మధురాంతకం నరేంద్ర ‘దాయాదుల తోట’  భూమన్ రివ్యూ
x

మధురాంతకం నరేంద్ర ‘దాయాదుల తోట’ భూమన్ రివ్యూ

రాయలసీమ చుట్టూ తిరుగుతూ సమస్తాన్ని కళ్ల కద్దే నవల.



మధురాంతకం నరేంద్ర వొక రచయితే కాదు లోతయిన తాత్వికుడు. సమాజాన్ని అంతు చూసేంతగా నిశితంగా పరిశీలిస్తున్నవాడు. ప్రతిదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు.

ఈ "దాయాదుల తోట" నవల అందించి చదవమంటే కొంచెం చదివి ఇంకేం చదువుతాములే ఇబ్బందిగా ఉండనుకున్న వాణ్ణి కొంచెం పట్టుగా ముందుకు కదిలితే చదవడం నుండి పూర్తయ్యేంత వరకు తెరుకోలేకపోయినాను.

హర్ష చుట్టూ తిరిగే కథ సమాజ విశ్వరూపాన్ని చూపించింది. రాయలసీమ చుట్టూ తిరుగుతూ, ఫాక్షన్, మత మార్పిడులు, యానాదులు, ఇంటి సంబంధాలు, సెక్స్ సంబంధాలు, అమెరికా జీవితం, రాజకీయం, తెలుగు రాష్ట్రాలు చుట్టూ తిరిగి సిద్దేశ్వరం అలుగు, ధవళేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్టు, కర్నూలు వరద, హంద్రీ నీవా, తెలుగు గంగ కాలువ, కలివి కోడి ప్రస్తావన, గాలేరు - నగరి, కళ్యాణి డ్యాం ప్రస్తావనలతో సమస్తమూ కళ్ల కద్దుతున్నాడు.

నరేంద్ర ఈ నవలతో "హర్ష అమ్మాయిని చూడడం కోసం వచ్చి" పదిరోజులుగా తిరుగుతూనే వున్నాను, వెదుకుతూనే వున్నాను. దేనికోసం వెతుకుతున్నానో కూడ తెలియదు. వెతకడం కోసం వెతకడం లాగుంది నా వెతుకులాట.

ఆ వెతుకులాటలో ఎందర్ని కలిసినాడో వాళ్ళ భాగోతమంతా చదువరికి చదివినంత.



అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్నది, భాషా రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తావన.

మొన్న తమిళనాడు లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడేవారిని చూసి ఆశ్చర్యమేసింది. రాష్ట్రాల ఏర్పాటు పేరిట తరాలుగా నివసిస్తున్న వారిని భాష పేరుతో తుండ్లు తుండ్లు గా తెగ నరికి పారేసినామనిపించింది.

మొరుసునాడులో తెలుగు తమిళము, కన్నడమూ, తొందనాడులో తెలుగు, తమిళమూ కలగూరగంప మాదిరిగా కలగలసి పొయ్యింది. ఆ రెండు తావులలో గూడా పెద్ద భాష తెలుగే!

మదరాసు గట్టిన చిన్నప్పనాయకుడూ, బెంగళూరు కట్టిన కేంప గౌడా ఇద్దరూ తెలుగోళ్ళే!

దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టినోళ్లు యీ సంగతులేవీ పట్టించుకోకుండా వాళ్ళకు అనుకూలంగా నరికిపారేసినారు.

కన్యాకుమారి నుంచి నాగపూర్ దాకా మిగిలిన అన్ని భాషల్లోకి కలగలసిపోయిన తెలుగోళ్లను వాక రాష్ట్రమనే కాంపౌండులోకి తెచ్చే దానికెట్లయితంది?

లోతుగా అలోచించాల్సిన సంగతులెన్నింటినో కూలంకషంగా చర్చకు లేవదీస్తున్న నవల ఇది.




రాయలసీమ ముఖచిత్రాన్ని అర్థవంతంగా ప్రస్తావిస్తున్న అద్భుతమయిన నవల ఇది.

" మొన్న వైరుధ్యాలు చూడు మనలో! ఒంటరితనమే సత్యమని నమ్మి కూడా పెళ్లి చేసుకోవాలనుకోవడం, పెళ్లి బందిఖానా అని తెలిసీ పెళ్లి చేసుకోవడం, నేనెవరో తెలుసుకోవడం కష్టమనీ తెలిసి వెతుక్కోవడం.... ఆధ్యాత్మికత అనుకుంటూ భౌతిక విషయాల దగ్గరే ఆగిపోవడం "__ ఇలాంటి తాత్విక చర్చలు బోలెడన్ని ఉన్న ఈ నవలను పనిబడి చదవండి. చాలా సంగతులు తెలుసుకుంటారు.

Read More
Next Story