
1808 లొ తెలుగు జిల్లాల కథ ఎలా మొదలైందంటే.. 26 అబ్బురపరిచే సత్యాలు
తెలుగు జిల్లాల పునర్వ్యవస్థీకరణ 1881-1931 మధ్య భారీగా జరిగింది, కేవలం పరిపాలనా సౌలభ్యమే కారణం. ఇపుడు ఏది జరిగినా దాని వెనక రాజకీయాలుంటాయనే అనుమాన సర్వత్రా ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరొక సారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సందర్బంగా ప్రత్యేక కథనం.
పూర్వం రాజుల కాలంలో మండలాలు అనే పరిపాలనా విభాగాలు ఉండేవేమో గాని 1808కి ముందు ఇపుడు మనం చూస్తున్న జిల్లాలు లేవు, కలెక్టర్లు లేరు. అపుడు జమిందారులు, సామంతరాజులు, పాలెగాళ్లదే పాలన. తెలుగు ప్రాంతాలకు సంబంధించి మొట్టమొదటి కలెక్టర్ థామస్ మన్రో (Major-General Sir Thomas Munro: 27 May 1761 – 6 July 1827). నిజానికి ఆయన కూడా జిల్లా కలెక్టర్ కాదు. ఎందుకంటే ఆయన సీడెడ్ ఏరియా మొత్తానికి ప్రిన్సిపల్ కలెక్టర్. ఈ పోస్టు ఆయనతో వచ్చింది ఆయనతోనే పోయింది. సీడెడ్ ఏరియా యాక్ట్ అనేది అక్టోబర్ 12, 1800 లో ఈస్టిండియా కంపెనీకి, హైదరాబాద్ నవాబుకు మధ్య జరిగిన ఒక సైనిక శాశ్వత ఒప్పందం. దీని ప్రకారం నిజాంనవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసిన భూభాగం ఇది. యుద్ధంలో ఓడిపోయాక టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని నైజాం, మైసూరు రాజులు పంచుకున్నారు. యుద్ధాలతో భయపడిపోయిన నిజాం రక్షణ కోసం కంపెనీ సాయం తీసుకున్నాడు. కంపెనీ ఆయనకు సైన్యం కాపలా పెట్టింది. సైన్యానికయ్యే ఖర్చుకోసం ఈ భూభాగాన్ని నిజాం కంపెనీకి ఇచ్చాడు. ఈమేరకు అప్పటి హైదరాబాద్ రెసిడెంట్ జేమ్స్ కీర్క్ పాట్రిక్ (Lieutenant-Colonel James Achilles Kirkpatrick :1764 – 15 October 1805), నిజాం నవాబుకు ఒప్పందం జరిగింది. అప్పటి నుంచే జిల్లాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ మొదలయింది. ప్రధాన జిల్లాలన్నీ 1881- 1931 మధ్యే ఏర్పడ్దాయి. అయితే, పునర్వ్యవస్థీకరణ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
నిజామ్ ప్రభువుకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం టైటిల్ ఇది.
1) SCHEDULE referred to in the TREATY. SCHEDULE of HIS HIGHNESS the NIZAM'S territorial acquisitions by the TREATY of SERINGAPATAM, dated the 18th May 1792, and by the TREATY of MYSORE, dated the 22nd June 1799, and which, in conformity to the fifth and sixth Articles of the annexed TREATY are now, together with the TALOOK of ADONI, and all other talooks situated to the south of the RIVERS TOOMBUDDRAH and KISTNAH, ceded in full and in perpetuity to the HONOURABLE EAST INDIA COMPANY.
2) థామస్ మన్రో చిత్రమయిన అధికారి. మందీ మార్బలం వెంటసుకుని పోయే వాడు. ప్రొటోకోల్ ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆనాటి అధికార వాహనం గుర్రమే. ఆయన గర్రెమెక్కి సాధ్యమయినంతవరకు ఒంటరిగానే పోయేవాడు. కాకపోతే, ఒకరిద్దరు సహాయకులు ఉండేవారు. మన్రో తర్వాత వచ్చిన కలెక్టర్లు రాయలసీమ ప్రాంతంలో పేదలకోసం బాగా శ్రమించారు. ముఖ్యంగా కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు కరువు సహాయ పనులు పెద్ద ఎత్తున చేపట్టే వారు.
3) ఈ భూభాగం బళ్లారి, అనంతపురం, కడప, కర్నూల్ లో కొంత భాగం (ఆదోని) దాకా విస్తరించి ఉంటుంది. ఈ భూభాగానికి ధామస్ మన్రో ప్రిన్సిపల్ కలెక్టర్ గా వచ్చాడు. ఆయన కాలంలో మద్రాసుప్రెశిడెన్సీలో అత్యధికా పన్ను వసూలు చేసిన ప్రాంతం ఇదే. పాలెగాళ్లను అణచేసికంపెనీకి పన్నురాబడి విపరీతంగా పెంచాడు. దీనితో కంపెనీ ఆయనకు ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఈ రాబడి ఈ ప్రవేశపెట్టిన రైత్వారి విధానం కూడా ఒక కారణం. సీడెడ్ ప్రాంతం హెడ్ క్వార్టర్స్ బళ్లారి, ఆయన నివసించింది. అనంతపురం జిల్లాలో. ఆయన గెస్ట్ హౌస్ ఒకటి మదనపల్లెలో కట్టుకున్నారు.
4) థామస్ మన్రో కింద నాలుగు సబ్ డివిజన్లు ఉండేవి. వాటికి కలెక్టర్స్ ఉండేవారు. 1807 మన్రో సెలవుమీద లండన్ వెళ్లిపోయారు. ఆ మరుసటి సంవత్సరం సీడెడె జిల్లా నుఅంటే బళ్లారి జిల్లాను రెండు విభజించారు. దీనితో బళ్లారి, కడప అనే రెండు జిల్లాలు ఏర్పడాయి. ఇప్పటి అనంతపురం జిల్లా బళ్లారి జిల్లాలోనే ఉండింది. ఇది జిల్లా కావడానికి మరొక 75 యేళ్లు పట్టింది. అంటే అనంతపురం జిల్లా 1882లో ఏర్పడింది.
5) 1807-1808 లో ఏర్పడిన కడప జిల్లా మద్రాస్ ప్రశిడెన్సీలో రెండో పెద్ద జిల్లాగా పేరు ఉండింది. అపుడు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ సిద్దవటంలో ఉండింది. ఈ జిల్లాలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 తాలూకాలు ఉండేవి. అవి: బద్వేల్, జమ్మలమడుగు, దువ్వూరు, చిట్వేల్, సిద్ధవటం, చెన్నూరు, చింతకుంట,కమలాపురం, పులివెందుల, రాయచోటి, కంబం, గిద్దలూరు, దూపాడు, కోయిలకుంట్ల, నొస్సం, గుర్రంకొండ, పుంగనూరు, మదనపల్ల, వాయల్పాడు.
6) 1812లో జిల్లా పునర్వ్యవస్థీకరణ మొదలయింది. ఆ యేడాది పెన్నానదిలో వచ్చిన వరదలు సిద్ధవటాన్ని ముంచేయడంతో జిల్లా కేంద్రాన్ని కడప పట్టణానికి మార్చారు. రాష్ట్రంలో 217 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక జిల్లా కడప జిల్లాయే.
7) 1823లో రాజమండ్రి జిల్లా ఏర్పాటయింది. దీనిని 1825లో దీనిని పునర్వ్యవస్థీకరించి గోదావరి, కృష్ణా జిల్లాలను ఏర్పాటుచేశారు.
8) 1856లో కడప జిల్తా రెండో సారి పునర్వ్యవస్థీకరణకు గురయింది. ఈ సారి పుంగనూరు జమిందారీని కడప జిల్లానుంచి వేరు చేసి నార్త్ ఆర్కాట్ జిల్లాకు కలిపారు.
9) 1858లో మరొకసారి కడప జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ సారి కోయిలకుంట్, కంబం, దూపాడులను వేరు చేసి కర్నూలు జిల్లాలో కలిపారు.
10) మరొక పునర్యవస్థీకరణ 1910 లోజరిగింది.అపుడు కదిరి తాలూకాని అనంతపురం జిల్లాలో కలిపారు.
11) 1911లో మదనపల్లె, వాయల్పాడు తాలూకాలను కడప జిల్లా నుంచి వేరు చేసి చిత్తూరు జిల్లాలో కలిపారు. 2022లో పునర్వ్యవస్థీకరణ జరిగాకా మదనపల్లె అన్నమయ్య జిల్లాకు పోయింది.
12) 1882లో బళ్లారి జిల్లాను మరొక సారి విడదీసి అనంతపురం జిల్లాను ఏర్పాటుచేశారు. 1910 లో కదిరి తాలూకాను అనంతపురానికి తీసుకువచ్చారు.
13) 1904లో క్రిష్ణా,నెల్లూరు గోదావరి జిలాలను పునర్వ్యవస్థీకరించి నాలుగు జిల్లాలు చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లా గుంటూరు
14) 1911 ఏప్రిల్ 1న నార్త్ ఆర్కాట్ జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంతవరకు నార్త్ ఆర్కాట్ జిల్లానుంచి కొన్ని భాగాలు విడదీసి చిత్తూరు జిల్లాను ఏర్పాటుచేశారు. అంతవరకు నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉన్న మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు చిత్తూరు జిల్లాలోకి వచ్చాయి
15) 1928లో నార్త్ ఆర్కాట్ జిల్లాలోని కన్గుండి జమిందారిలోని కొన్ని గ్రామాలను చిత్తూరు జిల్లాకు కలిపారు.
16) 1911 ఫిబ్రవరి 15న చెంగల్పట్టు జిల్లాకు చెందిన తిరువల్లూరు తాలూకాను నెల్లూరు జిల్లాకు కలిపారు.
17) 1925 ఏప్రిల్ 15 న క్రిష్ణా జిల్లాను పునర్వ్యవస్థీకరించి గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ గోదావరి జిల్లా పేరును తూర్పు గోదావరి అని నామకరణం చేశారు. తర్వాత గోదారిని కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం. కార్యాలయలన్నీ ఏలూరులో ఉండేది,
18) 1910 అక్టోబర్ 1 న నెల్లూరు జిల్లాలో కొవ్వూరు ఏరియాను తాలూకా గా చేశారు. అంతవరకు అక్కడ ఉన్న డిప్యూటీ తాశీల్దార్ కార్యాలయాన్ని రద్దు చేశారు.
19) 1910 లో కర్నూలు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంతవరకు కర్నూలు సమీపాన ఉన్న రామళ్ళకోట తాలుకాగా ఉండింది. అది డివిజన్ కేంద్రం కూడా. దానిని రద్దు చేసి డోన్, కర్నూలు తాలూకాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, కర్నూలు, డోన్ లను డివిజన్ స్థాయికి తీసుకువచ్చారు.
20) 1929 ఏప్రిల్ 19న ఆదోని తాలూకాలోని 33 గ్రామాలను,ఆలూరు తాలూకాలోని 6 గ్రామాలను, బళ్లారి తాలూకాలోని 46 గ్రామాలను కలిపి సిరిగుప్ప తాలూకాను పునరుద్ధరించి బళ్లారి డివిజినలో తీసుకున్నారు.
21) 1910 అక్టోబర్ 1న అనకాపల్లి డిప్యూటీ తాశీల్దార్ డివిజిన్ ను విశాఖపట్టణం డివిజిన్ లోకి తీసుకున్నారు.
22) 1910 అక్టోబర్ 1న గోదావరి జిల్లాలో బిక్కవోలులో డిప్యూటీ తాశీల్దార్ కార్యాలయం ఏర్పాటుచేశారు.
23) 1910 నవంబర 1, క్రిష్ణా జిల్లా నూజివీడు, గుడివాడ తాలూకాల్లోని గ్రామాలతో కైకలూరు తాలూక ఏర్పాటు చేశారు.
24) 1926 జనవరి 4న పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు తాలూకాలను ఏడుతాలూకాలుగా పునర్వ్యవస్థీకరించారు.1927 లో మరొక సారి రెవిన్యూ డివిజన్లను మార్చారు.
25) 1928 జూలై ఒకటిన జమ్మల మడుగు రెవిన్యూ డివిజన్ నుంచి కమలాపురం ను కడప రెవిన్యూ డివిజన్ కు మార్చారు.
25) 1931లో తూర్పు గోదావరి జిల్లాను మరొక సారి పునర్వ్యవస్థీకరించారు.
26 1950లో విశాఖపట్టణం విభజించి శ్రీకాకులం జిల్లా ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 1979 మేలో శ్రీకాకుళంజల్లాలోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం జిల్లా ఏర్పాటు చేశారు.
ముగింపు
1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం, 2014లో తెలంగాణ విడిపోవడం జరిగాక జిల్లా పునర్వ్యవస్థీకరణ చాలా ఉధృతంగా జరిగింది. అదింకా కొనసాగుతూ ఉంది. అయితే, 1881-1931 మధ్య ఇప్పటి రాజకీయాల్లేవు. ఎన్నికలు లేవు. ఇలాంటి నియోజకవర్గాలు లేవు. కాబట్టి జిల్లాల ఏర్పాటులో పునర్వ్యవస్థీకరణ పూర్తిగా పాలనాసౌలభ్యం మేరకే జరిగిందనుకోవాలి. అపుడున్న నేతలంతా కాంగ్రెస్ వాళ్లే కాబట్టి, వాళ్ల ప్రభావం ఏమైనా ఉందేమో ఏవరైనా చరిత్రపరిశోధకులు చెప్పాలి.
ఇది కూాడా చదవండి
రాయలసీమ 'భూదేవుడు' సర్ థామస్ మన్రోకి నివాళి

