మాట్లాడు...  (Sunday Poem)
x

Source: Jaume Plensa’s “Forgotten Dreams” at GRAY Chicago/Photo: Ted C. Fishman

మాట్లాడు... (Sunday Poem)

ఇల్లు సీక్వెల్ -17: గీతాంజలి "అవును నువ్వు విన్నదే నిజం..నాకు నువ్వు కాదు అతగాడే కావాలి. నా మాటలు వినేవాడు, నాతో మాట్లాడేవాడు ! ఇక నేను పోతున్నా, తలుపేసుకో !"



అవును కానీ..ఒకటిచెప్పు !
నాతో మాట్లాడవెందుకు ?
మాటలు రావా ఏంటి నీకు?
పుట్టింట్లో.. బళ్ళో..కాలేజీ లో ...
చిలకలా మాట్లాడిన నన్ను మూగదాన్ని చేసావెందుకు ?
నా నుంచి మాటలు, పాటలు,రాగాలు
కవిత్వం లాక్కున్నావేందుకు !
నీకేం మాటలు రాకనా..
మూగ వాడివైతే కాదు కదా!
చిన్నప్పుడు..నేను ఉట్టి కబుర్లపోగునని నాన్న..మాట్లాడకు..
అన్నేమో.. నీకేం తెలీదు..
నోరుమూస్కో..ఉష్ మాట్లాడకు..ఫో వంటింట్లో తగలడు!
గుమ్మం లో నిలుచోకు.. వీధిన పోయేటప్పుడు తలవంచుకో...
ఏం కొంగు భుజాల మీదకి కప్పుకొని చావు !
ఇవే మాటలు పుట్టింటి మగాళ్లతో.
ఇక్కడా అదే భాష ..అవే మాటలు !
అన్నం పెట్టమని
వేళ్ళను పెదాల మీద తడుతూ సైగ చేస్తావు.
నీళ్లు ,చాయ్ కూడా అదే మూగ భాషలో బొటన వేలు
పెదాలకి అంటిస్తూ అడుగుతావు.
పడక గదిలోకి త్వరగా రమ్మని కూడా అన్నీ సైగలతోనే !
చెవుడున్న మనిషి తో మాట్లాడుతున్నట్లు.
నువ్వు మూగాడివా?
***
పుట్టింటి మూగ తనం నుంచి..
కొన్ని మాటలు మూట గట్టుకుని నీ గడప తొక్కాను.
ఎన్నో మాట్లాడదామని..గలగల నవ్వుదామని..
నీకు పాటలు వినిపిద్దామని !
నువ్వు మాట్లాడక..నన్ను మాట్లాడనీయక
నా స్వరపేటికకి పక్షవాతం వచ్చేసింది !
గంటల కొద్దీ నీ ఆడ, మగ స్నేహితులతో మాట్లాడే నీకు
నా దగ్గర మాత్రం మూగతనం ఎందుకు ?
***
అది కాదుకానీ..ముందిది చెప్పు!
నీకూ.. నాకూ ఉన్న తాలూకు ఏంటో చెప్తావా కాస్త !
ఓహ్హ్... ఫుడ్ &బెడ్
మాత్రమేనా...
ఆడది అంతలోనే ఉండాలా ?
మీ ముత్తాతనుంచి నుంచి వచ్చిన వారసత్వామా ఇది ?
పెళ్లాలతో మాటలేంటి..చనువు,స్నేహం ఏంటి...
ఆమెను కాలి కింద చెప్పులా ఉంచేస్తే పోలా !
అవునందుకే మీ నానమ్మ...పిల్లులతో,
కుక్కలతో.. తోటలోని పక్షులతో.. పువ్వులతో
కబుర్లు చెప్పేది.
మీ అమ్మమ్మ..తనలో తానే రెండై..మూడై మాట్లాడుకునేది.
అంతెందుకు మీ అమ్మ కూడా వంటింట్లో గిన్నెలతో..మాట్లాడుతుంది..
వంటింటి కిటికీ దగ్గరకు రోజూ వచ్చే ఊర పిచ్చుకలతో మాట్లాడుతుంటుంది.
వాటిని చూస్తూ ఏవో రాగాలు కూడా తీస్తుంది !
మీ నాన్న ఆమె స్వరపేటిక కూడా నొక్కేసాడు.
అవును..ఎవరూ మాట్లాడేవాళ్ళు లేక
పిల్లి కుక్కలు పక్షులతో
అమ్మలు ఎన్ని కబుర్లు చెబుతారంటావు ?
ఇప్పుడు చూడు
నీ కొడుకు కూడా అన్నం పెట్టమని సైగ చేస్తున్నాడు.
*****
అవును గానీ...నాకిది చెప్పు...
నా చిన్న నాటి స్నేహితుడితో
నేను ఫోన్లో మాట్లాడితే తప్పేంటిట ?
ఎన్ని కబుర్లు చెబుతాడో తెలుసా ఒట్టి వసపిట్ట.
అతగాడితో నేనూ వసపిట్టనై పోయాను.
పదేళ్ల క్రితం పుట్టింటి నుంచి
నేను తెచ్చుకున్న మాటల మూటలు..
అతగాడి కోసం ఇప్పుడు విప్పేసాను.
మూటలోని మాటలకు రెక్కలొచ్చి.
నా పెదాల మీద వాలాయి..ఇక ఎన్నెన్ని కబుర్లనుకున్నావ్?
అతను వసంతాన్ని గురించి..కోయిల పాటల గురుంచి
నా చిన్న చిన్న కవితల గురించి
గజల్స్ గురుంచి...నా తోట గురుంచి..
నేనాపేసిన పీజీ చదువు గురుంచి మాట్లాడుతూనే ఉంటాడు.
ఎప్పుడూ ఉష్.. నోరుముసుకో అనడు.
మా మాటలకి అంతే లేదు..
నదులు, సముద్రాలు,ఆకాశం నక్షత్రాలు.. వెన్నెలలు
పూల తోటలు అన్నీ మా చుట్టూ సమావేశమై..విభ్రాంతిగా ..
ముచ్చటగా చూస్తూ ఉంటాయి మేం ముచ్చట్లాడడాన్ని !
***
అతనితో మాట్లాడద్ధంటావూ ?
ఎలా చెప్పు...అతను నాతో మాట్లాడుతూ ఉంటే...
నా మీద నాకు ఎంతో గౌరవం..ప్రేమ కలుగుతాయి
నా లోని సముద్రం ఉన్మత్తమై మబ్బుల దాకా ఉప్పొంగుతుంది.
నా లోపల ఒక అందమైన తోట మొలుస్తూ ఉంటుంది
నేను పూలు విరిసిన తోటలా సౌరభించి పోతుంటాను.
నా స్నేహితుడు నన్ను మూగదాన్ని కాకుండా కాపాడాడు మరి !
ఏంటీ మాట్లాడ్డం మానేయ్యాలా
నా వల్ల కాదు.
నాకు... నాతోమాట్లాడ్డం కావాలి..నన్ను వినడం కావాలి.
ఏంటీ మీ అమ్మలాగా.. నానమ్మలాగా పిల్లులు,
పక్షులు కుక్కలతో మాట్లాడుకోవాలా ?
అన్నిటినీ తెచ్చి ఇంట్లో పెడతావా ?
నువ్వు మాత్రం మాట్లాడవా...
నువ్వో మూగజంతువ్వి మరి !
అవును నువ్వు విన్నదే నిజం..నాకు నువ్వు కాదు అతగాడే కావాలి.
నా మాటలు వినేవాడు..నాతో మాట్లాడేవాడు !
ఇక నేను పోతున్నా ..తలుపేసుకో !



Read More
Next Story