మారేడుమిల్లిలో ‘హనీమేన్‌’!
x

మారేడుమిల్లిలో ‘హనీమేన్‌’!

తేనెటీగలను కాపాడటం కోసం రంపచోడవరం అడవుల్లో చెట్లు పుట్టల వెంట తిరుగుతున్న పెదబాలతో కొద్ది సేపు


అతని పేరు పెదబాల. వృత్తి ఉపాధ్యాయుడు. కానీ, తెలిసిన వారు తేనెటీగల టీచర్‌ అని పిలుస్తారు. నాలుగు గోడల తరగతి గదిలో పాఠాలుచెప్పాల్పిన అతను ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పి అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఆదివాసీ రైతులకు ప్రకృతి పాఠాలు చెబుతున్నాడు. చెట్లకు డబ్బులు కాసే అరుదైన రహస్యాన్ని వెల్లడించాడు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం, ఇర్లపల్లి స్వగ్రామం. తేనెటీగలను కాపాడుకుంటే చాలు, మన్యంలో గిరిజనుల చెట్లకు డబ్బులు కాస్తాయంటాడు. కొన్ని పంటల అధిక దిగుబడికి తేనెటీగలే కారణం అంటాడు. భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత ముఖ్యమైన,విలువైన జీవి ‘తేనెటీగ’ ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ప్రమాదంలో పడిపోయిందని ఆందోళన పడుతుంతాడు. అలా ఊరు కోకుండా వాటిని కాపాడటం కోసం రంపచోడవరం అడవుల్లో చెట్లు పుట్టల వెంట తిరుగుతున్న పెదబాలను కలుద్దాం రండి...

‘‘ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం నాలుగేళ్లు మాత్రమే అని, ఎప్పుడో చెప్పారు. ఇపుడు ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదు. దీన్నిబట్టి మానవ మనుగడ తేనెటీగలతో ఎంతలా ముడిపడి ఉందో అర్థం చేసుకోండి. ’’ అన్నాడు పెదబాల, పుట్టలోని తేనెతుట్టెను తీసి చూపుతూ...

వృత్తిరీత్యా టీచర్‌ అయినా ప్రవృత్తి తేనెటీగలపై పరిశోధన, పెంపకం, తేనెపట్టుకట్టడం. వాటిని కాపాడే పాఠాలు రైతులకు, చిన్నారులకు బోధించడం.

1. ఎలా అంతరిస్తున్నాయి..?

అడవుల నరికివేత,గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం, రసాయన పురుగు మందుల వాడకం, నేల కలుషితం కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సెల్‌ఫోన్‌ వినియోగం కూడా తేనెటీగలు అంతరించడానికి ఒక కారణం. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ తరంగాల వల్ల అవి అయోమయానికి గురయి, తమ దారిని మరిచిపోయి.. అంతిమంగా వాటి జీవితం ప్రమాదంలో పడుతుంది పెదబాల అంటారు.

2. తాగుబోతు తేనెటీగలు

రంపచోడవరం,అరకు ప్రాంతాల్లో విరివిగా జీలుగ కల్లు దొరుకుతుంది. తేనెటీగలు ఈ కల్లుకు బానిసలయ్యాయి. కల్లు లొట్టెలలో పడి చనిపోతున్నాయి. కల్లు పాడు చేస్తున్నాయని ఈ ప్రాంతపు వారు వాటిని చంపుతున్నారు. అలా వాటి ఉనికి ప్రమాదంలో పడటం గుర్తించిన పెదబాల, అవి కల్లు ముంతల వైపు వెళ్ల కుండా, పుప్పొడి, మకరందం అందించే మొక్కలు, తోటలు పెంచి వాటిని ఆకట్టుకుంటున్నాడు. వాటిని చంపకూడదని వాటి వల్ల పంటలకు జరిగే మేలు గురించి గిరిజనులకు వివరిస్తున్నాడు.

3. ఎలా కాపాడాలి?

తేనె పట్టు కోసం అడవుల్లో తేనెటీగలను వేటాడడం పాత పద్ధతి, ఈ పద్ధతి ఎన్నో ఈగల సమూహాలు నాశనమైపోతున్నాయి. దీని నివారణకు తోటలు, ఇళ్ళ వద్దనే పెట్టెలలో తేనెటీగలను పెంచడం వల్ల వాటి వినాశనాన్ని నివారించవచ్చు అంటారాయన.

రౖెెతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టాలి.దీనికి కొద్దిపాటి పెట్టుబడి, స్వల్ప వనరులు చాలు. పూలు పూసే మొక్కల్లో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధంగా, పంటల అధిక దిగుబడి వస్తుంది.

4. పల్లె స్వయం సమృద్ధి ప్రాజెక్టు (బాక్స్‌)

గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో పెట్టెల పద్ధతిలో తేనె ఉత్పత్తి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని ఒక ప్రాజెక్ట్‌ రూపొందించాడు పెదబాల.

తేనె పెట్టెలు అమర్చిన చోట , నిమ్మ, నారింజ, బత్తాయి, జీడి మామిడి, అరటి, దానిమ్మ, రేగు, దోస, గుమ్మడి, బీర, పొట్లకాయ, కాకరకాయ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర, మినుములు, కంది, బటాని, పిల్లి పెసర, ఉలవ, గడ్డి చామంతి, వామిటి, పల్లేరు, ఉత్తరేణి, బెండ, జనుము, వేప పెంచాలి. ఆ మొక్కల్లో పుప్పొడి, మకరందం లభిస్తాయి కాబట్టి, తేనెటీగలను ఆకర్షిస్తాయి. ఒక్క బాక్స్‌కి నెలకు 5 నుండి 6 కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అవుతుంది.

భౌగోళిక వాతావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర వహించే తేనెటీగలు రైతులు పండించే 84 రకాల పంటల దిగుబడిని పరపరాగ సంపర్కం ద్వారా పెంచుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 25 వేల రకాల తేనె టీగలున్నాయి. వీటిలో ఇండియాలో నాలుగు జాతులు మాత్రమే తేనెను ఇస్తాయి.

1. కొండ తేనే టీగలు, 2. చిన్న / విసనకర్ర తేనె టీగలు, 3. పుట్ట తేనెటీగలు, 4. ఐరోపా తేనె టీగలు . ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్ట తేనెటీగలు ఎక్కువగా

ఉంటాయి.

స్వచ్ఛమైన తేనె తయారీకి రైతులు కాస్త కష్టపడితే వారి పంట దిగుబడులు పెరుగుతాయి. విచ్చలవిడిగా రసాయన మందులు పంటలపై చల్లాల్సిన అవసరం ఉండదని, దీనివల్ల సాగు వ్యయం తగ్గుతుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయని పెదబాల అంటారు.

5. పెరిగిన దిగుబడి

పొద్దుతిరుగుడు, బత్తాయి, కానుగ, నువ్వులు, కంది తదితర పంటల సాగు చేస్తున్న చోట తేనెటీగల పెట్టెలు పెడితే, వీటిలోకి చేరిన తేనెటీగలు తోటల్లో చెట్లపై ఉండే పూలపైకి చేరి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల పూత నిలబడి కాత అధికమై దిగుబడి 15 నుంచి 30 శాతం దాకా పెరుగుతున్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రీసెర్చ్‌ (ఐఐఓఆర్‌) పరిశోధనల్లో నమోదు చేశారు. అటవీ ప్రాంతాల్లో పూలు, పండ్లు, కూరగాయల పంట చేలలో తేనెటీగల పెంపకంతో రైతులకు ఆదనపు వస్తుందని వీరు గుర్తించారు.

ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రతీపువ్వును,గడ్డిపోచను సంపదగా మార్చవచ్చు. ప్రతీ పల్లెలో పది ఎకరాలు సోలార్‌ ఫెన్సింగ్‌ వేసి తేనెటీగలు పెంచాలి. 5వ తరగతి వరకు తేనెటీగల జీవన విధానం ఆధారంగా విద్యాబోధన జరిగితే నిరుద్యోగ సమస్య ఉండదు. తేనెటీగల పెంపకాన్ని విస్మరించి వ్యవసాయం చేసినా ఉపయోగం లేదు. తేనెటీగల వల్ల కేవలం తేనె మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 70శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి ఉంది. తేనెటీగలు అంతరించిపోతే.. సమస్త జీవ జాతులకు భవిష్యత్‌లో తిండి దొరకడం కష్టమని... అందుకే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, ప్రతీ పల్లెలో బడిలో ఈ ఆదివాసీ టీచర్‌ అవగాహన కల్గిస్తున్నాడు. ఇప్పటి వరకు 2వేలకు పైగా స్కూళ్లలో పాఠాలు చెప్పాడు. ఇంకా చెబుతూనే ఉన్నాడు.

Read More
Next Story