జగన్నతోట తీర్ధాన్ని కనుమనాడే ఎందుకు జరుపుతారు?
x

జగన్నతోట తీర్ధాన్ని కనుమనాడే ఎందుకు జరుపుతారు?

జగ్గన్నతోట ప్రభల తీర్థం… కోనసీమ గుండె చప్పుడు.. ఎన్ని ప్రభలు వస్తాయో తెలుసా..


ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవం ఇవాళ (సంక్రాంతి కనుమనాడు) అత్యంత వైభంగా జరుగనుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నేడు (శుక్రవారం) ప్రసిద్ధమైన ప్రభల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవం కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ ఉత్సవంలో ఏకాదశ రుద్రుల ప్రభలు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తరలిరానున్నాయి.
ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి కౌశిక నదిని దాటుకుంటూ గ్రామస్తులు ప్రభలను తీసుకురావడం ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక వంటి గ్రామాల నుంచి కూడా ప్రభలు ఊరేగింపుగా రానున్నాయి. లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వం, స్థానిక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జగ్గన్నతోటకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు.
ఏమిటీ పండుగ విశిష్టత...
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైనది. కోనసీమ చుట్టుపక్కనున్న 11 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు.
ఏకాదశ రుద్రుల కొలువు..
లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 ఏళ్ల కిందట 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహిస్తున్నారనేది కథనం.
ప్రభపై అలంకరించిన దేవతల విగ్రహాలు
ప్రతి గ్రామ ప్రభకు సొంతగా ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. సంక్రాంతికి 10 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. ముందుగా వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు. తరువాత వాటి పై రంగు రంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరిస్తారు. గంగలకుర్రు, అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామీ, వీరేశ్వర స్వామీ విగ్రహాలని అలంకరించి జగ్గన్నతోట మోసుకు వస్తారు.
జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు
గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి
గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి
వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి
ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి
వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి
పెదపూడి – మేనకేశ్వరస్వామి
ముక్కామల – రాఘవేశ్వర స్వామి
మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి
నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి
పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి
పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి
ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకువస్తారు. ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వస్తాదులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం 50 మందికి పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకువస్తారు. తీర్థం పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.
జగ్గన్నతోటపై ప్రధాని మోదీ సందేశం
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో కనుమ సందర్భంగా జరిగే ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
2023 జనవరి 26న న్యూడిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ప్రభల తీర్థ శకటం అరుదైన గుర్తింపు పొందింది. అప్పటి నుంచి జగన్నతోట ప్రభల తీర్థం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
Read More
Next Story