ఇల్లొక రాజకీయం ! (Sunday Poem)
x

ఈ గోడల వెనక ఎంత రాజకీయం నడుస్తుందో...

ఇల్లొక రాజకీయం ! (Sunday Poem)

ఇంటికి ఉన్న పర్యాయపదాలలో రాజకీయం ఒకటా. నేటి కవిత చదివితే అది నిజమేనని పిస్తుంది. మనం కట్లుకునే చక్కటి ఇంటి గోడల మధ్య ఇంత చిక్కటి రాజకీయం ఉందా అనిపించే కవిత .




ఇల్లు (సీక్వెల్ కవిత-6)


-గీతాంజలి


అనగనగా ఒక ఇల్లు ! కాదు.. కాదు చాలా, ఇళ్ళ, అనేకమైన ఇళ్లు !

పెంకుటిళ్లు…డాబా ఇళ్ళు… మేడ ఇళ్ళు… రక రకాల ఇళ్ళు.

ఆ ఇళ్ళల్లో కొన్ని గదులు

గదికొక పరదా !

గదికొక రంగు,అలంకరణ...

గదికొక వాసన -

అత్తరు గదులు

ఆల్కహాలు గదులు, మల్లెల గదులు, చెంప దెబ్బల గదులు

వెక్కిళ్ళని వినపడనివ్వని గదులు .

ఆకలికి ఏడ్చే గదులు !

గదులు...గదులు!

ఇంట్లో గదులే గదులు! గదుల్ని మోసే ఇళ్ళు

గదుల్ని మూసే ఇళ్ళు! ఎన్నెన్ని రూపాల్లోనో ఇళ్ళు!

ఇల్లు, గది గదికో కథని రాసుకుంటుంది.

కొన్ని ప్రత్యేక మైన ఆడ, మగ వస్తువులతో గదులు

కొంతమందితో… కొన్ని రకాల మనుషులతో గదులు

అందులో కొన్ని గదులు… ఆడవి !

మరి కొన్ని మగవి ! ఆడా…

మగా వాసన వేస్తూ…

ముసలి వాసన…

పడుచు వాసన…

పిల్లల వాసనా వేస్తూ…ఇల్లు !

ఇల్లు ...తనని తాను

ఇన్ని గదులుగా... మనుషులుగా చీలుస్తుంది.

వినండి... ఇల్లు మహా కిలాడీ !

కత్తుల్ని, గరిటల్ని, పోపు డబ్బాలని, గ్రైండర్లని అమ్మలకిచ్చి,

పేపర్, పెన్నులని, పుస్తకాలని...టీవీలని,సెల్లులని,లాప్టాప్లని నాన్నలకు...అన్నలకిస్తుంది.

ఇల్లు వరండాలోని వాలు కుర్చీలో నాన్నకి రాజసాన్ని,విశ్రాంతిని ఇస్తుందా..?

మరి ఇటు చూడండి

భగ...భగ మండే పొయ్యిల మీద అమ్మల్ని కూర్చో బెడుతుంది...

ఎప్పటిదాకా..?

అమ్మలు కట్టెల్లో కాలేదాకా !

ఇదిగో కాస్త ఇటు రండి..ఈ భోజనాల గది ఉంది చూసారూ...

ఎంత కుట్ర చేస్తుందనుకున్నారు ?

ఆకలితో ఆడవాళ్ల కడుపుల్లో ఆసిడ్లు మరుగుతున్నా...

ముందు తాతయ్య,నాన్న,అన్నలనే భోజనం చేయమంటుంది.

ఇక ఆ వంటిల్లంటారా..

ఆసాంతం మనువు చెప్పినట్లే వింటుంది.

అమ్మ షుగరుకి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ లా రోజుకి మూడుసార్లు గుచ్చిగుచ్చి

నిర్దాక్షిణ్యంగా వంటింట్లోకి నెట్టేస్తుంది.

నానమ్మ నొప్పులైన మోకాళ్ళకు డోలో సిక్స్ ఫిఫ్టీ మాత్ర మింగించి

మరీ వంటింట్లో పరిగెత్తిస్తుంది...

ఆకలితో..నొప్పులతో నెలసరి పోట్లతో చెప్పొద్దూ ...

వాళ్ళ చేతివంట మహా రుచిగా ఉందంటూ లొట్టలు...

త్రేన్పులతో భోజనాల గదంతా..మగ కేరింతలతో గమకాలు పోతుంది.

పండగలప్పుడైతే ..

ఇల్లు అమ్మల్ని మూకుట్లో గారెల్లా..చికెన్ లెగ్ పీసుల్లా వేపి పడేస్తుంది.

వంటిల్లు తను నిద్ర పోదు...అమ్మలను నిద్రపోనివ్వదు.

అసలీ లోకం మొత్తంలో వంటగది తలుపులు ఎప్పుడూ మూసుకోవు.

ఇల్లు మగది కదా అస్సలు ఒప్పుకోదు !

ఇల్లు చాలా సార్లు మహా దుర్మార్గమైంది కూడా సుమా !

పడకటింటి రహస్య శృంగార హింసను ఆడవాళ్ల ఒంటికి పొరలు పొరల చీరగా కప్పేస్తుంది.

కన్నీళ్ల వర్షాన్ని వాళ్ళ రెప్పలతోనే మూసేసి...

పెదాల మీద లేని నవ్వులను సాగదీసి ...

భార్యలకో కొత్త మొఖం తొడిగి లోకం ముందుకు తోస్తుంది !

ఇక...ఇంటి తోరణంలో వాడిన పూలేమీ ఇంటి ఇల్లాలి దిగులును మోయవు కదా?

ఇల్లు ఎంత మాయావో చూడండిటు !

ఋతువుల సౌందర్యాన్ని భీభస్థాలని మోసిన ఇల్లు

ఇల్లాలి విషాదాన్ని మాత్రం వికృత వినోదంగా మార్చేస్తుంది.

నవ్వనీయదు..ఏడ్వనీయదు...

రోజుకొక మాస్క్ ని అమ్మల మొఖాలకి తొడుగుతుంది.

చూసారా...

ఇల్లెలా నిగూఢ రహస్యాలను తలుపు మూసేసి మరీ దాచిపెడుతుంది

ఇల్లు కోరల్ని దాచుకున్న ఒక కసాయి ...

గాయాల దుఖంతో గుండెలమీద వొరిగిన కన్నబిడ్డని మెట్టినింటికి తరిమేస్తుంది..

ఇంటి బయటకి వెళ్లిపోవాలనుకున్న అమ్మల్ని...

బయట లేని బూచిని చూపించి..

రెక్కపట్టి లోపలికి గుంజుకుంటుంది

అప్పుడు ఇల్లు హఠాత్తుగా మగాడిగా మారిపోతుంది.

అలాంటి ఇల్లు కూడా కొన్నిసార్లు గాయ పడ్డ మనిషిలా దీనంగా దిక్కులు చూస్తుంది.

అప్పుడు ఇల్లు ఆడ దానిలా మారిపోతుంది .

అందుకే అమ్మ చాలా సార్లు ఏడుస్తుంది !

అయితే..ఇంటిని ఆసాంతం నమ్మకండి సుమా !

సన్నజాజి తీగల్ని చుట్టుకొని ..

తన చుట్టూనో...వాకిట్లోనో పొగడ పూల సుగంధాల చెట్లను మోస్తుందని...

గడప ముందు రంగవల్లులతో నవ్వుతుందని...

చెట్టు మీద కోయిలలను పాడనిస్తుందని...

ఇల్లోక పండగ చీరలా కళ కళ్లాడి పోతుందని, అంతా బాగుందనుకోకండి.

ఇల్లెలా హృదయం లేనిదయ్యిందో తెలుసుకోవాలంటే...

వెళ్ళండి …

ఏ ఇంటి తలుపైనా సరే…తట్టండి!

తలుపులు తెరిచిన అమ్మల కళ్లు దాచిన కన్నీళ్ల చెలమల్ని...

నవ్వే పెదాల వెనకాలి పెగలని పదాల పెనుగులాటని కొత్త కళ్లేసుకుని చూడండి!

ఇంట్లోపలికి వెళ్లి మూసుకున్న గది...

గది నీ తెరిచి దుఃఖపు దుప్పట్లలో ముడుచుకు పడుకున్నఅమ్మలను లేపి హృదయానికి హత్తుకోండి.

అప్పుడిక వీధుల్లో మూసుకున్న తలుపుల్లో కనిపించే ఇళ్లు ఎంత సౌందర్యాత్మకమో...

ఆ ఇళ్ళు దాచుకున్న నిశ్శబ్దం ఎంత కర్ణ కఠోరమో ...

ఒక నాస్ట్కాలజిక్ కవిత రాయగలరేమో చూడండి ..

వెళ్ళండి !



Read More
Next Story