
విభక్తి ప్రత్యయాలతో పోతన భాగవత పద్యాలు
భాగవతోదాహరణము
విభక్తి ప్రత్యయాలతో పద్యాలు రచించే పద్ధతి నన్నయాది కవులలో ఉంది. బమ్మెరపోతనామాత్యులవారు కూడ ఉదాహరణ కావ్యాలలోవలె ప్రత్యేక విశిష్టత కలిగినపద్యాలను రచించినారు. భాగవతాన్నంతా పరిశీలిస్తే ప్రథమ, ద్వితీయ, తృతీయ,చతుర్థీ,పంచమీ,షష్ఠీ,సప్తమీ,సంబోధన.. విభక్తులతో ఉన్న పద్యాలు ఏరి వరుసగా కూర్చితే అదొక లఘు ఉదాహరణ కావ్యంగా దర్శనమిస్తుంది ----
ప్రథమావిభక్తి
ఉ.నల్లనివాడు,పద్మనయనంబులవాడు,మహాశుగంబులన్
విల్లునుదాల్చువాడు,గడువిప్పగువక్షమువాడు,మేలుపై
జల్లెడువాడు,నిక్కినభుజంబులవాడు,యశంబు దిక్కులం
జల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మాకభీష్టముల్ -౧
(నవమస్కంధం,361)
ద్వితీయావిభక్తి
శా.నీపద్యావళులాలకించు చెవులున్,
నిన్నాడువాక్యంబులున్,
నీ పేరం బనిసేయు హస్తయుగముల్,
నీమూర్తిపై జూపులున్,
నీ పాదంబుల పొంత మ్రొక్కుశిరముల్,
నీ సేవపై జిత్తముల్,
నీపైబుద్ధులు మాకునిమ్ము కరుణన్,
నీరేజపత్రేక్షణా! -౨
(దశమస్కంధం,పూర్వ, 408)
తృతీయావిభక్తి
శా. తాటంకాచలనంబుతో, భుజనట
ద్ధమ్మిల్లబంధంబుతో,
శాటీముక్త కుచంబుతో, నదృఢ చం
చత్కాంచితో శీర్ణ లా
లాటాలేపముతో, మనోహరకరా
లగ్నోత్తరీయంబుతో,
గోటీందుప్రభతో,నురోజభర సం
కోచద్విలగ్నంబుతోన్-౩
(అష్టమస్కంధం, 102)
చతుర్థీ విభక్తి
సీ.పంకజనాభాయ-సంకర్షణాయ శాం
తాయ విశ్వప్రబో-ధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే-సూక్ష్మాయ వాసుదే
వాయ పూర్ణాయ పు-ణ్యాయ నిర్వి
కారాయ కర్మని-స్తారకాయ త్రయీ
పాలాయ త్రైలోక్య-పాలకాయ
సోమరూపాయ తే-జోబలాఢ్యాయ స్వ
యం జ్యోతిషే దురన్యాయ కర్మ
తే.సాధనాయ పురాపురు-షాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ-పృధ్విరూప
కాయ లోకాయ నభసే౭న్తకాయ విశ్వ
యోనయే విష్ణవే జిష్ణ-వే నమో౭స్తు -౪
-చతుర్థస్కంధం702
సీ.స్వర్గాపవర్గ సు-ద్వారాయ సర్వ ర
సాత్మనే పరమహం-సాయ ధర్మ
పాలాయ సద్ధిత-ఫలరూపకాయ కృ
ష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తి
యుక్తాయ ఘనసాంఖ్య-యోగీశ్వరాయ హి
రణ్య వీర్యాయ-రుద్రాయ శిష్ట
నాథాయ దుష్ట వి-నాశాయ శూన్య ప్ర
వృత్తాయ కర్మణే మృత్యవే వి
తే.రాట్ఛరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి
భూతయే నివృత్తాయ స-త్పుణ్య భూరి
వర్చసే౭ఖిల ధర్మదే-హాయ చాత్మ
నే౭ నిరుద్ధాయ నిభృతాత్మ-నే నమో౭స్తు. -౫
-చతుర్థస్కంధం,703
తే.సర్వసత్తాయ దేవాయ-సన్నియామ
కాయ బహిరంతరాత్మనే-కారణాత్మ
నే సమస్తార్థలింగాయ-నిర్గుణాయ
వేధసే జితాత్మక సాధ-వే నమో౭స్తు. -౬
(చతుర్థస్కంధం,704)
5 పంచమీవిభక్తి---
క.నీకంటె నొం డెరుంగము,
నీకంటెం బరులు గావ నేరరు జగముల్,
నీకంటె నొడయ డెవ్వడు,
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా! -౭
-అష్టమస్కంధం,231
షష్ఠీవిభక్తి
శా.శ్రీ కైవల్యపదంబు జేరుటకునై-జింతించెదన్,లోక ర
క్షైకారంభకు,భక్తపాలనకళా-సంరంభకున్,దానవో
ద్రేకస్తంభకు, గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు,మహా-నందాంగనా డింభకున్
(ప్రథమస్కంధం,1)
ఉ.హారికి,నందగోకుల వి-హారికి,జక్రసమీర దైత్య సం
హారికి,భక్తదుఃఖపరి-హారికి,గోపనితంబినీ మనో
హారికి,దుష్టసంపదప-హారికి, ఘోష కుటీ పయో ఘృతా
హారికి,బాలకగ్రహ మ-హాసురదుర్వనితాప్రహారికిన్ -౯
(ప్రథమస్కంధం,29)
ఉ.శీలికి,నీతిశాలికి,వ-శీకృతశూలికి,బాణహస్త ని
ర్మూలికి,ఘోరనీరద వి-ముక్తశిలాహత గోపగోపికా
పాలికి,వర్ణధర్మ పరి-పాలికి,నర్జునభూజయుగ్మ సం
చాలికి,మాలికిన్,విపుల-చక్రనిరుద్ధ మరీచి మాలికిన్-౧౦
(ప్రథమస్కంధం,30)
ఉ.క్షంతకు,గాళియోరగ వి-శాలఫణావళినర్తనక్రియా
రంతకు,నుల్ల సన్మగధ-రాజ చతుర్విధ ఘోరవాహినీ
హంతకు,నింద్రనందన నియంతకు,సర్వచరాచరావళీ
మంతకు,నిర్జితేంద్రియ స-మంచిత భక్తజనానుగంతకున్-౧౧
(ప్రథమస్కంధం,31)
ఉ.న్యాయికి,భూసురేంద్రమృత-నందనదాయికి,రుక్మిణీ మన
స్థ్సాయికి,భూతసమ్మద వి-ధాయికి,సాధుజనానురాగ సం
ధాయికి,బీతవస్త్రపరి-ధాయికి,బద్మభవాండభాండ ని
ర్మాయికి,గోపికానివహ-మందిరయాయికి,శేషశాయికిన్-౧౨
(ప్రథమస్కంధం,32)
చ.వశుడుగమ్రొక్కెదన్ లవణవార్థివిజృంభణతానివర్తికిన్,
దశదిగధీశ మౌళి మణిదర్పణ మండిత దివ్యకీర్తికిన్,
దశశతభానుమూర్తికి,సుధారుచిభాషికి,సాధుపోషికిన్,
దశరథరాజుపట్టికిని,దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్ -౧౩
(నవమస్క౦ధం,360)
సప్తమీవిభక్తి
క. నీ యంద సంభవించును,
నీ యంద వసించియుండు నిఖిలజగములున్,
నీ యంద లయము బొందును,
నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా! -౧౪
(అష్టమస్కంధం,222)
సంబోధనం
ఉ.ఓ కమలాప్త!యో వరద!యో ప్రతిపక్షవిపక్షదూర!కు
య్యో!కవియోగవంద్య!సుగుణోత్తమ!యోశరణాగతామరా
నోకహ!యోమునీశ్వరమనోహర!యోవిమలప్రభావ!రా
వే!కరుణింపవే!తలపవే!శరణార్థిని నన్నుగావవే!! -౧౫
(అష్టమస్కంధం,902)
-సమర్పణ
వైద్యం వేంకటేశ్వరాచార్యులు
(సంస్కతాంధ్ర పండితుడు)
Next Story