హైదరాబాద్ లో న్యూ ట్రెండ్... 4 ఏఎం బిర్యానీ
x

హైదరాబాద్ లో న్యూ ట్రెండ్... 4 ఏఎం బిర్యానీ

హైదరాబాదీలు న్యూ ట్రెండ్‌‌కు తెర లేపారు.తెల్లవారుజామున 4ఏఎం బిర్యానీ విక్రయాలు కొత్తగా ప్రారంభమైనాయి.రమజాన్‌లో కొత్త వంటకాలు వచ్చాయి.పసందైన వంటకాల ముచ్చట్లు.


హైదరాబాద్ నగరమంటేనే ప్రపంచ ప్రసిద్ధి గాంచింది బిర్యానీ...గతంలో మిడ్ నైట్‌ బిర్యానీ ఒక ట్రెండ్.

మొదట్లో హైదరాబాద్ అబిడ్స్ జంక్షన్ లో ఉన్న గ్రాండ్ హోటెల్ మిడ్ నైట్ బిర్యానీకి ఫేమస్. అయితే అప్పటికి ఆ బ్రాండ్ బిర్యానీ లేదు. గ్రాండ్ హోటల్ వెనక వైపునున్న దొడ్డి దారి గుండా వెళ్లి మిడ్ నైట్ కూడా బిర్యానీ తినేవాళ్లు.

తర్వాత మిడ్ నైట్ బిర్యానీ అనే ట్రెండ్ మొదలైంది. చాదర్ ఘాట్ దగ్గిర ఉండే నయాగరా ఒకపుడు ఈ మిడ్ నైట్ బిర్యానీకి పేరు. ఇలాగే నగరంలో చాలా పేరున్న ఇరానీ రెస్టారెంట్లలో మిడ్ నైట్ బిర్యానీ వచ్చింది.

ఇపుడు మొదలయిన కొత్త ట్రెండ్ తెల్లవారు జామునే దొరికే బిర్యాని. దీని పేరు 4 ఎ.ఎం (4 AM) బిర్యానీ.

కానీ మారుతున్న కాలానుగుణంగా మొట్టమొదటి సారి తెల్లవారుజామున నాలుగు గంటలకు బిర్యానీని వేడివేడిగా వండి వడ్డిస్తున్నారు. దీనికోసం 4 ఏఎం బిర్యానీ స్టాళ్లు నగరంలో పలు చోట్ల వెలిశాయి.

హైదరాబాద్ గ్లోబలైజ్ కావడం, ఇక్కడ పలు ఫ్యాక్టరీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కాల్ సెంటర్లు రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు ఎపుడంటే అపుడు డ్యూటీ దిగిపోతుంటారు, లక్షలాది మంది బ్యాచిలర్లు ఈ ఉద్యోగాల డ్యూటీల నుంచి తెల్లవారు జామున దిగిపోతుంటారు. ఇలా నైట్ డ్యూటీలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్నపుడు బిరియాని పిలుపుతో నోరూరేలా చేయడం 4 ఎఎం బిర్యానీలు చేస్తున్నపని.

పూర్వం తెల్లవారు జామున వేడి వేడి ఇడ్లి తినడాన్ని ఉడిపి హోటళ్లు అలవాటు చేస్తే, ఇపుడు పరగడపునే బిర్యానీ తినడాన్ని 4ఎఎం బిర్యానీ స్టాళ్లు అలవాటు చేస్తున్నాయి.

తెల్లవారక ముందే తమకు ఇష్టమైన వేడి వేడి బిర్యానీని తినేసి వెళుతున్నారు. నగరంలో పలు చోట్ల వెలిసిన ఈ బిర్యానీ స్టాళ్లు హైదరాబాదీలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బిర్యానీస్టాల్స్ యజమానులు మాంసాహారులే కాకుండా శాకాహార బిర్యానీలు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. బిర్యానీనే కాకుండా పలు రకరకాల పసందైన వంటకాలను వండి వడ్డిస్తున్నారు. పనీర్ కుష్కా, చికెన్ కుష్కా, మటన్ కుష్కా పులావ్, కబాబ్ లను వేడివేడిగా వడ్డిస్తుండటంతో ఖాతాదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఓ హోటల్ యజమాని చెప్పారు.

పోటెత్తుతున్న జనం

గతంలో తెలతెలవారుతుండగానే ఇరానీ ఛాయ్ ఘుమఘుమలతో ప్రారంభమయ్యే హోటళ్లలో ప్రస్థుతం బిర్యానీ సర్వ్ చేస్తుండటంతో రద్దీగా మారాయి. ఈ బిర్యానీ హోటళ్లకు జనం పోటెత్తుతుండటంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే బిర్యానీ ఖాళీ అవుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి,వివేకానంద నగర్, బోరబండ ప్రాంతాల్లో తెల్లవారుజామున బిర్యానీ స్టాల్స్ వెలిశాయి. హైదరాబాద్ నగరంలో కొత్తగా తెల్లవారుజామున బిర్యానీ స్టాల్స్ ప్రారంభంతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైందని హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ ఆరీఫ్ ‘తెలంగాణ ఫెడరల్’కు చెప్పారు. ఈ 4.00 ఏఎం బిర్యానీ స్టాల్స్ ప్రాంతాలు హాట్ స్పాట్స్‌గా మారాయి. వినియోగదారుల సంతృప్తి కోసమే తాము 4.00 ఏఎం బిర్యానీ స్టాల్స్ తెరిచామని ఓ హోటల్ యజమాని చెప్పారు. రమజాన్ సీజనులో హలీంతోపాటు కొత్త కొత్త వంటకాలు అందుబాటులోకి వచ్చాయి.పొట్టేలును ముక్కలుగా చేయకుండానే గ్రిల్ చేసి మటన్ ప్రియులకు ఆ మొత్తాన్ని టేబులుపై సర్వ్ చేస్తున్నారు.

రమజాన్‌ సందడి

పవిత్ర రమజాన్ సందర్భంగా ముస్లింలు 30 రోజుల పాటు ప్రార్థనలు, ఉపవాసాలలో బిజీగా గడుపుతారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రమజాన్ షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. రాత్రి ఇషా నమాజ్ తర్వాత తరవీహ్ నమాజ్ లు చదువుతుంటారు. దీంతో పాతనగరంలో రాత్రంగా సందడి నెలకొంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో మసీదులు, హోటళ్లను అలంకరించారు. ఈ నెల రోజులపాటు ఇఫ్తార్ విందుల సందడి కూడా నెలకొంది. నగరంలోని మసీదులే కాకుండా షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద కూడా పండ్లు, మంచినీళ్ల బాటిళ్లను ఉపవాసం ఉన్నవారికి ఉచితంగానే అందిస్తున్నారు.

రకరకాల ఖర్జూరాలు

రమజాన్ సందర్భంగా ఉపవాసాన్ని ఖర్జూరా పండుతో విడుస్తారు. దీంతో గల్ఫ్ దేశాల నుంచి రకరకాల ఖర్జూరాలను రప్పించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 20రకాల ఖర్జూరాలు బేగంబజార్, మల్లేపల్లి, మీర్ ఆలంమండీ, చార్మినార్, ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఖర్జూరం నాణ్యతను బట్టి కిలో 200 రూపాయల నుంచి వెయ్యిరూపాయల దాకా విక్రయిస్తున్నారు. ఖర్జూరాలే కాకుండా రమజాన్ నెలలో మహిళలు దుస్తులు, గాజులు, పాదరక్షలు...ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులను షాపింగ్ చేస్తుంటారు. విదేశాల్లో పనిచేస్తున్న హైదరాబాదీలు సైతం రమజాన్ పండుగ కోసం స్వస్థలమైన హైదరాబాద్ నగరానికి తరలిరావడంతో నగరంలో కొత్త సందడి వాతావరణం నెలకొంది.

ఉచితంగా మండీ బిర్యానీ ఆఫర్

ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ సృష్టికర్తలు,సోషల్ మీడియా వినియోగదారులు సెలబ్రిటీల నుంచి ప్రతిస్పందనలను కోరుకునే కొత్త ట్రెండ్ ఇప్పుడు పాక ప్రపంచానికి చేరింది. ‘‘మునావర్ ఫరూఖీ వీడియోపై వ్యాఖ్యానిస్తే, మేం అయిదుగురికి ఉచితంగా జుర్బియన్ మండి బిర్యానీని అందిస్తాం’’ అనే ట్యాగ్‌లైన్‌తో రీల్‌ను సృష్టించిన హైదరాబాద్‌లోని ఆజెబో రెస్టారెంట్ ప్రచారంలో దూసుకెళ్లింది.హైదరాబాదులోని ఇన్‌స్టా ఫుడ్ బ్లాగర్‌లు కూడా వివిధ రకాల హైదరాబాదీ వంటకాలను సమీక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. రమజాన్ సందర్భంగా ఉచిత మండీ బిర్యానీని అందిస్తున్నామని పాత నగరానికి చెందిన ఓ రెస్టారెంట్ యజమాని తాజాగా ప్రకటించారు. మొత్తంమీద హైదరాబాదీలు ఫుడ్ లవర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read More
Next Story