
చంద్రబాబు, లోకేశ్ మాటామంతి..
చంద్రబాబును జగన్ 'భూతం' వెంటాడుతూనే ఉందా?
చంద్రబాబు, లోకేష్ ఎందుకు పదేపదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారంటే..
రికార్డు స్థాయి ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి, ఆయన తనయుడు లోకేష్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయిపోతారేమోనన్న భయం వెంటాడుతున్నట్టు స్పష్టమవుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటి పోయింది. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లూ నిశ్చింతగా పరిపాలించుకునే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది. అయినా ఆయన గాని, ఆయన తనయుడు లోకేష్ గాని నిశ్చింతగా లేరు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారేమోనన్న ఆందోళన, బెంగ వారిలో కనిపిస్తోందని వైసీపీ నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
అందుకే తరచూ ఎక్కడకు వెళ్లినా, ఏ వేదికలెక్కినా అది పార్టీ సమీక్షా సమావేశాలైనా, బహిరంగ సభలైనా.. మీడియా సమావేశాలైనా జగన్ భూతం అనే పదాన్నే పదేపదే వల్లె వేస్తున్నారు. తాము ఎక్కడికెళ్లినా మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రారన్న గ్యారంటీ ఏమిటని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదార్లు అడుగుతున్నారంటూ అదే పనిగా ఈ తండ్రీ తనయులు విమర్శిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని మీడియా సమావేశాల్లోనూ చెబుతున్నారు.
పదేపదే ఎందుకిలా?
కంపెనీలు ఏపీకి రాకుండా ఇతర రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలకు పోతుండడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం తమ వైఫల్యం కాదని, జగన్ మళ్లీ వస్తారనే భయం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదార్లకు ఉందని చంద్రబాబు, లోకేశ్ పదేపదే చెబుతున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు మూడు నెలల క్రితం జగన్ భూతాన్ని భూస్థాపితం చేసేశామని ఓ సమావేశంలో చెప్పారు. చెప్పారు. కానీ ఇప్పడు మళ్లీ ఆ భూతం లేస్తోందని బహిరంగ సభల్లో చెబుతున్నారు. అంటే వైఎస్ జగన్ మళ్లీ బలపడినట్టు ఆయనే అంగీకరిస్తున్నారా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారన్న భయం వారిని వెంటాడుతున్నట్టే అనిపిస్తోందని చెబుతున్నారు.
గ్యారంటీ అడుగుతున్నారుః లోకేష్
మీ రాష్ట్రంలో భూతం (జగన్) మళ్లీ పవర్ లోకి రారని మీరు గ్యారంటీ ఇస్తారా? అని అడుగుతున్నారంటూ గతంలో లోకేష్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. గత జనవరిలో విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఇటీవల నేను వెళ్లి ఓ కంపెనీ వారిని కలిస్తే.. వారు ఒక్కటే అడుగుతున్నారు.
జగన్ మళ్లీ అధికారంలోకి రారని, ముఖ్యమంత్రి కాబోరని మీరు హామీ ఇస్తారా? ఎందుకిలా అడుగుతున్నారని వారిని నేనడిగితే.. గతంలో ఇబ్బంది పడ్డాం కదా? అని అన్నారు. గతంలో (వైసీపీ ప్రభుత్వంలో) రెన్యూవబుల్ ఎనర్జీ పీపీఏలను రద్దు చేశారు. లులూ సహా అనేక కంపెనీలను తరిమేశారు. కియా మోటార్స్న్న ఇబ్బంది పెట్టారు. మీరు గ్యారంటీ ఇస్తారా? మళ్లీ వైఎస్ జగన్మోహనరెడ్డి అనే వ్యక్తి, ఆ పార్టీ (వైసీపీ) అధికారంలోకి రాదని.. బాండు పేపరు మీద కూడా సంతకం పెట్టమంటున్నారు. అప్పుడే మీ రాష్ట్రంలో మేం పెట్టుబడులు పెడ్తాం అంటున్నారు అని చెప్పారు.

'వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ పవర్ లోకి రాదని మీరు గ్యారంటీ ఇస్తారా? గతంలో మేం నష్టపోయాం.. అని ఇన్వెస్టర్లు అంటున్నారు.. వారికి సీఎం చంద్రబాబు భరోసా ఇస్తున్నారు' అని మంత్రి లోకేష్ ఇటీవల అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.
ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామన్నాం: చంద్రబాబు
కొన్నాళ్ల క్రితం విశాఖపట్నం జిల్లా టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాట్లాడుతూ 'రాష్ట్రంలో ఓ భూతం ఉందని, మళ్లీ అది లేవదని గ్యారంటీ ఏంటని కొంతమంది పెట్టుబడిదార్లు అడుగుతున్నారు. ఆ భూతం మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా? అని అంటున్నారు. అందుకే ఆ భూతాన్ని శాశ్వతంగా, రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చెప్పాం. భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాం' అని పేర్కొన్నారు.
ఆ భూతం మళ్లీ పైకొస్తోంది: సీఎం
నాలుగు రోజుల క్రితం కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ అనే భూతాన్ని పాతాళంలోకి దించేశాం అని పెట్టుబడిదార్లకు ధైర్యం చెప్పాం.
ఆ భూతాన్ని పాతాళంలోకి దించేశామనుకున్నాం. కానీ అరుంధతి సినిమాలో మాదిరిగా వదల బొమ్మాళీ.. నిన్నొదల అంటూ ఫేక్ ప్రచారాలతో మళ్లీ పైకొస్తోంది.' అంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే..
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడంలో వైఫల్యం చెందడంతో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం అంటూ అట్టహాసంగా దావోస్ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటే ఎవరూ ముందుకు రావడం లేదు. సింగపూర్ వెళ్లినా అదే పరిస్థితి. గతంలో ఆ దేశ మంత్రితో ఒప్పందాలు చేసుకుంటే ఆ మంత్రే అరెస్టయి జైలుకెళ్లాడు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జగన్ అనే భూతాన్ని చూపి తప్పించుకోవాలని చూస్తున్నారు.

ఓ మాజీ సీఎం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందా?' అని రాజకీయ విశ్లేషకుడు, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం పూర్వ అధిపతి ప్రొఫెసర్ బాబీవర్ధన్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
Next Story