కూతపెడుతున్న కోళ్లు, కోట్లలో పందాలు!!
x
పందానికి కాలుదువ్వుతున్న కోళ్లు

కూతపెడుతున్న కోళ్లు, కోట్లలో పందాలు!!

సిద్ధమైన పందెం కోళ్ల బరులు, లక్షలు పలుకుతున్న కోడిపుంజులు


గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పచ్చని పొలాలు, పిండి వంటల గుమగుమల కంటే ముందే పందెం కోళ్ల అరుపులు, బరుల వద్ద పేకాట కేకలు వినిపిస్తున్నాయి. కేవలం వినోదం కోసమే అనుకుంటే పొరపాటే.. ఇక్కడ నిమిషాల్లో కోట్లు చేతులు మారుతున్నాయి. కోడి పందెం ఒక సాకు మాత్రమే.. దాని వెనుక నడుస్తున్న జూదపు సామ్రాజ్యం విస్తుగొలిపేలా ఉందని హైదరాబాద్ లో స్థిరపడిన పాలకొల్లు వాసి నాగేంద్రబాబు చెబుతున్నారు.

మినీ స్టేడియాలను తలపిస్తున్న బరులు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి క్రీడకు సర్వం సన్నద్ధమైంది. భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, కైకలూరు, పోలవరం వంటి ప్రాంతాల్లో పందెం బరులు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా భారీ ఏర్పాట్లు, అతిథుల కోసం విందులు, వినోదాలతో పండగ వాతావరణాన్ని ముందే తెచ్చేశారు. చిన్నపాటి బరుల్లో లక్షల్లో పందేలు జరుగుతుంటే, ప్రధాన బరుల్లో మాత్రం రూ. కోటిన్నర వరకు లావాదేవీలు సాగుతున్నాయని నర్సాపురానికి చెందిన గ్రామస్తుడు జి.రామకృష్ణ చెప్పారు.

పందెం కోళ్లలో మేలు జాతి ఇవే..
పందెం కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ప్రధానంగా 15,16 రకాలను బాగా పెంచుతున్నారు. వీటి పెంపకం కూడా మామూలుగా ఉండదు. లక్షల్లోనే ఖర్చు పెట్టి జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు వంటివి పెట్టి పెంచుతారు.

రంగును బట్టి గుర్తింపు.. రకాన్ని బట్టి పందెం బట్టి ప్రత్యేక పేర్లు ఉంటాయి. ప్రధానంగా కోడి ఈకల రంగు ఆధారంగా కోడి రకాన్ని గుర్తిస్తారు. సేతు, డేగ, నెమలి(ఎర్ర నెమలి, నల్ల నెమలి), కాకి(నల్లకాకి, పచ్చకాకి), పర్ల(తెల్ల పర్ల, కాకిడేగ పర్ల,), రసంగి (నెమలి రసంగి), కిక్కిరాయి(ఎర్ర కిక్కిరాయి, తెల్ల కిక్కిరాయి), మైల, తెల్లఅబ్రాస్‌, కౌజు, మైల, పింగళ, ఎర్రపూల కోడి, బెరస.. తదితర పేర్లతో వీటిని పిలుస్తుంటారు.

నల్ల ఈకలు ఉన్న పుంజును కాకి అని, తెల్లని ఈకలు ఉంటే దానిని సేతు అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే పర్ల అని, శరీరం నల్లగా ఉండి, రెండు లేదా మూడు రంగుల ఈకలు ఉంటే దానిని కొక్కిరాయి అని వ్యవహరిస్తారు. ఇక ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కలపై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే నెమలి అని, మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని కౌజుగా, ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటే మైల అని, రెక్కలు ఎక్కువ తెలుపు రంగులో ఉంటే పింగళ అని, బంగారు రంగులో ఈకలు ఉంటే అబ్రాసు అని పిలుస్తారు.

అయితే, ప్రధానంగా డేగ, కాకి, నెమలి, కొక్కిరాయి రకాలను కోడి పందేల్లో ఉపయోగిస్తారు. వాటిపైన్నే పందాలు ఎక్కువగా సాగుతుంటాయని తాడేపల్లిగూడెం కు చెందిన రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.

లక్షల ధర పలికే 'రాజసపు' కోళ్లు
ఈసారి బరిలో నిలిచే కోళ్ల ధరలు సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని భీమవరంలో కోళ్లను బరిలోకి దించే నిపుణుడు పెద్దబ్బాయి అన్నారు. తాజాగా పెద్దాపురంలో కొక్కిరాయి రకం కోడి పుంజుకు 3.50 లక్షలు ఇస్తామన్నా సంబంధిత యజమాని అంగీకరించలేదని చెప్పారు.

పెద్దాపురం మండలంలోని ఒక కోళ్లఫారంలో ఉన్న 5 కిలోల బరువున్న ‘కొక్కిరాయి’ పుంజుకు ఏకంగా రూ. 3.50 లక్షల ధర పలికింది. ఇది మేలైన జాతి దృష్ట్యా, యజమాని అమ్మడానికి నిరాకరించారు.

సందడి చేస్తున్న తమిళనాడు కోడి..
తాజాగా తమిళనాడుకు చెందిన ఈ జాతి కోళ్లు కూడా బరిలో సందడి చేస్తున్నాయి. ఒక్కో పడ కోడి ధర రూ. 50 వేలు పలుకుతుండగా, వీటిపై లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఈ కోడికి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మహా గిరాకీ ఉంది.

ప్రధానంగా డేగ, కాకి, నెమలి రకాలకు గిరాకీ ఎక్కువ.

కోడి పందెం సాకు.. జూదమే అసలు ఆదాయం
నిర్వాహకులకు కోడి పందేల కంటే వాటి అనుబంధంగా జరిగే జూద క్రీడల ద్వారానే భారీ ఆదాయం సమకూరుతోంది. పందెం బరుల వద్ద కోత ముక్క, లోన-బయట, గుండాట వంటి శిబిరాల ఏర్పాటుకు ముందస్తుగానే వేలం జరుగుతోంది.

భారీ డిమాండ్: ఒక్కో బరిలో ఈ జూద శిబిరాలను ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు రూ. 50 లక్షల నుండి రూ. 70 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుంటున్నారు.

గుండాట జోరు: అన్నింటికంటే గుండాటలోనే నిర్వాహకులకు అత్యధిక లాభాలు వస్తుండటంతో వీటికి భారీ పోటీ నెలకొంది.

లెక్కల గణంకాల్లో: ఒక బరిలో రూ. 30 కోట్ల కోడి పందేలు జరిగితే, అక్కడ జూద క్రీడల విలువ రూ. 40 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ముందస్తుగానే అడ్వాన్సులు.. విక్రయాలు
భీమవరం సమీపంలోని ఒక ప్రముఖ బరిలో గుండాటకు రూ. 70 లక్షలు, పేకాటకు రూ. 40 లక్షలు, కోతాటకు రూ. 30 లక్షలు చొప్పున అడ్వాన్సులు ఇప్పటికే వసూలు చేసినట్లు సమాచారం.

ప్రతి కోటి రూపాయల పందెంపై నిర్వాహకులు 10% మెయింటెనెన్స్ కింద వసూలు చేస్తారు. ఈ మొత్తంతోనే అతిథులకు భోజనాలు, బరి నిర్వహణ ఖర్చులు పోను కోట్లలో మిగులు ఉంటుందని అంచనా.

మొత్తానికి, సంప్రదాయం ముసుగులో జరుగుతున్న ఈ "కనకవర్షం" క్రీడ ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైంది.

(ఫోటో కర్టసీ-అందాల ఆంధ్ర-మన సీమాంధ్ర- ఫేస్బుక్)

Read More
Next Story