(హాస్యం) అవును, అపుడపుడూ ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది!
x

(హాస్యం) అవును, అపుడపుడూ ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది!

రోజూ వాషింగ్ మెషిన్ వేయడం నా డ్యూటీ. ఆరాకా వాటిని మంచం మీద పడేస్తే మా ఆవిడ ఆనక మడతలు పెడుతుంది. ఆవిడ శ్రమ తగ్గిద్దామని నా బట్టలు మడత పెట్టుకున్నానా...


తెల్లారితే మా ఇంట్లో కిట్టీ పార్టీ. ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. నేను సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఇది మా ఇల్లేనా అనిపించింది. ఇల్లంతా చాలా నీట్ గా వుంది.

కిట్టీ పార్టీ డ్రాయింగ్ రూమ్ లో. మా డ్రాయింగ్ రూమ్ కాస్త పెద్దదికాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఆడ గ్యాంగ్ అంతా మా బెడ్రూమ్ లో కి ఇంట్లోవున్న కుర్చీలన్నీ పట్టుకుపోయి నానా కంగాళీ చేసివుండేవారు. మా మంచంకూడా తొక్కి తగలేసి వుండేవాళ్ళు.

వీళ్ళ పార్టీ వున్నంతసేపూ నేను హాయిగా బెడ్రూమ్లో పడివుండొచ్చు. ఓ రెండుమూడు గంటలు నాకు రిలీఫ్. హాయిగా నా లాప్ టాప్ లో ఏదైనా ఓ మంచి ఇంగ్లీషు ఫైటింగ్ సినిమా చూడొచ్చు, కచ్చితంగా ఆ పార్టీ టైమ్ లో మా ఆవిడ నన్ను పిలవదు. భలే అనుకున్నాను. లేకపోతే ప్రతిరోజు దిక్కు మాలిన దరిద్రపు గొట్టు సీరియల్సు చూడాల్సిందే.

అత్తగారు, మొగుడ్ని వదిలేసి పుట్టింట్లో తిష్టవేసిన ఆడబొడుచు కలిసి కోడల్ని ఏలా వేయించుకుతిందామా అని గంటల తరబడి ప్లాన్లు వేయడం లేదా అత్తగార్ని ఏ యాంగిల్ లో పీక పిసికి చంపుదామా లేదా మెట్లు దిగుతోంటే జారి పడేలా చేద్దామా అని ఆలోచించే కోడలు-- ఇవేకదండి ముదనష్టపు సీరియల్సు చూడలేక చస్తున్నాం.

నా ఫ్రెండ్ మనోహర్ "ఐరెన్ ఫిస్ట్" చూడండి మీకు నచ్చుతుంది అని రికమెండ్ చేసాడు కూడా. హమ్మయ్య, ఇన్నాళ్టికి స్వతంత్రంగా నాకిష్టమైన సీరియల్ చూడొచ్చు అని సంబరపడ్డాను.

అన్నట్టు రేపు నేను ఓ గంట పర్మిషన్ పెట్టి వస్తూవస్తూ ఓ కిలో క్యాలీఫ్లవర్ పట్రావాలికదా? మర్చిపోయి వస్తే మళ్ళీ చచ్చినట్టు పొలోమంటూ బయలుదేరాలి.

భార్య వాక్ పరిపాలకుడిలా వుండు లేదా కనీసం నటించి తగలడు అప్పుడు నీ బతుకు బావుండి తగలడతుంది అని ఆ సుబ్బిగాడు ఓ వుచిత సలహా పడేసాడు కదా.

పోనిలే ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని వాడు చెప్పినట్టే వింటున్నాను. ఒక్కోసారి నా భార్యామణి లీలలు భరించలేక ఆవేశం దిగమింగుకుని మనసులో ఆ సుబ్బిగాడిని శాపనార్థాలు పెట్టుకుంటూ మొహం మీద నవ్వు పులుముకుని ఆమెగారి మెప్పు కోసం నానా తిప్పలు పడుతున్నాను.

మొన్న ఏమైందో తెలుసా?

మా పనిమనిషి తన కూతురు పెళ్ళిఅని నెల్లాళ్ళు సెలవు పెట్టేసింది. దాంతో నా ఖర్మ కాలింది. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.

"ఏమండీ, రేపటి నుంచీ పనిమనిషి నెల్లాళ్ళపాటు రాదు. అది వచ్చేవరకూ మీరు నాకు పొద్దున పూట ఇంకొంచం అదనంగా హెల్ప్ చేయాలి. పేపరు చదవడాలు, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపడాలు కాస్త తగ్గించండి. రోజూ ఇల్లు తుడిచి రెండు రోజుల కొకసారి మాప్ చేస్తే చాలు. నాకు కీళ్ళ నొప్పులు కదా , ఆ పనులు నా వల్ల కాదు" అని ఓ చిన్న సైజు లెక్చర్ ఇచ్చింది.

"ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది;

ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది" అని ఇంచక్కా పాడుకుంటూ ఈ నెల్లాళ్ళు పని చేసుకుందామండి అంది మా ఆవిడ గోముగా.

నువ్వు దంచు , నేను గూడలు ఎగరేస్తాను అన్న సామెత జ్ఞాపకం వచ్చింది.

ఎవరు దంచుతారో ఎవరు గూడలెగరేస్తారో నాకు బాగా అనుభవమే సుమండీ.

ఈ నెల్లాళ్ళూ ఎదురుదెబ్బలెన్ని తగిలినా నాకు బాగా తట్టుకునే శక్తి ప్రసాదించండి అని అన్ని దేముళ్ళనీ మనసులో ప్రార్థించుకున్నాను.

మీ ఆవిడ మనసెరిగి మసులుకో అని ఆ సుబ్బిగాడు గీతోపదేశం చేసినప్పటినుంచి నేను పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయినా నాకు చివాట్లు తప్పడం లేదు. నా జాతకం అలాంటిది.

చచ్చేలా చాకిరీ చేయడం చివాట్లు తినడం నాకు అలవాటు అయిపోయింది. మా ముహుర్త బలం అలాంటిది. మొన్న ఒక పత్రిక లో చదివిన జోక్ గుర్తొచ్చి లోలోపల నవ్వుకున్నాను. "ఏమండీ మన పెళ్ళి జరిపించిన పురోహితుడు యాక్సిడెంట్లో పోయాట్టండి పాపం "అని భార్య అంటే "చేసిన పాపం వూరికే పోతుందా"అంటాడు భర్త.

ప్రతి రోజూ వాషింగ్ మెషిన్లో బట్టలు వుతికి ఆరేయడం నా డ్యూటీ. బట్టలన్నీ ఆరాకా వాటిని మంచం మీద పడేస్తే మా ఆవిడ ఆనక మడతలు పెడుతుంది. కొంచమేనా మా ఆవిడి శ్రమ తగ్గిద్దామని నా బట్టలు మడత పెట్టుకున్నాను. "ఓహో మీ బట్టలు మాత్రం మడత పెట్టు కున్నారన్నమాట అని మా ఆవిడ నిష్టూరంగా మాట్లాడింది.

సరే ఇలా లాభంలేదని మా ఆవిడ బట్టలు కూడా ఒజ్జుగా మడతలు పెట్టాను. కాస్త సంతోషిస్తుందేమోనని ఆశ పడ్డాను. "మడతలు పెట్టిన బట్టలు అలా మంచంమీద వదిలేయకపోతే, బట్టల బీరువాలో ఎవరి బట్ఠలు అక్కడ సర్దొచ్చు కదా . నేనొచ్చి సర్దాలా అసలే పని ఎక్కువై చేయలేక చస్తున్నాను అని విసుక్కుంది. ఇదండీ నా చివాట్ల బతుకు. ఏదో మంచికి పొతే అంటారు చూసారూ అదీ నా పరిస్థితి .ఏ పగవాడికీ అదే ఏ పగ భర్తకీ రాకూడదు అనుకున్నాను మనసులో.

ఆ సుబ్బిగాడికి నా చేతిలో చావు రాసిపెట్టుంది. ఈ సారి కనిపిస్తే మటుకు వాణ్ణి వదలకూడదని మనసులో శపథం చేసుకున్నాను.

కొన్నాళ్ళ కిందట, ఒకసారి మా ఆవిడ వుతికిన బట్టలు మడతపెడతూండగా నన్ను చూసి మీకు బట్టలు మడత పెట్టడం వచ్చా అని మా ఆవిడ అడిగింది. ఆ వచ్చు అదేమైనా బ్రహ్మవిద్యా ఏమిటి అన్నాను.

"ఏది, ఈ నైటీ మడత పెట్టండి"అంది. నేనెంత ఘోరమైన పొరపాటు చేసానో అప్పుడు నాకు అర్థం అయింది. నా జన్మలో ఎప్పుడైనా బట్టలు మడత పెడితే కదా ఈ నైటీ మడత పెట్టడానికి ? నాకు చేత నైనట్టు మడతపెట్టాను. అది చూసి మా ఆవిడ పకపకా నవ్వి "ఎంత అష్టావక్రంగా మడిచారండీ, ఇంకెప్పుడూ జీవితంలో ఇలాంటి సాహసాలు చేయనని ప్రామిస్ చేయండి అంది, హమ్మయ్య, బతికాను అనుకొని అక్కడి నుంచి జారుకున్నాను.

మరి ఇప్పుడు ఎలా చేత నైంది అని మీకు డౌటు రావచ్చు. చెబుతాను కాస్త ఒపిక పట్టండి. దాని వెనుకకూడా ఓ స్మాల్ కథవుంది. నాకు పట్టుదల ఎక్కువ . తెలియనిది ఏదైనా వుంటే దాన్ని సాధించే వరకూ నాకు నిద్రపట్టదు. మీకీ జన్మ కి చేతకాదు అని మా ఆవిడ ఎద్దేవా చేసింది కదా. ఏమైనా సరే సీక్రెట్ గా నేర్చుకొని మా ఆవిడకి నా ప్రతిభ చాటాలనుకుని అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను. ఒకసారి పని తొందర్లో మా ఆవిడ పని మనిషిని బట్టలు మడిచి బీరువాలో పెట్టమంది. అలాగే అమ్మగారు అని ఆ పనిలో పడింది. నేను పనిమనిషి వున్న చోటుకు వెళ్ళి సిక్రెట్ గా చూడసాగాను. ఏమండోయ్, నేను చూస్తోంది పనిమనిషిని కాదండోయ్ , బట్టలు ఎలా మడుస్తోందో కనిపెడదామనే చూస్తున్నాను. అనవసరంగా నా శీలాన్ని శంకించకండి. ఇప్పుడు అర్థం అయిందా నేను ఎలా నేర్చుకున్నానో.

సరే ప్రస్తుత విషయానికి వద్దాం.

తెల్లవారితే కిట్టీ పార్టీ. ఎందుచేతో రాత్రి కలత నిద్ర. భగవంతుడా, అంతా సవ్యంగా జరిగేలా దీవించు తండ్రీ అని మనసులో ప్రార్థించుకున్నాను.

తెల్లవారింది. లేచి కాఫీ మేకర్ వేసి, స్టవ్ వెలిగించి సన్నటి సెగ మీద పాలగిన్నె పెట్టి, వాషింగ్ మెషిన్ ఆన్ చేసి బ్రష్ చేసుకోడానికి వెళ్ళాను, నా దినచర్య ఇలా మొదలవుతుంది. ఇవి నా డ్యూటీలు. మా ఆవిడ కాస్త లేటుగా పడుకుని లేటుగా లేస్తుంది. నాకు చిన్నప్పటినుంచి త్వరగా పడుకుని తెల్లవారు జామునే లేవడం అలవాటు. తెల్లవారు జామునే లేచి చదువుకుంటే బాగా బుర్రకెక్కుతుందని నన్నూ, మా చెల్లెళ్ళనీ మా నాన్నగారు నిద్ర లేపేసేవారు. మాకు అలా అలవాటు అయిపోయింది. తెల్లారకట్టే నాలుగింటికి మెళుకువ వచ్చేస్తుంది. ఇంక నిద్ర పట్టదు. ఎవరి అలవాట్లు వారివి.

కాలకృత్యాలు అయ్యాకా కొంచం సేపు విధిగా వ్యాయామం చేస్తాను. అలా చేస్తే వళ్ళు గట్టి పడి తట్టుకునే శక్తి వస్తుందని మా నాన్నగారు నాకు అలవాటు చేసారు. అది ఇప్పుడు నాకు బాగా వుపయోగపడుతోంది.

ఈ లోగా పాలు కాగుతాయి. కాఫీ కలుపుకుని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చొని నింపాదిగా కాఫీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను. నేను కలుపుకునే కాఫీ నాకు చాలా రుచిగా అనిపిస్తుంది. అలా ఇద్దరు ముగ్గురు బంధువులు నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.

అయితే ఈ విషయంలో మా ఆవిడ అభిప్రాయాలు పూర్తిగా వేరు. నాది రైల్వే ప్లాట్ కాఫీలా వుంటుందని ఒకసారి రుచి చూసి డిక్లేర్ చేసింది. అంచేత ఆవిడ కాఫీ ఆవిడే కలుపుకుంటుంది. నేను చాలా పెందరాళే తాగేస్తాను కాబట్టి ఆవిడ నాక్కూడా తను కలుపుకున్న కాఫీ కాస్త ఇస్తుంది, అది నాకు సెకండ్ రౌండు. నిజంగానే రుచిగా వుంటుంది . కానీ నా కాఫీ కూడా ఏమీ తీసిపోదు. ఆవిడ కాఫీకి 98 మార్కులు అయితే నా కాఫీకి 92 మార్కులు ష్యూర్ గా పడతాయి. సర్లెండి, ఇప్పుడా సోది ఎందుకులెండి ? ఇది తెగే సమస్య కాదు.

నువ్వు కలిపే కాఫీ యే చాలా బావుంటుందని నేను ముందు జాగ్రత్త చర్యగా ఒప్పేసుకుని తీరాన్ని తాకబోయే తుఫాన్ ని దారి మళ్ళించేస్తాను.

సరే అసలు విషయంలోకి వద్దాం.

నేను చకచకా నా పనులు ముగించుకుని, నా డ్యూటీలు నిర్వర్తించి , టిఫిన్ బాక్సు తీసుకుని ఆఫిసుకు వెళ్ళిపోయాను. మరి ఇవాళ సాయంత్రం ఓ గంట పర్మిషన్ పెట్టి కిలో కాలీఫ్లవర్ పకోడిలు పట్రావాలి కదా వీళ్ళ కిట్టీ పార్టీకి. మా బాస్ కి క్రితం రోజే చెప్పేసాను పర్మిషన్ గురించి. ఏంటి విశేషం అని అడిగాడు. విషయం చెప్పాను. ఏ కల నున్నాడో వెంటనే ఓకే అన్నాడు. ఎందుకైనా మంచిది మూడింటికే వెళ్ళిపొ ట్రాఫిక్ చెప్పలేం అన్నాడు. ఆఫీసులో పులి కావచ్చు కానీ ఇంట్లో ఆయన పరిస్థితి ఏమిటో పాపం అనిపించింది.

మూడు అవగానే టక్కున లేచి బయలుదేరాను.

మా ఇంటికి దగ్గరలోనే వుంది ఆ పకోడీల కోట్టు. మేము బజార్లోకి ఎప్పుడు వచ్చినా వాడి షాపుకు వెళ్ళి క్యాలీఫ్లవర్ పకోడీలు కొనుక్కుని ఇంటికి పట్టుకుపోతాము. ఎలా చేస్తాడో గానీ చాలా రుచిగా వుంటాయి . చాలా మంది అక్కడే నుంచుని తినేస్తూ వుంటారు. మా మొహాలు ఆ షాపు వాడికి బాగా అలవాటు. ఎప్పుడూ మేము కలిసే వెడతాము. ఒకటా రెండా ఐదారేళ్ళగా వెడుతున్నాం.

ఆ షాపు దగ్గర స్కూటర్ ఆపి లోపలికి వెళ్ళాను. జనం ఎక్కువ మంది లేరు. నేను కొంచం పెందరాళే వెళ్ళాను కదా. నన్ను చూసి ఆ షాపువాడు ఓ చిరునవ్వు పడేసి "సార్ రాలేదా?"అని అడిగాడు.

బహుశా నా పక్కన వున్న ఆయన్ని అడుగుతున్నాడేమో అని ఆయనకేసి చూసాను. నన్ను కాదండీ మీతోటే అంటున్నాడు అని ఆయన అన్నాడు.

నేను బిత్తరపోయి మళ్ళీ షాపువాడికేసి చూసా.వాడు అదే నవ్వుతో "సారు రాలేదే, బిజీగా వున్నారా"అని అడిగాడు. అప్పుడు గానీ నా బుర్రలో లైటు వెలగలేదు .కొరడా పట్టుకొని ఛళ్ మని కొట్టినట్టు అనిపించింది .

వాడి వుద్దేశం మా ఆవిడ రాలేదా అని. నాకు అర్థం అయింది. నా తల కొట్టేసినట్టు అనిపించింది. ఏమిటీ వీడికి కూడా తెలిసిపోయిందా నా పరిస్థితి? వీడూ కనిపెట్టేసాడా మా ఇద్దరిలో ఎవరు బాసో? ఇంటా బైటా నా ఖర్మ ఇలా తగలడిందన్నమాట , వెధవ బతుకు అనుకుంటూ " బిజీగా వున్నారు" అనిచెప్పి వాడు వేడివేడిగా ప్యాక్ చేసి ఇచ్చిన పకోడిలు తీసుకుని బైటపడ్డాను.

నా చెవుల్లో ఇంకా వాడి మాటలే గింగురు మంటున్నాయి. స్కూటర్ ని ఆటో పైలెట్లో పోనిస్తున్నాను. ఆ సుబ్బిగాడు దారిలో ఎక్కడైనా కనిపిస్తే వాడి ని ఢీకొట్టి చంపేసివుండేవాణ్ణి కచ్చితంగా .

మొత్తానికి ఎలాగో ఇంటికి చేరుకున్నాను. మా ఆవిడ నాకోసం కాలుకాలిన పిల్లిలా పచార్లు చేస్తోంది. నన్నూ, చేతిలో ప్యాకెట్ చూసి " హమ్మయ్య, వచ్చారా , బతికించారు. వాళ్ళంతా ఇంకో పావు గంటలో మన ఇంట్లో వుంటామని ఫోన్ చేసారు. సరే ఎండలో పడి వచ్చారు. హాయిగా లోపలికెళ్ళి తీసుకోండి. తలుపు జార్లా వేయండి. అవసరమైతే పిలుస్తాను అంది మా ఆవిడ.

యాంత్రికంగా లోపలికి నడిచి పడకకుర్చీలో కూలబడ్డాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. చప్పట్లు, పకపకా నవ్వులతో మెళుకువ వచ్చింది. తలుపు సందులోనుంచి చూసాను. డ్రాయింగ్ హౌస్ ఫుల్. టి పాయ్ మీద ప్లేట్ లలో స్వీట్, చిప్సు, నేను తెచ్చిన పకోడీలు కనిపించాయి. అమ్మలక్కలంతా కబుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటూ ఆరారగా వాటిని లాగిస్తున్నారు. మధ్య మధ్య దడుచుకుని చచ్చేలా భయంకరంగా నవ్వు తున్నారు.

ఏదైనా సినిమా చూద్దామనుకున్నాగానీ మూడ్ లేదు.ఒక చెవి అటుకేసి పడేసాను.

వాళ్ళ సంభాషణల్లో మొగుళ్ళ మీద టాపిక్ వచ్చింది.మొగుళ్ళ గుణగణాల గురించి చెప్పుకుంటున్నారు. మా ఆవిడ వంతు రాగానే నన్ను తెగ పొగిడేసింది. "మా ఆయన బంగారు కొండ, నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. నేనేదైనా గట్టిగా పనిచేస్తే గిలగిలలాడిపోతారు. నన్ను ఏ పనీ చేయనివ్వరు తెలుసా అని అనగానే "అబ్బా, నువ్వు చాలా లక్కీ ఫెలోవే, మా ఆయనా వున్నాడు, ఏ పనీ చేయడు, మంచినీళ్ళ గ్లాసుకూడా చేతికి అందివ్వాలి, చస్తున్నాననుకో చాకిరీ చేయలేక అని ఒకావిడ అంటే మరొక ఆవిడ నాకు అలాంటి మొగుడు దొరికివుంటేనా రోజూ పువ్వుల్లో పెట్టి పూజించేదాన్ని అని సెలవిచ్చింది.

ఇంతలో తలుపు తోసుకుని నా భార్యామణి లోపలికి వచ్చి "ఏవండి, పార్టీ అయిపోయింది అంతా బయలు దేరుతున్నారు, మీకు అంతా హాయ్ చెబుతారట ఒకసారి రండి అంది . ఈ కొత్త డెవలెప్మెంట్ ఏమిటో, వాళ్ళందరిని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు. "ఏమిటా వెర్రి చూపులు, ఒకసారి రండి అని నెమ్మదిగా నాకు మాత్రమే వినపడేలా హూంకరించింది,

చేసేదేమీ లేక ఆవిడ వెనకాలే బలి పశువు లా నడిచాను. నన్ను చూడగానే అంతా లేచి నిలబడి హాయ్ అన్నారు. నేను వాళ్ళందరికి నమస్తే చెప్పాను. మీలాంటి భర్త దొరకడం మా ఫ్రెండ్ చేసుకున్న అదృష్టం అని చెప్పి వెళ్ళిపోయారు.

'ఏవండీ మీకు చాలా థాంక్స్ .ఆ క్యాలీఫ్లవర్ పకోడీలు చాలా బాగా చేసావు,"అని చెప్పి అన్నీ లాగించేసారు.

అన్నట్టు మీకో గుడ్ న్యూస్ చెప్పనా అంది. ఇక మీదట కిట్టీపార్టీలు కాన్సిలా అన్నాను కళ్ళెగరేసి. అదేమీ కాదు, ఇకనుంచీ నెల్లాళ్ళ కొకసారి కాక ప్రతి పదిహేను రోజులకీ జరపాలని డిసైడ్ చేసాం అని మా ఆవిడ అనగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి. కాళ్ళ కింద భూమి కంపించినట్ట అనిపించి తలుపు పట్టుకుని వెర్రి చూపులు చూస్తూ నుంచుండి పోయాను.

Read More
Next Story