
మమ్మల్ని ఏడవనివ్వండి, ప్లీజ్!
కృపాకర్ మాదిగ ‘మండే కవిత’
మా మురికికి
మీరు స్నానం చెయ్యబోవడం
మా నగ్నత్వానికి
మీరు బట్టలేసుకోడం
మా ఆకలికి
మీరు బువ్వ తినబోవడం
మా రోగాలకి
మీరు మందు మింగబోవడం
మా కడుపులో దుఃఖాలకు
మీరు గొంతుకలవ్వడం
మా వెతుకులాటకి
మీరు చూపునివ్వడం
మా కార్యాచరణకి
మీరు పథక మెయ్యడం
మా ముక్తికి
మీరు దార్లు వెయ్యడం
మా గమ్యానికి
మీరు నడవబోవడం
మా సమస్యల పరిష్కారానికి
మీరు యుద్ధం చెయ్యబోవడం
మాతో ఒడ్డెక్కాలంటూనే
మీరు లోయల్లో ఉండే వ్యూహాలెయ్యడం
మాతో వెలుతురు బయళ్లు చూడాలంటూనే
మీరు అజ్ఞాతంలో సాధన చెయ్యడం
మాతో పరాయీకరణ సరికాదంటూనే
మీరు పరకాయ ప్రవేశం చేసెయ్యడం
ఇది సరికాదు సవర్ణ కామ్రేడ్స్
దీన్ని మార్క్స్ మెచ్చడు మావో మెచ్చడు
ఇప్పటికే మేము సోషల్ ప్రిజన్ లో వున్నాము
దయతో మమ్మల్ని వదిలేయండి
మమ్మల్ని మరింత దిగజార్చకండి
మా ఊపిర్లను మమ్ము పీల్చుకోనివ్వండి
మా పెనుగులాటలు మా కొదిలెయ్యండి
మా బతుకు యుద్ధాలను మమ్ము చేసుకోనివ్వండి
--- కృపాకర్ మాదిగ

