ఇల్లు  (SUNDAY POEM)
x

ఇల్లు (SUNDAY POEM)

గీతాంజలి రాస్తున్న‘ఇల్లు’ సీక్వెల్ కవితల్లో ఇది నాలుగవది.





ఇల్లు (సీక్వెల్- 4)


-గీతాంజలి




పద …

నీ ఇల్లు ఊర్లో ఉందో, నగరంలో ఉందో , ఎక్కడ ఉందో అలా ఉండనీ !

నువ్వైతే బయలు దేరు ముందు ! పద...మూతబడిన ఇంటి తాళం తీయాలి

వేసవికి ఉడికిపోతున్న ఇంటికి విసనకర్ర విసిరి కాసింత గాలినివ్వాలి

కన్నీళ్లతో చెమ్మబారిన గోడలని మృదువుగా చేతి రుమాలు తో అద్దాలి

జోలపాడి నిద్ర పుచ్చిన పడకగదిని నిద్రపుచ్చాలి

అన్నం పెట్టిన వంటగదికి అన్నం ముద్ద తినిపించాలి

ఊయల లూగుతూ పాటలు విన్న వరండాలో మళ్ళీ.. రేడియోని మోగించాలి

చీకటైన ప్రతీ గదిలో దీపాల్ని వెలిగించాలి

కీకారణ్యంలా మారిన పెరటిలో కొద్ది ఎండను

వంపాలి

ఎడారిలా ఎండిన తోటలోకి కొన్ని మేఘాలను కురిపించాలి

చిన్నబోయిన డాబా మీదకి చుక్కల్ని.. వెన్నలని కలిపి కుమ్మరించాలి

వాకిట్లో ఓ ముగ్గేసి ..తులసి కోటలో ఓ దీపాన్ని వెలిగించి అమ్మ పాదాలకి నమస్కరించినట్లు..ఇంటి గుమ్మాన్ని కళ్లకధ్ధుకుని దండం పెట్టాలి

నిన్ను మళ్ళీ నమ్మిన ఇంటిని వదిలి వెళ్లనని వాదా చేయాలి

గుర్తు పెట్టుకో ఇల్లు నన్నెందుకు విడిచి వెళ్ళావని నిన్ను అడగదు..దుఃఖం తో చీకటిలా ముడుచుకు పోతుంది.నువ్వు మాట్లాడడం మానేసిన ఇల్లు మూగదైపోతుంది.

యుగాలుగా ఎదురుచూసిన ఇల్లు ముసలిదైపోతుంది

పద.. ఊర్లోనో,నగరంలో నో...

ఇల్లు నీకోసం ఎదురు చూస్తుంది !


Read More
Next Story