‘కల్కి’లో కనిపించిన శివాలయం.. ప్రభుత్వం ఏం చేస్తోంది..!
x

‘కల్కి’లో కనిపించిన శివాలయం.. ప్రభుత్వం ఏం చేస్తోంది..!

కల్కి సినిమా చూపించిన శివాలయం గురించి ఈ విషయాలు మీకు తెలుసా. ఈ ఆలయం విషయంలో ప్రభుత్వం ప్లానింగ్ ఏంటో తెలుసా..


ఏదైనా విషయాన్ని శాశ్వతంగా దాచడం అసాధ్యం.. అది ప్రకృతికైనా. ఇందుకు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు గ్రామంలోని నాగమల్లేశ్వర స్వామి ఆలయం నిదర్శనం. ఎప్పుడు కనుమరుగైందో కూడా తెలియకుండా ఇసుక దిబ్బల కింద దాగి ఉన్న ఈ ఆలయం.. 2020లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆలయాన్ని పట్టించుకునే వారు తగ్గిపోయారు. ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి’ సినిమాతో ఈ ఆలయం మళ్ళీ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ విషయంపై అక్కడి స్థానికులు మాట్లాడుతూ.. ‘కల్కి సినిమా షూటింగ్ ఇక్కడ రెండు రోజులు జరిగింది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ గుడిని వీక్షించడానికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు’ అని చెప్తున్నారు.

2020 నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ ఆలయంపై అనేక మంది మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ గుడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంతటి పురాతన కట్టడం ఇన్నాళ్లూ ఇసుకలో ఉన్నా శిథిలం కాకుండా ఉన్నందుకు ఆ ఇంజనీరింగ్ నైపుణ్యం, శిల్పకళకైనా ప్రభుత్వం గుర్తింపు కల్పించాలని పలువురు మేధావులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పుడెప్పుడో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలబడే ముందు టీడీపీ అభ్యర్థి ఆనం ఆదినారాయణరెడ్డి.. ఈ ఆలయం గురించి ప్రస్తావించారు.

అభివృద్ధి చేస్తాం: ఆనం

తాము అధికారంలోకి వస్తే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, మరోసారి ఈ ఆలయాన్ని భక్తులకు చేరువ చేస్తామని ఆనం ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఇప్పుడు ఆయన గెలిచారు, వారి పార్టీనే అధికారంలోకి వచ్చింది. మంత్రి అయ్యారు, అది కూడా దేవాదాయశాఖకే. కా ఇంతవరకు ఆ ఆలయం గురించి స్పందించలేదు. ఈ ఆలయ పునరుద్ధరణ, ఆధునికీకరణకు సంబంధించి ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. కానీ ఈ ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఈ ఆలయాన్ని అక్కడే పునరుద్దరించాలా.. లేకుంటే ఊరికి దగ్గరగా నిర్మించాలా అన్న విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ పరమైన చర్చల్లో కూడా ఈ ఆలయ అంశం వచ్చినట్లు తెలుస్తోంది.

పట్టించుకోని యునెస్కో

ప్రపంచవ్యాప్తంగా సంస్కృతికి అద్దం పట్టే అంశాలకు గుర్తింపు నిచ్చి, వాటిని రక్షించుకోవడంపై దృష్టి పెట్టే సంస్థ యునెస్కో. ఈ సంస్థ సైతం శతాబ్దాల క్రితం ఇసుకలో కనుమరుగై కొన్నేళ్ల క్రితం బయటపడిన నాగమల్లేశ్వర ఆలయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంతో పాటు సంస్కృతిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి సంస్థలు కూడా ఈ ఆలయాన్ని నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కోరుతున్నారు.




అసలు గుడి చరిత్ర ఏంటంటే..

పెరుమాళ్లపాడు వద్ద పెన్నా నది తీరంలో కొన్నేళ్ల కిందట ఈ ఆలయం బయటపడింది. ఈ గుడి పైభాగం మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ ఆలయం శివాలయమని, అక్కడ నాగలింగేశ్వరుడు కొలువై ఉన్నాడని సోమశిల ప్రాంత ఆలయ అధికారి పెంచల ప్రసాద్ వెల్లడించారు. ‘‘పెరుమాళ్లపాడులో ఉన్నది నాగలింగేశ్వరస్వామి ఆలయం. ఈ గుడిని ఎవరు కట్టించారు? ఎప్పుడు కట్టించారు? అన్న విషయాలు తెలియవు’’ అని తెలిపారాయన.

అది కూడా రహస్యమే..

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు? అన్నదే కాదు.. ఆఖరికి ఈ ఆలయం అసలు ఇసుకలో ఎలా కూరుకుపోయింది అనేది కూడా ఒక రహస్యమే. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. 1850-1900 మధ్య వచ్చిన వరదల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అప్పుడే ఈ ఆలయం భూస్థాపితమై ఉంటుందని కొందరు చరిత్రకారులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ‘‘చరిత్ర ఆధారంగా చూస్తే 1850-1900 కాలంలో వచ్చిన వరదల దెబ్బకు పెన్నానది నీరు ఆనకట్టను మించి రెండు అడుగుల ఎత్తులో ప్రవహించాయి. ఆ సమయంలోనే మునిగిపోయిన ఎన్నో ఊళ్లతో పాటు పెరుమాళ్లపాడు కూడా మునిగిపోయి ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఆలయం కూడా కనుమరుగై ఉంటుంది’’ అని ఆయన వివరించారు. దాంతో పాటుగా ఈ ఆలయంపై ఉన్న శిల్పకళ శైలిని చూస్తే చోళుల కాలంలో కట్టిన ఆలయంగా ఉందని కూడా ఆయన వివరించారు. బహుశా 12, 13వ శతాబ్దంలో ఇటుగా వచ్చిన చోళులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

మరి ప్రజలేమంటున్నారంటే..

పెరుమాళ్లపాడు స్థానికుల చెప్పున్నదాని ప్రకారం ఈ ఆలయం 60 ఏళ్ల కిందటే బయటపడిందట. అప్పట్లో ఈ ఆలయ గోపురం మాత్రమే కనిపించేదని, అప్పట్లో తాము కూడా అక్కడ ఆడుకునేవాళ్లమని అక్కడి వృద్ధులు అనేకమంది చెప్తున్నారు. పెద్దలు చెప్పిన మాటలు విన్న యువకులు కొందరు కరోనా సమయంలో పెరుమాళ్లపాడు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి దగ్గర తవ్వకాలు చేశారు. అప్పుడే మరింత ఆలయ భాగం బయటపడిందని చెప్తున్నారు. ఆ గుడిని ఆ ఊరికి దగ్గర్లోనే నిర్మించాలని అధికారులను కోరుతుననట్లు ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగంటి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ‘‘బయట ఉద్యోగాలు చేసుకుంటూ, చదువులు కొనసాగిస్తున్న వారు ఊరి పెద్దల మాటలు విని చందాల రూపంలో డబ్బులు సేకరించారు. ఆ డబ్బుతోనే ఇక్కడ తవ్వకాలు చేశారు. అప్పుడే గుడి బయటపడింది. ఊరికి ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అక్కడే ఆలయాన్ని నిర్మిస్తే దొంగలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఆలయాన్ని ఊరికి దగ్గర్లో నిర్మించాలి. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

ఆలయంపై స్పందించిన ఈవో వరప్రసాద్ కూడా.. గ్రామస్తుల నిర్ణయం ప్రకారమే పనులు మొదలు పెడతామని గతంలోనే చెప్పారు. ‘‘1987లో ఈ గుడి దేవాదాయశాఖ పరిథిలోకి వచ్చింది. గుడి మాన్యాల రక్షణకు దేవాదాయశాఖలో కలిపారు. ఆలయానికి దాదాపు 80 ఎకరాల మాన్యం ఉంది. మూడు సంవత్సరాలకు ఒకసారి వేలం పాట పెట్టి వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేస్తాం. ఈ మేరకు గుడి కట్టడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని, కాలక్రమంలో పెన్నా నది తన మార్గాన్ని మార్చుకోవడంతో ఆలయం భూస్థామితమైపోయిందని కూడా మాట వినిపిస్తోంది.

Read More
Next Story