ఎమ్మిగనూరు జాతరలో...
జనవరి 15వ తేదీ బుధవారం రథోత్సవంతోె మొదలు. నెలరోజులు సాగే జాతర ఇది
మూడుదినాలు సెలువులు అంటే అందరం ఎమ్మిగనూరుకి ఎలబారితిమి. ఈ ఫొద్దు మాపుసారి (15-01-2025) ఎమ్నూరు జాతరలేకి ఒక్కుండ్నే ఫోయింటి. దీంటక్కి ఇంతగూడా కుశాలు అనిపించల్యా. ఉద్యోగం రానప్పుడే జేబుల దమ్మిడీ లేకున్యా గుండెనిండా ఆనందంత న్యాస్తులు అందరం కలిసి తిరిగొస్తుంటిమి.
కథకు నా .....ఇయ్యాల జాత్రల ఫోయింటే కుక్క సంతకి ఫోయినట్లయ్యిడిస్య. ఇంట్లవొల్లత కల్సిఫోతే నాను అనుకునేవి సూడలేనని ఒక్కడ్నే రస్తా ఇడిస్తి. పాతసినిమా ముందర ఉలిగంమ్మొళ్ళు దుడ్లు అడుక్కొంటుండ్రి. మాసిన్నప్పుడు అడ్డపంచె కట్టుకున్నపల్లెలొల్ల సెల్లెలు ఇగ్గుకొని దుడ్లు అడుగుతుండ్రి. ప్యాంటు ఏసుకున్నోల్లని అడుగుత లేకుండ్రి. ఇప్పుడేమీల్యా! అందర్నీ అడుగుతుండారు. అయితే రవ్వంత మర్యాదగా అడుగుతుండారు. నన్ని గూడా ఏమన్నా దానం ఇయ్యండి సారూ అని అడిగిరి. మీ కోస్రమే " తృతీయ ప్రకృతి " కథ రాసేన్య ఇడిసిపెట్టండి అందాం అనుకొంటి. మల్ల ఏంట్కిల్యాప్పా ఏమన్న అంటే సిగ్గు ఫోతాదని అనుకొని యాభై రూపాయలిచ్చి ముందరికి ఫోతి.
తొట్టతొలుత ఉండే అంగడి నా స్టూడెంటుదే! వాని సూసి ఇగిలిస్తి. రాసారూ ! మైసూరుపాకు ఒకటి తిందువు , ఇప్పుడే సేసేమ్య . నీకి ఇష్టుము కదా అన్య. కర్నూల్ల ఎవుడు అడగల్ల మనల్ని ఇట్లా అనుకుంటా కుశాలుగా ఒకటి తీసుకొని తింటి. ఎట్లుండాదప్పా యాపారము అంటి. అవ్వ వొడికింది తాత మలతాడుకి సరిపోయేతట్ల ఉంది సారూ అన్య. పిల్లల్ని బాగా సదివిచ్చుకోప్పా అని ముందుకి ఫోతి. సవారు బండి కనపడల్యా. కొన్నాద్దాలు కనపడల్యా. తిప్పితే కిర్రు కిర్రు అనేదాన్ని నుగ్గ బునికితి . యాడాసిక్కల్యా! సేతి ఏలికి రబ్బరు తాడు సెక్కిచ్చుకొని సెండాట ఆడుతుంటిమి. అవిల్యా! ఏమిజాత్రప్పా ఇది అనిపిచ్చ్య. ఈనెమ్మ కొనుక్కొని ఇంట్ల పెట్టుకుందామంటే ఒగుటి గూడా లేవు అనుకొంటి. అవి ఉండిన్నాడు దుడ్లు లేవు. దుడ్లు ఉన్నప్పుడు అవిలేవు . గాశారానికి నా ...... అనుకొంటి.
బరువు సూపెట్టే తాత యాడా కనపడల్యా! బచ్చాల పెంచు లక్క ఉండే మిసిని పెట్టుకొని పక్కన కీ ... అని సబ్దము సేసే మిసిని పెట్టుకొని ఉంటుండ్య. యాటికి ఫోయనో పాపము అనుకొంటి. బలము సూసుకొనేకి రెండు సేతులత గుంజే మిసినీ లేదు. వానెక్క బాలయ్యత , సిరంజీవిత ఫోటా దిగుదాము అంటే అవీ లేవు. బట్టకి వాళ్ళ బొమ్మలు గీసి కడుతుండ్రి. అవట్ల ముందు నిలబడి ఆయప్పోల్లతో ఫోటా దిగినట్ల కులుకుతుంటిమి. పెద్దమరీడు ఈరేసు గాడుశ్రీదేవిత దిగుతుండ్య ! ఈరేసుగాడొస్తే శ్రీదేవి ఫోట లేదని శానా బాధ పడుతుండ్య సూడప్పా అనుకొంటి. బోర్లిచ్చిన గిలాసుల్ని సెండుత కొట్టె అంగడి కనపడల్యా! సెల్లు ఫోను ఆటల దెబ్బకి అన్ని అగుడయ్యేవ్య అనుకొంటి.
తేరుకాడ నిలబడి సేతుల సెప్పు మాదిరి పట్టుకొని ఇగిలిచ్చుకుంట అందురూ ఫోటా దిగేది సూసి ఈసెల్లు ఫోను ఫోటా స్టుడియాని మింగిడిస్య కదప్పా అనుకొంటి. అట్లే నడుసుకొంటా తేరు బజారు కిందితుక్కు ఫోతి. అవతల లైనుల అన్ని గాజుల అంగండ్లు ఉంటాయి. మాము సిన్నగున్నప్పుడు మొగొల్లను ఆతుక్కు ఫోనీయకుండ్రి. ఇప్పుడుగూడా అట్లే ఉంటాది ఏంటికి ల్యాప్పా అనుకొని ఎనక్కి తిరిగితి. అవతలపక్క పోలీసు పిలగాడు నమస్కారం సారూ అన్య. ఎవురప్పా అంటి. నాను నీదగ్గర సదువుకునేన్య గదా సారూ అన్య. సంతోషమప్పా అంటి. ఎనిక్కి ఫోతుండారు సారూ. ఇట్లా ఫోండి అన్య. వొద్దుల్యాప్పా! అదంతా అడోల్లు తిరిగేదిగదా ! మొగల్లని ఫోనీయరు గదా అంటి. వాడు నుగ్గ నగి ఇంగా నువ్వు యాడుండావు సారూ! ఆకాలం ఫోయి శానా దినాలాయ. ఇట్లే ఫోండని దారి సూపిచ్చ్య. సరెల్యాప్ప అని తిరిగితి.
కొంచెం ముందుకి ఫోయినంక ఒక అప్ప ( నాయిన) తన పిలగాడిని అడుక్కొనేది సెవుల బడ్య. అట్లనే నిలబడి ఒకసెవ్వు ఏస్తి. వాడు వాల్ల నాయన్ని ఇమానం కొనీయమని నుగ్గ అడుక్కొంటుండాడు. వాల్ల అప్పేమో ఆర్నూట యాభై సెపుతుండార్లే ! మూడు దినాలు ఆగు నన్నూరుకే ఇస్తారు అంటుండాడు. నువ్వు అన్ని ఉద్దర మాట్లు సెపుతుండావు. ఫోయిన జాత్రకి కూడా ఇట్లే సెబితివి! యా ఇప్పియ్యల్యా! ఇసారి ఇడిసేలేను. ఇప్పిచ్చేతీరల్ల అని అటుము పెట్టుకొనిండాడు. వాల్లప్పేమో నెత్తి గీరుకొంటుండాడు. నాకైతే పిలగాడిని సూసి నా సిన్నతనం గుర్తుకు వచ్చ్య. మానాయనగూడా ఇప్పిస్తా.. ఇప్పిస్తా అనుకుంటా యా ఇప్పిస్తుండల్యా! వాడిని సూసి కండ్లల్ల నీళ్ళు తిరిగ్య. సెయ్యి జేబులోకి ఫోయ. అయిదునూర్లుపాయలనోటు సేతికి తగిల్యా. సగం బయిటికి తీసినోడిని మనుసు మార్సుకొని లొపలే పెడితి. పిలగాని ముందు వాడి నాయన్ని అవుమానంసేసేది ఇష్టుం ల్యాక! ఇంటికాడికొచ్చినా పిలగాని వేడుకోలే గుర్తుకి వొస్తుండాది. ... నానేమన్నా తప్పుసేసిండానా ఎక్కువ ఆలోచన చేసి అనిపిచ్య. బువ్వ తినాలనిపించల్యా!