ఆటపాకలో పెరిగిన వలస పక్షుల సందడి
x

ఆటపాకలో పెరిగిన వలస పక్షుల సందడి

కొల్లేరు సరస్సు ఎన్నో పక్షి జాతులకు నిలయం. ఇది పక్షుల సంతానోత్పత్తి కేంద్రం. అందుకే శీతాకాలం ఇక్కడ పక్షుల సందడి టూరిస్టులను ఆకట్టుకుంటుంది.


ఆటపాక పక్షుల సందర్శన కేంద్రం కొల్లేరు సరస్సు హృదయభాగంలో ఉంది. శీతాకాలంలో వలస పక్షుల సందడితో కళకళలాడుతుంది. నవంబరు నుంచి మార్చి వరకు సైబీరియా, తూర్పు యూరప్, ఉత్తర ఆసియా నుంచి వచ్చే సైబీరియన్ క్రేన్, స్పాట్-బిల్డ్ పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, హెరాన్స్, డార్టర్స్, బ్లాక్-టైల్డ్ గాడ్‌విట్స్, డక్స్, వేడర్స్ వంటి వందలాది జాతులకు చెందిన లక్షలాది పక్షులు ఇక్కడ ఆశ్రయం పొందుతాయి. ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో కీలకమైన ఆశ్రయస్థలంగా నిలుస్తోంది. ప్రకృతి ప్రేమికులకు బోటు రైడ్‌ల ద్వారా పక్షులను సమీపంగా చూసే అవకాశం లభిస్తుంది, గూళ్లు కట్టుకోవడం, సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణ వంటి దృశ్యాలు మనసును మంత్రముగ్ధం చేస్తాయి. అటవీశాఖ సంరక్షణ చర్యలతో ఈ జీవవైవిధ్యం మరింత వికసిస్తుంది. కానీ కాలుష్య బెదిరింపులు ఇంకా సవాలుగా ఉన్నాయి.

ఈ పక్షుల రాకకు ముందుగానే అటవీశాఖ అధికారులు ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో రూ.5 లక్షలతో ప్రత్యేక ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో పెలికాన్, పెయింటెడ్‌ స్ట్రాక్, నల్ల తల కంకణం (బ్లాక్-హెడెడ్ ఐబిస్), నారాయణ పక్షి (ఓరియంటల్ డార్టర్), తెడ్డుమూతి కొంగ (ఓపెన్-బిల్డ్ స్ట్రాక్), రడ్డీషెల్‌ డక్, విష్కర్డ్‌ టేర్న్‌ వంటి పక్షులు వాటిపై గూళ్లు కట్టుకుని స్థిరపడ్డాయి. ఇందులో కొన్ని పక్షులు సంతానోత్పత్తి చేయడంతో పాటు, తమ పిల్లలకు ఆహారం అందిస్తూ సంరక్షిస్తున్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.


కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద తాజా నీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఇది కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య 308 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అక్టోబరు నుంచి మార్చి వరకు ఈ సరస్సు వలస పక్షులకు శీతాకాలపు ఆశ్రయంగా మారుతుంది. సైబీరియా క్రేన్, గ్లాసీ ఐబిస్, పర్పుల్ మూర్‌హెన్, పైడ్ అవోసెట్, రెడ్-క్రెస్టెడ్ పోచార్డ్స్, బ్లాక్-వింగ్డ్ స్టిల్ట్స్, అవోసెట్స్, కామన్ రెడ్‌షాంక్స్, విగాన్స్, గాడ్‌వాల్స్, కార్మోరెంట్స్, గార్గనీస్, హెరాన్స్ వంటి అనేక జాతుల పక్షులు ఉత్తర ఆసియా, తూర్పు యూరప్, సైబీరియా, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వలస వస్తాయి. ఈ సరస్సు సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో కీలకమైన భాగం, ఇక్కడ గతంలో 2 కోట్లకు పైగా పక్షులు వచ్చేవి. ఇటీవల జనవరి మొదటి వారంలోనే 116 జాతులకు చెందిన 96,195 పక్షులు రికార్డు అయ్యాయి. ఇది దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన శీతాకాలపు ఆశ్రయస్థలాల్లో ఒకటిగా నిరూపిస్తోంది. ఈ సీజన్‌లో సుమారు 108 జాతులకు చెందిన 2-3 లక్షల పక్షులు వచ్చే అవకాశం ఉందని అంచనా.

ఈ పక్షుల రాకతో కొల్లేరు మరింత హుషారుగా మారింది. పర్యాటకులు అందాలను దగ్గరగా తిలకించడానికి, పక్షులకు అతి సమీపంలో తీసుకువెళ్లే బోటు షికార్లకు ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతి పండగ సమయంలో బంధుమిత్రులతో వచ్చిన రాష్ట్రవాసులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజల రాకతో రోజురోజుకు రద్దీ పెరుగుతోంది. 270 ఎకరాల సువిశాల కొల్లేరు చెరువులో వందలాది రకాలకు చెందిన వేలాది పక్షులను ఒకేచోట చూసి పరవశించిపోతున్నారు. ‘‘ఈ ప్రకృతి అద్భుతాన్ని చూస్తుంటే మనసు ప్రశాంతంగా మారుతోంది. పక్షుల గగన విహారం, గూళ్లలో పిల్లల సంరక్షణ దృశ్యాలు మరపురానివి,’’ అని కైకలూరుకు చెందిన కస్యపు శ్యామ్ ప్రకాష్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.


పక్షులకు ఎల్లలుండవు : శ్రీరామ్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్‌ సమీక్షకుడు, హైదరాబాదు
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్‌ దేశాలు మంచుతో ఉంటా యి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి.

పక్షులను ప్రేమించాలి : బి విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు.

పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం.

ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం

పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అద్భుత ప్రదేశంగా విరాజిల్లుతుందని పలువురు సూచిస్తున్నారు. పక్షుల సంరక్షణకు అటవీశాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయం. మరిన్ని స్థానిక సమాజ సహకారంతో ఈ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. కొల్లేరు ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామం!

Read More
Next Story