
వర్షం పడిందంటే వణుకుతున్న మర్లపాడు తండా..!
ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ తట్టుకోలేక కొందరు వృద్ధులు చనిపోయారు. అసలు ఆ తండాలో ఏం జరుగుతుంది.
ఇక్కడంతా రైతులే కొందరు సొంత పొలాల్లో మరి కొందరు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. పత్తి, వరి కూరగాయలు పండిరచుకుంటూ గొర్రెలు,మేకలు, పాడి పశువులు పెంచుకుంటూ ఉన్నంతలో ఎవరి మీద ఆధార పడకుండా తృప్తిగా బతుకుతున్నారు.
కానీ కొంత కాలంగా వారి భవిష్యత్‌లో ప్రమాదంలో పడినది..
అప్పటి నుండి ఈ పల్లెలో రాత్రి పూట ఎవరూ నిద్రపోరు! ఒకరు నిద్రపోయినా మరొకరు
మేల్కొని ఉండాల్సిందే. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ఆందోళనతో కనిపిస్తారు.
ఈ టెన్షన్ తట్టుకోలేక కొందరు వృద్ధులు చనిపోయారని ఇక్కడి యువకులు మాతో చెప్పారు. 350 కుటుంబాలు నివసించే ఈ గ్రామానికి ఏమైంది?
ఎందుకిలా క్షణం క్షణం భయం భయంగా బతుకు తున్నారు?
అసలేం జరిగిందో తెలుసుకుందామని ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి ఈ విలేజీలో ఒక రోజంతా ఫీల్డ్ విజిట్ చేశారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట మండలంలోని
నక్కల గండి ప్రాజెక్టు నిర్మాణం
నక్కల గండి ప్రాజెక్టుకి సమీపంలోని గ్రామమే మర్లపాడు తండా. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 3,155 ఎకరాలు ముంపుకు గురి అయ్యే అవకాశం ఉంది.ఈ తండాలో 350 కుటుంబాలు నివశిస్తున్నాయి. అక్టోబర్ 29న మర్లపాడు తండా పెద్ద ప్రమాదంలో పడిరది. అదెంత భయంకరంగా ఉందంటే...
ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే 3,155 ఎకరాలు
‘ ఆ రోజు పగలంతా చినుకులు పడుతున్నాయి. 4 గంటల తరువాత వాన పెద్దది అయింది.తరువాత వాగులు పొంగి తండాలోకి నీళ్లు రావడం మొదలై మెల్లగా నడుం లోతు నీళ్లు వచ్చేసినాయ్. మాకు మస్తు భయం వేసి అందరం పక్కనున్న మరో గ్రామం వైపు పరుగులు తీసినం... అతి కష్టం మీద ప్రాణాలు అయితే కాపాడుకున్నాం కానీ మీ పశువులను మేకలను కాపాడుకోలేక పోయినం. ఇంట్లో దాచుకున్న బియ్యం, పత్తి కొట్టుకొని పోయాయి కట్టుబట్టలతో మిగిలాం...’ అని చెప్పారు తండాకు చెందిన సోనీ.
బతుకంటే భయం
‘ నక్కల గండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామం ఇది. వానలు పడినపడినపుడల్లా రాత్రుళ్లు కంటి మీద కునుకు ఉండదు.ఎపుడు వరదలు ముంచెత్తి ఊరు మునిగిపోతుందో తెలీదు. రాత్రి పూట కొందరు గ్రామస్తులు మేల్కొని కాపలా కాస్తుంటారు. ఈ వత్తిడి భరించ లేక చాలా మంది వృద్ధులు చనిపోయారు. యువకులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వైపు వలస పోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు సరైన సహాయం లేదు. ఒక్క మీడియ ప్రతినిధి కూడా మా వైపు వచ్చి ఒక్క ఫొటో తీయలేదు. మీరే మొదటి సారి వచ్చారు..’ అన్నారు మరో గ్రామస్తుడు రాజ్యనాయక్.
గ్రామస్తుడు రాజ్యనాయక్
పొలాలు లాక్కున్నరు, ఇళ్లు ఇవ్వలేదు
‘ 2007 నాటి కథ ఇది, నక్కల గండి ప్రాజెక్టు మొదలయ్మే ముందు ఇరిగేషన్ వారు, రెవిన్యూ వాళ్లు కలెక్టర్ మర్లపాడు తండాకు వచ్చి ప్రాజెక్టు కోసం మా పొలాలు తీస్కున్నరు. మట్టిని తోలుకొని పోయి కట్టను వేశారు. మాకు ఉండటానికి కాలనీ కట్టిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు మాకు నీడ కల్పించ లేదు. ఇపుడు మేం మా బిడ్డలతో ఎక్కడికి పోవాలి? ప్రమాదం అని తెలిసినా ప్రాజెక్టు పక్కనే ఈ ముప్పు ప్రాంతంలో ఉంటున్నాం. తుపాన్ వానలు వచ్చినపుడు ఈ తండా అంతా మునిగిపోతుంది అనే భయంతో ఎటూ పోయే దారి లేక బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు తక్షణమే కాలనీ కట్టించి ఇవ్వాలి. లేదా స్ధలాన్ని ఇచ్చి డబ్బు ఇస్తే మేమే కట్టుంకుంటాం.’ అన్నాడు మర్లపాడు తండా వాసి లక్ష్మణ్.
గ్రామస్తుడు లక్ష్మణ్
ఇదీ మర్లపాడు తండా ప్రజల కన్నీటి గోస. నక్కల గండి ప్రాజెక్టు కోసం పంట పొలాలు కోల్పోయారు . కానీ, నిర్వాసితులైన వారికి పునరావాసం ఇప్పటికీ కల్పించ లేదు.
ఎటు పోవాలో దిక్కు తోచక ప్రమాదపు అంచున ఉన్న తండా లోనే తలదాచుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు ప్రజలు.
జలమయం కావడంతో తడిసి పోయిన పుస్తకాలు.
ఈ తండా ధీన గాథ తెలుసుకున్న
హైదరాబాద్‌కి చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ సంస్ధ, ప్రతీ కుటుంబానికి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
హైదరాబాద్‌కి చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ సంస్ధ, ప్రతీ కుటుంబానికి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
అలాగే సుభిక్ష ఫౌండేషన్ సంస్ధ ప్రతినిధి ఉమేష్ గ్రామంలోని పరిస్ధితులను అంచనా వేసి వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నారు.
నాశనం అయిన పత్తి, బియ్యం బస్తాలు
అసలీ ప్రాజెక్ట్ ఎపుడు మొదలైంది? ప్రస్తుత పరిస్ధితి ఏంటీ?
సాధారణ స్థితి: ప్రాజెక్టు భూ సేకరణ (2009 ప్రారంభం) తర్వాత ఆలస్యమై, నిర్మాణం పూర్తి కాలేదు. 7.64 TMC కెపాసిటీతో రూ.545 కోట్ల బడ్జెట్. మిషన్ కాకతీయ నుండి నీటి లిఫ్టింగ్ లక్ష్యం.
క్షణం క్షణం భయంగా బతుకుతున్న గ్రామస్తులు
తాజా అప్‌డేట్: 2025లో పునరావాసం (R&R) పనులు పురోగతిలో. అచ్చంపేట మండలం మర్లపాడు తండా (243 కుటుంబాలు), కేశ్యతండా (108 కుటుంబాలు)లో సర్వేలు జరుగుతున్నాయి. 351 కుటుంబాలకు 10 ఏళ్ల తర్వాత పరిహారం. గేట్లు బిగించడం మొదలుపెట్టాలంటే గ్రామాలు ఖాళీ చేయాలి.
సమస్యలు: గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం. BRS నాయకురాలు కవిత 2025 నవంబర్ 12న ప్రాజెక్టు సైట్ సందర్శించి, నిర్వాసితులకు వెంటనే పునరావాసం డిమాండ్ చేశారు. దిండి, నెల్లికల్ ప్రాజెక్టులతో పోల్చి విమర్శ.
భవిష్యత్: పునరావాసం పూర్తయిన తర్వాత నిర్మాణం వేగవంతం కావచ్చు. 1.5 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనాలు ఆశ.
ఇంత వరకు ఏ జర్నలిస్టు మా మర్లపాడు తండాకు రాలేదు. మీరే మొదటి సారి వచ్చారు అని , ఫెడరల్ తెలంగాణ ప్రతినిధికి ఆవేదనగా చెబుతున్న గ్రామస్తులు.
వ్యయం: ప్రాజెక్ట్ కోసం రూ.750 కోట్లు అంచనా వేయబడి నది.
ముంపు: ప్రాజెక్ట్ వల్ల 3,155 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
భూసేకరణ: ప్రాజెక్ట్ కోసం 2,300 ఎకరాలు భూమిని సేకరించారు, కానీ మరో 700 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది.
రెక్కాడితే గానీ డొక్కాడని 350 పేద కుటుంబాలకు వీలైనంత త్వరగా పునరావాసం కల్పించి జీవనోపాధులు కల్పించాల్సిన అవసరం ఉంది.

