తొలి ప్రయత్నం..తొలిఅడుగు.. ముందడుగే..!
x

తొలి ప్రయత్నం..తొలిఅడుగు.. ముందడుగే..!

హైదారాబాద్ కీసరలో ఉమెన్ రైటర్స్ కథా కార్యశాల ఒక చారిత్రక సంఘటన. కాంతి నల్లూరి చెబుతున్న విశేషాలు


2024 సంవత్సరాంతం... “హైదరాబాద్ ఉమెన్ రైటర్స్ ఫోరం” వారికి తొలి అడుగకు నాంది. ఇన్ని అడుగులా అనొద్దు. అన్ని అడుగులు ఒకే అడుగుగా ముందుకే..

30.12.24 ఉదయం ఐదు గంటలకు ఒంగోలు నుండి రాజ్యలక్ష్మి అక్కతో కలిసి కీసరకు కారులో బయలుదేరాం. 8.30 కల్లా హైవేపై ఉన్న పెద్ద హోటల్ దగ్గర కారు ఆపాడు డ్రైవర్ రాఘవరెడ్డి. ఓ గంట మా సమయం ఖతం... అనుకుంటూ మళ్ళి సాగాం.

ముందు వచ్చిన వాళ్ళు టిఫిన్లు తింటున్న, పాయింట్ ఫోటోలు, మాకు టిఫిన్లు కావాలి, వద్దు, టి ఒక్కటి చాలు, మేము ఇక్కడున్నాం, మేము అక్కడున్నాం, ఇన్నింటికి వస్తాం! అంటూ వాట్సప్ సంభాషణలు. విజయక్క "రెడీ టు ఈట్, రన్ ఫాస్ట్" అంటూ ఇంకా ఫోను మెస్సెజస్‌తో కవ్విస్తున్నారు. మాలో కూడా తొందరగా అక్కడ వాలాలన్న యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. నున్నగా ఉన్న తెలంగాణ రహదారులు టైంకు వెళతారులేనన్న ధైర్యాన్నిస్తున్నాయి. ప్రయాణంలో సైట్ సీయింగ్, ఊర్లపేర్లకు అప్పచెప్పే నా కళ్ళను మైలేజీ రాళ్ళకు, బోర్డులకు అంకితం చేశా. 1992లో పాదయాత్ర చేసిన రోడ్లకు ఇప్పటి రోడ్లకు పోలికే లేదు. అప్పుడంతా ఎడారిలా ఉన్న రోడ్లు, పొలాలు. ఇప్పుడు రోడ్డు మధ్యలో, ఇరుపక్కల పచ్చటి మొక్కలతో, చెట్లతో, పైర్లతో కళకళ లాడుతున్నాయి.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కంగానే వచ్చేసాం అన్న ఆనందం మా ముగ్గురి కళ్ళల్లో. ఉమెన్ రైటర్ మిత్రులను కలుసుకోబోతున్న ఆనందం మా ఇద్దరిదీ అయితే, టైంకు చేర్చుతున్నానన్న ఆనందం రాఘవరెడ్డిగారిది. ఓఆర్‌ఆర్‌పైకి రాగానే బైక్ రేసింగ్‌లు, చనిపోయిన పెద్దోళ్ల పిల్లలు, తల్లిదండ్రుల దుఃఖం కళ్ళముందు కనిపించింది. ఇప్పుడు బైకులకు ఎంట్రన్స్ లేదని రాఘవ గారు చెబుతున్న కబుర్లకు చెవులను, కీసర దారికి వున్న బోర్డులకు కళ్ళను ఇచ్చేసి, కీసర వచ్చేసింది అన్నాను గట్టిగా. ఇందాకే వచ్చేసిందండి కూల్‌గా నీకన్నా నేను ముందున్నానని రాఘవరెడ్డి చెప్పకనే చెప్పాడు.

రూట్ మ్యాప్, కరెంట్ మ్యాప్ పెట్టండి అంటూ వచ్చేవాళ్లు, పెడుతున్నామంటూ వెళ్ళిన వాళ్ళు. అక్కడి సౌందర్యాన్ని వచ్చిన తర్వాత ఆనందించాలి తప్ప ముందు చెప్పకూడ దనుకున్నారు నిర్వాహకులు. కీసర అనగానే "అంకురం" అని అర్థమైంది. "అంకురం"తో పరోక్షంగా (నెల్లూరు పురందరన్న, అంకురం గురించి, సుమతి, సుమిత్ర గురించి మంచి పిల్లలమ్మ అని చెప్పేవాడు. ఇన్నయ్యగారి గురించి కూడా) చాలా పరిచయం ఉంది. చూడాలని ఎప్పటి నుండో అనుకున్నాను. రెండుసార్లు అయితే చూపిస్తావా? చూపించవా? అని అన్నతో దెబ్బ లాడాను. సరే సరే అంటూ వాయిదా వేస్తూ పోయారు. సంతాప సభకు ఆయన పుస్తకంలో రైటప్ కోసం ఫోన్లో మాట్లాడాను.

అంకురం సంస్థను కూడా చూడబోతున్నానన్న అదనంగా మరో ఆనందం నాకు. వేలమంది విద్యార్థులకు చదువును, అనాధలకు ఆశ్రయాన్ని ఇచ్చినదే "అంకురం". అంకురం అంటే "మొలక, నీళ్ళు,నెత్తురు, ఆరంభం, విత్తడం, మొదలుపెట్టడమని అర్థo. ఈ అంకురంలో అంకురించిందే ‘ హైదరాబాద్ ఉమెన్ రైటర్స్ ఫోరం(HWWF) కథ కార్యశాల’. మహబూబనగర్, వరంగల్, నిజాంబాద్, ఒంగోలు ఇంకా చాలా చోట్ల నుంచి వస్తున్నాం అని మెసేజ్లు పెడుతున్నప్పుడే అనుకున్న. హైదరాబాద్ ఒక్క చోట నుండి కాదు కదా హైదరాబాద్ ఎందుకు అనుకున్న. హైదరాబాదు వాళ్లు పెడుతున్నారు. ఇతర చోట్ల నుండి ఇష్టపడి వస్తున్నారు కనుక హైదరాబాద్ ఉంచారేమో? వెళ్లిన తర్వాత అడగాలి అనుకున్న. అది అడగాలన్న విషయమే గుర్తుకురానంత వేగం.

ఒకతను ఆధ్వర్యంలో అతి రహస్యంగా ఓ వర్కు షాపు జరుగుతుండేది. అయిపోయిన తర్వాతనే అందరికీ తెలిసేది. సామాన్యులకు ప్రవేశము లేనిది. ఇంకొకరి వర్క్ షాపు ఈమధ్య కర్నూల్లో జరిగింది. పాల్గొంటానని అడిగితే ఎకామిడేషన్ లేదు. మీరు అంత దూరం నుండి వస్తున్నారు. ఏకామిడేషన్ కల్పించలేం. ఇంకొకసారి మీకు తప్పకుండా చెబుతాం అన్నారు చాలా గౌరవంగా. ఇప్పటికీ వారి పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ ఎదురుచూపులో భండారు విజయక్క డిసెంబర్ లో ‘హైదారాబాద్ ఉమెన్ రైటర్ ఫోరమ్ కథ కార్యశాల’ పెడుతున్నాం అనగానే ఎగిరి గంతేసాను. సంవత్సరం చివర,కొత్త సంవత్సరం ప్రారంభం హడావుడి ఉంటుంది కదా! ఇప్పుడు పెట్టడం అన్యాయం డేట్ మార్చమని ఆమెను చాలామంది అడిగారు. సంవత్సరం మారకుండా వచ్చిన వాళ్ళతోనే పెట్టుకుందామని విజయక్క పట్టుదల. ఈ పట్టుదల వల్లనే 30.12.24న ఉత్సాహంగా "అంకురo" కు చేరాం. పలకరింపులు కౌగిలింతలు, ఆశ్చర్యాలు ఆనందాలు. అందరు మబ్బుల్లో తేలిపోతునట్లుగా ఉన్నారు.

ఎదురు చూస్తున్న కథ కార్యశాల భండారు విజయక్క వేదిక దగ్గరకు, వేదిక మీదకి ఆహ్వానం పలకటంతో స్కూల్ విద్యార్థుల్లా అందరం నిశ్శబ్దమైపోయాము. 11.30 కల్లా జ్యోతి ప్రజ్వలనతో కార్యశాల ప్రారంభమైంది. భండారు విజయక్క సoస్థ స్థాపన, ఉద్దేశం, రావాల్సినవారు రాకపోవడం కారణాలు వివరించారు. కథలు ఎలా రాయాలి? ఎలా ముగించాలి? ఎక్కడ కామాలుండాలి. మన కథలు మనమే రాసుకుందాం. మహిళలకు ఇంతవరకు ఎక్కడ ప్రత్యేకంగా వర్క్ షాప్ జరగలేదు. ఈ కథ కార్యశాల వల్ల మనం అనేక విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ అందరo విద్యార్థులo. అందరం సమానం. ఎక్కువ తక్కువ లేదు. వీటన్నిటికన్నా మనుషులతో మనుషులు కలవడమే గొప్ప. ఒకరి భావాలు ఇంకొకరo పంచుకుందాం. ఈ కథ కార్యశాలను ప్రతి మూడు, నాలుగు నెలలకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో రణగొరధ్వనులకు దూరంగా పెట్టుకుందాం.


కథ కార్యశాల బోధకులతో రచయిత్రులు


మహిళల కోసం మహిళలు నిర్వహించుకున్న వర్క్ షాపు మొదటిది ఇదే. కథ వర్క్ షాపులను 30 ఏళ్ల నుంచి విరసం, అరసం, మంజీరా మొదలైన చాలా సంస్థలు పెడుతున్నాయి. మహిళలు పురుషులు పాల్గొంటారు. చాలామంది మహిళలు, కవిత్వం బాగా రాసిన వాళ్ళు కథలు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం, స్వయంసిద్ధ, యోధ కథా సంకలనాల కథలు పరిశీలించినప్పుడు నాకు తెలిసింది. ఆ కథలల్లో చిన్నచిన్న లోపాలు కనిపి0చాయి. కథ వస్తువు బాగా తీసుకున్నారు. నిర్మాణం ఎలా చేయాలి? ఎత్తుగడలు ఎలా ఉండాలి. ఎలా మొదలు పెట్టాలి. కొనసాగింపు, డైలాగులు ఎలా ఉండాలి. కామా, పుల్ స్టాపులు సెమికొలను ఎక్కడ ఉంచాలనేది అవగాహన లేకపోవడం వలన ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

పేరాలతో, వ్యాసాలుగా, 8 పేజీలలో రాయమంటే 23పేజీలు రాస్తున్నారు. స్వీయ ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నారు. స్వయంసిద్దలో ఇచ్చిన డైరెక్షన్స్ వల్ల కొందరు రచయితలు యోధ కోసం కథలు రాసినప్పుడు తమ పొరపాట్లను సరిదిద్దుకుని, కథలను ఈసారి అద్భుతంగా రాశారు. ఈ విషయం గమనించిన తరువాత అనిపించింది వర్క్ షాప్ పెట్టాలని. మనం ఒక్కళ్ళమే అభివృద్ధి చెందడం కాదు. అందరూ రాయగలిగితే ఇంకా మంచి కథలు వస్తాయి. నేను పనిచేసిన సంస్థలలో, చాలామందికి కథలు రాయాలని ఉంటుంది. విభిన్న పద్ధతుల్లో మనo కథలు ఎలా రాయాలో సభ్యులకు నేర్పితే బాగుంటుందని చాలా పోరాడి,ఒత్తిడి చేశాను.

కథా వస్తువును ఎలా తీసుకోవాలి. శైలి శిల్పం, నిర్మాణం ఎలా ఉండాలి. భాషను ఎలా ఉపయోగించాలి. వాక్య నిర్మాణం ఎలా ఉండాలి. ఎడిటింగ్ ఎలా ఉండాలి. సెల్ప్ ఎడిటింగ్ మాత్రమే కాక బయట వారితో కూడా ఎడిటింగ్ చేయించుకోవడం కథలకు చాలా అవసరం అనిపించింది. ఇది క్లాసెస్, వర్క్ షాప్ ల వలన రీచ్ అవుతుంది. ఇది నేర్పాలి కదా! సంస్థలుగా వేదికలగా మనం చేయాల్సింది అదే చేయాలని అనిపించింది. మన సంస్థలోకి వస్తున్నవారికి, మనతో పాటు కొత్తగా కథలను రాసే ప్రయత్నంలో ఉన్నవారికి, నేర్పగలిగితే అది చాలా ఉపయోగం ఉంటుందనిపించింది.

ఈమధ్య ఖమ్మంలో జరిగిన ఈస్తటిక్ సంస్థ బహుమతులప్పుడు కథ వర్క్ షాప్ ను, కొత్త పద్ధతుల్లో వారు నిర్వహించడం తెలుసు. ఇప్పుడు నేను కూడా అదే పద్దతిని ఎందుకు పాటించకూడదు. ఎప్పుడు పాత పద్ధతులేనా? ఉపన్యాస పద్ధతిలో కాకుండా వాడుక భాషలో (అంటే ఎకడమిక్ ధరణిలో కాకుండా) కథ కార్యాశాల నిర్వహిస్తే, కథకులు చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు తెలుసుకునే వీలు వుంటుంది. ఎడిటింగ్ లోపాల్ని తెలుసుకోగలుగుతాం. కొత్త రచయితలు అందరూ ఈజీగా కథ రాయడం తెలుసుకోగలగాలనే ఉద్దేశంతో,ఎట్లైనా సరే!” “కథ వర్క్ షాప్ “ పెట్టాలన్న సంకల్పంతో ఉన్నాను. వాట్సాప్ గ్రూపు లో మిత్రులకు పెట్టడం జరిగింది. చాలామంది మేము వస్తామని స్పందించారు. మీ అందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ కార్యశాలలో మనందరం కథ గురించి చాలా విషయాలను నేర్చుకుందాం. నేర్చుకుంటాము.ఇది నెరవేరితే కథా కార్యశాల విజయవంతం అయినట్లేనని మా అందరికీ భండారు విజయక్క ఉత్సాహాన్ని నింపారు.

అంకురం సుమిత్ర గారికి రైట్ హ్యాండ్ గా ఉన్న రాజేశ్వరి మేడంగారు "అంకురం" తరపున ఆహ్వానం పలుకుతూ మంచి కవిత వినిపించారు. రాజేశ్వరి మేడంగారిది మా ప్రకాశం జిల్లానే. మేడంగారు మండల రెవిన్యూ అధికారిగా రిటైర్ అయ్యారు. అయినా చాలా సింపుల్ గా ఉన్నారు. మా అందరికీ ఆ రెండు రోజులు భోజనాలు, టీలు, టిఫన్లు స్నాక్స్, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రోటి, నిల్వ పచ్చళ్ళు. ఇంటి దగ్గర అమ్మలా టైం టు టైం అందించారు. సభాధ్యక్షులైన బిఎస్ రాములుగారు అందరిని పరిచయం చేసుకుంటు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరారు. విజయ భండారు, శివలక్ష్మి, సుజాత, జయంతి, శ్రీదేవి, నిహారిక, నెల్లుట్ల రమాదేవి, కళ్యాణి కుంజ, గిరిజ పైడిమర్రి, శాంతిప్రబోద, రాధా, అనిత, కొలిపాక శోభారాణి, శ్యామలాదేవి, వసంత,శ్యామల, రాజ్యలక్ష్మి, కాంతి, యాకమ్మ, నస్రీన్ ఖాన్, ఫరాద్,జ్వలిత, అరుణ,కొండపూడి నిర్మల, శాంతి ప్రభోద, గిరిజ పైడిమర్రి, శ్యామల rtd WCPC గారు దాదాపు 30 మంది పైగా మొదలైన రచయితలండరు తమ పరిచయ వాక్యాలు చెప్పారు.


సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత బీఎస్ రాములు



ఈ కార్యశాల గురించి చెబుతున్నప్పుడు మరో ప్రత్యేకమైన వ్యక్తులు ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకరు సాయిబాబా సహచరి వసంత. తనకు ఆ ముందు రోజే కథ కార్యశాల గురించి తెలిసిందట. చాలా ఆసక్తిగా వచ్చారు. తనను చూసిన మా అందరికీ సాయిబాబా గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకు అంతే. సాయిబాబా గురించి తను రాసిన కవితను నాకు చెప్పారు. ఇంకొకరు బి.ఎస్.రాములు గారి సహచరి శ్యామగారు. వీరైతే,. ఇప్పటివరకు తెర వెనుక ఉన్న ఓ అసాధారణ, సాదారణ మహిళ. రాములు గారికి తనకు తోడుగా వచ్చారు. బిఎస్ రాములు గారిని ఓ పసిబిడ్డలా పర్యవేక్షణ చేస్తున్నారు. పరిచయ కార్యక్రమంలో ముందు మాట్లాడను అన్నారు.

తన గురించి బిఎస్ రాములుగారు చెప్పటం మొదలు పెట్టగానే, నా గురించి నేను చెప్తాను, నేను చెప్తాను అని ముందుకు వచ్చారు. కార్యశాల స్ఫూర్తి , ప్రభావం శ్యామలగారితోనే మొదలయింది. బి ఎస్ రాములుగారు రాజకీయాలలో అండర్ గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు, ఏడు సంవత్సరాలు పోలీసుల దాడులు, బూతులు, ఎలుకల కోసం పాములు తిరిగే గోనెపెంకుల ఇంట్లో నలుగురు పిల్లలను బ్రతికించటం కోసం బీడీలు చుట్టే పని చేశానని అన్నారు. ఆమె జీవితమే ఓ స్పూర్తిదాయకమైన పెద్ద కథ. సభ అధ్యక్షత వహించిన బిఎస్ రాములుగారు మాట్లాడుతూ ఇంతమంది మహిళలను, ఈ కథ వర్క్ షాప్ లో చూడడం చాలా ఆనందంగా ఉందన్నారు. 93, 98 లో జరిగిన వర్క్ షాప్ ల గురించి వివరించారు.

ఒక చిత్రకారుడికి వుండే నిషిత దృష్టి కథకులకుండాలి. మనస్సు చూడకుండా కన్ను చూడలేదు. పరిశీలన శక్తి ఉండాలి. బొమ్మలు చేయడం వస్తే ఏ బొమ్మైనా చేయవచ్చు. కథలు రాయడం వస్తే ఏ కథ అయినా రాస్తాం. వాఖ్యనిర్మాణం రావాలి. వ్యాస పద్ధతి ఇప్పుడు పనికిరాదు. కథలు రాయటం తెలుసుకోవాలంటే ‘కథలబడి’ చదవాలి. కథా రచనకు కథకుడికి పాఠాలు:- కథకు ప్రారంభం.. కొనసాగింపు.. ముగింపు ఉంటుంది. 8 పేజీల లోపల ఉంటే పత్రికల్లో వస్తుంది. 20 పేజీలుoటే రాదు. వందేళ్ళ కితo బుర్రకథ హరికథలు రూపంలో వారం రోజులు పాటు కథలను చెప్పేవారు.. శ్రీపాద సుబ్రహ్మణ్యం కథలు అరవై పేజీలు ఉండేవి.అప్పటికి అవి అవసరం. అప్పుడు చదివారు. టెక్నాలజీ ఊహాశక్తి పెరిగినది. ఇప్పుడు చదవరు. కథ చిన్నగా ఉండాలి. అరవై పేజీల కథను అదే స్థాయిలో అదే స్ఫూర్తితో పది పేజీలలో చెప్పగలగాలి.

ఒక్క పేజీ కథ రాసుకుని వంద ఎపిసోడ్లు తీస్తున్నప్పుడు 4 పేజీల్లో కథలు ఎందుకు రాయలేమనిపిస్తుందిి. సింగిల్ లైన్ తో షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు రెండు పేజీలలో కథ చెప్పలేమా? కథలో పేరాలు పెద్దగా ఉండకూడదు. మూడు ఐదు ఏడు లైన్లలో ఉంటే చదవడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వ్యాసాలలో 15 లైన్ల వరకు అయినా ఉండొచ్చు. పేరా మార్చడం అంటే సంఘటనలు సంభాషణలు మారుతాయి. సంభాషణలకు కొటేషన్లు, కామాలు ఉండాలి. కథను సంఘటనలను సృష్టిస్తూ రాయాలి. యండ్లమూరి వీరేంద్రనాథ్ సంఘటనలను సృష్టిస్తాడు. సన్నివేశ వర్ణన కొంత అవసరం. అందమైన ముగింపు ఇవ్వాలనుకుంటారు. ముగింపు సందేశాత్మకంగా ఉండాలి.

కొసమెరుపు కథల్లో సస్పెన్స్ చాలా చాలా ఉంటుంది. దీనివల్ల కొంత నష్టం జరుగుతుంది. మధ్యలో కథనంపై దృష్టి పెట్టకుండా ముగింపు మీద పెడతారు. కవిత్వం ఏకవచనం. ఒక్క పాత్రతో ఎంతైనా చెప్పవచ్చు. కథ బహువచనం. నాలుగు ఐదు పాత్రలను చిత్రీకరించాలి . కథలో మినిమం రెండు పాత్రలైనా ఉండాలి. మనసులోని జ్ఞాపకాలు ద్వారా ఎంత కథ అయినా చెప్పవచ్చు. గతంలోకి వెళ్లి వర్తమానం రాయవచ్చు. నిర్దిష్టతలో సార్వజనినత కనిపించాలి. సెంటిమెంట్ లేకుండా ఉంటే కథలు పండవ్. రావిశాస్త్రి ఒక వాక్యం ప్రారంభించి ఎటైనా తీసుకుపోయేవాడు.

1. కథను రాయటానికి మూడు పద్ధతులు ఉంటాయి. 1. నేను అనిరాస్తే ఉత్తమ పురుష ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ అంటారు. ఉత్తమ పురుషలో అనేక సౌకర్యాలు ఉంటాయి. వర్ణనలు, వ్యాఖ్యానo, సంఘటనలు అన్ని మనమే చెప్పొచ్చు. ప్రభాకర్ జైన్ కథలన్ని ఫస్ట్ పర్సన్ లోనే ఉంటాయి.

2. సెకండ్ పర్సన్ కథలు. ఉత్తరాలు, ఇతరులతో చెబుతున్నట్లు, ఫోన్లో మాట్లాడుతునట్లు ఉండే కథలు. కొంచెం సులభంగా ఉంటాయి. సెకండ్ పర్సన్ కథలో కొంత సౌలభ్యం ఉంటుంది. అవసరమైనంత మేరకు, దృశ్యకరించకుండా యాభై సంఘటనలనైనా టకటక చెప్పుకుంటూ పోవచ్చు.

3.థర్డ్ పర్సన్ కథలు స్వగతం లో అనుకున్నట్లుగా ఉంటాయి. వీటిని కర్మసాక్షి కథలు అంటారు. సవాసేరు గోధుమలు థర్డ్ పర్సన్ లో రాసినది. మున్షి, ప్రేమ్ చంద్, మలుపు ఉదా.. చెప్పవచ్చు.

కథలలో పాత్రలు, సన్నివేశాలు, సంఘర్షణ, ఆహార్యం, దృశ్యకరణ, వ్యక్తిత్వాల చిత్రీకరణ, సార్వజనినత, ప్రేమ, సెంటిమెంట్, మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలలో సమానత ఉండాలని ముగించారు.

ప్రధాన వక్త ఎస్ కాంతారావు:

బిఎస్ రాములు గారిది ఎకడమిక్, ఉపన్యాస పద్ధతిలో అరటిపండు వోలిసి పెట్టినట్లుగా ఉంటే, కాంతారావు గారిది అరటిపండు మిక్సీ వేసి నోట్లో వేసినట్టుగా ఉంది. ప్రశ్నించే పద్ధతిలో ప్రాథమిక విద్యార్థులకు బోధించినట్లుగా ఉంది. కాంతారావుగారు తన కథలు గురించి చెప్పగానే 'వావ్' అంటూ అందరo నోరేళ్లపెట్టాము. 350 కథలు రాస్తే 120 కథలు పైగా బహుమతులు వచ్చాయట. అందులో 150 కథలు గిరిజనుల గురించి రాసినవట. ఆరు నవలలు, ఆరు కథా సంపుటాలు వచ్చాయట. ఇంకా మూడు నవలలు "విత్తం" లేక ఆగిపోయాయని అనటంతో అయ్యో! అనిపించింది.

శిల్పం, శైలి, నిర్మాణం ట్రాష్ అనంగానే తనవైపు 'ఆ' అంటూ చూసాం. భాష,భావం, వ్యక్తీకరణ, వస్తువు ఎన్నికలో ఉంటుంది. జీవితమే ముఖ్యం. పౌరాణిక కథలకు ఇప్పటి కథలకు తేడాలేంటి? ప్రశ్నించారు? పౌరాణిక కథలలో పాత్రలు గ్రాంథిక భాషలో మాట్లాడుకుంటాయి. మన కథలలో పాత్రలు వాడుక భాషలో మాట్లాడతాయి. విన్నవాటిని, కన్నవాటిని తనదైన శైలిలో, పంధాలో రాస్తే అదే కథ. శీర్షిక (పేరు )ముందు రాయవద్దు. స్క్రిప్టును మూలకు పడేయండి. కొంత కాలం తరువాత కరెక్షన్ చేయడం మొదలు పెట్టండి. ఐదవ సారి రాసేటప్పుడు శీర్షిక తగులుతుంది. కథకు సంబంధం లేని టైటిల్ పెట్టాలి.

క్యారెక్టర్ మారినప్పుడల్లా పేరా మారాలి. పరిశీలన కూడా దృశ్యమానంగా ఉండాలి. ఉత్తమ పురుష, ప్రధమ పురుష, కర్మసాక్షి కథన పద్ధతి ఉండాలి. నెల్లూరు కేశవస్వామి గొప్ప కథకులు. ఆయన కథలు చదివితే కథ ఎలా ఉండాలో? ఎలా రాయాలో? అర్థం అవుతుంది.

కథకు మూడు లక్షణాలు ఉండాలి 1.ఆరంభం 2.కొనసాగింపు 3.ముగింపు. ఆరంభం ఆసక్తిగా ఉండాలి. కొనసాగింపు విసుగు చెందకుండా ఉండాలి. ముగింపు అద్భుతంగా ఉండాలి.

1. వర్క్ షాప్ ఉద్దేశంతో కథకులకు ఉండాల్సిన మూడు లక్షణాలు చెప్తాను. 1.డేగ కళ్ళు. డేగ కళ్ళలాగా కథకుడి కళ్ళు ఎప్పుడు కథల కోసం వెతుకుతూ ఉండాలి.

2.పాముచెవులు. పాముకు చెవులు ఉన్నాయా? లేవు అన్నాం. పాముకి ఒళ్లంతా చెవులే. శరీర స్పర్శ ద్వారా తెలుసుకుంటది. పాములాగా ఒళ్లంతా చెవులుగా ఉండాలి. బస్సులో వెళ్తున్న ప్పుడు విన్న సంభాషణలు బట్టి రాసిన కథకు బహుమతి వచ్చింది.

3.కుక్కముక్కు ఉండాలి. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్లుగా కరోనా క్రిమి ప్రపంచాన్ని వణికించింది. పరిశోధన కోసం గిరిజనులను ఎన్నుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎండాకాలంలో ఆకులు కూడా ఉండవు. కటిక పేదరికం ఉంటుంది. కర్ర దుంపలను (కోరికితే చచ్చిపోయేటంత విషం ఉంటుంది) ఆఖరి ప్రయత్నంగా తెచ్చి మూడు రాత్రులు మూడుపగళ్ళు గంపల్లో పోసి నీటి ప్రవాహ0లో పోకుండా కడతారు. నీటి ప్రవాహానికి ఆ విషo ఇరుగుడు అయితది. అప్పుడు వాటిని కుడుములుగా చేసుకొని తింటారు. గిరిజనులు మనలాగా డబడబా మాట్లాడరు. అతి తక్కువగా 'అ' 'వు' లతో మాట్లాడతారు. ఇలాంటి చోట డేగకళ్ళు, పాముచెవులు పనికి రావు. నా కుక్కముక్కు పని చేసింది. 'గంధపుచెక్కలు' పేరుతో రాసిన కథకు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ మూడు లక్షణాలు ఉంటే చాలా సౌలభ్యతకు లోనవుతాం.

ఇంకొక మూడు లక్షణాలు 1.లవణం 2.భకం,3.కుకటం. ఉప్పులా కథ రచయిత ఎక్కడ కనిపించకూడదు. కనపడకుండా రుచినిచూస్తూ కథలో తాను అంతర్భాగమై ఉండాలి. ఎదురుచూచిన కథా వస్తువు కోసం కొంగలా తపస్సు చేయాలి. టక్కున అందుకోవాలి. కోడిలా తవ్వాలి. మహిళలకు అన్వహించే అంశం ఇది. కుకటం తన పిల్లల రక్షణలో దశలవారీగా అలవాటు చేస్తూ నైదిబ్బలో ఆకుపచ్చ పురుగుల కోసం తవ్వినట్టు తవ్వాలి. ఈ ఆరు లక్షణాలతో పాటు మంచి భాషను మీరు ఉపయోగిస్తే, మీనుండి కూడా మంచి కథలొస్తాయని ముగించారు.

మండవసుబ్బారావు గారు మాట్లాడుతూ కథలో ఉండాల్సిన అంశాలు గురించి వాళ్ళిద్దరు చెప్తే, నేను కథలో ఉండకూడని అంశాలు, కథ ఎందుకు రాయాలి చెపుతాను. నేను ఎమ్మెస్సార్ కథలు అని 78లో వేసుకున్నాను. ఆ కథలు బాగున్నాయని నారాయణరెడ్డి, ఆరుద్ర గార్లు అనటంతో ఆరుద్ర గారి త్వ మేవాహం మీద పరిశోధన చేశాను. అయితే నా విమర్శ నచ్చని నా గైడు నా పరిశోధన పై సంతకం చేయలేదు. పీహెచ్డీ డిగ్రీ రాలేదు.కనుక మనం చెప్పేది చాలా సూక్ష్మంగా ఉండాలి.

. కథ అనేది సంస్కృత పదం. కథ అంటే చెప్పడం. చెప్పడానికి లక్షణాలేమిటి? శ్యామల గారు చెప్పారు. ఏ శిల్పం,ఎ శైలి, ఏ భాష వాడారు. ప్రతి మనిషి కథలు రాయలేరు. కాని చెబుతారు. నిన్నటి గురించి సింపుల్ గా చెప్పడమే కథ. విమర్శకులు శిల్పం శైలి ఉండాలి అంటారు.

పత్రికలు వ్యాపార సంబంధమైన, పెద్దకథ, కథ, చిన్నకథ, పేజీ కథ, 100 వర్డ్స్ స్టోరీ, నానో కథలు, కార్డు కథలు ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. 100 వర్డ్స్ లో కథ చెప్పవచ్చు అంటూ పదే పది వాక్యాల్లో అద్భుతమైన కథ చెప్పారు.

కథ ఎందుకు రాయాలి అంటే టాల్ స్టాయ్ "ఫాస్ట్ టెల్లింగ్ ఆన్ రియాలిటీ ఆఫ్ ఎస్టర్డే" (fast telling on reayality of yesterday) అన్నారు. నిన్నటి వరకు జరిగిన సంఘటనలను చెప్పడమే కథ. ఊహ లోకానికి వెళ్ళి నీ ఇష్టమైంది నీ ఇష్టం వచ్చినట్లు రాయవద్దు. సంఘర్షణ, సంఘటనలు, పాత్రలు, పాత్రోచిత సంభాషణలు ఉండాలి.

కథ, కవిత ఎలా రాయాలి? నేర్పడం కోసం కాంతరావు, నేను ప్రతి సం.8,9,10 తరగతుల విద్యార్థులకు దాదాపు 300 మందికి రెండు రోజులు వర్క్ షాప్ నిర్వహించి, శీర్షిక ఇచ్చి రాయించి బాగున్నవాటికి బహుమతులు ఇచ్చి పంపుతున్నాం. ఈ విద్యార్థులే కదా రేపటి కవులు కథకలు. జనవరి 3,4 తేదీల్లో కవిత, కథ కార్యశాల జరుగుతుంది అని ముగించారు.

రెండో వక్త... కొండవీటి సత్యవతిగారు మాట్లాడుతూ ఇక్కడ మీ అందర్నీ చూస్తుంటే 2004లో భూమిక, అన్వేషి ఆధ్వర్యంలో కథా నిర్మాణం, వస్తువు, తీరుతెన్నుల గురించి రెండు రోజులపాటు చాలా పెద్ద ఎత్తున జరిగిన వర్క్ షాపు గుర్తుకు వస్తుంది. ఆ వర్క్ షాప్ కు అబ్బూరి ఛాయాదేవి, పి.సత్యవతి, కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అప్పుడు ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. ఆనాటి వర్క్ షాప్ కథకులకు కొత్త చూపును ఇచ్చింది. కథా పరిచయం లేని వాళ్లు కూడా అప్పటికప్పుడు కథ రాయడం జరిగింది. ఉదా:శిలాలోలిత ఆరుచుక్కల ముగ్గు అని చాలా మంచి కథ రాసింది. మీరు కూడా ఈ రాత్రికి ఒక కథ రాయండని చెప్తున్నాను. ఈ వర్క్ షాప్ మీకు కొత్త దృష్టిని ఇస్తుందనుకుంటున్నాను.

అబ్బూరి ఛాయాదేవిగారు ఆ రెండు రోజుల కార్యక్రమాన్ని అక్షరం పొల్లు పోకుండా రికార్డ్ చేసారు. ఈ రికార్డు వల్ల 1904లోనే (గురజాడ అప్పారావుగారి కన్నా ముందే) అద్భుత కథలు రాసిన మొదటి మహిళ, భండారు అచ్చమాంబ గురించి (ఆమె కథలు కథలు కాదు పొమ్మన్నారు. ఆమెను, కథలను గుర్తించలేదు) పీహెచ్డీ చేసినంత చదివి వెలుగులోకి అంటే మనందరికీ తెలిసేటట్లు చేయగలిగాను. 80 లో వచ్చిన స్త్రీవాద ఉద్యమం గురించి, వెల్లువలా వచ్చిన సాహిత్యం గురించి చెప్పారు. స్వతంత్రానికి ముందు చాలా కాలం మహిళల సాహిత్యాన్ని చీకట్లోనే ఉంచారు. సాహిత్యంలో స్త్రీలు మరుగునపడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనకు తెలియని మనచరిత్ర వచ్చేవరకు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి కూడా తెలిసేది కాదన్నారు. సత్యవతిగారు అతి ముఖ్యమైన మూడు పాయింట్లు చెప్పారు.

1.స్త్రీలుగా, రాస్తున్నప్పుడు చూడాల్సింది స్త్రీల దృష్టి కోణంతో ఎలా ఉందని. ఇప్పటివరకు సమాజమంతా పురుషుల కోణంలో ఉంది.

2. ప్రపంచీకరణ గుప్పెట్లో (విషంలో) ఇరుక్కుపోయాం. మొబైల్స్ వచ్చిన తర్వాత వంటరి వాళ్ళమైపోయాం. కుదురైన మనసును, సున్నితమైన స్త్రీతత్వాన్ని కోల్పోయాం. ఈ కోణంలో కూడా కథలు రాయాలి.

3. ఏనభైలలో మహిళ,దళిత, ముస్లిం స్త్రీల ఉద్యమాలు, సాహిత్యం, ప్రశ్నలు వచ్చినట్లే ఇప్పడు trans జెండర్ ల ఉద్యమాలు వస్తున్నాయి. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. వాళ్ళ కథలు రాయాల్సి ఉంది. వారు చెప్తారు కానీ రాయలేరు. వారి దగ్గర కూర్చుంటే అనేక కథలు రాయగలం. అయినా బయట వ్యక్తులుగా రాసినట్టుగానే ఉంటుంది. వారి కథలను వారిచేతనే రాయించగలగాలి.

ట్రాన్స్ జెండర్ ల బాధల గురించి చెప్తూ "బ్లేడ్ వేయటం" అంటే ఏమిటో చెప్పారు. దీని గురించి మాకు ఎవరికీ తెలియక పోవటంతో చాలా దిగులు పడిపోయాం. ఈ కార్యశాల వల్లనే ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతాం.

ఫోక్సో చట్టం, డొమెస్టికల్ వైలెన్స్ చట్టం, సెక్స్ వల్ హెరాస్మెంట్ చట్టం, గృహహింస చట్టం, ఆస్తి హక్కు చట్టాల గురించి చెప్పారు. మీకు అన్ని చట్టాలు ఉన్నాయి. ఇంకేంటి ఇబ్బంది అంటారు. చట్టాలు ఉన్నాయి అమలు జరుగుతున్నది ఎక్కడ? ఈమధ్య భార్య బాధితుల సంఘం అధ్యక్షుని భార్య మా దగ్గరికి వచ్చింది తిండి లేకుండా. చట్టాలు వేరు సమాజం వేరు అనుకోవడం లేదు. ఈ అంశాల్లో నుంచి కథలు ఎన్నుకోండి. బస్తీలకు, గ్రామాలకు, ఫ్యామిలీ కోర్టు దగ్గరకు, పోలీస్ స్టేషన్లకు, సెక్స్ వర్కర్స్ దగ్గరకు ప్రిజనర్స్ దగ్గరకు, సీనియర్ సిటిజన్స్ దగ్గరకు వెళ్లండి. బోలెడన్ని కథలు వస్తాయి. కథ వస్తువులకు కొదవేలేదు.

సమావేశంలో గ్రూపు చర్చలు


ప్రపంచీకరణ విధ్వంసం, వస్తువ్యామోహం పాసిజం-మతతత్వ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ముగించారు. మూడవ వక్త నెల్లుట్ల రమాదేవిగారు:- సాహిత్యంలో హాస్యానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఈ సబ్జెక్టు గురించి చెప్పాల్సిన వాళ్ళు ఏవో కారణాల చేత రాలేకపోయారు. రమాదేవిగారు అప్పటికప్పుడు ప్రావీణ్యం ఉన్న గొప్ప టాలెంటెడ్ పర్సన్ గా హాస్యాన్ని పండించారు. అప్పటివరకు జరిగిన సీరియస్ లో నుంచి, ఇంత బాగా కథలు రాయగలమా? అన్న ఆలోచనలలో నుంచి బయటకులాగి నవ్వుల పువ్వులు పూయించారు. పాత కొత్త సినిమాల్లోని హాస్యాన్ని ఆహాభావాలతో సినిమా చూస్తున్నంత గొప్పగా చూపించారు. పాత కొత్త సినిమాలలోని హాస్యానికి ఉన్న తేడాను కూడా చెప్పారు. ఇంటి చుట్టుపక్కల జరిగే వాటిలో ఎంత హాస్యం ఉంటుందో సందర్భోచితంగా చెబుతుంటే అప్పటిదాకా కొంతమందే హాస్యాన్ని పండించగలరన్న భ్రమలను తొలగించుకున్నాము.


అప్పటికే అనుకున్న టైం మించి పోవడంతో, చర్చించాల్సిన కథలోకి వచ్చి నాలుగు గ్రూపులుగా విడిపోయాం. ఓల్గా గారి కథ "నోర్ముయ్" ను కొండపల్లి నిహారిణి చాలా శ్రావ్యంగా వినిపించారు. ఎగ్జామ్ రాస్తున్నoత సీరియస్ గా మరోసారి చదివి ఒక్కొక్క గ్రూపు వారివారి అభిప్రాయాలను ఇచ్చిన పుస్తకంలో నోట్ చేసుకున్నారు. గ్రూప్లో ఉన్న ఒకరు వారు రాసుకున్న వాటి గురించి చెప్పారు. అన్ని గ్రూపుల సారాంశము, ఈ కథ రాసి 35 సం.లైనప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయని, మార్పు రాలేదనే నిర్ణయానికి వచ్చారు. చిన్న కథలోనే పెద్ద భావం. అనేక సింబాలిక్ లతో కథ నడిచిందని చర్చించారు. అందరి అభిప్రాయాలను బిఎస్ రాములు గారు సమన్వయ పరిచారు.

అంతటితో ఆరోజు కథా కార్యశాలను ముగించి అందరం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ అనేక అంశాలు, కథల రాస్తున్న వారి ఇళ్ళల్లో నుంచి వచ్చే విమర్శలు, ఇబ్బందులు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత గ్రూపులు గ్రూపులుగా చర్చలు మొదలయ్యాయి. రెండవరోజు: 31..12..24. 2వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ బిఎస్ రాములు గారు కార్యాచరణ సంబంధాలు చెప్పగలగాలి. ఏమి జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకు అనివార్యమైనది? కర్ణుడుకు శాపం లాగా పురుషాదిక్యత సమాజంలో కథలు రాయటం మహిళలకు అనివార్యమేనన్నారు.

కథ కార్యశాల నిర్వాహకులలో ఒకరైన సుమిత్రగారు "అంకురం" స్థాపన, ఎదుర్కొన్న ఇబ్బందులు, విద్యార్థులకు "అంకురం" తరుపున అందించిన విద్య, వసతి. ప్రత్యేక తెలంగాణ, 2014 నుంచి ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులవలన పిల్లలను అతి కష్టం మీద వివిధ సంస్థలలో చేర్పించటం. ఇప్పుడు పాఠశాలల కెళ్ళి వివిధ అంశాలపై స్కిల్స్ ను, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని,ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మీకుగాని, ఇతర తెలిసిన మిత్రులకుగాని "అంకురం"లో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఎన్ని రోజులైనా ఎంతమంది అయినా రావచ్చని చాలా భరోసాని ఇచ్చారు. తెలిసిన అందరికీ చెప్పండి అన్నారు. భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కు, ఒంటరి మహిళలకు ఇక్కడ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నామన్నామని అందరికీ ఆహ్వానం పలికారు.

నిన్నటి కన్నా కొద్దిగా అభివృద్ధి చెంది 1 2 3 4 చెప్పి నాలుగు గ్రూపులుగా, చర్చించాల్సిన నాలుగు కథలు ఒకేసారి ఇచ్చేశారు. కథా కార్యశాలలో మా రెండవ కథ "ఆక్రమణo" గురించి చాలా చర్చ జరిగింది. ఇది ముదిగంటి సుజాతారెడ్డి గారి కథ. వస్తు వ్యామోహం, గిరిజనుల నిజాయితీ, అమాయకత్వం, పెట్టుబడి దారుల దోపిడీ, మతం కూడా వీరికి ద్రోహం చేసిందని చర్చించారు. గిరిజనుల జీవితాలు, సంఘటనలు, సంభాషణ రూపంలో ఉన్న మంచి కథ అని చర్చించారు. కానీ గిరిజన భాష ఎక్కడా ఆ కథలో లేదని, ఈ కథనే నిజంగా ఓ గిరిజనుడు రాస్తే ఇంకా దుఃఖంగా ఉండేదన్నారు.

అందరి అభిప్రాయాలను సమన్వయపరుస్తూ బిఎస్ రాములుగారు పాతికేళ్ళ క్రితమే గిరిజనుల గురించి రాయటం చాలాగొప్ప విషయమని, ఇతరులు రాయకూడదనటం సరైంది కాదని, రాయడమే చాలాగొప్ప అని చెప్పారు. నిజమే కదా అనుకున్నాం. మూడవ కథ "మెర్సీపరిశుద్ధ పరిణయం" .ఇది మానస ఏండ్లురి గారి కథ. చిన్న చిన్న వాక్యాలతో, పేరాలతో మాలో చాలామందికి తెలియని చర్చి సంప్రదాయాలను తెలిపిన కథ. దళితులపై అగ్రవర్ణాల దోపిడేకాక దళితస్త్రీలపై జరిగే అత్యాచారాలను కళ్ళ ముందుంచిoది. అన్నింటి దగ్గర అంటరానితనం ఉంటుంది. అత్యాచారాలు చేయడానికి దళిత స్త్రీలు కావాలనే గొప్ప డైలాగు ఉంది ఈ కథలో.

అందరి అభిప్రాయాలను సమన్వయపరుస్తూ బిఎస్ రాములుగారు చాలా గొప్పకథని, రచయిత్రి పరిణితి కనిపిస్తుందని చెప్పారు. నాలుగో కథ "కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు". ఇది విమలక్క గారి కథ. ఉద్యమం పోరాటాలు నేపథ్యంలో వచ్చిన కథ. ఉద్యమాలలో పాల్గొంటున్నవారిని, టీన్ ఏజ్ పిల్లలను ఎలా దొంగ ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నారో తెలియచెప్పిన అద్భుత కథ. కనీసం శవాలను కూడా బంధువులకు చూపించకుండా పోలీసులే దహనం చేయడం అమానుషమని తెలిపిన కథ. ఈ పరిస్థితిల నేపథ్యంనుంచే శవాల ఆధీన కమిటీ, బంధు మిత్రుల కమిటీ వచ్చిందని చెప్పవచ్చు.

కార్యశాలకు అతిథ్యం ఇచ్చిన "అంకురం" సుమిత్ర గారితో

ఇంకా చదవడానికి ఐదవ కథ ఉన్నప్పటికి, అప్పటికే మూడు గంటలు అవుతుంది మధ్యాహ్న భోజనాలు కూడా తినలేదు. సుమిత్రగారు, రాజేశ్వరి మేడంగారు, మధ్య మధ్యలో మేము తినడానికి తాగడానికి ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నారు.అయినా, కొత్త సంవత్సరం. ఇళ్ళ దగ్గర ఎదురు చూసేవాళ్ళ కోసం వెళ్లిపోయే హడావుడిలో కథకులు ఉన్నారు. నిర్వాహకులు ఆ కథ గురించి మీ మీ అభిప్రాయాలను తర్వాత తెలియజేయండి అన్నారు. ఈ రెండు రోజుల కథాకార్యశాలపై, పాల్గొన్నవారు తమ తమ అభిప్రాయాలను చెబుతూ ఈ కథ కార్యశాల ఇచ్చిన స్ఫూర్తితో కథలు రాస్తామాన్న ధైర్యము, కాన్ఫిడెన్స్ మాలో వచ్చిందని వచ్చిందన్నారు. ఈ కథ కార్యశాలను వీలైనంత తొందరలో మళ్ళి పెట్టండని కోరారు.

ఆతర్వాత ముగింపు సమావేశానికి అతిధి గా వచ్చిన హేమలలిత , అడ్వకేట్ గారు మాట్లాడుతూ ఎంతో శ్ర్మకు ఒడ్చి నా మిత్రురాలు ఈ కార్యశాల ను పెట్టిందని, మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వియజ్యవంతం చేయడమే కాకౌండా మీ అభిప్రాయాలు విన్న తర్వాత భండారు విజయ చాలా మంచి పని చేసిందని అర్ధం అయిందని చెబుతూ భండారు విజయక్కకు అభినందనలు పాల్గొన్న రచయితలందరికి కృతజ్నతలు తెలియజేసారు... మహిళా రచయితలకు చట్టాల మీద కూడా కొంత అవగాహన పెంచుకోవడం వలన, ఆ దిశగా కూడా కథలు రాసే అవకాశం వుంటుందని చెప్పారు. ఎన్నో చట్టాలు మహిళల కోసం వున్నప్పటికీ వాటి అమలులో రాజ్యం చేస్తున్న అలసత్వాన్ని వివరిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. చివరగా హైదరాబాదు ఉమెన్ రైటర్స్ ఫోరo సభ్యులు నస్రీన్ ఖాన్ వందన సమర్పణ చేయడంతో కథా కార్యశాల ముగిసింది.

రెండు రోజులు రణగొర ధ్వనులకు దూరంగా, ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన, ప్రేమ ఆప్యాయతలను రంగరించి చేసిన వంటల దగ్గర నుంచి వేడి నీటి స్నానాల వరకు చేసిన వసతీ ఏర్పాట్లకు, కల్పించిన సౌకర్యాలకు అంకురం సుమిత్ర గారికి, రాజేశ్వరి మేడంగారికి, అంకురం నుంచి మొలకెత్తిన అందమైన అమ్మాయి, ఆమె ముచ్చటగొలిపే మాటలతో, అనేక సందర్భాలలో మాకు గైడ్ గా ఉండి ట్రెక్కింగ్ తో పరిసర ప్రాంతాల కొండెక్కించిన తప్రిన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోతున్నందుకు దిగులుగా అనిపించింది. ఇంతటి ఉద్విగ్నమైన, ఉద్వేగభరితమైన గుండెలతో ఒక్కొక్కరంగా తిరిగి మామా ఇండ్లకు బయలుదేరాం.

దీనంతటికీ కారణమైన భండారు విజయక్క శ్రమను, కష్టాన్ని, ఖర్చులను మాటలలో చెప్పలేం. మొదటి లేదా తొలి ‘హైదరబాద్ ఉమెన్ రైటర్స్ ఫోరం కథాకార్యశాల’ విజయవంతం కావడానికి విజయక్క నిరంతర కృషి, పట్టుదల, వెనుదీయని మనస్తత్వం, తోటి వారికి తనకు తెల్సినంతలో నేర్పాలన్నా తపన , దాని వెనుక ఆమె నిశ్వార్ద పూరితమైన మనసు ఉన్నాయని ఘంటాపదంగా చెప్పవచ్చు. తన పేరులోనే "విజయం" ఉంది. ఫోన్లకు, ఇతర విష కాలుశ్యాలకు రెండు రోజులు మమ్మలందర్నీ దూరంగా ఉంచిన కథాకార్యశాల కు అందరం కృతజ్ఞత చెప్పితీరాల్సిందే!

ఈ కథకార్యశాలను సమన్వయపరచడానికి, కథ లక్షణాలు చెప్పడానికి వయస్సును కూడా లెక్కచేయకుండా సహాయంగా శ్యామలతో వచ్చి రెండురోజులు మాతో మాఅందారికి స్ఫూర్తినిచ్చిన తత్వవేత్త బిఎస్ రాములు గారికి, తన జీవిత అనుభవాల విత్తనాలను మా ముందు చల్లిన శ్యామలగారికి హృదయపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు. పండ్లను రసం తీసి పంచదార ఐస్ ముక్కలు కలిపి, ఆకులతో అలంకరించి నోటికి అందించి నంత కమ్మగా కథ లక్షణాలు చెప్పిన ఎస్ కాంతారావుగారికి, కథకు ఉండాల్సిన లక్షణాలే కాదు, ఉండకూడని అంశాలు, కథ అంటే, టాల్ స్టాయ్ చెప్పిన "fast telling on reality of yesterday" ను ఉదాహరణలతో చెప్పిన మండవ సుబ్బారావు గారికి వినమ్ర నమస్కారాలు. పాఠశాల విద్యార్థులకు కథ, కవిత ఎలా రాయాలో నేర్పటం కోసం ప్రతి సంవత్సరం వర్క్ షాపులు నిర్వహిస్తూ ఈ ఇద్దరు చేస్తున్న ప్రయత్నాలకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.

అంతకు ముందు జరిగిన వర్క్ షాపులు గురించి నేర్చుకున్న అంశాలు గురించి, కొత్త చూపుతో కథలు ఎన్నుకోవడం, రాయటం గురించి చెప్పిన కొండవీటి సత్యవతి గారికి, సాహిత్యంలో "హాస్యం" పాత్ర గురించి హాస్య భరితంగా చెప్పి నవ్వుల పువ్వులు పూయించిన నెల్లుట్ల రమాదేవిగారికి మరిన్ని మరిన్ని హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు. కథా కార్యశాలకు కథ లిచ్చిన రచయితలకు, ఈ కార్యశాల విజయవంతం చేయడానికి తమ చేతులను ఆసరాగా ఇచ్చిన వారందరికీ ఆకాశంలో చుక్కలన్ని భూమిమీద మొక్కలై విరిసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇంతకూ ..ఈ కథా కార్యశాల’ ఎక్కడ జరిగింది అని చెప్పలేదు కదూ! హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, భోగారం మండలం, కీసర లోని భోగారం సెంటర్ నుండి కాలనీ రోడ్ లో ఉన్న "అంకురం లైఫ్ స్కిల్స్ సెంటర్"లో.

ఈ కథ కార్యశాల గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పలేకపోతున్నందుకు మన్నించమని కోరుతూ...

Read More
Next Story