
image: Frank Robert Dixon, Fine Art America
కవితోత్సవం
అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి కవిత
పదాలు పేర్చటం
ప్రాసలు, అంత్య ప్రాసలు కూర్చటం మాత్రమేనా
కవిత్వం అంటే?
మాటలకు మనసు ఉండాలి
ఆ మనసు మనతో మాట్లాడాలి
ఆ మనసున్న మాటలను కవిత్వీకరించాలి
అది కదా కవిత్వం అంటే!
పదాలు అగ్ని జ్వాలలను ఎగజిమ్మాలి
దుఃఖాశ్రువులనూ, ఆనంద భాష్పాలనూ వర్షించాలి
మనిషిని కదిలించాలి
కరిగించాలి
నడిపించాలి
కొండలు, గుట్టలు, చెట్లు చేమలు
పూవులు రెమ్మలు లతలు
జలపాతాలు సెలయేళ్ల గలగలలు
సరిత్సాగరాల సరిగమలు
ప్రకృతి అంతా కవిత్వమై పోవాలి
మనిషి కవిత్వంలో మమేకమై పోవాలి
స్త్రీ హృదయాంతరంగం లో జ్వలించే అగ్నికీలలు
ఆమె మౌన భాష లోని అవ్యక్త పదాలు
అడుగడుగుకు ఆత్మగౌరవ పోరాటాలు
మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న
నిగూఢ భావాలు
తామే కవిత్వమైపోవాలి
కవిత్వం మనిషికి జీవాధారం!
కవిత్వం ఓ ఉత్సవం!
ఏనాటి దైనా, నేటి దైనా
కవిత్వం మనిషికి కదలిక నివ్వాలి!
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
Next Story

