లెమన్ గ్రాస్ పంట వేశామంటే.. వద్దన్నా డబ్బే..
x

లెమన్ గ్రాస్ పంట వేశామంటే.. వద్దన్నా డబ్బే..

ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ఆదాయం రెట్టింపు వస్తుంది.


ఈ పంటకు కాపలా అవసరం లేదు, జంతువుల బెడద లేదు, పండించేందుకు ప్రత్యేకంగా ఎరువుల అవసరం లేదు. కీటకాలు ఈ పంటను ఆశించవు.

పెద్దగా పెట్టుబడి అవసరం లేదు, వర్షాలు పడకపోయిన ఇబ్బంది లేదు,

సారం లేని భూములే ఈ సాగుకు అనుకూలం. ఇన్ని విశిష్టతలున్న పంటను సాగు చేయాలనుకుంటున్నారా? అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే, శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం,పోలేరు గ్రామంలో కడియం కేశవరావును పకలకరించాలి.

ఒరిస్సా,ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో సంప్రదాయ పంటలతో వరుస నష్టాలు చూసిన ఈ సిక్కోలు రైతు ఇపుడు వినూత్న పంటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇతడు చేస్తున్న గడ్డిసాగు ఎందరికో స్ఫూర్తి.

వరదలను తట్టుకుంటుంది. అకును నలిపితే నిమ్మ వాసం వస్తుంది.

‘‘ గడ్డే కదాని లైట్‌ తీసుకోకండీ, ఈ కరోనా కాలంలో ఓ రేంజ్‌లో డిమాండ్‌ ఉన్న నిమ్మగడ్డి ఇది. ’’ అంటాడు కేశవరావు‘ ఫెడరల్‌ తెలంగాణ ’ప్రతినిధికి తన విజయ గాథ చెబుతూ.

నీరు తక్కువ ఉన్నచోటునే ఎక్కువగా పెరుగుతుంది.

వరి వేసి నష్టాల పాలయ్యాను

గతంలో వరి పంట సాగు చేసిన ఈ రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడినా పంట నిలవదని గుర్తించి, ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టిపెట్టాడు సామాజిక మాధ్యమాలలో అన్వేషించి, బీడు భూముల్లో ఏ పంట వేస్తే లాభదాయకమో తెలుసుకున్నాడు. అలా నిమ్మ గడ్డి సేద్యం వైపు అడుగులు వేశాడు. ఒరిస్సాలో ఈ పంటను విజయవంతంగా సాగు చేస్తున్న రైతులను కలిసి మార్కెట్‌ పై అవగాహన పెంచుకున్నాడు.


‘‘ ఒకసారి లెమన్‌ గ్రాస్‌ పంటను వేస్తే కోతకు రావడానికి కేవలం మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే పడుతుంది. తరువాత ప్రతీపంట 2నెలలు. అంతే కాదు.. ఏడాదిలో ఒక మొక్కను కనీసం ఆరు నుంచి ఏడు సార్లు వరకు కోయవచ్చు. మనం కోస్తూ ఉంటే ఈ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మరో విశేషం ఏమంటే, విత్తనాలు ఒకసారి నాటితే 8 నుండి 10 ఏళ్ల పాటు పంట వస్తూనే ఉంటుంది. ’’ అని ఈ సాగులో సౌలభ్యం వివరించారు కేశవరావు.

లెమన్‌ గ్రాస్‌ని సాగును తొలి సారి మొదలు పెట్టిన రైతు కేశవ రావు

ఎకరాకు ఒక పంటకు దిగుబడి 3 టన్నులు. దీని నుండి 30లీటర్ల లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌ వస్తుంది. లీటర్‌ నూనె కనీసం వెయ్యి రూపాయల నుంచి 1600 రూపాయల వరకు ఉంటుంది.

నూనె ఎలా తీస్తారు ?

నిమ్మ గడ్డి మొక్కలను తుంచి వాసన చూస్తే నిమ్మ కాయ వాసన వస్తోందంటే చాలు.. అది కోసేందుకు సిద్ధంగా ఉన్నట్టే. అప్పుడు దానిని భూమి నుంచి ఐదు అంగుళాల పైకి కట్‌ చేసి కట్టలు కట్టి అమ్ముకోవచ్చు. లేదా నూనెను తీసి అమ్మితే మరింత లాభం వస్తుంది. స్టీమ్‌ డిస్టిలేషన్‌ పద్దతి లో నూనె తీస్తారు. దీని కోసం డిస్టిలేషన్‌ యంత్రం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పంట పండించే రైతులు బృందంగా ఏర్పడి ఉమ్మడిగా ఈ యంత్రం సమకూర్చుకుంటే ఆర్ధిక భారం ఉండదు.

మెట్ట ప్రాంతపు రైతులకు నిమ్మగడ్డి వరం

కోసిన పచ్చగడ్డిని డిస్టిలేషన్‌ ట్యాంక్‌లో నింపి బ్రాయిలర్‌లో మండిస్తారు. ట్యాంక్ లోకి నీరు చేరేలా పైపులుంటాయి. గడ్డి ఉడికి వెలువడే ఆవిరితో నూనె తయారవుతుంది. ఆయిల్‌ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల కట్టెల ఖర్చు మిగులుతోంది. టన్ను గడ్డికి పదిలీటర్ల తైలం వస్తుంది.

నిమ్మ గడ్డితో తీసిన ఆయల్‌

తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం!

ఈ పంటకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కేవలం ముప్ఫై నుంచి నలభై వేల రూపాయల ఖర్చుతో లక్షల్లో లాభాలను ఆర్జించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఎకరానికి సంవత్సరానికి లక్ష నుంచి లక్షా యాభై వేల ఆదాయం వస్తుంది.

డిస్టిలేషన్‌ ప్లాంట్‌

ఈ నూనెకు డిమాండ్‌ ఎందుకు?

దీన్ని కాస్మెటిక్‌, డిటర్జెంట్లు, సువాసన ద్రవ్యాల తయారీ లో, దోమలను నివారించే లిక్విడ్‌లలో, మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే దీనికి డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది.


యంత్రం ద్వారా నిమ్మ గడ్డి నుండి తైలం తీస్తున్న దృశ్యాలు

వరికంటే ఎక్కువ ఆదాయం!

‘‘ సాగునీరు లేని, మా ప్రాంతంలో వరి వేస్తే ఖర్చులన్నీ పోనూ, ఎకరాకు ఇరవై వేలు కూడా మిగలదు. అదే నిమ్మ గడ్డిని సాగు చేస్తే లక్షల్లో ఆదాయం. మెట్ట రైతులకు ఇంతకు మించిన పంట లేదు!! ’’ అని ధీమాగా అంటాడు కేశవరావు.

Read More
Next Story