమకూర్చారు. సుమధుర గాత్రాలు శ్రోతల్ని అలరించాయి. ప్రతి సన్నివేశంలోనూ నటీనటుల నిపుణత, అంకితభావం, దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటం అవుతు న్నాయి. మొత్తంగా నాటక బృందం అత్యంత క్రమశిక్షణతో మూడు గంటల నిడివిగల మట్టిమనిషి నాటకాన్ని రక్తికట్టించారు. జనవరి 12, 13 తెదీల్లో గుంటూరు, తెనాలిలో ఇచ్చిన మట్టిమనిషి ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం), గుంటూరు కళా పరిషత్, కళా తోరణం సంస్థలు వెన్నుదన్నుగ నిలిచాయి.

Read More
Next Story